సీతాంజనేయ సంభాషణం – II

వ. హనుమ ఆలపించిన రామకథను విన్న సీతకు కలిగిన క్షణికమైన ఆనందం, శింశుపా తరుశాఖీయశ్రేణి నడుమ భీకరమైన వానరరూపం కనిపించగానే తీవ్రమైన భయాందోళనగా మారుతుంది. అప్పుడు …

తతశ్శాఖాన్తరే లీనం దృష్ట్వా చలితమానసా।
వేష్టితార్జునవస్త్రం తం విద్యుత్సఙ్ఘాతపిఙ్గలమ్॥5.32.1॥


పదచ్ఛేదము:- తతః – శాఖాంతరే – లీనం – దృష్ట్వా – చలితమానసా – వేష్టితార్జునవస్త్రం – తం – విద్యుత్సంఘాతపింగళమ్ ॥

అన్వయక్రమము:- తతః (సా) వేష్టితార్జునవస్త్రం, విద్యుత్సంఘాతపింగళం, శాఖాంతరే లీనం తం దృష్ట్వా చలితమానసా (అభవత్).

ప్రతిపదార్థము:- తతః = పిమ్మట, (సా = ఆ జానకీదేవి), వేష్టితార్జునవస్త్రం (ధరించిన) తెల్లని బట్టలు గలవాడును, విద్యుత్సంఘాతపింగళమ్ = మెఱుపుతీగల సమూహమువలె పచ్చని వర్ణము గలవాడును, శాఖాంతరే లీనం = కొమ్మల నడుమ దాగియున్నవాడు నగు, తం = ఆ హనుమను, దృష్ట్వా = చూచి, చలితమానసా = చెదరిన మనస్సుగలది, (అభవత్ = అయ్యెను).


సా దదర్శ కపిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినమ్।
ఫుల్లాశోకోత్కరాభాసం తప్తచామీకరేక్షణమ్॥5.32.2॥


పదచ్ఛేదము:- సా – దదర్శ – కపిం – తత్ర – ప్రశ్రితం – ఫుల్లాశోకోత్కరాభాసం – తప్తచామీకరేక్షణమ్ ॥

అన్వయక్రమము:- సా తత్ర ప్రశ్రితం, ప్రియవాదినం, ఫుల్లాశోకోత్కరాభాసం, తప్తచామీకరేక్షణం, కపిం దదర్శ.

ప్రతిపదార్థము:- సా = ఆ సీతాదేవి, తత్ర = అచ్చట, ప్రశ్రితం = వినయవంతుడును, ప్రియవాదినం = ప్రియభాషియును, ఫుల్లాశోకోత్కరాభాసం = వికసించిన అశోకపుష్పముల సమూహమువలె ప్రకాశించుచున్నవాడును, తప్తచామీకరేక్షణం కరిగింపబడిన బంగారమువలె పచ్చనైన కన్నులు గలవాడును అగు, కపిం = హనుమను, దదర్శ = చూచెను.



మైథిలీ చిన్తయామాస విస్మయం పరమం గతా।


పదచ్ఛేదము:- మైథిలీ – చింతయామాస – విస్మయం- పరమం – గతా ॥

అన్వయక్రమము:- మైథిలీ పరమం విస్మయం గతా చింతయామాస.

ప్రతిపదార్థము:- మైథిలీ = సీతాదేవి, పరమం విస్మయం గతా = మిక్కిలి ఆశ్చర్యము యా = నొందినదై, చింతయామాస = ఆలోచించెను.



అహో భీమమిదం రూపం వానరస్య దురాసదమ్॥5.32.3॥
దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహ సా।

పదచ్ఛేదము:- అహో – భీమమ్ – ఇదం – రూపం – వానరస్య – దురాసదం దుర్నిరీక్ష్యమ్ – ఇతి – జ్ఞాత్వా – పునః – ఏవ – ముమోహ – సా ॥

అన్వయక్రమము:- అహో, వానరస్య ఇదం రూపం భీమం, దురాసదమ్; ఇదం
దుర్నిరీక్ష్యమ్ ఇతి జ్ఞాత్వా సా పునరేవ ముమోహ.

