పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఈమాట రామాయణం గురించి Sivakumar Tadikonda అభిప్రాయం:

    12/03/2023 2:50 pm

    వ్యాసం ఆవేదనని వెలువరిస్తూ అర్థవంతంగానే మొదలయింది గానీ, కొన్నిచోట్ల దారి తప్పినట్లనిపించింది.
    “క్షమాపణలు చెప్పాలి” అంటూ వెలువడిన వ్యాఖ్య అసంబధ్ధమే! అలాగే, చదివే అందరూ సంయమనంతో చదువుతా రనుకోవడం కూడా! సినిమా నచ్చింది, నచ్చలేదు అని ప్రజలు చెబుతారు గానీ, ఆ అభిప్రాయాల గూర్చి పొడవైన వ్యాసాలు రాసేవా రెంతమంది? బాగా నచ్చనప్పుడు తెరలు చింపేశారు కూడా! చదివిన ప్రతి కథమీదా నచ్చింది/నచ్చలేదు అని రాసేవాళ్ల శాతం కూడా బహుస్వల్పమే నన్న సంగతి నాకంటే పత్రికా సంపాదకులకే ఎక్కువ తెలుసు. అప్పటికీ, శ్యామలరావు గారు ఎందుకు నచ్చలేదో విశదపరచారు. చదవనన్నవాళ్లని ఏ పత్రికా చదివించలేదు. డబ్బులు కట్టే చోట మాటటుంచి, ఇది పూర్తిగా లాభాపేక్ష లేని, ప్రకటనలు ఏవీ లేని పత్రిక. సంపాదకులు అపరిమితంగా స్వంత సమయాన్ని వెచ్చిస్తూ నడుపుతున్న పత్రిక. కనీసం ఈ మాత్రం కూడా ఆ వ్యాఖ్యలు చేసినవాళ్లు అర్థం చేసుకోలేదంటే ఆశ్చర్యమేస్తుంది.
    “సాటి తెలుగు రచయితకు తమ గాఢమైన మౌనంతో తెలుగు రచయితలు, తె. ర. సంఘాలు, బృందాలూ ఇంత బలంగా తోడు నిలిచింది …” అనడం సమంజస మనిపించలేదు. నాకు కనిపించినంతవరకూ FBలో రచయితని బెదిరించడాన్ని గర్హిస్తున్నా మనే అన్నారు. ఇంతకన్నా ఏ మాశిస్తున్నారు?

    ఇక కథ గూర్చి –

    “నేత్రోన్మీలనం కథ ద్వారా రచయిత పూర్ణిమ ఇదే చేసింది. ఒక జానపద రామాయణం నుంచి కలిగిన సాహిత్యస్ఫూర్తితో రాజ్యానికీ కళాకారునికీ మధ్య నిరంతరమూ ఉండే సంఘర్షణను సీతారాముల పాత్రల ద్వారా తన కథగా పలికించుకుంది. ఒక బలమైన సంఘర్షణకు ప్రతిరూపం ఇవ్వడానికి అంతే బలమైన పాత్రల అవసరం ఉంటుంది. సీతారాములకంటే ఈ సంఘర్షణకు ప్రతిరూపం ఇవ్వగలిగినవారు ఇంకెవరున్నారు?” అన్నారు. అందే ఎత్తులో లేకపోవడంవల్ల కావచ్చు ఆ అంతస్సూత్రం ఈ పాఠకుడికి అందలేదు. అంతకు ముందరి వాక్యాలని (“ఈ సమాజంలో నిమ్నకులస్తుడు, అంటరానివాడుగా వెలివేయబడిన వ్యక్తి రామాయణాన్ని అగ్రవర్ణ బ్రాహ్మణ దృక్పథంతో ఎలా చూడగలడు? ఏం, రామాయణం అతనిదీ కాదా?”) జోడిస్తే, కథకు స్ఫూర్తి నిచ్చిన జానపద రామాయణంతో అగ్రవర్ణ బ్రాహ్మణ దృక్పథానికి సమస్య ఉన్నది, అందుకే విమర్శ లొచ్చాయన్న అర్థం వస్తుంది. దీన్ని కదూ, ఫాల్స్ ఈక్వివలెన్స్ అనేది? వర్ణాల ప్రసక్తి ఎలా వచ్చిందసలు? (వాల్మీకి అగ్రవర్ణ బ్రాహ్మణుడు కాదు అని ప్రత్యేకంగా చెప్ప నవసరం లేదు.) తాడిగడప శ్యామలరావు గారి వ్యాఖ్య వల్ల మాత్రమే కన్నడ జానపదంలోని ఉత్తర రామాయణం గూర్చి నాకు తెలిసింది. (ఓల్గా గారి ఒక కథలో లాగా శూర్పణఖ సీతని కలిసింది గానీ అక్కడ, అడవికి పంపబడ్డ తరువాత; ఈ జానపదంలో అడవికి పంపబడడానికి కారణ మయింది.) గిరీశ్ కర్నాడ్ నాటకాలు కొన్నింటితో పరిచయం ఉన్నది గానీ, స్ఫూర్తి నిచ్చిన ఈ నాటకం గూర్చి ఇంకా తెలియదు; ఎవరయినా లింక్ పంపితే (లేదా ఈమాటలో వివరాలని ప్రచురిస్తే) తెలుసుకునే అవకాశ ముంటుంది. ఆ కన్నడ జానపదం గూర్చి తెలియకపోతే ఈ కథ అంతా అక్కణ్ణించీ దింపిందే ననుకోవడానికి ఆస్కార మున్నది. అదే గనుక నిజమయితే దాన్ని స్పష్టం చేసి వుంటే ఏ సమస్యా వచ్చేది కాదు; కానీ, స్ఫూర్తితో అని మాత్రమే పేర్కొన్నారు కనుక రచయిత్రి కల్పన ఎంత అన్న ప్రశ్న వస్తుంది.

