రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

స్మైల్ ఒఖడే… ఇహ లేడు!

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
నవంబర్ 2008

స్మైల్
స్మైల్

జులై ’95 లో షికాగో తానా సభల సందర్భంలో యస్. వీ. రామారావు, నేనూ చిత్రకళా ప్రదర్శనానికి వచ్చిన బొమ్మల కోసం ఈజెల్స్‌ తయారుచేస్తున్నాం. అతిథిగా వచ్చిన బాపూ గారు కూడా మాతో కలిసి వడ్రంగం పని చేసిపెడుతూ, అన్నారు ‘మీ సభలకి స్మైల్‌ వస్తున్నాడటగా?’ అని. ఆశ్చర్యం వేసింది. ‘స్మైల్‌ వస్తున్నట్టు మాకు ఎవరూ చెప్పలేదే?’ అని ఊరుకున్నా.

అన్నట్టుగానే రెండువందల “ఖాళీ సీసాలు” మోసుకొని స్మైల్‌ షికాగో వచ్చాడు. ‘ముందుగా చెప్పద్దూ, వస్తున్నట్టు?’ అని కాస్త గదమాయించా.’మీ ఊరొస్తున్నా’ అని ముందుగా చెప్పడం స్మైల్‌ కి ఎప్పుడూ అలవాటు లేదు. చిన్నప్పుడు ఏలూరు లోనూ అంతే! ఎక్కడనించో తుఫానులా ఊడి పడేవాడు, చెప్పకండా చెయ్యకండా.

జులై ఒకటో తారీకున స్మైల్‌ని తానా సభకి పరిచయం చేసి “ఖాళీ సీసాలు” గురించి నాలుగు మాటలు చెప్పడం నా భాగ్యం. ఆ సభలో వేదాల శ్రీనివాసాచార్యులు గారు వేదపఠనం చేసి స్మైల్‌కి దుశ్శాలువాలు కప్పడం నాకు నవ్వొచ్చింది. ఎప్పుడూ అంటూ ఉండే వాడిని, “తమ్ముడూ! సాయిబ్బూ! నీకు ఒడుగు చేయించాలని ఉన్నదయ్యా” అని. ఇస్మాయిల్ (స్మైల్‌ కాకముందు మాకు అతను ఇస్మాయిల్ గానే తెలుసు.) మా తమ్ముడి క్లాస్ మేట్. అందుకని స్మైల్ నాకు సాయిబ్బు తమ్ముడు అయ్యాడు. అల్లా అనే హక్కు నాకొక్కడికే ఉండేది. అతని పూర్తి పేరు మహమ్మద్‌ ఇస్మాయిల్‌.

ఏలూరు కాలేజీలో చదువుకొనే రోజుల్లో వెల్చేరు నారాయణ రావు మేస్టారి ద్వారా స్మైల్ మాకు పరిచయం. అరవైల్లో నారాయణరావుగారు, సూర్యనారాయణరాజు, నేనూ, రాత్రుళ్ళు ఒంటిగంట దాటే దాకా ఓవర్ బ్రిడ్జ్ కోసం పోసిన ఇసక కొండల పైన కూచొని బాతాఖానీ చేసే రోజుల్లో ఇస్మాయిల్ మాతో కలిసి తిరిగేవాడు. మాతోపాటు పెద్దవంతెన దగ్గిర ఇరానీ “టీ”ర్థయాత్రకి వచ్చేవాడు.

పంథొమ్మిదివందల అరవై నాలుగు ఆఖరి రోజుల్లో ననుకుంటాను, తెల్లటి కాగితాల మీద ముత్యాల్లాంటి దస్తూరితో “వల” కథ పట్టుకొని వచ్చాడు. అప్పటి వరకూ ఇస్మాయిల్ కథలు చదువుతాడనే తెలుసు. కథల గురించి మాట్లాడతాడని తెలుసు. రాస్తాడని నాకు తెలీదు. రాతప్రతిలో ఉన్నప్పుడు ఆ కథ మేమందరం చదివాం. “అక్షరం మార్చకు! వెంటనే అచ్చుకి పంపించు” అన్నాం. భారతిలో ఆ కథ వచ్చిన తరవాత అదేదో నాకథ పడ్డట్టే గర్వంగా మురిసిపోయాను.

