దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు

ముందుమాట

ఈమాట పత్రికలో ఈ సినిమా పోస్టర్ల గోలేమిటి? అయినా ఇంటర్నెట్లో చాలా తెలుగు సినిమా సైట్లలో ఇలాంటి పోస్టర్లున్నాయి కదా అనుకునేవారిని ఉద్దేశించి ఈ నాలుగు మాటలు. 2003 సంవత్సరంలో సంజయ్ సుబ్రహ్మణ్యం, పార్థా చటర్జీలు కలిపి నడిపిన ఒక కాన్ఫరెన్సుకి బెర్లిన్ వెళ్ళి అనుకోకుండా ఒక ప్రదర్శన చూడటం జరిగింది. అందులో ముఖ్యంగా జ్యోతింద్ర జైన్ నడిపిన Indian Popular
Culture అన్న ప్రదర్శన నన్ను బాగా ఆకట్టుకొంది. అలాగే ఆయన ఆ సందర్భంలో రాసిన వ్యాసాలు కూడా. ఇవి తరువాత పుస్తక రూపంలో కూడా వచ్చాయి.


మేనరికం

అప్పటికే క్రిస్టొఫర్ పిన్నే (Christopher Pinney; Camera Indica), రేచల్ డ్వయర్ (Rachel Dwyer; “Cinema India: The Visual Culture of Hindi Film) రాసిన పరిశోధనా వ్యాసాలు, లాలా దీనదయాళ్, రాజా రవివర్మల బొమ్మల మీద వచ్చిన కాఫీ టేబుల్ పుస్తకాలు చదివి వున్నా ఇలాంటి బొమ్మలని ఒక శాస్త్ర పద్ధతిలో చూస్తారని, ఇలాంటి పరిశోధనలని Visual Studies అన్న పేరుతో పిలుస్తారని నాకు తెలియదు. ఈ దృశ్య సంస్కృతి (visual Culture) గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం పెరిగింది. అప్పటినుంచి ఈ విషయంపై కొంచం విస్తృతంగానే చదివాను. ముఖ్యంగా హిందీ, తమిళ, బెంగాలీ ప్రాంతాల్లోని దృశ్య సంస్కృతులపైన గడచిన పదేళ్ళలో చాలా పెద్ద సంఖ్యలో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి. కేవలం బొమ్మలతో, Bollywood in Posters లాంటి కాఫీ టేబుల్ పుస్తకాల గురించి నేను మాట్లాడటం లేదు. ఈ బొమ్మల ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చునో, ఎందుకు ఇలాంటి పరిశోధనలు అవసరమో పిన్నే ఒక ఇంటర్వ్యూలో వివరిస్తాడు. క్రిస్టఫర్ పిన్నే గత ఆరేళ్ళలో రాసిన మరో రెండు మంచి పుస్తకాలు: ఫొటోస్ ఆఫ్ ది గాడ్స్, ది కమింగ్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఇన్ ఇండియా.

నాలుగేళ్ళ క్రితం ఇలాంటి బొమ్మల్ని డిజిటైజ్ చేసి పరిశోధకులకి అందుబాటులో వుంచే గొప్ప ప్రయత్నం జరిగింది. దాని ఫలితం ‘తస్వీర్ ఘర్‘. వీళ్ళు నా దృష్టిలో చేసిన గొప్ప పని ప్రియా పౌల్ గారి సేకరణనంతటినీ కంప్యూటర్ పైకి ఎక్కించటం. ఈ సేకరణలోని బొమ్మలని వాడుకుంటూ చాలా వ్యాసాలు వచ్చాయి.