ప్రతిపదార్థము:- అహో = ఆహా, వానరస్య = వానరుని యొక్క ఇదం రూపం ఈ రూపవిశేషము, భీమం = భయంకరమైనదియును, దురాసదం = చేరశక్యము గానిదిగను ఉన్నది, ఇదం = ఈ రూపము, దుర్నిరీక్ష్యం = చూచుటకు శక్యముగా నట్టిది, ఇతి = అని, జ్ఞాత్వా = తలచి, సా = ఆ సీతాదేవి, పునః ఏవ = మఱల, ముమోహ = మూర్ఛిల్లెను.



సీ.
వెలయు విద్యుల్లతా వితతి వోలె వెలిగి
తెల్లని వస్త్రముల్ తేజ మలర
వికసితాశోకపు విరివోలె భాసిల్లి
కరుగుపసిడివన్నె కనుల తోడ
వినయము జూపెడు విమల వచనముల
కొమ్మల మాటున క్రుంగి యున్న
పింగళ వర్ణపు వీరకపీశుని
భీకర రూపము బెదరి చూచి

తే.గీ.
వట్టి కలయని భావించి వనజ నేత్ర
చూడరాదని యనుకొని చూచి సీత
భయము నొందుచు మదిలోన భ్రాంతి తోడ
మరల మతిదప్పి నేలపై మహిజ కూలె!
విలలాప భృశం సీతా కరుణం భయమోహితా॥5.32.4॥
రామరామేతి దుఃఖార్తా లక్ష్మణేతి చ భామినీ।
రురోద బహుధా సీతా మన్దం మన్దస్వరా సతీ॥5.32.5॥

పదచ్ఛేదము:- విలలాప – భృశం – సీతా -కరుణం – భయమోహితా రామ – రామ – ఇతి – దుఃఖార్తా – లక్ష్మణ – ఇతి – చ – భామినీ – రురోద – సహసా – సీతా మందం – మందస్వరా – సతీ ॥

అన్వయక్రమము:- భామినీ సీతా భయమోహితా, దుఃఖార్తా రామ రామేతి, లక్ష్మణేతి చ భృశం కరుణం విలలాప సీతా సహసా మందస్వరా సతీ మందం రురోద.

ప్రతిపదార్థము:- భామినీ సీతా = స్త్రీయైన సీత, భయమోహితా = భయముచే విమోహితురాలును, దుఃఖార్తా = దుఃఖముచే పీడింపబడినదియునై, రామ రామేతి = హా రామా! రామా! యనుచు, లక్ష్మణ ఇతి చ = హా లక్ష్మణా! యనుచును, భృశం కరుణం = మిక్కిలి దీనముగా, విలలాప = శోకించెను. సీతా = ఆ సీతమ్మ, సహసా = వెంటనే, మందస్వరా సతీ = మిక్కిలి మందమైన కంఠస్వరము గలదై, మందం = నెమ్మదిగ, రురోద = శోకించెను.


ఆ.వె.
భయము క్రమ్ముకొనగ బాష్పముల్ రాల్చుచు,
రామ రామ యనుచు రమణి కుమిలె!
సన్నగొంతు తోడ సాధ్వియు శోకించె,
రామ! లక్ష్మణ! యని లలన పొగిలె!

సాఽథ దృష్ట్వా హరిశ్రేష్ఠం వినీతవదుపస్థితమ్।
మైథిలీ చిన్తయామాస స్వప్నోఽయమితి భామినీ॥5.32.6॥


పదచ్ఛేదము:- సా – అథ – దృష్ట్వా – హరిశ్రేష్ఠం – వినీతవత్ – ఉపస్థితం – మైథిలీ – చింతయామాస – స్వప్నః – అయమ్ ఇతి – భామినీ ॥

అన్వయక్రమము:- అథ సా భామినీ మైథిలీ వినీతవత్ ఉపస్థితం హరిశ్రేష్ఠం దృష్ట్వా అయం స్వప్నః ఇతి చింతయామాస.