ఆ తరువాత “సముద్రం” కథ. “అదేమిటి? సముద్రం ముందు రావాలి. ఆ తరువాత వల రావాలి. నువ్వుత్త తిరకాసు వాడివి” అని వేళాకోళం చేసాను. ఆరు నెల్లు తిరక్కుండా, ఆ సముద్రాన్ని నవలికగా మార్చి పట్టుకొచ్చాడు. అప్పటికింకా తాను స్మైల్ అవతారం ఎత్తలేదు. చాలా ఏళ్ళ తరువాత, “నీ సముద్రాన్ని మరీ పల్చబడనీయకు. దాన్నీ కథ గానే ఉండనీ” అని నే నన్నానని తానే గుర్తుచేశాడు.

నేను ప్రతి ఏడూ ఇండియా వచ్చినప్పుడు చూడటానికి వచ్చేసేవాడు; రాజమండ్రీ నుంచో, హైదరాబాదు నుంచో. కనీసం ఒక రెండు రోజులు పాత స్నేహితాలు నెమరు వేసుకోవడం, పాత దోస్తుల్ని కలవడం ఆనవాయితీ. కొత్త కొత్త కవుల పుస్తకాలు పోగుచేసి ఉంచేవాడు, ఆప్యాయంగా నాకోసం. తరువాత గంటలకొద్దీ తెలుగు సాహిత్యం గురించీ తెలుగులో విమర్శల గురించీ వాదాలు, ప్రతివాదాలు.

తను చేసిన అనువాదాలు చదివి వినిపించేవాడు. చాలా మొహమాటస్తుడు స్మైల్. తన కవితల పుస్తకం, “ఒఖడే” సిగ్గుపడుతూ మరీ ఇచ్చాడు. ముందు డాలీ బొమ్మ. వెనక తన ఫొటో! స్మైల్ రాసింది కాస్తే. అయితేనేం, వాసి మాత్రం జాస్తి.

 అర్థ స్వప్నాలు, అర్థ సత్యాలు
చుట్టుకు గడిచిపోతాయి వ్యర్థంగా జీవితాలు. 

చాలా మంది విషయంలో ఇది ఎంతో నిజం, కానీ, స్మైల్ విషయంలో ఇది పచ్చి అబద్ధం.

నిజమైన స్మైల్‌ని హెరన్‌టన్‌ కవితకి అనువాదంలో చూడండి.

” …ఈ మాట్లాడేది నేను
నేను జీవిస్తున్నాను,
ఇది నా గొంతు,
ఈ మాటలు నా మాటలు.
నా నోరు పలుకుతోది వీట్ని.
నేనొక కవిని.
నువ్వు వినేది
నీ గూబ మీద పేల్తున్న నా పిడికిల్ది.”

మహా మంచి స్నేహితుడు స్మైల్. మరెంతో మెత్తని హృదయం స్మైల్‌ది. వీటన్నింటికన్నా మహ గట్టిది అతని మాట.

అలాంటి స్మైల్ ఒఖడే! ఆ స్మైల్ ఇహ లేడు.

    
   

15అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Sai Brahmanandam Gorti December 8, 2008 2:43 pm

