ఒఖడే

[శ్రీ స్మైల్ జ్ఞాపకార్థం, వారి ప్రసిద్ధమైన ఒఖడే కవితను ఇక్కడ పునః ప్రచురిస్తున్నాం. మాకు అనుమతి నిచ్చిన శ్రీమతి యాస్మిన్ ఇస్మాయిల్ గారికి కృతజ్ఞతలు – సం.]

అర్ధ స్వప్నాలు, అర్ధ సత్యాలు
చుట్టుకు గడిచిపోతాయి వ్యర్ధంగా జీవితాలు

గాలి గాయపడుతుందని ఆకు రాలదు
నేల నొచ్చుకుంటుందని మొక్క మొలవదు;
అలా అనుకుంటాం
అయినా ఏదీ ఆగదు

ఆ మూలన ఒకడు
మృత్యు నైశిత్యపు వులితో శిలలు చెక్కుతుంటాడు
నచ్చీ నచ్చక వీర్యాండపు బండలమీద పగలగొట్టి
మళ్ళా మళ్ళా చెక్కడం మొదలెడ్తాడు
విషాద గీతాలాలపిస్తాడు

విదూషకుడు వినోదానికి
గెంతులేస్తూ
వంకర టింకర పాటొకటి పాడ్తుంటాడు
యుగాలుగా యిదే ఎడతెగని ధారంటాడు.
దొర్కింది తినండి తాగండి
సుఖంగా నిద్ర పొండంటాడు

అసలు ఎవడికి వాడే అంతవరకూ
స్వీయ శవవాహకుడంటాడు.

ఒకడు

కంట ఆశా నక్షత్రం మెరుస్తాడు
చేతిలో చలచ్ఛలన జీవన కేతనంతో
కాదిది కాదిదంటూ
కేకై నింగికి లేచి మోగుతాడు

మరొకడు అతని కంఠనాళానికి గాలం వేసి
నేలకి లాగుతుంటాడు.

ప్రపంచపు అనేకానేక వికృత రణగొణ ధ్వనులు ముంచెత్తుతున్నా
ఒక కేక ఒక సజీవ గీతమై సంగీతమై
సుసందేశమై సుభిన్న ఆలోచనై
నా
మనసు మెదడుల గట్లను కోసుకు లోపలికెళుతుంది.

ఓ పువ్వు పూస్తుంది
జీవితం సంపన్నమౌతుంది
అర్ధవంతమై సాగుతుంది

ఆ ఒఖడి వల్లే

(నామినికి, 3-2-89)