మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం

కథ: మాతృత్వానికి మరో ముడి
రచన: వి. విజయలక్ష్మి
రచనా కాలం: 1987-88.

ఏ కథ అయినా ఎప్పుడు నచ్చుతుంది అంటే చదివేటప్పుడు మనల్ని మనం అందులో ఇడెంటిఫై చేసుకోగలిగినప్పుడు. ఆ సంఘటన మన జీవితంలో జరిగి ఉండక పోయినా అలా జరిగితే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మన ఊహకి తగిన విధంగా పరిష్కారం కథలో ఉంటే మరీ నచ్చుతుంది. ఒక్కోసారి నిజ జీవితంలో మనం ప్రవర్తించాలనుకున్న విధానానికీ, వాస్తవానికీ మధ్య పొంతన కుదరనప్పుడు, రచయిత ఆవిష్కరించిన కోణం మన భావాలను ప్రతిబింబించే విధంగా ఉన్నప్పుడు ఆ కథ మన మనస్సులో గాఢమైన ముద్రను వేస్తుంది. కొన్ని కథలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

మాతృత్వానికి మరో ముడి అన్న కథను తొలిసారిగా ‘అభిషిక్తం’ అన్న కథ సంపుటంలో చదివాను. చదువుతున్నంత సేపూ కథలో పూర్తిగా లీనమై పోయాను. ఆ తల్లి మనసులోని ఘర్షణ, గిల్టీ ఫీలింగ్, ఆ తపన… మాతృత్వపు మమకారాన్ని, మానవత్వాన్ని కూడా అధిగమించిన దారిద్ర్యం. ఈ కథను చదువుతున్నప్పుడూ, అనువాదం చేస్తున్నప్పుడూ కన్నీటిని ఆపుకోలేక పోయాను.

ఆర్థికంగా కొంతైనా స్థిరత్వం ఉంటేనే కుటుంబంలో ప్రేమానురాగాలు నిలిచి ఉంటాయనిపిస్తుంది. పాప మందులకి పెట్టే ఖర్చువల్ల పెద్ద పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేక పోతున్నాం అని ఆ భర్త అన్నప్పుడు, ఆ చేదు నిజాన్ని మింగడం కన్నా ఆ తల్లికి గత్యంతరం లేదు. పాప ఇంకాసేపట్లో చనిపోతుందని, పాప చావు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే రైలు తప్పి పోతుందని గంగ ఒడ్డున వదిలేసి వచ్చేస్తాడు ఆ భర్త. ఎందుకిలా చేసావని నిలదియ్యలేదు ఆ తల్లి. పాపను వెతుక్కుంటూ గంగ ఒడ్డుకి బయలుదేరలేదు. తలారా స్నానం చేసి ప్రయాణపు ఏర్పాట్లలో మునిగి పోతుంది.

ఈ కథ చదువుతుంటే కడుపున పుట్టిన పిల్లల్ని పెంచే ధైర్యం, స్తోమత లేక ఏ చెత్త కుండీలోనో వదిలేసిన తల్లులు గుర్తుకు వస్తారు. సమాజపు రీతి రివాజులు చెయ్యకూడని పనులని చేయిస్తాయి. కానీ మానవత్వంతో నడుచుకోవడానికి, సాటి మనిషి పట్ల దయతో వ్యవహరించడానికి స్పందించే మనసు ఉంటే చాలు. మనకి ఉన్న పరిధిలో సమాజ సేవ చేయడానికి ఎటువంటి ఆటంకమూ ఉండదు.

కొన్ని చోట్ల మరీ నినాదాలు వల్లించినట్లు, సాగతీసినట్లు అనిపించినా కథా గమనంలో ఆటంకం ఏర్పడదు. ఈ కథను తమిళంలో అనువదించి మంగయర్ మలర్ అన్న పత్రికకి పంపించినప్పుడు, ఆ పత్రిక ఎడిటర్ శ్రీమతి మంజుళా రమేష్ గారు స్వయంగా ఫోన్ చేసి ఆ కథ తనని ఎంతగానో కదిలించిందని, మరుసటి నెలలోనే ఆణిముత్యంగా ప్రచురిస్తున్నామనీ తెలిపారు. సెప్టెంబర్, 2004 లో ‘దందనై’ అన్న టైటిల్‌తో తమిళ అనువాదం వెలువడింది. తమిళంలో ఈ కథను చదివిన పూనాకి చెందిన పాఠకులు శ్రీ ఎన్.శ్రీనివాసన్ ఆంగ్లంలో ‘Verdict’ అన్న పేరిట అనువదించారు.

రచయిత్రి శ్రీమతి వి.విజయలక్ష్మి 1947లో పుట్టారు. పొలిటికల్ సైన్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ముప్పై రెండేళ్ళు స్టేట్ బాంక్ ఆఫ్ హైద్రాబాద్‌లో, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అసిస్టెంట్‌గా ఒక దశాబ్దం (1984- 1995) పని చేసి 2001లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. వీరు వ్రాసిన కథలు ఆంద్ర ప్రభ, స్వాతి మంత్లీ, ఉదయం, ఆంధ్రభూమి, రచనలలో ప్రచురింప బడ్డాయి. మాతృత్వానికి మరో ముడి అన్న కథ ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో 87 లోనో, 88 లోనో వెలువడింది. .