ప్రతిపదార్థము:- అధ = పిమ్మట, సా భామినీ మైథిలీ = ఆ సీతాదేవి, వినీతవత్ ఉపస్థితం = వినయముగా చేరియున్న, హరిశ్రేష్ఠం = హనుమను, దృష్ట్వా = చూచి, అయం స్వప్నః ఇతి = ఇది స్వప్నమా యని, చింతయామాస = భావించెను.


ఆ.వె.
మిగుల వినయమునను మెలుగు కపివరుని
విస్మయమున జూచె వింత గాను
మదిని కలవరపడి మైథిలీభామిని
స్వప్నమనుచు మరల సంశయించె!
సా వీక్షమాణా పృథుభుగ్నవక్త్రం శాఖామృగేన్ద్రస్య యథోక్తకారమ్।
దదర్శ పిఙ్గాధిపతే రమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠమ్॥5.32.7॥

పదచ్ఛేదము:- సా – వీక్షమాణా – పృథుభుగ్నవక్త్రం – శాఖామృగేంద్రస్య యథోక్తకారమ్, దదర్శ – పింగాధిపతేః – అమాత్యం – వాతాత్మజం – బుద్ధిమతాం – వరిష్ఠమ్ ॥

అన్వయక్రమము:- సా వీక్షమాణా, పృథుభుగ్నవక్త్రం, శాఖామృగేంద్రస్య యధోక్తకారం, పింగాధిపతేః అమాత్యం, బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం దదర్శ.

ప్రతిపదార్థము:- సా = ఆ సీతాదేవి, వీక్షమాణా = శ్రద్ధగా చూచుచున్నదై, పృథుభుగ్నవక్త్రం = విశాలమై ఉబ్బియున్న ముఖము గలవాడును, శాఖామృగేంద్రస్య = వానరరాజయిన సుగ్రీవునియొక్క, యధోక్తకారం = ఆజ్ఞను నెరవేర్చు బంటు అయినవాడును, పింగాధిపతేః = వానర రాజయిన సుగ్రీవునియొక్క అమాత్యం మంత్రియును, బుద్ధిమతాం వరిష్ఠం = బుద్ధిశాలురలో శ్రేష్ఠుడును అగు, వాతాత్మజం = వాయునందనుడైనట్టి హనుమను, దదర్శ = చూచెను.


ఆ.వె.
వెడద హనువు నుబ్బి వెరపించు హనుమను,
బుద్ధిమంతులందు భూరివరుని
సూర్యపుత్రు నాజ్ఞ చూరగొన్న కపిని
అరసి జూచె సీత అబ్బురమున!

సా తం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞా గతాసుకల్పేన బభూవ సీతా।
చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచిన్తయామాస విశాలనేత్రా॥5.32.8॥


పదచ్ఛేదము:- సా – తం – సమీక్ష్య – ఏవ – భృశం – విపన్నా – గతాసుకల్పా – ఇవ – బభూవ – సీతా – చిరేణ – సంజ్ఞాం – ప్రతిలభ్య – చ – ఏవం – విచింతయామాస – విశాలనేత్రా ॥

అన్వయక్రమము:- సా సీతా తం సమీక్ష్య ఏవ భృశం విపన్నా గతాసుకల్పా ఇవ బభూవ. విశాలనేత్రా (సా)చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య ఏవం విచింతయామాస.

ప్రతిపదార్థము:- సా సీతా = ఆ సీతాదేవి, తం = ఆ హనుమంతుని, సమీక్ష్య ఏవ = చూచినంతనే, భృశం విపన్నా = మిక్కిలి క్లేశమునొందినదై, గతాసుకల్పా ఇవ = ప్రాణములు గోల్పోయినదివలె, బభూవ = ఆయెను, విశాలనేత్రా (సా) = విశాలమైన కన్నులుగల ఆమె, చిరేణ = చాలసేపటికి, సంజ్ఞం = స్పృహను, ప్రతిలభ్య = పొంది, ఏవం = ఈ రీతిగా, విచింతయామాస = చింతింపసాగెను.