    రామాయణం అందరిదీని అన్న విషయం మూల కథకు చేటు రానంతవరకూ, పాత్రల ఔచిత్యానికి భంగం కలిగించనంతవరకూ వర్తిస్తుంది. ఉదాహరణకి, శూర్పణఖ రాముణ్ణి అడవిలో కలిసి అతనితో జరిపిన సంభాషణలో, అతను ససేమిరా అంటుంటే, ఆమె, “నువ్వో అందగాడి ననుకుంటున్నావా, మా అన్నయ్య రావణుడు నీకంటే చాలా అందగాడు, కానీ నాకు తోబుట్టువు అవడం వల్ల మాత్రమే నిన్ను దేబిరిస్తున్నాను,” అని అంటున్నప్పుడు సీత విని, “రాముడి కంటే అందగాడు ఎలా ఉంటాడో!” అని ఊహిస్తూ, ముని అవతారంలో వచ్చి స్వరూపాన్ని చూపిన రావణుడిని చూసి కేవలం అతని అందం వల్ల మాత్రమే మూర్ఛపోయిందని, అశోకవనంలో రావణుడు దరిచేరమంటూ మాట్లాడినప్పుడల్లా “కాదంటె అవుననిలే అని అర్థంచేసుకో డెందుకు?” అని లోపల్లోపల విసుక్కుంటూ, హనుమంతుడు వింటుండగా రావణుడు ఇచ్చిన అల్టిమేటమ్ తరువాత, “అతనొచ్చి విడిపిస్తా డనుకున్నాను, ఏడాది గడిచింది, ఇంకెంతకాలం ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని చేరకుండా ఊరుకునేది?” అన్న ఆలోచనలని కలిగిన దానిగానూ, హనుమంతునితో, “ఆయన ఉంగరాన్ని ఆయన్నే ఉంచుకొమ్మను!” అంటూ విసిరికొడితే, ఆ వార్త చేరిన రాముడు కేవలం ఆ కోపంతో నెరపిన అంగద రాయబారంలో రావణుడు, “ఆమె వస్తే వెంటనే తీసుకెళ్లు,” అని చెప్పాడనీ, అంగదుడు సీతని “రామ్మా వెడదాం!” అంటే ఆమె “నేను రాను” అని చెప్పగా రాముడికి కోపం ఇనుమడించి లంక మీద దండెత్తాడనీ, రావణుడు, “నీ మొహాన్ని ఎప్పుడయినా అద్దంలో చూసుకున్నావా? ఆమె నిన్ను కలిసినప్పుడల్లా నన్నే ఊహించుకుంటుంది!” అని పగలబడి నవ్వుతూ చచ్చా డనీ, అందుకే రాముడు మంట పెట్టించి అందులోకి సీతని తనే స్వయంగా తోశాడనీ రాయచ్చు. దీన్ని రామాయణ మంటారా? ఈ అర్థంలో రామాయణాన్ని అందులోని పాత్రలని గాక సొంత పాత్రలని పెట్టుకుని కథ రాసుకొమ్మనేది!

