పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/06/2011 1:55 pm

    మోహనరావుగారు:

    మీరు ఓపిగ్గా కేతన పద్యాలను, నన్నెచోడుని పద్యాలను వెతికి మా అందరికీ అందజేసినందుకు ఎంతగానో కృతజ్ఞతలు.

    నా దృష్టిలో ఈ కింది కేతన పద్యం తెలుగు సంస్కృతం పదాల కలయిక సాధువని ధృవీకరిస్తున్నట్టుగా లేదు. ఒక్కొక్కచోటన్ అంటే rarely, occasionally అని అర్థం చేసుకోవాలనుకుంటాను.

    తెనుగుపదంబులపైఁ బెం-
    పొనరఁగ సంస్కృతముచెల్లు నొక్కొకచోటన్
    మును సుకవీంద్రులు గృతులన్
    బనిగొని రచియించినట్టి పరిపాటిమెయిన్ (133)

    ఇంతకు పూర్వం సుకవీంద్రులు తెలుగు సంస్కృతాలను కలిపిన పదాలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి కాబట్టి వాటిని వాడడంలో తప్పులేదు అంటున్నాడు, కేతన. “ఆర్యవ్యవహారంబులందు దుష్టంబు గ్రాహ్యంబు” అని చెప్పినట్టుగా.

    ఇక మీరు చెప్పిన “మూడు నేత్రములవాఁడు”, “పచ్చ యంబరము” అన్నవి విగ్రహవాక్యాలౌతాయి గాని సమాసాలు కావు. కేతన ఇచ్చిన ఉదాహరణలలో మూడస్త్రంబులు అన్న సమాసంలో తెలుగు సంధి వాడడం గమనించదగ్గ విశేషం.(సంస్కృత సంధి సూత్రాలనుబట్టి మూడు+అస్త్రంబులు = మూడ్వస్త్రంబులు (యణాదేశసంధి) అయ్యేది).

    నన్నెచోడుడు మూండు, వాండు, వీండు, వీంగు, లోంగొని అని రాయడానికి తమిళ సంపర్కం కారణం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మనం అరసున్న వాడుతున్న ప్రతిపదాన్ని నిండుసున్నాతో ఒకప్పుడు తెలుగులో ఉచ్చరించేవారు. ఈ నిండుసున్నను అరసున్నగా ఉచ్చరించే ధ్వనిపరిణామం జరుగుతున్న రోజుల్లో రెండు రకాల ప్రయోగాలు అర్థవంతంగానే ఉంటాయి కాబట్టి నన్నెచోడుడు వీటిని సున్నతోనూ, అరసున్నతోనూ వాడగలిగాడని నా అభిప్రాయం.

