[ఈ వ్యాసం మొదటగా ‘చేరాతలు’ శీర్షికలో (సెప్టెంబరు 2, 1990) ప్రచురించబడింది. చేరా గారి ప్రత్యేక అనుమతితో యదాతథంగా ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాం. వారికి మా కృతజ్ఞతలు – సం.]
స్మైల్‌కు కవిగా కన్నా కథకుడిగా ఎక్కువ పేరున్నట్టుంది. అతను రాసిన కథ పేరు మీదుగా ‘ఖాళీ సీసాల ఇస్మాయిల్’ అనే పేరు రూఢిలో ఉండి. కాకినాడలో ఉంటున్న సీనియర్ కవి ‘చెట్టు ఇస్మాయిల్’ నుంచి వేరుగా గుర్తించటానికి ఇట్లా అనేవారు. ఇప్పుడు కవిగా ‘స్మైల్’ అనే పేరుతో ప్రశస్తి వచ్చింది.
ఎక్కువ రాయక పోవటం వల్ల (తనే చెప్పుకున్నాడు స్లో రైటర్నని) స్మైల్‌కి మేజర్ కవిగా గుర్తింపు లేకపోయినా సమకాలిక కవులు ఈయన్ను మంచి కవిగా గుర్తించారు. ఈయన ‘మా అబ్బాయిని కొట్టినప్పుడు’ అనే కవితను రావులపల్లి సునీత రాసిన ‘తల్లిగోడు’ అనే కవితతో కలిపి ఈ శీర్షిక కింద పూర్వం ఒకసారి పరామర్శించాను.
ఈ పుస్తకం (ఒఖడే)లో 1966 నుంచి 1990 వరకూ పాతికేళ్ళ కాలంలో రాసిన పన్నెండు ఖండికలున్నాయి. ఈ పుస్తకం విచిత్రమైన పొడుగాటి మీసాలతో సాల్వడార్ డాలీ బొమ్మ ముఖచిత్రంగా పొడుగాటి (ఆడ్) సైజులో ఉంది. ఈ కవికి డాలీ చిత్రాలు ఇష్టం. తన కిష్టమైన చిత్రకారుని బొమ్మ ముఖచిత్రంగా వేసుకుని కవి ఫోటో వెనక వేశారు. ఈ పుస్తకంలో ‘డాలీ నుంచి కాస్త గాలి’ అనే ఒక ఖండిక ఉంది. ఇది కృ.శా. కవిత్వం మీద (చెట్టు) ఇస్మాయిల్, సైగల్ పాట మీద అఫ్సర్ రాసిన ఖండికల సరసన చేర్చదగినది.
ఒకోసారి తూలిపోతుంటాం కాదా అని తన మూడ్ గురించి మనకు ముందుగా చెప్పి
జ్ఞాపకం వస్తావు డాలీ
గడియారం కరిగి ప్రవహిస్తూ
అని డాలీని గుర్తు తెచ్చుకుంటూ మంచుముక్క లాగా కరిగిపోతున్నట్టు డాలీ చిత్రించిన గడియారాన్ని గుర్తు చేస్తాడు. కరుగుతున్న కాలాన్ని సంకేతించిన ఈ డాలీ చిత్రం ప్రపంచ ప్రసిద్ధమైంది. వెంటనే దృశ్యచిత్రంతో సమమైన ఊహా చిత్రాలను పదాలతో చిత్రిస్తాడు కవి.
ఓ తుమ్మ ముల్లు శూన్యంలోకి
కలుక్కున దిగబడినట్టు
నిటారుగా నిలుస్తుంది.
ఓ కన్నీటి చుక్క
దుఃఖపు పావురమై
అశాంత గీతాలు ఆలపిస్తూంటుంది.
ఈ రెండూ చాలు బాధా తీవ్రతను వ్యక్తం చేయ్యటానికి. కానీ కవి వీటితో సంతృప్తి పడక రెంటినీ కలిపి మరో చిత్రం తయారు చేశాడు చూడండి.
