ఋతుపర్ణము

2004లో నేను గీచిన పర్ణ వర్ణ చిత్రానికి భావాన్నిస్తూ వ్రాసిన కవిత యిది. వసంతములో వనలతలు చిగిరించేటప్పుడు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అదే ఆకు వర్షాకాలములో పెద్దగా పెరిగినప్పుడు ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకులు రాలిపోయేటప్పుదు అదే ఆకు వివిధవర్ణాలతో అందముగా నుంటుంది. అట్టి ఆకును ఎఱ్ఱటి రంగుతో చూపాను. రాలకుండా మిగిలిన ఒక ఆకు ఎండి మట్టి రంగులో ఉంటుంది. అట్టి ఆకు శీతాకాలాన్ని చూపిస్తుంది. ఈ చిత్రపు మరొక ప్రత్యేకత ఏమంటే యిందులో యెక్కడా ఖాలీ చోటు లేదు. ఇట్టి చిత్రాన్ని గణితశాస్త్రములో టెసెలేషన్ (Tessellation) అంటారు. సుప్రసిద్ధ డచ్ కళాకారుడు ఎషర్ (M.C. Escher) ఇట్టి చిత్రాలను గీయడములో అందెవేసిన చేయి.


ఋతుపర్ణము

వసంతము చైతన్యాన్ని చూపిస్తే, వర్షాకాలము జీవితములో ఉచ్ఛదశను చూపిస్తుంది. ఆకురాలు కాలము సంపూర్ణత్వాన్ని, తృప్తిని చూపిస్తే, శీతాకాలము తహతహను, నిరీక్షణను సూచిస్తుంది. ఈ ఋతువులకు అనుగుణముగా వసంతతిలకము, వనమయూరము, కనకప్రభ, వియోగిని వృత్తాలను యెన్నుకొన్నాను. వసంతతిలకానికి సంస్కృత యతిని ఉంచాను. కనకప్రభకు యతి చెప్పలేదు, దీనికి ప్రతి పాదములో మూడు పంచమాత్రా గణాలు, ఒక లగము ఉన్నాయి కనుక యతిని మూడవ మాత్రాగణపు మొదటి అక్షరముతో నుంచాను. వియోగిని వైతాళీయపు ఒక ప్రత్యేకత. మహాకవి కాళిదాసు మన్మథుడు చనిపోయిన తరువాత రతీదేవి పడ్డ ఆవేదనను, విరహాన్ని ఈ వియోగిని వృత్తములోనే ఒక సర్గ నిండా వ్రాసినాడు. అన్ని పద్యాలు ముద్రాలంకారయుక్తము (పద్యములో దాని పేరు ఉండడము). ఇది ఒక చెట్టు ఆత్మకథ అని చెప్పవచ్చును.

1. వసంతతిలకము

త-భ-జ-జ-గ-గ, యతి (1, 9)

కాలమ్మొ, యామని గదా! కలరాగగీతుల్
తేలేను మారుతములో దియతీయగా, నా
పూలో వసంత తిలకమ్ములు నాడు జూడన్
మేలై వెలింగె వనిలో మృదుచైత్రరాత్రుల్

2. వనమయూరము

భ-జ-స-న-గ-గ, యతి (1, 9)

ఆ వనమయూరములు హ్లాదముగ నాడన్
జీవముల నిచ్చునది చెంగుమని బాఱన్
బ్రోవులుగ మేఘములు రోదసిని గప్పన్
రావముల వర్షము ధరాతలము నింపెన్

3. కనకప్రభ

స-జ-స-జ-గ, యతి (1,9)

కన నేడు నిండె కనకప్రభా ద్యుతుల్
వనభూమి రంగుల తివాసి యయ్యెనే
తనరారె కన్నెదుట తామ్రపర్వతం
బనిశమ్ము ఖేచరము లాకసమ్ములో

4. వియోగిని

స-స-జ-గ, యతి (1,6) / స-భ-ర-ల-గ, యతి (1,7)

ముద మెక్కడ మ్రోడు నే వనిన్
నిదురే లేదుగ నే వియోగినిన్
మధుమాసపు మైక మెప్పుడో
సుధతో నూతనశోభ లెప్పుడో

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...