పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రవాఁ ?
ద్రౌపది నవలకి సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిన సందర్భంలో విద్యాధికులు, సాహితీవేత్తలూ ఇతిహాసాలనీ, ప్రబంధాలనీ ఒకే దృష్టితో చూసి, ఒకే స్థాయిలో పెట్టి వ్యాఖ్యానించడం, విమర్శించడం మొదలుపెట్టారు. ఇది సమంజసం కాదు. ఈ రకమైన విమర్శనా ధోరణి సామాన్యపాఠకులకి తాత్కాలికంగా తృప్తి కలిగించవచ్చు. కాని, ఈ ధోరణి పరంగా సాహితీ సద్విమర్శ శాశ్వతంగా కుంటుపడే అవకాశం ఉన్నది. ఈ విషయం తెలిసి కూడా సాహితీవేత్తలు పనికట్టుకొని ఎందుకు ఈ ధోరణిలో పడ్డారు? బహుశా అందుకు ఒక కారణం: ఈ పుస్తకంపై ప్రజలలో వచ్చిన వ్యతిరేకత వల్ల కొందరు ఈ నవలకు మతప్రేరితంగా ఇచ్చిన వక్ర భాష్యం కావచ్చు. అదే నిజమైతే, సాహితీవేత్తలు తీసుకున్నమార్గం సరైనది కాదు. మతప్రేరితంగా ఈ పుస్తకానికిచ్చిన వక్రభాష్యం ఎంత తప్పో, ఇతిహాసాలని, ప్రబంధాలని ఒకే స్థాయిలో చేర్చి విమర్శించడం అంతే తప్పు.
ఇతిహాసాలకున్న ప్రత్యేకత, ముఖ్యంగా వాటికున్న బహుళార్థకతపై (polyphony) ఈ మధ్యనే ఆంధ్రజ్యోతి దినపత్రికలో (ఫిబ్రవరి 8, 2010 వివిధ) చెప్పిన ఆ వ్యాసాన్ని ఈమాటలో కొద్ది సవరణలతో పొందు పరుస్తున్నాను. ఆ వ్యాసంలో వివరణలు మళ్ళీ మళ్ళీ చెప్పడం అనవసరం.
ఇప్పుడు ఇతిహాసాలకి, ప్రబంధాలకీ, ఉన్న భేదం గురించి కొద్దిగా చెప్పడం అవసరం.
ఇతిహాసాలను కాలానుగుణ్యంగా తిరిగి చెప్పవలసిన అవసరం ఉన్నది. అందువలన కేవలం సాహిత్యప్రయోజనమే కాక, సాంఘిక ప్రయోజనం కూడా ఉంటుందన్నది నిర్వివాదాంశం. ప్రముఖ పాశ్చాత్య సాహితీవేత్తలు చాలామంది Classics are to be re-told from time to time అని చెప్పడం కొత్త వింత కాదు. పాశ్చాత్యదేశాలలో ఆ పని జరుగుతూనే ఉన్నది. ఈ విషయంలో మనమే వెనకపడి ఉన్నాం.
పోతే, మన ఇతిహాసాలు ఒకేరసాన్ని పోషించే గ్రంధాలు కావు. ముఖ్యంగా భారతం వంటి ఇతిహాసంలో అన్ని రసాలూ పోషించబడ్డాయి, శృంగారంతో సహా! అందుకని ఇతిహాసాల నుంచి పాత్రలని తీసుకొని నవలలు అల్లేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉన్నది. మన ప్రబంధాలు అట్లా కాదు. ప్రబంధాలు సర్వసాధారణంగా ఒకేఒక రసాన్ని పోషిస్తాయి. ముఖ్యంగా శృంగారరసం. శృంగారరసం అంటే ఏవగింపు ఉన్న వాళ్ళు వాటి జోలికి పోకపోయినా బాగుండేది. కానీ, గత శతాబ్ద ప్రారంభంలో ఒకరిద్దరు విమర్శకులు పనికట్టుకొని మన ప్రబంధసాహిత్యంలో ఉన్నదంతా కేవలం ‘తుచ్ఛశృంగారం’ అనే విక్టోరియన్ నీతి మన ‘విద్యాధికుల’ పై రుద్దారు. ఆ భావన, ఆ విచిత్రధోరణి నుంచి మనం ఇంకా కోలుకోలేదు. ప్రబంధం అని అనంగానే మన సాహితీవేత్తలు ఇంకా ఆ పాత పల్లవే వల్లిస్తున్నారు.