సినిమా పోస్టర్లు


దొంగరాముడు

సినీ పరిశ్రమలో పోస్టర్లు, పాటల పుస్తకాలు, కరపత్రాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినదే. ప్రతి వారికీ వీటి గురించి గొప్ప జ్ఞాపకాలే వుంటాయని అనుకుంటున్నాను.ఇవి మన సంస్కృతిలోను, దైనందిన జీవితంలో ఒక భాగమై పోయాయి. పైన చెప్పినట్లు వీటిని అధ్యయనం చేయడానికి inter-disciplinary పద్ధతి అవసరం. మొదటిగా రంగుల్లో క్యాలెండర్లు ఎప్పుడు ముద్రింపబడ్డాయి, తొలి సినిమా పోస్టరు ఏది అన్న ప్రశ్నలకు సాధికారమైన సమాధానాలు లేవు కానీ భారతదేశంలో 19వ శతాబ్దం చివరినాటికే లితోగ్రాఫిక్ ముద్రణ ప్రాచుర్యంలో వున్నట్లు, శివకాశి అప్పటికే ముద్రణా రంగంలో ఒక పేరు సంపాదించుకున్నట్లు తెలుస్తుంది[1,2,3]. మనకి తెలిసిన తొలి సినిమా పోస్టర్ ప్రముఖ చిత్రకారుడు, సినీ నిర్మాత, దర్శకుడైన బాబూరావు పైంటర్ తన చిత్రం ‘కల్యాణ్ ఖజీన’కు (1924) స్వయంగా డిజైన్‌చేసుకున్నది [4]. రేచల్ డ్వయర్, దివియా పటేల్ రాసిన వ్యాసంలో చారిత్రకంగా సినిమా ప్రకటనల పరిణామం గురించి మంచి సమాచారం లభిస్తుంది[4].


చివరకు మిగిలేది

మొన్నమొన్నటి వరకు, అంటే 1992లో డిజిటల్ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకు, సినిమా పోస్టర్లు చేతితోనే చిత్రించేవారు. 1990కి పూర్వపు మద్రాసు నగరంతో పరిచయమున్న వారికందరికీ మౌంట్ రోడ్డుపైన నిలబెట్టిన పెద్ద కటౌట్లు పరిచితమే. ఆ కటౌట్లు తయారు చేసి, చిత్రించిన కళాకారులకే అంకితమిస్తూ ప్రెమిందా జాకబ్ (Preminda Jacob) ఏకంగా సెల్యులాయిడ్ దేవతలు అనే ఒక పుస్తకమే రాసింది. ఈ వ్యాసంలో ఇలా చేతితో చిత్రించిన మేనరికం (1954), దొంగరాముడు (1955), చివరకు మిగిలేది (1961) పరదేశి (1953), ఏకవీర (1969) పోస్టర్లు చూడవచ్చు (చివరి రెండు చిత్రాలు bharatwaves.com, cinegoer.com సైట్లనుండి తీసుకోబడ్డాయి.) ఇలాంటి పోస్టర్లు ఈరోజు అపురూపమైన, కళాత్మకత సంతరించుకున్న వస్తువులు. ఈనాడవి పెద్ద పెద్ద నగరాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో కూడా ప్రదర్శించబడుతున్నాయి.


పరదేశి

వ్యాపారాత్మకంగా కూడా వాటి విక్రేతలకు బోలెడు డబ్బు సంపాదించి పెడుతున్నాయి. 2003లో ఒక వేలంలో ఒక్కొక్క పోస్టరు సగటున పదిహేను నుండి నలభై వేల రూపాయిలకు అమ్ముడు పోయినట్లు రంజని మజుందార్ రాసిన వ్యాసం[6] ద్వారా తెలుస్తుంది. ఈ వ్యాసంలోనే సాంకేతికంగా వచ్చిన మార్పులు దీవార్, షోలే, లగాన్ లాంటి సినిమాల పోస్టర్ల తయారీలో జరిగిన సంఘటనలు గురించి కూడా తెలుసుకోవచ్చు. హిందీ సినీ పోస్టర్ చరిత్రను సమగ్రంగా చెప్పే బృహత్ కార్యక్రమంలో ఈ వ్యాసం ఒక భాగం. ఈ సందర్భంలో మజుందార్ వాక్యాలు పూర్తిగా ఉదహరించడం సమంజసమనుకుంటాను.

“Walter Benjamin, in his well-known theses on the destruction of aura after the birth of the photograph had envisioned a time when multiplication and mechanical reproduction would enable the possibility of art becoming a genuinely democratic form, accessible and available outside the rarefied space of the art museum. In a strange twist, the original hand-painted film poster which was seen plastered on walls in various parts of the country and available for a price of five rupees in the streets till the early 1990s, has now acquired the status of an ‘art’ form as collectors enter the field of preservation, display and sale of the traditional poster.”