    ఎంతో మర్మమున్నది, పొరలు పొరలుగా విడదీసుకుంటూ చదవాలి కాబోసు ననుకుంటూ జాగ్రత్తగా పరిశీలించడం కూడా ఈ పాఠకుడు చేసిన తప్పు వల్ల కావచ్చు ఈ కథ గూర్చిన ఈమాట FB పోస్టులో పరిష్కారం చెయ్యకుండా వదిలేసిన, మూల రామాయణంలోని పాత్రల ఔచిత్యాన్ని మార్చిన అంశాల నన్నింటినీ వివరించడం జరిగింది. వాటిని ఇక్కడ తిరిగి పేర్కొనడం లేదు; అయితే, మీరు చదివి ఉంటారన్న నమ్మకంతో ఉన్న నన్ను, “నా దృష్టిలో అది ప్రచురించదగ్గ కథ. పదిమందీ చదివి చర్చించదగ్గ కథ. నా నిర్ణయంలో సంశయాలు సందేహాలూ నాకు లేవు. ఒక సంపాదకుడిగా ఆ కథను పునఃప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాను, ఉంటాను.” అన్న డిక్లరేషన్ ఆశ్చర్యపరచింది. చర్చించవలసిన దేమిటి? నేను ఆ పోస్టులో పేర్కొన్న అంశాలు చర్చించవలసినవి కావా? (“తండ్రిపై బిడ్డకున్నఅనురాగం, తండ్రిని బిడ్డను చేసిన వైనం అద్భుతం.” అన్నారు దర్పణం శ్రీనివాస్ తన వ్యాఖ్యలో. ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకున్నది నేనొక్కడినే కాదు! ఆ వ్యాఖ్యని పొడిగిస్తే, తండ్రి కోసం భర్తనే త్యాగం చేసిన సీతాదేవి కొంతమందికి ఆదర్శం కావచ్చు కానీ, సీతాదేవి పాత్ర ఔచిత్యానికి ఇది భంగం కలగకుండా ఎలా ఉన్నది? నేను ప్రశ్నించినది, తండ్రి తన కారణంగా కూతురు సంసారం విఛ్ఛిన్న మవడాన్ని సంతోషిస్తాడా, చచ్చి రావణుడు రాముణ్ణి గెలిచాడు అనడం రామాయణ మవుతుందా అని. దీన్ని రామాయణమని ఒప్పుకుంటే, నేను పైన కల్పించిన పాయని కూడా రామాయణమని అనాల్సిందే!) కథలో అందని అంతస్సూత్రం వల్ల, పాఠకుని అజ్ఞానంవల్ల అని అనిపించడం వల్లనా నా వ్యాఖ్యలు ఈ వ్యాసంలో చోటుచేసుకోలేదు? ఆ అందని అంతస్సూత్రం శ్రీకృష్ణ తులాభారంలో తులసీదళం లాగా నేను పేర్కొన్న అంశాల నన్నింటికన్నా గొప్పది కావచ్చు. చెప్పొచ్చుగా!? లేక చెప్పకపోవడమే చెప్పడమా? చర్చ ఇలాగేనా సాగేది?

    “రచన గొప్పదనం రచయిత ఆశయంలో ఉంటుంది” అన్న నిర్వచనాన్ని వినని పత్రిక అన్నారు. కానీ, ఈ పాఠకుడికి మాత్రం ఆ కారక్టరైజేషన్ని వ్యతిరేకిస్తూ సంఘర్షణే ఆశయమై సంపాదకుల దృష్టిలో గొప్పదనాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది గానీ రచనలో ఆ గొప్పదనం కనిపించలేదు. కొన్ని ఆంగ్ల కథల మీద, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ మీద ఎలా చదవాలో ఎలా అర్థంచేసుకోవాలో వచ్చిన వ్యాసాల్లాగా ఈ కథని ఎలా అర్థంచేసుకోవాలో ముందే విశదపరిచి వుంటే ఎవరి మనోభావాలు దెబ్బతినడానికీ ఆస్కారం ఉండేది కాదేమో!