    ప్రముఖ కథా రచయిత “స్మైల్” ఇకలేరు. చాలాకాలం వరకూ పేరు వినడమే కానీ ఆయన పరిచయం లేదు. ఆరేళ్ళ క్రితం అనుకోకుండా హైద్రాబాదు నుండి కాకినాడ వెళుతుండగా ఆయనతో కలిసి కొద్దిసేపు ప్రయాణించాను. మా బెర్తుల పక్కనే ఓ ముస్లిం కుటుంబం వుంది. రైలు సికింద్రాబాదు దాటిందో లేదో మావాళ్ళు టిఫిన్ కారీర్లు తెరిచారు. తెచ్చుకున్న పులిహార ఆ ముస్లిం ఫామిలీ కీ ఆఫర్ చేసింది మా అక్కయ్య. “పులిహారా! దాని వాసనకి చలించలేనంత స్థిత ప్రజ్ఞుణ్ణి కాదు లెండి!” అంటూ ఆయన తీసుకున్నారు. ఓ ముస్లిం వ్యక్తి ఇంత స్వచ్చంగా తెలుగు మాట్లాడుతూ, “స్థిత ప్రజ్ఞుడు” లాంటి పదం వాడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మాటల్లో పేరూ, వూరూ అడిగితే అప్పుడు తెలిసింది ఆయనే ప్రముఖ కథా రచయిత స్మైల్ అని. మాది అమలాపురం అని చెప్పగానే “కోన సీమా? చెప్పరేం! పులిహార రుచి చూడగానే అనుమానం వచ్చింది. మీ వైపు కందా బచ్చలీ కూర వండుతారు. నాకు ఆ కూర అంటే చాలా ఇష్టం..” అంటూ చెప్పుకొచ్చారు. ప్రయాణమంతా ఆయన చిరునవ్వుల ముచ్చట్లతోనే గడిచిపోయింది. తిరుగు ప్రయాణంలో ఆయన రాసిన ఖాళీ సీసాలు కథని సంపాదించి చదివాను. మరలా కలుసుకునే అవకాశం రాలేదు.

  2. 2
    gorusu jagadeeshwar reddy December 8, 2008 10:43 pm

    శ్రీవెంకటేశ్వరరావుగారికి, నమస్కారాలు.

    స్మైల్‌గారికి మీరందించిన నివాళి చదివాను. ఈ సందర్భంగా వారితో గడిపిన కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవాలనిపించింది. నా చిన్నతనంలో స్వాతి మంత్లీలో “నాకు నచ్చిన కథ” అనే పరిచయం వచ్చేది. అందులో అత్తలూరి నరసింహారావుగారు పరిచయం చేసిన “ఖాళీ సీసాలు” కథ చదివి ఆ స్మైల్‌ అనేవాడు కనిపిస్తే కాళ్లపైన పడిపోవాలనే ఆవేశం కల్గింది. ఆ తర్వాత కొన్నాళ్లకి నేను హైద్రాబాద్‌ వచ్చేశాక మా కాలేజి లెక్చరర్‌ వివిఎస్‌ఎన్‌ మూర్తి అనే ఆయనతో మాటవరసకి ఆ కథ గురించి అంటేం ‘వాడు నా క్లాస్‌ మేటయ్యా. వాడిక్కడే కమ్మర్షియల్‌టాక్స్‌లో పనిచేస్తున్నాడు’ అంటూ అప్పటికప్పుడు నాతో ఫోన్‌లో మాట్లాడించాడు. అది మొదలు స్మైల్‌గారి ఇంటికి తరచూ వెళ్తుండేవాడిని. వాళ్ల ఇల్లు క్రాస్‌రోడ్స్‌లో సప్తగిరి టాకీస్‌ దగ్గర ఉండేది. ఇది 1992 లోని సంఘటన. తర్వాత భరాగోగారు వచ్చి వాళ్లింట్లో ఉండి “‌ఖాళీ సీసాలు” పుస్తకానికి కావలసిన మెటీరియల్‌ సమకూర్చుకుంటూ ఉండగా స్మైల్‌గారు అనువాదం చేసిన “చుగ్తాయ్‌” “‌కంబలి” కథ దొరకలేదు. నాకు మొదట్నుంచి మంచి కథల్ని కుట్టుకోవడం అలవాటు. అలా నా దగ్గరున్న ఆంధ్రప్రభలో వచ్చిన కంబలి కథని తీసుకెళ్లి ఇచ్చాను. ఆ పుస్తకం ముందు మాటలో తనని పుస్తకం వేయమని సతాయించిన వారిలో నన్ను కూడా చేర్చారు స్మైల్‌గారు. ఆ పుస్తకావిష్కరణ 1995లో ప్రెస్‌క్లబ్‌లో ఎంతో నిరాడంబరంగా, ఇంటి పండగలా జరిగింది. రబ్బరుని చెక్కి బొమ్మలుగా మలిచే ఆర్ట్‌ కూడా వారికి ఉందని నేనా సభలో చెప్పాను. (ఈ విషయం నాకు మా మూర్తి సార్‌ చెప్పారు)