ముల్లు మొనమీద ముక్కును మోపి
బ్యాలెన్స్‌కి రెక్కల్ని తిప్పలు పెడుతూ
నన్ను శపిస్తుంది కదా డాలీ
వీర్యాల వానలో నానమని
మళ్ళా మనిషిగా పుట్టమని
మనిషి మనుగడను గురించిన తాత్విక గీతం ఇది. ముల్లు మొన మీద ముక్కు మోపి బాలెన్సు చేసే పావురం ద్వారా జీవితంలో అర్ధరాహిత్యాన్ని, క్లేశాన్ని చూపించదల్చుకున్నాడు.
అధివాస్తవికమైన చిత్రాలు కవిత్వంలో చిత్రించటంలో వేగుంట మోహన్ ప్రసాద్ ఘటికుడు. చాలాసార్లు అతని ఊహల్ని మనం అందుకోలేం. కాని స్మైల్ ఊహాచిత్రాలు అందీ అందకుండా ఒక్కోసారి దూరంగా చాలాసార్లు దగ్గరగా స్పష్టాస్పష్టంగా పోల్చుకోటానికి వీలుగా కనిపిస్తుంటాయి. ఈ కవే డాలీని గురించి, జీవితాన్ని గురించి చెప్పిన మాటలు ఇతని కవిత్వానికి అన్వయిస్తాయి. ఈ గీతంలో డాలీని సంబోధిస్తూ స్మైల్ –
నువ్వూ నాకు నీలానే
అర్ధం అయీ అవవు
జీవితం లాగే
శాశ్వతంగా జీవితం లాగే
శాశ్వతం లాగే.
స్మైల్ కవిత్వం జీవితాన్ని నిర్వచించదు. లక్ష్యాల్ని సూచించదు. ఖండ ఖండాలుగా జీవితాన్ని విడగొట్టి ఊహా చిత్రాలుగా చిత్రిస్తాడు. వీటిలో వాస్తవికత కన్నా నిర్లిప్తమైన తాత్విక ధోరణి కనిపిస్తుంది.
కొత్త సంవత్సరాన్ని ‘కొత్త సముద్రం’గా భావించిన ఈ ఖండిక చూడండి.
ఆవిడ కౌగిల్నీ పిల్లల నవ్వుల పూరేకుల్నీ
సిగరెట్లనీ, విస్కీ సీసాల్నీ, పేకముక్కల్నీ
రహస్య సుఖాల జిలుగు దారిలో
మంచి కవిత్వాల కాయితాలనీ
స్నేహితుల ఆప్యాయపు వేళ్ళ కొసల్నీ
అభాగ్యుల జాలి చూపుల చూరు చివర్లనీ
పట్టుకుని మూడొందల అరవై అయిదు కల్లోల సముద్రాల్ని
ఈదాలి మళ్ళా
నేను.
పైన చెప్పినవన్నీ జీవితంలో సాధారణమైనవే. “మళ్ళీ ఇవేగదా, జీవితం మళ్ళీ రొటీన్‌గా ఈదటమే గదా” అన్న నిర్లిప్తత వీటి వెనకాల ఉంది.
అయితే ఈ నిర్లిప్తతలో నుంచి ఒక్కోసారి ఒక ఆశారేఖ ప్రసారిస్తాడు. ‘ఒఖడే’ అనే ఖండికలో –
అర్ధ స్వప్నాలు, అర్ధ సత్యాలు
చుట్టుకు గడిచిపోతాయి వ్యర్థంగా జీవితాలు
అని వ్యర్థజీవితాలతో ప్రారంభిస్తాడు.
గాలి గాయపడుతుందని ఆకురాలదు
నేల నొచ్చుకుంటుందని మొక్క మొలవదు
అని ప్రకృతి పరంగా జీవితంలో స్తబ్దతను ఉత్ప్రేక్షిస్తాడు. కాని ఆ వెంటనే గొంతు మార్చేసి, మాట తిప్పేసి –
అలా అనుకుంటాం
అయినా ఏదీ ఆగదు
అని మార్పుని సూచిస్తాడు.
ఆ మూలన ఒకడు
మృత్యునైశిత్యపువులితో శిలలు చెక్కుతుంటాడు…
విషాద గీతాలాలపిస్తాడు
అని నిరాశాపూరిత దృశ్యాన్ని చిత్రిస్తాడు.