  2. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/06/2011 12:36 pm

    ముఖ్యసంపాదకుడుగా చక్రపాణిగారి శైలీ, అధికారమూ ప్రత్యేకంగా ఉండేవి. మా నాన్నవంటి రచయితలని working editors గా ఎంపిక చేశాక వారిచేత ఎంత చాకిరీ అయినా చేయించేవారాయన.
    అప్పట్లో ఆయన నడిపిన ఆంధ్రజ్యోతి, (కొన్నాళ్ళు యువ – దీన్ని మళ్ళీ 1961లో హైదరాబాద్‌లో మొదలుపెట్టారు), కినిమా, చందమామ, అన్నిటికీ మా నాన్న చేతా, కొంత దాసరి సుబ్రహ్మణ్యంగారిచేతా left and right ఎంతో రాయించేవారు. ఎక్కడా ఎవరి పేరూ పడేది కాదు.
    కినిమాలో అప్పట్లో పైకొస్తున్న తారలూ, గాయనీగాయకులూ, కొత్తగా నిర్మాణసంస్థల్లోకి వచ్చిపడుతున్న డబ్బులూ అన్నీ బోలెడంత పని కల్పించేవి. చందమామ ఆఫీసు నుంచి ఏ లంచ్ టైంలోనో బయలుదేరి విజయా-వాహినీ రికార్డింగ్ స్టూడియోలకేసి వెళ్ళే అలవాటూ, షూటింగ్ జరిగే ఫ్లోర్లకు వెళ్ళడమూ మా నాన్న కినిమా మూతపడిన చాలా ఏళ్ళదాకా చేసేవారు. నా స్కూలు రోజుల్లో ఒక్కొక్కప్పుడు నేనుకూడా వెళ్ళి విశేషాలు చూసేవాణ్ణి.
    మొత్తంమీద రాసినదెవరనేది ఆ కాంపౌండ్‌లో అంత ముఖ్యం కాదు. చివరకు విజయచిత్ర మాసపత్రికకు సంపాదకుడుగా నియమించిన రావి కొండలరావుగారికి తమిళ పత్రిక బొమ్మై ఎడిటర్‌కన్నా తక్కువ జీతం ఇచ్చేవారు. ఎందుకంటే సినిమాల్లో నటించకూడదనే ఆంక్ష ఆయనమీద పెట్టలేదు కనక. ఇది చదివినవారికి పులి గొంతులో ఎముక తీసిన కొంఘ కథ జ్ఞాపకం రావచ్చు!
    భానుమతి వ్యాసం రావడమే ముఖ్యం. ఎవరో సేకరించి, స్వయంగా రాసిన వ్యాసానికి మా నాన్న కొన్ని కామెంట్లు జతచేసి, పేజినేషన్ సరిగ్గా వచ్చేటట్టు (చందమామలాగే!) అచ్చు వేయించి ఉంటారు.
    1975-80 ప్రాంతాల్లో యువ దీపావళి సంచికల్లోనూ, ఇతర సంచికల్లోనూ మా నాన్న రాసినవీ, దాసరివారు రాసినవీ బెంగాలీ నవలల అనుసరణలు చాలా అచ్చయాయి. కొన్ని నా దగ్గర ఉన్నాయి కూడాను. దీన్ని ghost writing అనాలో, hack work అనాలో నాకు తెలియదు!

  3. కోనసీమ కథలు: సత్తెవతి గురించి మోహన అభిప్రాయం:

    09/06/2011 10:21 am

    ఈమాట అచ్చుతప్పులు లేకుండా ఉండాలంటే ఎవరూ అడగని నా సలహాలు 🙂
    1. అచ్చు తప్పులను దుర్భిణీ కళ్లతో చూడవలసిన బాధ్యత రచయితకు ఉంది. ఒకటికి రెండుమారులు చదివి తప్పులను, టైపోలను సంపాదకుల దృష్టికి తేవాలి. మన కళ్లముందున్న తప్పులు మనకు గోచరించవు ఒక్కొక్కప్పుడు. స్నేహితులను, ఇంటిలోని వాళ్లను చదివి వెదకమనాలి.
    2. ప్రతి సంపాదకునికి మూడో నాలుగో రచనలను ఎడిట్ చేయవలసి ఉంటుంది, అవి కూడ పత్రిక ప్రకాశమయ్యే మూడు నాలుగు రోజులకుముందు. ఇది అంత సులభమైన పని కాదు. చివరి బాధ్యత వారిదే ఐనా, ఒక రెండు మూడు రోజులలో వాళ్ల వృత్తి, ఇంటి పనులతోబాటు ఈ పనులను కూడా కొనసాగించడము కష్టతరమే.
    3. పాఠకులు తప్పులను కనుగొంటే, వాటిని నేరుగా సంపాదకులకు తెలియజేస్తే వారు తప్పకుండా వాటిని సరిదిద్దుతారు. ఈమాట మనది కూడా, కాబట్టి మనము కూడా దీనిని సర్వాంగసుందరముగా చేయవచ్చును.
    4. విశ్వనాథం-విశ్వనాధం, తెలుగువారు థ అనే అక్షరాన్ని అలాగే వ్రాసినా దానిని ధ అనే ఉచ్చరిస్తారు. అందుకే థ-ధ లకు యతిమాత్రమే కాదు ప్రాస కూడ చెల్లుతుంది. సారథి-సారధి, కథ-కధ, ఇత్యాదులు ఎన్నో! విధేయుడు – మోహన