ఏకవీర

హిందీ పోస్టర్ల గురించే చెప్పే మరో వ్యాసం జెర్రీ పింటో రాసినది. అలాగే సాంకేతికంగా తెలుగు పోస్టర్లు కూడా చాలా పరిణతి చెందాయని ఈ వ్యాసంలో అనబడ్డది. సినిమా పబ్లిసిటీలో పోస్టర్ల పాత్ర ప్రముఖమైనది. 70 ఏళ్ళ క్రితమే గూడవల్లి రామబ్రహ్మం “తెలుగు ఫిలిం పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే!” అన్న వ్యాసంలో (ఆంధ్రపత్రిక, విక్రమనామ సంవత్సర ఉగాది సంచిక, 1940) పబ్లిసిటీ కోసరం మొత్తం బడ్జెటులో ఆరోవంతు వరకు ఖర్చు చేయవచ్చని సూచించారు. అప్పట్లో అయన నిర్ణయాలు సంచలనాత్మకమైనా ఈనాడు ఇంకా హెచ్చు శాతమే పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నారు.

ఆసక్తి కరమైన విషయమేమంటే అసలు తెలుగులో వున్న ఫాంట్ల సంఖ్య తక్కువైతే, వాస్తవానికి ప్రచురణ రంగంలో వాడేవి అర డజనుకి మించి ఉండవు. కానీ పోస్టర్ల విషయానికొచ్చేసరికి గొప్ప వైవిధ్యం[6] కనిపిస్తుంది. మచ్చుకి కొన్ని కొత్త సినిమా పోస్టర్లు ఇక్కడ చూడవచ్చును.


గొల్లభామ

ఇంకా సినిమా పోస్టర్లు చరిత్రను కూడా చెప్తాయన్నదానికి గొల్లభామ సినిమా పోస్టర్లు ఉదాహరణ. మొదటి చిత్రం “విజయచిత్ర” జూన్ 1967 సంచికలో ప్రచురింపబడింది. రెండవది జులై, 1967 సంచికలోనిది. సంగతేమంటే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి పెద్ద గోల జరిగింది. యాదవ కుల సంఘాలు “గొల్లభామ” లోని గొల్ల అన్న పదం చాలా నిందాత్మకంగా, కించపరిచేదిగా వుందన్నారు. దానితో “భామావిజయం అను గొల్లభామ కథ”గా టైటిల్ మారిపోయింది.


భామావిజయం

నిజానికి 1947లో కూడా ఇదే పేరుతో (రఘురామయ్య, కృష్ణవేణి, అంజలి నటించినది) చిత్రం విడుదలయినప్పుడు “యాదవయువక సంఘాలు” All India National Congress అధ్యక్షుడి నుండి బ్రిటిష్ ప్రభుత్వం వరకు టెలిగ్రాముల ద్వారా ఫిర్యాదులు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం తీర్పు వారికి అనుకూలంగా రాకపోయినా[7] తరువాత కొంతకాలానికి సినిమా టైటిల్‌ను ‘విజయభామ’గా మార్పు చేశారు.


సీతా కళ్యాణము

ఆంధ్రమహాసభ వారి ఉద్యమం ఊపందుకొనడం వల్లనో, సినిమాలన్నీ కలకత్తా, బొంబాయి, షోలాపూర్ వంటి పొరుగు రాష్ట్రాల నగరాలలో, ఒక ముక్క తెలుగు కూడా రాని దర్శకుల, నిర్మాతల చేతిలో తయారవుతున్నాయని ఆనాటి పత్రికల్లో తీవ్రంగా వచ్చి పడిన విమర్శల వల్లనో, “మన రాష్ట్రమున, మన ధనముతో, మన నటీనటులతో” తయారయిన చిత్రమని ఒత్తి చెప్తున్న ప్రకటన చూడండి. (గృహలక్ష్మి పత్రిక, ఆగస్టు 1934).


సన్ రికార్డ్సు ప్రకటన

అన్ని ప్రకటనలనూ నమ్మకూడదని ఈ పాటల పుస్తకం చూస్తే తెలుస్తుంది. 1936 సంవత్సరంలో విడుదలయిన “సతీ అనసూయ, ధృవ” అన్న రెండు (బాలల) చిత్రాలకు సంబంధించిన పాటలు ప్రప్రధమంగా విడుదలవుతున్న సినిమా పాటలని ఈ ప్రకటన మొదట్లో అంటున్నారు. కానీ వాస్తవానికి 1933 నాటికే (సావిత్రి) సినిమా పాటలు రికార్డులపైన వచ్చిన దాఖలాలున్నాయి. 1934లో వచ్చిన లవకుశ సినిమా పాటల రికార్డులు జనాదరణ పొందాయి.