    ఆయన్ని చివరి సారిగా పోయిన ఏడాది అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీకె.రామచంద్రమూర్తిగారి వారబ్బాయి పెళ్లిలో హైదరాబాద్‌లో చూశాను. నా పుస్తకాన్ని అక్కడే ఇచ్చాను – వారు రాజమండ్రి వెళ్లాక ఫోన్‌ చేశారు. నా ‌”ఉసుళ్లు” అనే కథకోసం వారి “తూనీగ” కవితలోంచి కొన్ని పదాలు వాడుకున్నాను. వారి “ఖాళీసీసాలు” కథలోని “పాడు పిల్లల”తో నేను “జగదాంబ జంక్షన్‌” అనే కథ రాశాను. (ఈ కథ ఆంగ్లానువాదం టెక్సాస్‌ యూనివర్సిటీ వారేసిన “సాగర్‌”(2002)లో వచ్చింది) అవన్నీ నా పుస్తకంలో ఉటంకించాను. స్మైల్‌గారు ఎంతో సంతోషించారు.

    వారి పెద్దమ్మాయి పెళ్లి హైద్రాబాద్‌లో పింగళి వెంకట్రామారెడ్డి హాల్లో అయినప్పుడు అందరం వెళ్లాం. అది పెళ్లిలా జరగలేదు. ఏదో మహా ఉత్సవంలా అనిపించింది. ఆ పెళ్లి విందుని మా అమ్మాయి ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది, జరిగి పుష్కరం దాటినా.

    ఆయన అందం పున్నమి చందమామ – ఆయన మాట్లాడినా, నవ్వినా కురిసేది వెన్నెలే!

    అశ్రునివాళితో – గొరుసు జగదీశ్వరరెడ్డి.

  3. 3
    విష్ణుభొట్ల లక్ష్మన్న December 9, 2008 10:18 am

    స్మైల్ ఇక లేరు అన్న వార్త తెలుగు పత్రికల్లో చదివాను. వేలూరి గారి నివాళి కూడా చదివాను. అరే అప్పుడే చనిపోయేంత వయస్సు కాదే! నమ్మలేకపోయాను.

    అది 1999 సంవత్సరం అనుకుంటా. అజో.విభో పురస్కారం రాజమండ్రిలో. పురస్కారగ్రహీత శ్రీ నండూరి రామ్మోహన రావు. అక్కడ చూసాను స్మైల్ గారిని మొదటిసారి. అదే చివరిసారి కూడా.

    ఆ నేపధ్యంలో, పోటీనాటకాల బహుమతి విజేతలు, బహుమతి తీసుకోటానికి కూడా వేదిక మీదకి రాలేని పరిస్థితుల్ని తీవ్రంగా విమర్శిస్తూ కనిపించిన స్మైల్ గార్ని అప్పుడే చూసాను. అప్పుడే స్మైల్ గారితో పాటు, మిత్రులు బేతవోలు రామబ్రహ్మం, తల్లావజఝుల పతంజలి శాస్త్రి గార్లతో కలిసి ఒక సాయంత్రం అంతా సాహిత్య ఇష్టాగోష్టిలో గడిపాం. వృత్తి సాహిత్యం కాకపోయినా, ప్రవృత్తి సాహిత్యమే అని మిత్రులు చెపుతుంటే విన్నా. స్మైల్ గారి రచనలు నేనేవీ చదవలా. అవకాశం వస్తే, ఇప్పుడు కొని చదువుతా.

