మరి?

ఉదయాన లేచిన వెంటనే తారా ఆంటీ చనిపోయిందన్న విషాదవార్త అందింది. క్షిప్ర ఈ సమాచారాన్ని వినగానే దిగ్భ్రాంతికి లోనై కింద కూలబడిపోయింది. అంతకు ముందురోజే తార హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి పోయింది. ఆ సాయంత్రమే క్షిప్ర తారా ఆంటీ ఇంటికి వెళ్ళింది, డాక్టర్ ఏం చెప్పారో తెలుసుకునేందుకు. ఆమెకు తార ఆరోగ్యం గురించిన దిగులు ఎప్పుడూ.

క్షిప్ర రెండు నెలల క్రితమే ఆ కాలనీలో అద్దెకు చేరింది. నిజానికి ఆమె ఆ నగరానికి కొత్త. తన తల్లికి దూరంగా ఉన్నందుకు ఆమె తరచుగా బెంగకు లోనయ్యేది. ఆ కాలనీకి వచ్చిన మొదటి రోజే ఆమె తారా ఆంటీని కలిసింది. తార భర్త ఆ కాలనీ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావడంతో, అతన్ని ఏదో అడగటం కోసం వాళ్ళింటికి వెళ్ళింది క్షిప్ర. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఇంట్లో తార, ఆమె భర్త, అత్తగారు – ముగ్గురే ఉంటున్నారు. తార ఉబ్బసపు వ్యాధితో బాధపడుతోంది. ఐనా సరే, ఆమె తన రోజువారీ పనులన్నింటిని ఎంతో చక్కగా టైముకు చేసుకుంటుంది. ఆమె భర్త, అత్తగారు తారను మెట్లు వాడనివ్వరు. అందువల్ల కాలనీలో ఇతరులతో ఆమెకు స్నేహం అంతగా ఏర్పడలేదు. రెండు వారాలకొకసారో నెలకొకసారో డాక్టరు దగ్గరికి పోయేందుకు మాత్రమే ఆమె మెట్లను వాడుతుంది. క్షిప్ర తప్ప ఆమె ఇంటికి ఇంకెవరూ వచ్చేవారూ కాదు.

క్షిప్ర ఆమె ఇంటికి మొదటిరోజున వచ్చింది. తర్వాత కూడా అప్పుడపప్పుడు వచ్చేది. తారకు బయటినుండి ఏ వస్తువైనా అవసరమైతే క్షిప్ర తెచ్చి ఇచ్చేది. ఎత్తున ఉన్న అరల్లోంచి ఏదైనా తీయాల్సివస్తే కూడా. తార కూడా క్షిప్రను బాగా గారాబం చేసింది. ఆమె ఎప్పుడైనా కొత్త పచ్చడి పడితే దాన్ని మొట్టమొదట క్షిప్రకే ఇచ్చేది.

గతరాత్రి క్షిప్ర, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తార చాలా ఆయాసంతో ఉంది. కానీ వైద్యపరీక్షల రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయి కనుక, ఆమె సరదాగానే ఉండింది. తన అనారోగ్యం మీద జోకులు వేస్తూ నవ్వింది. కానీ అదే రాత్రి ఆమె చనిపోయింది.

ఆ వార్తను వినగానే తారావాళ్ళ ఇంటికి పరుగెత్తింది క్షిప్ర. ఆ ఇంటిలోని ప్రతి అణువులో తారా ఆంటీ ఉన్నట్టే అనిపించింది క్షిప్రకు. ఆమె చేసిన మిఠాయిలు టేబులు మీద ఉన్నాయి. ఆమె వండిన కూర గిన్నె వంటగదిలోని స్టవ్ మీద ఉంది. ఆమె చేసిన రకరకాల పచ్చళ్ళు ఫ్రిజ్‌లో ఉన్నాయి.

తార ఏ వంటపాత్రనూ పారేయలేదు. అవంటే ఆమెకు ఇష్టం. ఇంట్లోని ప్రతి చిన్న వస్తువును ఏదోవిధంగా ఉపయోగించేది ఆమె. తన పిల్లల చిన్నప్పటి దుస్తులను కూడా ఆమె ఎంతో జాగ్రత్తగా దాచింది. దేనితోనూ జత కలవని గిన్నెలు, రకరకాల సైజులలో ఉన్న బట్టలు, ఒకవైపునే రాసిన కాగితాల కట్టలు, చిరిగిన దుప్పట్లు, దిండు గలీబులు… ఇవన్నీ ఉన్నాయి. ఆమె దాచిపెట్టిన వాటిలో అవి మాత్రమే కాదు, రాలిన తన వెంట్రుకల కట్టలు కూడా ఉన్నాయి. వాటితో ఆమె తనకోసం కొప్పులను తయారు చేసుకునేది.

ఆ వస్తువులన్నిటిని క్షిప్ర అంతకు ముందు కూడా చూసింది. కానీ ఇప్పుడు అవి మరీ కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. తార భర్త దివాకర్ వాటన్నిటిని క్షణంలో బయట పారేస్తాడేమో. తార తన హృదయంలో ఎన్నో అవమానాలను పెట్టుకొని భరించింది. ‘ఒకరోజున ఇవన్నీ సర్దుతాను అనుకుంటాం. కానీ, వాటిని అలాగే వదిలి ఎకాయెకిన చెప్పాపెట్టకుండా ఈ లోకాన్ని వదులుతాం.’ తార పార్థివశరీరం ముందు నిలబడగానే క్షిప్రకు ఈ ఆలోచన మనసులో మెదిలింది. దాంతో ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి.

