ఖాళీ

నా లోపలంతా బోలుతనం
అంతులేనంత శూన్యం
మహానగరం నిర్మానుష్యమైనట్టు
మహాసముద్రం ఒట్టిపోయినట్టు
ఖాళీ చేసుకోలేనంత ఖాళీతనం తప్ప
నాకో ఉనికి లేదు మణికి లేదు –

కరువు కాలంలో గింజలేమీ లేక
ధాన్యం కొట్టు నిండుకున్నట్టు
మరిడొచ్చి మందలో పడి
మేకల్నన్నీ ఊడ్చుకుపోయినట్టు
నిండా ఖాళీతనం నింపుకున్న
కృష్ణకాయం తప్ప మరేం లేదు –

ఎండుటాకును రివ్వాటు తిప్పినట్టు
ఒంటరితనం నన్ను ఎగరేస్తోంది
లక్ష్యం లేదు గమ్యం తెలియదు
నెట్టిన దిశకు సాగిపోవడం తప్ప
పోగొట్టుకోవాల్సిందేమీ లేదు –
నన్ను నాకు మిగలనివ్వని
నా ఏకాకితనపు సహవాసం తప్ప!

నా గుల్లతనం
నమిలి నమిలి నన్ను తినేస్తోంది
తొలిచి తొలిచి లోపలికంటా
నన్ను నెమరేస్తోంది
నెత్తురు తుడిచే దూదిముద్దలా
నన్ను నా గాయాలపై అద్దుతూ
పదేపదే సలపరించే సంవేదన తప్ప
నాతో మిగిలిందేమీ లేదు –
మెలిపెట్టే మొరటు నొప్పి తప్ప!

గతంలో నాలో ఏముండేదో..
ఇప్పుడది లేని శూన్య స్థానాన్ని
శబ్ద రాహిత్యం అల్లుకుంది
ప్రేమ రాహిత్యం పట్టుకుంది
రిక్త చైతన్యం చుట్టుకుంది

*
బోలుమంటున్న నాలోకి
నన్ను నేను నింపుకునేందుకు
నాలోపలి చీకటి గూట్లో
ఓ దివ్వెను నేనే వెలిగించుకోవాలి కదూ


కంచరాన భుజంగరావు

రచయిత కంచరాన భుజంగరావు గురించి:

దాదాపు రెండు దశాబ్దాలుగా సాహిత్యంలో కొనసాగుతున్న కంచరాన భుజంగరావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ ఆధునిక తెలుగు కవి, రచయిత, ఉపాధ్యాయులు. \”కళింగాంధ్ర కవి\”గా గుర్తింపు పొందిన ఆయన, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సామాజిక, భౌగోళిక అంశాలను ప్రతిబింబిస్తూ కవిత్వం రాస్తారు. ఈయన రచనలలో సామాన్యుల జీవితాలు, వలసలు మరియు ప్రాంతీయ సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. వీరి \”వలస పక్షుల విడిది – తేలినీలాపురం\”, \”నీటి గింజల పంట\” (కవితా సంపుటి) వంటివి ప్రసిద్ధం.

 ...