ద్రౌపది నవలను సమర్థిస్తూ వచ్చిన వ్యాసాలలో మనకి కొట్టవచ్చినట్టు కనిపించేది ఇదే; ‘ద్రౌపది నవలలో ఉన్న శృంగారం మన ప్రాచీన ప్రబంధాలలో కన్నా చాలా తక్కువే,’ అని. కొందరు విద్యాధికులు కొన్ని ప్రబంధాలని ఉదహరించారు కూడా! కుమారసంభవం, కళాపూర్ణోదయం, రాధికాస్వాంతనం, వంటి పుస్తకాలు! ఈ పుస్తకాలన్నింటిలోనూ పురాణ వ్వ్యక్తులు పాత్రధారులుగా వస్తారు. అది కాదనం. అయితే, ఈ పుస్తకాలలో ఉన్న శృంగారం ‘అశ్లీలమని, మితిమీరినదని, అనౌచిత్యమనీ’ రాసారు. శృంగారరస ప్రధాన ప్రబంధంలో ఎంత శృంగారం ఉచితం, ఎంత శృంగారం కావలసిన మోతాదులోనే ఉన్నది అన్న ప్రకటనలు, వాఙ్మూలాలు వివాదాస్పదాలు.
రాధికాస్వాంతనం కేవలం శృంగార ప్రబంధం. శృంగారరసమే అందులో ప్రధానం. పోతే, కుమారసంభవంలో ఎనిమిదవ సర్గ శివపార్వతుల హనీమూన్! ఆ సందర్భంలో శృంగారం కాక ఏ రౌద్రరసమో, హాస్యరసమో ఎలా పోషించాలో చెప్పండి? ఈ సాహితీవేత్తలు తెచ్చిన సామ్యం ఎంత అసందర్భంగా ఉన్నదో ఊహ తెలిసిన పాఠకులే నిర్ణయించాలి. ఇకపోతే కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయం గురించి ఈ సాహితీవేత్తలు రాసిన రాతలు చదివితే, వీళ్ళు కళాపూర్ణోదయం చదివే రాస్తున్నారా అన్న అనుమానం వస్తున్నది.
కళాపూర్ణోదయంలో సరస్వతీ బ్రహ్మల ప్రణయం వర్ణించబడింది. నిజమే! ప్రారంభంలో సూరన్న గారు చెప్పిన పద్యం కాస్త జాగ్రత్తగా చదివిన ఎవరికైనా, ఆ తరువాత ఐదవ ఆశ్వాసంలో సర్స్వతీ బ్రహ్మల ‘చిత్రప్రణయ సల్లాపము’ ఏ విధంగా అన్వయించుకోవాలో బోధపడుతుంది.