ఆ.వె.
కపిని గాంచినంత కడుభీతి జెందుచు,
ప్రాణ మీగినట్లు భామ కూలె!
కొంతవడికి మరల కుదురుకొన్న పిదప
విపులనేత్ర మదిని వింగడించె!

స్వప్నే మయాఽయం వికృతోఽద్య దృష్టశ్శాఖామృగశ్శాస్త్రగణైర్నిషిద్ధః।
స్వస్త్యస్తు రామాయ స లక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః॥5.32.9॥


పదచ్ఛేదము:- స్వప్నః – మయా – అయం – వికృతః – అద్య – దృష్టః – శాఖామృగః – శాస్త్రగణైః – నిషిద్ధః – స్వస్తి – అస్తు – రామాయ – సలక్ష్మణాయ తథా – పితుః – మే జనకస్య – రాజ్ఞః ॥

అన్వయక్రమము:- అద్య మయా వికృతః అయం స్వప్నః దృష్టః. శాస్త్రగణైః నిషిద్ధః శాఖామృగః (తత్ర) దృష్టః. సలక్ష్మణాయ రామాయ స్వస్తి అస్తు. తథా మే పితుః రాజ్ఞః జనకస్య (స్వస్తి అస్తు).

ప్రతిపదార్థము:- అద్య = నేడు, మయా = నాచేత, వికృతః = వికారమైనట్టి, అయం స్వప్నః = ఈ స్వప్నము, దృష్టః = చూడబడినది, శాస్త్రగణైః = ధర్మశాస్త్రములచే, నిషిద్ధః = నిషేధింపబడినట్టి, శాఖమృగః = వానరము (తత్ర దృష్టః = ఆ స్వప్నమున చూడబడెను.) సలక్ష్మణాయ = లక్ష్మణసహితుడైనట్టి, రామాయ = శ్రీరామునకు, స్వస్తి అస్తు = శుభమగుగాక! తథా = అట్లే, మే పితుః = నా తండ్రియైనట్టి, రాజ్ఞః జనకస్య = జనకమహారాజునకు, (స్వస్తి అస్తు = క్షేమమగుగాక!)


ఆ.వె.
స్వప్నమందు కోతి స్వస్తి కాదని తెల్పు
శాస్త్రములనుబట్టి జరుగు కీడు
రామలక్ష్మణులకు రక్ష కలుగుగాక
జనకునకును సతము జయము గాక!

స్వప్నోఽపి నాయం నహి మేఽస్తి నిద్రా శోకేన దుఃఖేన చ పీడితాయాః।
సుఖం హి మే నాస్తి యతోఽస్మి హీనా తేనేన్దుపూర్ణప్రతిమాననేన॥5.32.10॥


పదచ్ఛేదము:- స్వప్నః – హి – న – అయం – న – హి – మే – అస్తి – నిద్రా శోకేన – దుఃఖేన – చ – పీడితాయాః – పీడితాయాః – సుఖం – హి – మే – న – అస్తి – -యతః – విహీనా – తేన – ఇందుపూర్ణప్రతిమాననేన

అన్వయక్రమము:- అయం స్వప్నః నహి; శోకేన దుఃఖేన చ పీడితాయాః మే నిద్రా నహి అస్తి, యతః (అహం) ఇందుపూర్ణప్రతిమాననేన తేన విహీనా (అస్మి అతః) మే సుఖం నహి అస్తి.

ప్రతిపదార్థము:- అయం = ఇది, స్వప్నః = స్వప్నము, నహి అస్తి = కానేకాదు, శోకేన = శోకముచేతను, దుఃఖేన చ = దుఃఖముచేతను, పీడితాయాః = పీడింపబడినట్టి, మే = నాకు నిద్రా = నిద్ర, నహి అస్తి = లేనే లేదు, యతః = ఏ కారణమున, (అహం = నేను) ఇందుపూర్ణప్రతిమాననేన = పూర్ణచంద్రసన్నిభమైన ముఖము కలిగినట్టి, తేన = ఆ శ్రీరామునిచే, విహీనా = వియోగము నొందినదాననో, అతః = అందువలన, మే = నాకు, సుఖం = సుఖము, నహి అస్తి = లేనే లేదు.


రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచిన్త్య వాచా బ్రువతీ తమేవ।
తస్యానురూపాం చ కథాం తదర్థమేవం ప్రపశ్యామి తథా శృణోమి॥5.32.11॥


పదచ్ఛేదము:- రామ – ఇతి – రామ – ఇతి -సదా – ఏవ – బుద్ధ్యా – విచింత్య – వాచా – బ్రువతీ – తమ్ – ఏవ – తస్య – అనురూపం – చ – కథాం – తదర్ధామ్ – ఏవం – ప్రపశ్యామి – తథా – శృణోమి

అన్వయక్రమము : – (అహం) సదైవ రామేతి రామేతి బుద్ధ్యా విచింత్య వాచా తమేవ బ్రువతీ ఏవం తస్య అనురూపం ప్రపశ్యామి తథా ఏవం తదర్థాం కథాం చ శృణోమి.

ప్రతిపదార్థము:- (అహం = నేను) సదైవ = ఎల్లప్పుడును, రామేతి రామేతి = రామా రామా యని, బుద్ధ్యా విచింత్య = మనస్సున స్మరించి, వాచా = వాక్కుతో, త మేవ = ఆ శ్రీరాముని గూర్చియే, బ్రువతీ = పలుకుచున్నదాననై, ఏవం = ఈ రీతిగా, తస్య = ఆ శ్రీరామునకు, అనురూపం = తగినట్టుగా, ప్రపశ్యామి = చూచుచున్నాను, తధా = అట్లే, ఏవం = ఈ రీతిగా, తదర్థాం కథాం చ = శ్రీరాముని (చరిత్రనే బోధించునట్టి) వృత్తాంతమును, శృణోమి = వినుచున్నాను.


అహం హి తస్యాద్య మనోభవేన సమ్పీడితా తద్గతసర్వభావా।
విచిన్తయన్తీ సతతం తమేవ తథైవ పశ్యామి తథా శృణోమి॥5.32.12॥


పదచ్ఛేదము:- అహం – హి – తస్య – అద్య – మనోభవేన – సంపీడితా – ఏవ – తద్గతసర్వభావా – విచింతయంతీ – సతతం – తమ్ – ఏవ – తథా – పశ్యామి – తథా – ఏవ – శృణోమి

అన్వయక్రమము:- అహం అద్య మనోభవేన సంపీడితా సతతం తమేవ చింతయంతీ తద్గతసర్వభావా తథైవ తస్య రూపం పశ్యామి తథా (తస్య కథాం) శృణోమి.

ప్రతిపదార్థము అహం = నేను, అద్య = నేడు, మనోభవేన = మన్మధునిచే, సంపీడితా = పీడింపబడినదాననై, సతతం = నిరంతరము, తమేవ = ఆ శ్రీరామునే, చింతయంతీ = స్మరించుచున్నదాననై, తద్గతసర్వభావా = ఆ శ్రీరామునియందు లగ్నమైయున్న నా సమస్తమైన మనస్సు గలదాననై, తథైవ = ఆ రీతిగనే, తస్య రూపం = ఆ శ్రీరాముని రూపమును, పశ్యామి = కనుగొనుచున్నాను, తథా = ఆ రీతిగా, (తస్య కథాం = అతని చరిత్రను) శృణోమి = ఆలకించుచున్నాను.


సీ.
నిముస మాలోచించి నీరజాక్షియు నంత,
కల కాదు కాదని కలికి వగచె
నిదురయే లేకున్న నిక్కము కల రాదు,
శోకతప్తకు నిద్ర సుఖము లేదు!
మదిలోన రాముని మరువక దలచిన,
మరిమరి వినిపించు మగని కథలె
పూర్ణచంద్రుని బోలు పురుషోత్తముని మోము,
తలపోయ కనిపించు తనదు పతియె!
తే.గీ.
తన మనోరథమే మది తవిలియుండ
తలపులే కోతిరూపును దాల్చెనేమొ
కల్పనలు సేయు చిత్తవికల్పమనుచు
నిజము గాదిది భ్రమయని నిశ్చయించె!