  4. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి చిలమకూరు విజయమోహన్ అభిప్రాయం:

    09/06/2011 7:02 am

    “లోపలి నుండి మా కోడలివి, వెనువెంటనే మా అబ్బాయివీ నవ్వులు వినబడ్డాయి.”
    ఆ నవ్వులతోపాటు మా నవ్వులు కూడా వినిపించి ఉండాలే మీకు !

  5. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Bhamidipati Phani Babu అభిప్రాయం:

    09/06/2011 5:19 am

    “భార్యామణి చెప్పింది చేయడం నాకు నలభయ్యొక్కేళ్ళుగా అలవాటు అయిపోయింది. పెళ్ళికి ముందు అమ్మ కూచి అనేవారు, పెళ్లి అయిన తరువాత కొంగు చాటు మొగుడు అంటున్నారు.” ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ నవంబరులో అవకాశం వచ్చి, మీ ఇంటికి ఏలూరు వస్తే, ఆ టెబుల్ మేనర్సూ అవీ లేకపోతే, కాఫీ ఈయరేమో అని భయంగా ఉంది!
    రమ్మంటారా వద్దంటారా?

  6. తెలుగుదనం (not in lighter vein) గురించి రాజేష్ దేవభక్తుని అభిప్రాయం:

    09/06/2011 3:03 am

    వెంకటేశ్వర రావు గారు, నమస్కారం.

    మీరే అన్నట్లుగా ” పెసరట్టే తెలియని, తినడానికే ఇష్టపడని జనాభా ఉందంటే ” ఆ ప్రాంతంలో తెలుగుదనం తగలపడిపోయినట్లే కదండీ. ఇంకా దేని గురించి మీ కోపం. మీరు అమెరికాలో ఉన్నందున…. మీ ఒక్కరికో , ఇంకోతమందికో పెసరట్టు చేసే విదానం తెలిసినందున, అక్కడ తెలుగుదనం బ్రతికే ఉంది అనుకోమంటే , అనుకుంటాం…! నేను 1984 లో పుట్టాను, నాకు పెసరట్టు తెలుసు , స్వతహాగా చేసుకోగలను కుడా (కావాలని మా అమ్మతో కుర్చుని నేర్చుకున్నాను), అంటే దాన్ని అంత ఇష్టపడ్డాను. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో చాలా మంది దీనిని ఎరుగుదురు కుడా..!

    ఇదే కాకుండా దిబ్బరొట్టె , జోన్నరోట్టే కూడా నా చిన్న వయసులో తిన్నాను. అయితే ఇప్పుడు అవి అంతగా లేవు, ముఖ్యంగా జోన్నరోట్టే. మీరు చెప్పిన తరువాతే ” పెసరట్టు ” తెలుగు వారిదని నాకు తెలిసింది. కాని నాకు ఇష్టమైన ఉపహారం ఏది అని ఎవరైనా అడిగితె నేను చెప్పేది పెసరట్టు, పూరి.

  7. కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి శారద అభిప్రాయం:

    09/06/2011 12:27 am

    వ్యాసం చాలా ఆసక్తికరంగా, చాలా బాగుంది. గొప్ప సంగీత విద్వాంసుల గురించి వినటం, తెలుసుకోవటం మంచి అనుభూతి. ధన్యవాదాలు.

    శారద

  8. ఈమాట సెప్టెంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి lyla yerneni అభిప్రాయం:

    09/05/2011 3:46 pm

    సెప్టెంబర్ 2011 సంచిక ముందుమాట రాసినదెవరు?

    రచన: పక్కన పేరు లేదు.

    దాని కిందే చూస్తే ఒక చిత్రం, ఒక రచయిత వివరాలు ఉన్నాయి. ఈ సంచికకు, ఈ ముందుమాట గాని, వారు రాసినారా? కాని మరణ తేదీ చూస్తే అది సంభవమా? కాదు.