    ఈ కథ సంపాదకులకి గొప్ప దనిపించినట్లుగానే, ఏ కళ గూర్చిన అవగాహన ఎవరికి ఎంత ఉన్నదనేది పూర్తిగా వ్యక్తిగతం – entirely subjective. అది నాలిక తెలిపే రుచి వంటిది. (వాన్ గో బతికుండగా అతని వర్ణచిత్రాలకి గుర్తింపు రాలేదు. ఈనాడు వాటికి విపరీత మయిన గిరాకీ! గెలీలియో విషయంలో లాగా కాక – ఎందుకంటే అది సైన్స్, కళ కాదు – వాన్ గో చిత్రాల గూర్చి అతని సమకాలీనుల అవగాహన తప్పనీ ఈనాటివాళ్ల అభిప్రాయం సరయినదనీ అనడంలో అర్థంలేదు.) దాని గూర్చిన పరాయివారి భిన్నాభిప్రాయాలు – ఎంత గొప్పవారివయినా సరే – వాక్స్వాతంత్ర్యంవల్ల వ్యక్తం చెయ్యబడచ్చు గానీ అవీ పూర్తిగా వ్యక్తిగతమే – కళకు అబ్జెక్టివిటీని ఆపాదిస్తూ ఎంత గొప్పవాళ్లు వ్యాసాలని ప్రచురించినా గానీ.

    [క్షమించండి. మీ ఎఫ్.బి. వ్యాసాలు మేము చదవలేదు. ఆ కథ పట్ల మీ విమర్శ ఒక వ్యాసంగా ఈమాటలో ప్రచురించి ఉండవలసిందని మా అభిప్రాయం. – సం.]

  2. గోరంత బొమ్మ – కొండంత బాపు గురించి రవికుమార్ పరస అభిప్రాయం:

    12/02/2023 10:48 pm

    సమ్మోహనాస్త్రం అన్వర్ మీది.

  3. పోస్టుమాస్టరు గురించి పద్మావతి రాంభక్త అభిప్రాయం:

    12/02/2023 9:04 pm

    తాత్వికతతో కూడిన మంచి కథ. చదువుతుంటే కథలో లీనమై కళ్ళు తడిసాయి.

  4. ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    12/02/2023 11:10 am

    తాటిపాములగారు,

    మీ అభినందనలకు వినయ నమస్సులు!

    1. నగరము అన్న అర్థంలో ఉండే పుర- (పురం) అన్నది నపుంసక లింగంలో ఉంటుంది. పురః/పురస్ అన్న అవ్యయ శబ్దానికి ముందు-, ప్రథమ- అన్న అర్థాలే తప్ప నగరము అన్న అర్థం లేదు. పురానికి హితము కలిగించేవాడు అన్న అర్థంలో పురహితుడు అన్న సమాసమే అవుతుంది తప్ప పురోహితుడు (పురః + హిత) అన్నదానికి ఆ అర్థం రాదు.

    2. మీరు చెప్పింది నిజమే. రత్నరాశులనిచ్చు అన్నది మూలంలో లేదు. కానీ ఈ సూక్తంలోనే అగ్ని ధనాన్ని, యశస్సును, వీరవంతులైన సంతానాన్ని ఇస్తాడని తరువాతి శ్లోకాలలో ఉంది కదా. అలాగే ఇతర అగ్ని సూక్తాలలో కూడా అగ్ని సంపదలను, తురగ ధేనువులను ఇస్తాడని ఉంది కాబట్టి కొంత స్వతంత్రించి రత్నరాశులనిచ్చు అని రాసాను. కనీసం మొదటి రెండు శ్లోకాలతో సీసపద్యం పూర్తి చేయాలని ఆ రకంగా చేసాను. “హోత యితడు రత్న ధాతృడితడు” అంటే మూలంతో పూర్తిగా సరిపోయేదేమో.

  5. ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం గురించి M J Thatipamala అభిప్రాయం:

    12/02/2023 10:43 am

    మంచి ప్రయత్నం. మొదటిసారిగా పురోహితుడంటే ‘పురానికి హితము కలిగించేవాడు ‘ అన్న లౌకిక అర్థం కాకుండా (పురః = ముందు; హితం = నడుచువాడు. ప్రథమహితుడు) అన్న అసలైన అర్థం తెలుసుకొన్నాను. ధన్యవాదాలు!