    ఒక మంచి మనిషిని, సాహిత్యాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తిని మరింత తెలుసుకోలేకపోయినందుకు చింతిస్తూ,

    స్మైల్ గారికి శ్రద్ధాంజలితో,

    లక్ష్మన్న

  4. 4
    రాజేంద్ర కుమార్ దేవరపల్లి December 9, 2008 11:21 am

    సుమారో దశాబ్దం క్రితం డాక్టర్.యం.ఆదినారాయణ రాసిన ‘భ్రమణకాంక్ష’ పుస్తకావిష్కరణ సభకు వచ్చిన స్మైల్ గారిని మొదటిసారి చూసాను. అత్తలూరి చేసిన పరిచయంతో ఆవేళ కొంత సమయం ఆయనతో గడిపాను. చిన్నప్పటి నుంచి కాస్త పత్రికలు తిరగేస్తూ ఉండటంతో కొన్ని విభిన్నంగా ఉండే పేర్లు అజంతా, ఎల్లోరా, స్మైల్. వీరిలో ఒక్క స్మైల్ గారిని మాత్రం కలవగలిగాను. వాసికి ఎక్కువగానూ, రాశిలొ కాస్త తక్కువగానూ మనకందించిన స్మైల్ గారి సాహితీవ్యాసంగం,ఇష్టాగోష్టులూ ఎవరన్నా గ్రంథస్తం చేస్తే ఒక మహోపకారం మనపట్ల చేసినవారవుతారు అని నాభావన. మంచి మనిషి స్మైల్ గారికి నా మనఃపూర్వక శ్రద్ధాంజలి.

  5. 5
    డా.ఇస్మాయిల్ December 9, 2008 7:23 pm

    ‘చెట్టు’ ఇస్మాయిల్ గారిని చదివాను కానీ, ఈ ‘స్మైల్’ గారి ‘ఖాళీ సీసాల’ను చదవాలి. స్మైల్ గారికి నా మనఃపూర్వక శ్రద్ధాంజలి.

  6. 6
    vinnakota ravisankar December 9, 2008 8:10 pm

    ఇస్మాయిల్ గారు హైదరాబాదు వచ్చినప్పుడల్లా స్మైల్ గారు వచ్చి పలకరించేవారు. ఆ రకంగా ఆయన్ని అనేకసార్లు కలుసుకున్నాను. ఆయన మంచి మాటకారి. ఇస్మాయిల్ గారు ఎప్పుడూ ఏదో ధ్యానంలో మునిగి ఉండే వటవృక్షమైతే, స్మైల్ గారు ఆకులతో నిత్యం గలగలా సంభాషించే రావిచెట్టు. ఏదైనా విషయం మీద ఆయన వాదించే తీరు నాటకీయంగా, ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.”ఖాళీసీసాలు” పుస్తకావిష్కరణ జరిగినప్పుడు హాజరయ్యాను. దేవుడిపెళ్ళిలా జరిగిన ఆ సభలో అందరూ పెద్దలే.ఎవరికి మాట్లాడాలనిపించినా, వచ్చి మాట్లాడమన్నారు. ఇస్మాయిల్ గారి చివరిరోజుల్లో ఆయన్ని ఏదోవిధంగా సత్కరించాలనే ఉద్దేశ్యంతో ఒక అభినందన సభని హైదరాబాదులో స్మైల్ గారు ఎంతో శ్రమపడి నిర్వహించారు. ఆ సభలోనే, ఇస్మాయిల్ గారికి అంకితమిచ్చిన నా “వేసవివాన” ఆవిష్కరణకి కూడా అవకాశం కల్పించారు. స్మైల్ గారి స్నేహ స్వభావంవల్ల, ఆయన్ని కొద్దిగా ఎరిగున్నవారు కూడా మర్చిపోవటం కష్టం. ఆయన నవ్వు, మాట పదేపదే మనసులో మెదుల్తున్నాయి. మళ్ళీ ఆయన్ని కలుసుకోవటం వీలుపడదంటే నమ్మశక్యం కావటం లేదు.

  7. 7
    కొడవళ్ళ హనుమంతరావు December 9, 2008 10:43 pm

    ఖాళీ సీసాల స్మైల్

    స్మైల్ చనిపోయారంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ “ఖాళీ సీసాలు” చదివాను. అది స్మైల్ రాయడం మొదలెట్టిన ఒకటి రెండేళ్ల లోపునే, 1965లో రాసిన కథ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, సాహిత్య అకాడెమీ (వాకాటి, వేదగిరి) కూర్చిన “బంగారు కథలు” లో పొందుపరచిన కథ. బెడ్ టైమ్ రీడింగ్ కి పనికిరాని కథ!

