అన్‌కండిషనల్ ప్రేమను అడగడంలోనే కండిషన్ ఉందని
అవసరం తీర్చుకొని దాటుకునే అవకాశవాదానికి
అది మరో పేరని
తెలిసినా ప్రశ్నించలేకపోయిన క్షణం
మరిచిపోయిన ఇష్టాలను ఎవరైనా అడగాలని
మనసులోని వేదనను
ఎవరితోనైనా పంచుకోవాలని
ఎదురుచూసి ఎదురుచూసి విఫలమైన క్షణం
దాటుకొని వచ్చిన గడపకు
మెట్టిన గడపకు
నువ్వు పరాయివే అని తెలిసి
నిస్సహాయంగా విలపించిన క్షణం
అష్టావధానాల మధ్య
పెనంతో దోస్తీ వదలని దోశె పైన
అడుగంటిన అన్నం పైన
ఆసరా కాలేని మనుషుల పైన
చూపలేకపోయిన కోపాన్ని
చల్లారిన టీతో దిగమింగిన క్షణం
ఎన్నో క్షణాలు
నిర్వేదపు అలలై ముంచేస్తాయి
ఎన్నో గాయాల సలపరింతలు ఎవరికీ వినపడవు
ఎన్నో మరణాలు బయటికి కనపడవు
అప్పుడెప్పుడో
వెలుతురు పిట్ట వినిపించిన వేణుగానాన్ని
ఆసరాగా చేసుకొని
ఫీనిక్స్ పక్షి మళ్ళీ మళ్ళీ లేస్తూనే ఉంటుంది
దుఃఖపు నిశి మాటున
మరుగున పడిన వెన్నెల వెలుగును అన్వేషిస్తుంది.