    మరి ఆయన గురించిన వివరాలు అక్కడ ఉంటానికి కారణం?

    ఇంకా కొంచెం కిందికి వస్తే – ఈ సంచికలో మీకోసం: అని ఒక రచయితల – రచనల చిట్టా ఉంది.
    అవి మాకోసం ఐతే, మరి దానికి పైన ఉన్న సమాచారం ఎవరికోసం? మో కోసమా?

    ఆ రచన ఎవరిది?

    అసలెవరికీ ముందుమాట? ఎవరికి ఈ స్వాగతం? పత్రిక ఎన్నో సంచికో చెపితే చాలు. ఈ పేజీ తెల్లగా వదిలేసినా, పాఠకులు ఎడమ పక్కకి వెళ్ళి సంచిక ఎంచుకుంటారు. కుడిపక్క స్పష్టంగా రచనలు కనిపిస్తున్నాయి. రచయితల పేర్లు అక్కడే ఉన్నయి కూడాను.

    ఈ పత్రికలో, నిజంగా ఆ జాగాను తాజా మరణాలకు ఎలాట్ చేశారని, ఎవరికో, ఏదో ఒక మూఢ నమ్మకం ఉంది, అందువల్ల ఆ పేజీ Template మార్చలేకపోతున్నారనీ నాకనిపిస్తున్నది.
    Is a break thru possible? can we have a simple ‘table of contents’ page like any other modern magazine?

    లైలా

  9. కోనసీమ కథలు: సత్తెవతి గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    09/05/2011 3:09 pm

    మీమాట అంటూ అజ్ఞాతంగా ఒక వ్యాఖ్య చేసారు.

    కథ గురించి మీ అభిప్రాయం రాసారు. దాన్ని గౌరవిస్తాను.

    కానీ మధ్యలో మీరు చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరంగా వున్నాయి. సామాజిక వర్గాలూ, కులాల ప్రస్తావన లేకుండా కథలు చదవలేరా? తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యాల్లో ఇదొకటి. ఏ సామాజిక వర్గమయితేనేం? మనుషుల గురించి నాకు తెలిసింది రాసాను. మంచో, చెడో చూపిద్దామని. వేరే సామాజిక వర్గాల గురించి రాస్తే, అదిగో వాళ్ళని తక్కువ చేస్తూనో, కించపరచడానికో రాసారంటూ మీరే మరో మారుపేరుతో గగ్గోలు పేట్టే అవకాశం వుంది.

    ఏ రచయితయినా రాసిన కథని పత్రికకి ఎందుకు పంపుతారూ? పుస్తకం అచ్చేద్దామని పైలెట్ టెస్టు కోసం కథలు రాస్తారన్న కొత్త విషయం ఇప్పుడే తెలిసింది.

    మీ అసహనపు వ్యాఖ్యలు ఎవరికీ మంచి చెయ్యవు. గమనించండి.

    మీరెవరో పేరు చెప్పుంటే మీ వ్యాఖ్యలకి గౌరవం పెరిగేది.

    సామాజిక వర్గాల ప్రస్తావన వచ్చిందనే ఇది రాయాల్సొచ్చింది. లేకపోతే రాసుండేవాణ్ణి కాదు.

    -సాయి బ్రహ్మానందం

  10. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి prasad అభిప్రాయం:

    09/05/2011 2:51 pm

    ఈ వ్యాసం వలన ఇప్పటీ అప్పటీ సినిమా మరియూ సినీ జర్నలిజం రంగాల్లో ఉన్న సామ్యాలనూ, తేడాలనూ గురించి ఆలోచించే అవకాశం కలిగింది. రోహిణీప్రసాద్ గారు చెప్పినట్లు ఇది కో.కు గారు రాయలేదనేది ఈ వ్యాసంలో కనపరచిన భావాలవలనా శైలి వలనా స్పష్టం.