కళాపూర్ణోదయం ప్రారంభంలో సూరన్న గారు చెప్పిన పద్యం ఇది:
అనయము ప్రేమ సంధిలగ నాస్య చతుష్టయ యౌగపద్య చుం
బన ఘన కాంక్ష బోలె, నిగమంబుల పేరిట నాల్గు రూపులం
దనరెడు భార్యమాట జవదాటక, సృష్టి యొనర్చు వారిజా
ననుడు ……………………………. గావుతన్. — (అవతారిక, 14 వ పద్యం)
స్థూలంగా తాత్పర్యం ఇది: బ్రహ్మ తన నాలుగు ముఖాల నుంచీ వెలువడే మాటలతో (నాలుగు వేదాలు) విశ్వ సృష్టి చేస్తాడు. ఈ మాటలు ఆయన నాలుకలపై కదలాడుతున్న సరస్వతే! అందుకనే ఆ దేవి మాట ఆయన జవదాటడు; ఆ సరస్వతి అదే సమయంలో ఆయన నాలుగు ముఖాలనీ (నోరులనీ) ముద్దిడుతుంది, అని భావం. ఈ పద్యంలో మొదటి మాట పుట్టుక, వేదాలు, విశ్వ సృష్టి మన మనసులలో మెదిలితే, తరువాత ఐదవ ఆశ్వాసంలో వారిరువురి ప్రణయకలాపం కేవలం అశ్లీల శృంగారంగా ఎల్లా అభివర్ణించగలం? అది సాధ్యమా? మన సంప్రదాయం అర్థమైనవారికి అటువంటి మలినమైన ఊహ ఎప్పుడూ రాకూడదు. పైన చెప్పిన ఈ సాహిత్య విమర్శకులే ‘సంప్రదాయం’ అన్న మాట ఒక ఊతపదంగా వాడుతున్నారు కానీ, ఆ సంప్రదాయం లోని గాఢత అర్థమై రాయటల్లేదనిపిస్తున్నది. ఈ పుస్తకంలో ఇతరత్రా అసలు శృంగారమే లేదని నేను అనటల్లేదు. పింగళి సూరన్న గారే రాసారు: ‘యత్య పూర్వ కథాసంవిధాన వైచిత్రీ మహనీయంబును, శృంగారరస ప్రాయంబును, పుణ్య వస్తు పర్ణ నాకర్ణనీయంబును నగు కళాపూర్ణోదయంబను మహా కావ్యంబు నిర్మింపంగడంగితి…’ అని!
అంతకన్నా ముఖ్యమైన విషయం. కళాపూర్ణోదయం 16వ శతాబ్దంలో దక్షిణ ఆసియానుంచి వచ్చిన మొట్టమొదటి ఆథునిక నవల. చంపూ పద్ధతిలో రాసిన బహుళార్థక నవల. ఈ నవల బహుళార్థకనవలగా (polyphonic novel) ప్రతిపాదించి, వివరించి, సమర్థించి, విమర్శించి, అనువదించిన గౌరవం నారాయణరావుకి, షూల్మన్కీ దక్కింది. (చూ: The Sound of The Kiss or The Story That Must Never be Told, Pingali Surana’s KalapoornOdayamu, Translated by Velcheru Narayana Rao and David Shulman, Columbia University Press, New York, 2002). ఆంధ్రప్రదేశ్ లో సాహితీ ద్రష్టలుగా సమీక్షలు, విమర్శలూ రాసే వారు ఈ పుస్తకం చదివితే బాగుండును.
ఆఖరిగా ఒక విషయం. ద్రౌపది నవలని తూలనాడినవారు, బహుమతికి తగదని ధర్నాలు చేసేవారూ, అందలానికెక్కించినవారు, అద్భుతం అని పొగిడేసినవారూ, – ఈ రెండు వర్గాల వాళ్ళూ – వారివారి స్వప్రయోజనాలకి సాహిత్యాన్ని వాడుకోవటం శోచనీయం. ఆ నవల గొప్పదని, కాదనీ నిర్ణయించడం మందిబలంపై ఆధారపడకూడదు, మతిబలంపై ఆధారపడాలి గాని. ఇది ఎలెక్షన్ కాదు, వోట్లు వేయించుకొని జయాపజయాలు నిర్థారించడానికి. సాహిత్యంలో మంచి, చెడూ వోటింగ్ ద్వారా నిర్ణయిస్తే, సాహిత్యం అడుగంటుతుంది. సాహిత్యంలో రాజకీయాల రభసే నెగ్గుతుంది.