    స్మైల్ కవిత్వం ఏమీ నేను చదవలేదు కాని, ఆ కథ ముగింపు:

    “… రెప్పలు మూయని కళ్ళు వెయ్యి చావులు శపించాయో.
    హాయి హాయిగా వున్న గాలికి, పల్చ పల్చగా వున్న ధూళికి, పచ్చపచ్చగా వున్న చెట్లకి, వెచ్చవెచ్చగా వున్న ఎండకి, దూరంగా హోరు హోరుగా వున్న సముద్రానికి, పైడి మీద బోర్లించిన మూకుడు సమాధి ఆకాశానికి తెలిసి వుండాలి.
    తెలియకపోయీ వుండాలి.”

    చదివిన వెంటనే రెండేళ్ళ క్రితం ఓ సైన్సు వ్యాసంలో చూసిన ఒమర్ ఖయ్యాం కవిత గుర్తొచ్చింది:

    And that inverted Bowl we call The Sky,
    Whereunder crawling coop’t we live and die,
    Lift not thy hands to It for help – for It
    Rolls impotently on as Thou or I.

    2006లో ఇండియా వెళ్ళినప్పుడు, అప్పుడే మో, స్మైల్ ఇరువురి సంపాదకత్వాన వెలువడిన “కొమ్మలు రెమ్మలు” చూశాను. “ప్రపంచీకరణ, వాణిజ్యీకరణలకు బలయిపోతున్న ఆంధ్రదేశపు యువతీయువకులకు వారి తెలుగు నేలలో మొలిచిన మహా వృక్షాలనీ, వాటి కొమ్మల్నీ రెమ్మల్నీ పిందెల్నీ పువ్వుల్నీ కాయల్నీ,” పరిచయం చేసే పుస్తకం. స్మైల్ కొమ్మని కూడా వారి మిత్రులు మిగిలిన వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.

    చివరగా, పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది. స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను. ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు. “బంగారు కథలు” ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో. పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం.

    కొడవళ్ళ హనుమంతరావు.

  8. 8
    యుగంధర్ December 11, 2008 5:06 am

    అప్పుడే పోవాల్సిన వయసు కాదు. ఇంత మంచి వాళ్ళు హడావుడిగా పైకి వెళ్ళిపోయినప్పుడల్లా బహుశా దేవుడికి వాళ్ళ అవసరం మనకంటే ఎక్కువేమో అనిపిస్తుంటుంది నాకు. తన ఆప్త మిత్రుణ్ణి ఇలా వేలూరి గారు తల్చుకోవడం ఎంతైనా సమంజసంగా ఉంది. అస్సలు పరిచయం లేని కొత్తవాళ్ళని కూడా, కేవలం వాళ్ళు తెలుగు సాహిత్యాభిమానులు అన్న కారణం వల్ల, ఆత్మీయుల్లా చేరదియ్యడం స్మైల్ లాంటి స్థితప్రజ్ఞులకే చెల్లుతుంది.

  9. 9
    chavakiran December 12, 2008 12:19 am

    పొయినోళ్లంతా గొప్పోళ్లు, మంచోళ్లు. ఈ లోకం వీడి పొయిన తరువాతనే వారి విలువ ఇప్పుడే పుట్టిన కుసుమాలకు తెలుస్తుందనుకుంటాను.

    బాబ్బాబూ, ఇలా అందరూ టపా కట్టాకనే మాకు వారి వారి గొప్పతనాన్ని వివరించక, కొంతమంది ఈ లోకంలో ఉండగానే వారి గురించి ఓ ముక్క చెపితే బాగుంటుంది కదా.

  10. 10
    Vamsi M Maganti December 15, 2008 6:00 am

    పోయినోళ్ళందరూ మంచోళ్ళు. పోయాక వాళ్ల విలువ “ఆలస్యం” గా నైనా తెలుస్తుంది.