తారా ఆంటీకి క్షిప్ర హృదయంలో ఎటువంటి స్థానం ఉండిందో, క్షిప్రకు తారతో ఎటువంటి ఆత్మీయబంధం ఉండేదో ఆ రెండిళ్ళలోని వ్యక్తులకు మాత్రమే తెలుసు. కాలనీలోని చాలా మంది అక్కడ గుమిగూడారు. క్షిప్ర ఏడవడం వాళ్ళకు విచిత్రంగా కనిపించింది. కాలనీకి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి తార కోసం ఏడవటమేంటి, ఆ హక్కు ఆమెకెక్కడిది? అనుకున్నారు వాళ్ళు.

అందరి ముఖాలమీది ఆశ్చర్యాన్ని చూసి క్షిప్ర తనను తాను సంబాళించుకుంది. ఆమె మౌనంగా ఉండిపోయింది. కానీ, కొందరు ఆడవాళ్ళు ఆమెను వదలలేదు. ఒకామె ఉపశమనాన్నిస్తున్నట్టుగా క్షిప్ర వీపుమీద చేతితో రుద్దుతూ, పక్కన ఉన్నామెతో ఇలా అన్నది: “ఈమె అత్త ఈమధ్యనే చనిపోయింది. అందుకే క్షిప్ర ఇంతగా ఏడుస్తోంది. ఈ అమ్మాయిని పాపం ఆ పాత జ్ఞాపకాలు బాధపెడుతున్నాయి.” ఈ వివరణ అవసరమైంది. లేకపోతే ఆమె ఏడవటాన్ని ఎలా సమర్థిస్తాం మరి?!

సాయంత్రంవేళ గుడి దగ్గర ఒకామె క్షిప్రను కలిసింది. “తార నీకు బంధువా?” అని అడిగింది. ఆమె తను ఇవాళ ఉదయమే అలా ఏడ్చింది కనుక, ఆమె అలా అడుగుతున్నదని ఊహించి “కాదు” అన్నది క్షిప్ర.

“మరి?”

‘మరి?’ అనే ఆ పదంలో సామాజిక నియమాలు దాక్కుని ఉన్నాయి. వాటిలో కొన్ని స్పష్టంగా, మరికొన్ని అస్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం జీవించాలని సమాజం కోరుతోంది. వాటిలోని ఒక రాయని నియమమేమంటే, సమాజం ఒప్పుకునే బాంధవ్యం లేనప్పుడు లేదా సమాజపరంగా స్నేహితులు కానప్పుడు వారికోసం ఏడవకూడదు. ఇతర సందర్భాలలో ఆ నియమాలను మించినదానికంటే ఎక్కువ ప్రవర్తించడం అనుమతించబడదు. మరి అనే ఈ రెండక్షరాల పదం సంజాయిషీని కోరుతుంది.

తన అత్త చనిపోవడానికి కొన్నిరోజుల ముందు ఆమెతో తను షాపింగ్‌కు వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చింది క్షిప్రకు. అకస్మాత్తుగా వారి ఎదురుగా ఒక లారీ ఒక బైక్‌ను గుద్దింది. బైక్‌ను నడుపుతున్న వ్యక్తి గింగిరాలు కొడుతూ వెళ్ళి రోడ్డుమీద పడిపోయాడు. క్షిప్ర “అయ్యో!” అని గట్టిగా అరుస్తూ అతడి దగ్గరికి పరుగెత్తింది. కానీ, ఆమె అలా పరుగెత్తడాన్ని అత్త, అక్కడ ఉన్న ఇతరులు అనుమతించనట్టుగా చూశారు. కొంతసేపటి వరకు అత్త ఆమెతో మాట్లాడలేదు.

కాబట్టి, తారా ఆంటీ కోసం ఏడ్చే హక్కు క్షిప్రకు లేదు. ఒకవేళ అలా ఏడవదల్చుకుంటే ఆమెతో తనకున్న దగ్గరి బంధాన్ని అందరికీ తెలియచెప్పి, తన హక్కు నిరూపించుకోవాలి.

కొన్నిరోజుల తర్వాత క్షిప్ర మరొక ఆమెను షాపులో కలిసింది. “నీకు ఆమె బంధువా?” అని అడిగింది ఆమె. తార ఆంటీ చనిపోయి చాలా రోజులైంది కనుక, క్షిప్ర ఆ సంఘటనను దాదాపు మరిచిపోయింది. కానీ, తార మరణానికీ క్షిప్ర కన్నీళ్ళకూ మధ్య బంధుత్వాన్ని ఇంకా వెతుకుతూనే ఉంది ఆమె.

“ఎవరికి బంధువు?” అని అడిగింది క్షిప్ర.

“తారకు.”

“ఉహుఁ, కాదు.”

“మరి?”

ఆ స్త్రీ క్షిప్ర కన్నీళ్ళకు ఒక నియమాన్ని విధించింది. ఇక ఇప్పడు ఏ బంధుత్వం లేకుండా ఒకరికోసం ఏడ్చేందుకు క్షిప్ర దగ్గర వివరమైన సమాధానం లేదు.

(మరాఠీ మూలకథ: మగ?; ఆంగ్లానువాదం: వర్షా హళబె)