వల్లూరి రికార్డులు

చివరిగా కొన్ని తొలినాటి పాటల రికార్డుల ప్రకటనల వివరాలు. 1920నాటికే (ఆంధ్రపత్రిక, రౌద్రి నామ సంవత్సర ఉగాది సంచిక, 1920) వల్లూరి జగన్నాథంగారు రికార్డులిచ్చారని దీని ద్వారా తెలుస్తుంది. నాకు తెలిసినంతలో 1920 నాటికి, గాత్రపరంగా, సాంప్రదాయ సంగీతపు కీర్తనలు, భక్తిరస ప్రధానమయిన రికార్డులే ఎక్కువ వెలువడ్డాయి. అప్పటికింకా నాటక పద్యాలు కూడా రికార్డులకెక్కలేదు. తరువాయి రెండు చిత్రాల ద్వారా భమిడిపాటి కామేశ్వరరావుగారు కూడా రికార్డులిచ్చారని తెలుస్తుంది (హెచ్.ఎం.వి క్యాటలాగ్, బొంబాయి, జనవరి 1930; .హెచ్.ఎం.వి క్యాటలాగ్, కలకత్తా, 1927).


భమిడిపాటి రికార్డులు

నాకు చరిత్ర, ఆంత్రపాలజీలలో ఆసక్తి హెచ్చు కనక తెలుగులో కూడా ఎవరైనా ఇలా ప్రకటనలు, పోస్టర్లు, సినిమా, టి.వి లాంటి దృశ్య మాధ్యమాల చారిత్రక పరిణామం పైన పరిశీలనాత్మక పరిశోధనలు చేస్తే బాగుంటుందని నాకో కోరిక. నాకు తెలిసినంతలో తెలుగు దేశంలో ఎవ్వరూ ఈరోజు వరకూ ఈ విషయాన్ని అందుకున్నట్లు లేదు. ఈ మధ్యనే చూసిన ఒక మంచి ప్రయత్నం కత్తి మహేష్‌కుమార్‌ రాసిన చిన్న వ్యాసం. నేనైతే ఇంకా చూడలేదు కానీ చాలా కాలం సినిమా రంగంలో పోస్టర్లు తయారు చేసిన ఈశ్వర్ గారు సినిమా పోస్టర్ అన్న ఒక పుస్తకం తెలుగులో వెలువరించారని విన్నాను. ఒకనాడు చేత్తో గీసిన సినిమా పోస్టరే, ఈనాడు ఆధునికత, వ్యాపారమెళకువలు, మధుర స్మృతులు ఆపాదించిన అరుదత్వం కలగలసి నేసిన అపురూపమైన వస్తువు. భిన్న కోణాలనుండి తెలుగు సాంస్కృతిక చరిత్రను అధ్యయనం చేసే పరిశోధనలు ఇక ముందైనా హెచ్చు సంఖ్యలో వస్తాయని ఆశిద్దాం.


గ్రంథసూచి

  1. Indian history.
  2. Poster Design.
  3. B.S. Kesavan, History of printing and publishing in India : a story of cultural re-awakening; 3 Volumes, New Delhi : Nat. Book
    Trust, 1985-1997.
  4. Rachel Dwyer and Divia Patel, Cinema India: The Visual Culture of Hindi Film. Rutgers University Press, New Brunswick, New Jersey, 2002.
  5. Ranjani Mazumdar; The Bombay film poster; Seminar, May 2003.
  6. On Typesets, Fonts and Graphic Design in Indian Publishing, Pappu Nagaraju et al. (Forthcoming)
  7. See the copies of correspondence published in: తెలుగు సినిమా -చరిత్ర, సంస్కృతి, సిద్ధాంతం పై వర్క్‌షాప్; అన్వేషి & Centre for the study of culture and society-Bangalore, హైదరాబాదు, ఆగస్టు 13-16 1999.