    ఒక సంగతి. నేను చాలా రోజులో, ఏళ్ళ క్రితమో ఒక “ఇస్మాయిలుని” కవిత / హైకూ చదివా :

    పచ్చని పొద
    ఒకటికి
    పోయాలనిపించింది […]

    మరి ఆ ఇస్మాయిలు, ఈ ఇస్మాయిలు ఒక్కరేనో కాదో నాకు తెలియదు. మళ్ళీ ఇస్మాయిలు అని పేరు కనపడితే ఉన్న “స్మైలు” కూడా పోయి … ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

  11. 11
    bollojubaba December 28, 2008 4:38 am

    వంశీ గారికి :-)

    మీరు చెప్పిన హైకూ వ్రాసింది చెట్టుకవి ఇస్మాయిల్ గారు. మీరు వ్యంగ్యంగా ఉటంకించిన హైకూ, ఒక స్ట్రే థాట్. అలా చూడగలగడం కూడా అరుదైన విషయమే కదా. చెట్టుకవి ఇస్మాయిల్ గారి ఇతర రచనలు ఈమాట ఆర్చైవ్స్ లో ఉన్నాయి వీలైతే చదవండి. ఎంజాయ్ చెయ్యగలరు. I wonder in his poetry how he could see the things in such a totally different angles.

     ఇక ఇప్రస్తుతం జరుగుతున్న డిస్కషను ఖాళీ సీసాల ఇస్మాయిల్ గారిగురించి. వీరు తన పేరును స్మైల్ అని కుదించుకొన్నారు. తెలుగు సాహిత్యం వరలో రెండు ఇస్మాయిల్స్ దూరటం బాగోదు కనుకేమో. వీరు వ్రాసింది తక్కువైనా మంచి కవిత్వం వ్రాసారు.

     పై విషయంలో మీకే కాదు చాలా మంది కన్ఫ్యూషను లో ఉన్నారని నాకనిపించి ఈ కామెంటు వ్రాస్తున్నాను. ఎందుకంటే, ఆయన చనిపోయిన రోజున ఓ లోకల్ పత్రికలో, చానాళ్ల క్రితమే చనిపోయిన చెట్టుకవి ఇస్మాయిల్ గారిని మరలా వార్తల్లోకెక్కించేసాడో విలేఖరి. 

  12. 12
    rama December 29, 2008 11:28 am

    వేలూరి గారికి,

    మీరు smile ని తలుచుకోవడం బాగుంది. smile సౌమ్యుడు. సంస్కారి. కానీ ఆయన చివరికి క్రమంగా “ముస్లింవాద సంఘాల” వైపు మొగ్గు చూపేడు.వాటికి దగ్గరయ్యాడు. వాళ్ళకి పెద్దదిక్కుగా మారి వాళ్ళ పుస్తకాలకి ముస్లింగా ఆ అస్తిత్వంతో ముందు మాటకూడా రాసేడు. అదీ ఆశ్ఛర్యం. మొదటి రోజుల్లో smile ని ఎరిగిన వారికి ….ఈ మార్పు కొంతవింతని కలిగించక పోలేదు. ఇవాళ తెలుగు దేశంలో ఇదీ పరిస్థితి. స్మయిలు సైతం ఈ ప్రవాహంలో పడక తప్పలేదు. ఇది ఒక మార్పు ఆఖరి రోజుల్లో smile లో.

    స్మయిల్ ని సైతం మారేలా చేసిన ఈ ధోరణులు..వీటి భవితవ్యాలు..మంచివో..చెడ్డవో నాకు తెలీదు. కానీ ఇదిగో …ఇది మరో కోణం …smile వ్యక్తిత్వంలో….అన్న సంగతిని కూడా చెప్పాలని.

    భవదీయ
    రమ.

