ఏమీలేదనుకుంటే…
దానికన్నా నిరుపయోగమైనది లేదు
రూపం లేదు భాషా రాదు
నడవడం తెలియదు నవ్వీ ఎరుగదు
కష్టాలు తీర్చదు కరచాలనానికీ అందదు
కానీ అక్కడ నువ్వున్నావనుకుంటే…
అది సహస్ర దళాల సువర్ణ పద్మం
నిన్ను మోస్తోందనుకుంటే…
వేయి పడగల శేషుని రూపం
నువు విహరిస్తున్నావనుకుంటే…
అదే క్షీరసాగర తరంగం
మహోత్తుంగ హిమ శైల శిఖరం
ఒక్కసారైనా నేను కంటితో చూడనిదీ
నన్ను నిలువునా కోసినా ఎవరికీ చిక్కనిదీ
నా దగ్గరున్నందుకు కేవలం నాదయినందుకు
దానికెంతటి భాగ్యం దక్కిందీ!
ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగిందీ!
లేని పోని వూహలతో
ఇంతటి వైభోగాన్ని నేను దానికి అంటగట్టానా!
చెప్పినట్లు విని
భరించలేనంత ఆనందాన్ని అది నాకు కట్టబెట్టిందా!
రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. \"రేవు చూడని నావ\" అనే కవితాసంపుటి, \"మహార్ణవం\", \"ఆలోచన అమృతం\" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి \"mitva\" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. \"నా స్నేహితుడు\" అనే కథకు 1994 లో \"కథ\" అవార్డు అందుకున్నారు ...