    వేదాలను అపౌరుషేయాలు అంటారనే మాట ప్రసిద్ధి. అరిషడ్వర్గాలనుండి బయటపడలేని మనం మన భావాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉంటే చాలా నయం.

    ఉదాహరణకు, మొదటి పద్యంలో ‘రత్నరాశులనిచ్చు’. ఈ పదం ‘మోహం’, ‘లోభం’ సూచిస్తుంది. శ్లోకంలో ఈ అర్థం వచ్చే పదం లేదు. మీరు ఛందస్సు నడక కొరకు వాడారని అనుకొంటాను.

    మీరు చేస్తున్న పని ఎంతో కఠినతరమైంది. అందుకోండి, అభినందనలు!

    నా మాటల్లో ఏవైనా తప్పులుంటె అవి పూర్తిగా నావే!

  6. బ్లూ ఫిన్ గురించి కిరణ్ అభిప్రాయం:

    12/02/2023 10:19 am

    పైన రమణి గారు “తప్పు” అని చెప్తున్న పద్ధతి– థర్డు పెర్సనులో మొదలుపెట్టి ఫస్టు పెర్సనులోకి జంప్ చేయటం– రచయిత ఉద్దేశపూర్వకంగా చేశారని స్పష్టంగా తెలుస్తున్నది (ఆ జంప్ చేసిన చోట చుక్కగుర్తుతో భాగం మారిందని చెప్పారు కూడా). ఉద్దేశపూర్వకంగా చేసినంతవరకు కథలు చెప్పే పద్ధతుల్లో తప్పొప్పులకు చోటు లేదు.

  7. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ అభిప్రాయం:

    12/02/2023 9:54 am

    చక్కని అనువాదం కవితలో ‘శాంత్యోదయ’ వ్యాకరణం ప్రకారం సరికాదు. దానిని కూడా సరి చేస్తే మొత్తం బాగుంది.

    [ సరిచేసాం. దోషం చూపినందుకు ధన్యవాదాలు. – సం. ]

  8. ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం గురించి తుమ్మూరి అభిప్రాయం:

    12/02/2023 8:40 am

    చాలా మంచి ప్రయత్నం. నాకు ఎప్పటి నుంచో కుతూహలంగా ఉంది. వేదార్థం తెలిస్తే బాగుండునని. చాలా వివరంగా ఉంది.

  9. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి Kiran Kumari.B అభిప్రాయం:

    12/02/2023 8:19 am

    మంచి సందేశము. అనువదించి అందజేసినందుకు అనేక కృతజ్ఞతలు!

  10. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి తుమ్మూరి రాంమోహనా రావు అభిప్రాయం:

    12/02/2023 6:21 am

    ఒక గొప్ప వ్యాసానికి చక్కని అనువాదం. ఈ ప్రసంగంలో పంచతంత్రం ప్రస్తావన ముందు చెప్పబోతే విషయానికి శ్రోత/పాఠకుడిని తను చెప్పబోయే విషయానికి ఉన్ముఖీకరణగా ఉంది. ఇతఃపూర్వం శాంతి గురించిన విశ్లేషణ ఈ విధంగా ఎప్పుడూ చదివిన అనుభవం నాకు లేదు. కాని చదువుతుంటే రుష్దీ ఎంతగా దాని గురించి ఆలోచించారో అవగతమౌతుంది. తాను పురస్కారానంతరం ఒకవేళ రాస్తానేమో అంటూ చెప్పిన కథలో నేటి సమాజం ప్రతిబింబిచింది. ఇక స్వేచ్ఛ గురించి చెప్పిన మాటలు మనసును ఆకట్టుకున్నాయి. అన్యాపదేశంగా కవులు కళాకారులకు ఆయన ఇచ్చిన సూచన కూడా మనసును అలరించింది. మానవీయతతో అమానవీయతకో జవాబు ఇవ్వటం అన్నమాట చాలా సంయమనంతో చెప్పిన మాట. ఈ ప్రసంగం చదివిన తరువాత ఆ పురస్కారానికి ఎంతటి అర్హత కలిగి ఉన్నాడో కూడా తెలుస్తున్నది.ఇంత మంచి వ్యాసాన్ని అనువదించి అక్షరాక్షరం మనసుకు హత్తుకునేలా అందించిన మీకు ధన్యవాదాలు. మీ అనువాద పటిమకు జోహార్లు.