  13. 13
    కొడవళ్ళ హనుమంతరావు December 30, 2008 7:50 am

    రమ గారికి,

    ముస్లిం అస్తిత్వంతో స్మైల్ ముందుమాటలు రాసిన పుస్తకాలలో కొన్నిటివయినా పేర్లివ్వమని మనవి. వాటిని చదివి పాఠకులు ఆయనలో వచ్చిన మార్పు మంచికో చెడుకో, కొంతవరకైనా బేరీజు వేసుకునే వీలుంటుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  14. 14
    rama December 30, 2008 10:30 pm

    తప్పకుండా హనుమంతరావు గారూ !

    smile “గౌరవ సంపాదకత్వం” వహించిన “వతన్” ముస్లిం కథలు…అలాగే “అజాఁ” అన్న గుజరాత్_ముస్లిం కవిత్వం కి 23/9/2002 న,రాజమండ్రి నించి స్మయిల్ రాసిన ముందుమాట చదవండి.

    “వీళ్ళేం ‘దండోరా’ లు వేయించుకుంటారు. వీళ్ళేం వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు జరుపుతారు అంటూ, … బ్రాహ్మణుల మీద…వాళ్ళని soft target చేయడం చాలా తేలిక అన్న సానుభూతితో మాట్లాడిన smile ‘వతన్’కి ఖాజా రాసిన దాన్ని (ఆ పుస్తకానికి “గౌరవసంపాదకుని”గా ఖాజా రాతల్లోని) బ్రాహ్మణ నిందని ఒప్పుకోవడంతో పాటు, తానుగా ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని రాసిన దాన్లో అయితే ఖాజాని మించి ‘అగ్రవర్ణాల’పై కోపం చూపించే దిశగా కదలడాన్ని గమనించవచ్చు.

    Gujarat riots గానీ …మొన్న తాజ్..నారిమన్ హౌస్ ల మీద ముస్లిం terrorists దాడి గాని ఎవరూ మెచ్చగలిగినవి కాకపోయినా, గుజ్రాత్ హింస మీద అచ్చులో వచ్చినన్ని పుస్తకాలు terrorists హింసని వ్యతిరేకిస్తూ ఒక్క పుస్తకమూ కనీసం తెలుగులో వీళ్ళెవ్వరూ ప్రచురించకపోవడం కూడా మనం గమనించవలసిన విషయాలే !!

    రమ.

  15. 15
    M.A.Khadeer October 20, 2024 10:13 pm

    It was a sad development that Isnail too moved towards religion. Brahmins(some) are the red hot revolutionaries in India, like Gora gaaru,

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గత శతాబ్దంలో ప్రజాకవులు
  • అయ్యబాబోయ్‌ లక్షరూపాయలే!!
  • స్మరణ: కథ నచ్చిన కారణం
  • స్త్రీ పర్వంలో గాంధారి
  • తీన్‌ కన్యా

ఇటువంటివే…

  1. తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్
  2. ఒఖడే
  3. స్మైల్‌ – ఓ జ్ఞాపిక
  4. కవి స్మైల్ గురించి మరొక్కసారి…
  5. స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత

నవంబర్ 2008 సంచికలో ...

  • 2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు
  • 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ
  • A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu
  • అసమర్థులు
  • ఈమాట – నామాట
  • ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం
  • కుతంత్రం
  • జనరంజని: మహానటి సావిత్రి
  • డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష
  • తరువాతేమిటి?
  • తెలుగు కథల పోటీ
  • నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం
  • నాచన సోమన అపురూప పద సంచయం
  • నేనొక సాధారణ పాఠకుణ్ణి
  • పదేళ్ళ “ఈమాట” మాట
  • పళ్ళెం మాత్రం పగలగొట్టకు
  • పురూరవ
  • పురూరవ: శ్రవ్య నాటిక
  • బాలమురళీకృష్ణ సంగీతం
  • మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి
  • మనకు తెలియని మన త్యాగరాజు – 2
  • మరచిపొమ్మంటున్నారు
  • మూడు జ్ఞాపకాలు
  • రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా
  • రామా కనవేమిరా!
  • రెండు తీరాలు
  • సార్ గారండీ… సార్ గారండీ…
  • సువర్ణభూమిలో …
  • స్మైల్ ఒఖడే… ఇహ లేడు!
  • హిమపాతము
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!
వానకు తడిసిన పువ్వొకటి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.