ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి.
1. తానా కథాసాహితి 2001 కథానికల పోటీలో విజేతలైన మూడు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.
ఈమధ్య “కథల పోటీలు, వాటి ప్రయోజనాలు” గురించి కొంత చర్చ జరుగుతోంది. ఈచర్చలో ముఖ్యంగా తానా, ఆటాలాటి సంస్థల పాత్ర గురించిన అంశం ప్రవాసాంధ్రులందరికీ సంబంధించినది.ఈ విషయం మీద పాఠకుల అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ బహుమతి విజేతల గుణావగుణాల గురించిన చర్చని ఆహ్వానిస్తున్నాం.
ఈకథల ప్రచురణకు కారకులైన శ్రీ జంపాల చౌదరి గారికి మా కృతజ్ఞతలు.
ఈపనిలో సాయం చేసిన శ్రీ శంకగిరి నారాయణస్వామి (నాశీ) గారికి మా థేంక్స్.
2. శ్రీ కనకప్రసాద్ ఏడాదిపైగా ధారావాహికగా రాస్తున్న “తమాషా దేఖో” ఈ సంచికతో ఆగిపోతోంది. పాత్రలు, ప్రదేశాలు, వర్తమాన సామాజిక స్థితుల్ని ప్రతిబింబించడంలో ఇది గురజాడ “కన్యాశుల్కం” వారసత్వం పుణికిపుచ్చుకున్నదని మా విశ్వాసం. ఇలాటి విశిష్టమైన రచనని “ఈమాట” కు అందించిన కనకప్రసాద్‌కి మా కృతజ్ఞతలు.
3. శ్రీ కలశపూడి శ్రీనివాసరావు ప్రవాసాంధ్రుల సాంస్కృతిక పరిరక్షణా కలాపాల గురించి సాధికారంగా, సంయమనంతో, నిర్దిష్టంగా రాసిన ఒక వ్యాసపరంపరని ఆంధ్రభూమి దినపత్రికలో ఈమధ్యనే ప్రకటించారు. ఒకపత్రికలో ప్రచురించబడ్డ రచనల్ని మళ్ళీ ప్రచురించకపోవడం “ఈమాట” నిర్దేశిక సూత్రాల్లో ఒకటి. ఐనా, ఈ వ్యాసాలు ముఖ్యంగా ఉత్తరమెరికా ప్రవాసాంధ్రులకే సంబంధించినవి కనుకా, వీటిలో స్పృశించిన, చర్చించిన విషయాల ప్రాముఖ్యత వల్లా, ఆ సూత్రానికి exception ఇచ్చి ఆవ్యాసాల్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం. ప్రవాసాంధ్రులందరూ వీటిని తప్పక చదువుతారని మా ఆశ. చదివి వారి అభిప్రాయాల్ని అందరితో పంచుకుంటే బాగుంటుంది.
4.వచ్చే నెలలో వినాయకచవితి రాబోతోంది. అది ఈసంచికాకాలంలో ఔతుంది గనక ముందుగానే రెండు వినాయకచవితి రచనలు ఇస్తున్నాం.
5. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు ఇప్పటివరకు ఉత్తరమెరికాలో వచ్చిన తెలుగు సాహిత్యం మీద సమగ్రమైన పరిశీలనా గ్రంథాన్ని ప్రచురించాలని ఒక పథకం చేపట్టారు. ఇక్కడి రచయిత్రు(త)లందరినీ వారివారి రచనల్ని ఫౌండేషన్‌కి పంపవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. దీని తాలూకు అన్ని వివరాలున్న ప్రకటనను ఈ సంచికలో చూడొచ్చు.
6. “విశ్వకవిత” అనే ఓ కొత్త శీర్షికను ప్రవేశపెడుతున్నాం. దీన్లో, ప్రపంచ భాషల్లో ఉన్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కవితలకు తెలుగు అనువాదాల్ని ప్రచురిస్తాం.ఇదివరకు శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి కొన్ని అనువాదాలు ప్రచురించాం. ఇప్పుడు ఈ “విశ్వకవిత” శీర్షికని ప్రతిభావంతుడైన యువకవి తమ్మినేని యదుకుల భూషణ్ నిర్వహించబోతున్నారు. ఐతే ఈశీర్షిక అతని అనువాదాలకే పరిమితం కాదు. ఉత్సాహం వున్న మరెవరైనా కూడా అనువాదాలు చేస్తే మూలాన్ని,అనువాదాన్ని మాకు పంపండి.
7. “ఈమాట” పత్రికను తెలుగులిపిలో ప్రచురించగలగడానికి “లేఖ” సర్వర్ ఆధారం. దాన్ని ఇంతకాలం నడిపిన శ్రీ జువ్వాడి రమణ గారికి మా కృతజ్ఞతలు.