‘మృత్యునైశిత్యం’ అనే ప్రయోగం కొత్తది. పదునును మృత్యువుతో పోల్చే భావమూ కొత్తదే.
విదూషకుడు వినోదానికి
గెంతులేస్తూ
వంకర టింకర పాటొకటి పాడుతుంటాడు
దొరికింది తినండి తాగండి
సుఖంగా నిద్రపోండంటాడు
అని జీవితంలో అబ్సర్డిటీని చూపిస్తాడు. అయితే ‘ఈ ప్రపంచపు అనేకానేకానేక వికృత రణగొణ ధ్వనుల మధ్యనే ఒక కేక ఒక సజీవ సంగీతమై’ వినిపిస్తుంది.
ఓ పూవు పూస్తుంది
జీవితం సంపన్నమౌతుంది
అర్ధవంతమై సాగుతుంది
ఆ వొఖడి వల్లే
అని Life is rich and meaningful అనే ఆశను వ్యక్తీకరిస్తాడు.
ఈ పుస్తకం పదేళ్ళ కింద (1980) రాసిన తూనీగ అనే కవితతో ముగుస్తుంది. బాల్యంలో చాలామందికి కలిగే అవ్యక్తానుభవాన్ని గొప్ప కవిత్వానుభవంగా మలిచాడు స్మైల్. మొదలు పెట్టటమే అసాధారణంగా మొదలు పెడతాడు.
‘వేళ్ళు తొండలైపోయేవి తూనీగ దొరికేదాకా’ అని వేళ్ళను తొండలతో పోల్చటంలో ఔచిత్యం ఉంది. తొండ అటూ ఇటూ తల కదిలిస్తూ హఠాత్తుగా ఆగి పరిసరాల్ని పరిశీలిస్తుంది. తూనిగను పట్టుకునే వేళ్ళకిది సజీవమైన పోలిక.
మేఘాల మొహాలు చూసుకునే
పచ్చటి చెరువు నీట్లో
పచ్చికగరువుల్ని నెమరేసే గేదెల కొమ్ముల మీద
సాయంత్రపు సూర్యుడితోపాటూ
గాలి సర్దాగా కూచున్నట్టు
గుంపులు గుంపులుగా తూనీగలు
తూనీగలు చాలా తేలికగా ఉంటాయనటానికి గాలి సర్దాగా గేదె కొమ్ముల మీద కూర్చుంది అని గడుసుగా అంటాడు. తూనీగల సెటింగు చిత్రించి అక్కడ తూనీగను పట్టుకునే ప్రయత్నాలూ, అక్కడి దృశ్యాలూ, అప్పటి మనో భావాలూ అద్భుతంగా చిత్రిస్తాడు. తూనీగ తోకకి దారంకట్టి ఎగరేస్తే అది కాస్త ఎత్తు ఎగిరి కిందపడిపోయేది. దాన్ని వర్ణిస్తూ –
‘చడీ చప్పుడు లేకుండా కింద పడిపోయేది అక్కయ్య జడలోంచి రాలిన కనకాంబరం మల్లే’ అంటాడు.
తూనీగలను ఎగరేసి ఆనందించే స్థితిని అప్పటి స్థితికీ వయసుకీ తగిన పోలికలతో వర్ణించాడు.
రెండోక్లాసు నుంచి మూడోక్లాసుకి ఎగిరినప్పట్లా
దుమ్ములో చిలుంపట్టిన బేడ బిళ్ళ
ఎవరిదో నాకు దొరికినప్పట్లా
మా అన్నయ్య నాకివ్వని
వాడి బంతి పగిలిపోయి ఎగరనప్పట్లా.
స్మైల్ బహు కావ్యాలు రాసి మేజర్ కవి కాలేదని నాకు దిగులు లేదు. సమకాలికులే కాక తరువాత వారు కూడా పదే పదే చదువుకుని మూడ్‌లోకి వెళ్ళిపోగల కవిత్వం రాశాడన్న సంతోషం నాకు చాలు.
‘ఒకడు నాచన సోమన’ లాగా తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్.