రహస్య సాంగత్యం

కనపడని ఒక విచ్ఛేదం
కడుపులో పొంచి వున్నట్టు
బద్దలవబోయే బాంబు ఒకటి
లోపల బస చేసి టిక్ టిక్ టిక్ అంటున్నట్టు
దేహం లోని అంతరింద్రియంపై
దాడి చేసేందుకు క్రూరమృగమొకటి
దాపుల్లో గుఱ్ఱుమంటూ వేచి వున్నట్టు
లోపలి అల్లకల్లోలాల రహస్య రంపపు కోతలతో
రోజుల నిప్పుల కుంపట్ల మీంచి రోజూ నడక

అసంతృప్తి అణ్వస్త్రమై
అంతరంగంలో చొరబడి
భయానకత చుట్టుముట్టి
స్తిమితానికి తెర పడి
సాధించింది చాలక
చాలనితనం చాలా పెరిగి
గుండె లోపలి గుబులు లాంటి దిగులు
కడుపు లోపలికి బదిలీ అయి కదలాడుతున్నట్టు –

స్వల్పత్వపు సలుపు మీద సులువు కాదు గెలుపు
అల్పసంతోషిత్వం అనల్ప అదృష్టమే
మింటిని తాకే కళాతృష్ణ
కంటి మీద కునుకు లేకుండా చేసి
కోరిన ఫలితం దొంగాటలాడుతూ
దోబూచులాడుతున్నట్టు
కనపడని విచ్ఛేదమొకటి
కడుపులో దేవుతున్నట్టుంటుంది

కర్తవ్యమనుకున్న దాన్ని
కాలితో తన్ని పారెయ్యలేము
అందుకోలేకపోతున్న అమోఘత్వం
అందుబాటు లోకి వచ్చే దాకా
వెలితి నిండిన బాటల మీదైనా
వెళ్తూనే వుండాలి నిరంతరంగా
రహస్య రంపపు కోతల నిప్పు కుంపట్ల
సాంగత్యాన్నే సాహసంగా మార్చుకుంటూ


ఎలనాగ

రచయిత ఎలనాగ గురించి:

ఎలనాగ అన్న కలం పేరుతో రచించే డాక్టర్ సురేంద్ర నాగరాజు తెలుగు, ఆంగ్ల సాహిత్య రంగంలో ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు. ఇప్పటివరకు వారు రచించిన 41 పుస్తకాల్లో అనువాదాలు కూడా ఉన్నాయి. లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మౌఘం కథలు, ప్రపంచ కథలు, సైరస్ మిస్త్రీ రాసిన క్రానికల్స్ ఆఫ్ ఎ కార్ప్స్ బేరర్, పవన్ కె వర్మ రచించిన గాలిబ్: ది మ్యాన్, ది టైమ్స్, కె సచ్చిదానందన్ రచించిన నాట్ ఓన్లీ ది ఓషన్స్ వంటి పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. వట్టికోట అల్వారస్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు మొదలైన ప్రముఖ తెలుగు రచయితల రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. వారి ఆంగ్ల కవితా సంకలనం \”డాజ్లర్స్\” 25 విదేశీ భాషల్లోకి అనువదించబడింది.

 ...