మనోరథస్స్యాదితి చిన్తయామి తథాపి బుద్ధ్యా చ వితర్కయామి।
కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్తరూపశ్చ వదత్యయం మామ్॥5.32.13॥


పదచ్ఛేదము:- మనోరథః – స్యాత్ – ఇతి – చింతయామి తథా – బుద్ధ్యా – అపి – వితర్కయామి – కిం – కారణం తస్య – హి – న – రూపం – సువ్యక్తరూపః – చ – వదతి – అయం – మామ్

అన్వయక్రమము:- అయం మనోరథః స్యాత్ ఇతి చింతయామి; తథాపి బుద్ధ్యా అపి (సః న ఇతి) వితర్కయామి; కిం కారణం (ఇతి చేత్) తస్య రూపం నాస్తి హి; అయం సువ్యక్తరూపః మాం వదతి చ.

ప్రతిపదార్థము:- అయం = ఈ సంఘటనము, (మే) మనోరథః స్యాత్ = మానసికమైన అభిలాషయే యగును, ఇతి = అని, చింతయామి = భావింతును, తథాపి = అయినను, బుద్ధ్యాపి = నిశ్చలమైన బుద్ధితో (సః న ఇతి = అట్టి మానసిక భావన కాదని) వితర్కయామి = ఊహించుచున్నాను. కిం కారణం (ఇతి చేత్) = కారణమేమి (అనగా), తస్య = ఆ మానసికభావనకు, రూపం నాస్తి హి = = ప్రత్యక్షమైన రూపముండదు గదా! అయం = ఈ వానరుడు, సువ్యక్తరూపః = వ్యక్తమైనట్టి రూపముగలవాడై, మాం వదతి చ = నన్ను గూర్చి మాటాడుచున్నాడు గూడను.


తే.గీ.
మదిని బుద్ధితో తర్కించి మరల మరల,
భ్రమకు రూపముండదనుచు పడతి యెంచె!
“వ్యక్తరూపమున పలుకు వానరుండు,
నికట ప్రకటితుడయ్యెను నిజము గాదొ?”

నమోఽస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ।
అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్ఛ తథాస్తు నాన్యథా॥5.32.14॥


పదచ్ఛేదము:- నమః – అస్తు – వాచస్పతయే – సవజ్రిణే – స్వయంభువే – చ – ఏవ – హుతాశనాయ – అనేన – చ – ఉక్తం – యత్ – ఇదం – మమ – అగ్రతః – వనౌకసా – తత్ – చ – తథా – అస్తు – న – అన్యథా – (అస్తు) ॥

అన్వయక్రమము:- సవజ్రిణే వాచస్పతయే నమః అస్తు; స్వయంభువే హుతాశనాయ (నమః అస్తు) మమ అగ్రతః అనేన వనౌకసా యత్ ఇదమ్ ఉక్తం, తత్ తథాస్తు; అన్యథా న (అస్తు).

ప్రతిపదార్థము : = సవజ్రిణే = దేవేంద్రునితో కూడినట్టి, వాచస్పతయే = బృహస్పతికి, నమః అస్తు = నమస్కారమగుగాక! స్వయంభువే = బ్రహ్మదేవునకు, హుతాశనాయ చైవ = అగ్నిదేవునకును, నమః అస్తు = నమస్కారమగుగాక! మమ అగ్రతః = నా సమక్షమున, అనేన వనౌకసా = ఈ వానరునిచే, ఇదం యత్ ఉక్తం = ఇది ఏమి చెప్పబడెనో, తత్ = అది, తథాస్తు = అట్లే యగుగాక! అన్యథా న అస్తు = వేరొకరీతిగా (బూటకముగా) కాకుండుగాక!


కం.
“దండము వాచస్పతికిని,
దండము వజ్రధరుడైన దైవతవిభుకున్!
దండము వనజభవునికిని,
దండము వైశ్వానరుడగు దహనుని కిపుడున్!
కం.
దండిగ కోతి వచనములు,
నిండుగ బూటకము కాక నిజమే కాగా
అండగ నిలువుం” డనుచును,
దండముల నిడెను ధరణిజ దైవంబులకున్!