హైడిగర్ భాష, విషయము, విధానము
“అని పలికి యగ్ని వలగొని తన దేహము దానిలోన తడయక యిడినం-
గని బోయ విస్మయంబున… ”
(తిక్కన, కపోతవృత్తాంతము, మహాభారతము, శాంతిపర్వము, 3. 323)
బోయకే కాదు, పాఠకుడికి కూడా విస్మయం కలుగుతుంది, తిక్కన చేసిన “యిడి” ప్రయోగం చూచి. కపోతం అగ్నిలో దూకలేదు, తన దేహాన్ని అగ్నిలో “ఉంచింది” (“యిడినన్”) హోమాగ్నిలో ఆహుతిని వలె! అయితే, యీ ప్రయోగం యజ్ఞాలు చేసిన తిక్కన మాత్రమే కాదు, సామాన్యులు కూడా చేస్తారు. “వాడు ఒళ్ళు వంచి పనిచేస్తాడు.” ఇది సామాన్యుని సంభాషణ. వాడు “వంగి” పనిచేయడం లేదు. “ఒళ్ళు వంచి” పనిచేస్తున్నాడు. “వాడు”, “వాడు వంచిన ఒళ్ళు” ఒకటి కాలేవు. ఈ సాధారణసంభాషణ దేహాత్మభావాన్ని నిరస్తం చేస్తోంది.
మరో సాధారణసంభాషణ: “ఎలా ఉన్నావు?”
తెలుసు.
“తెలుసా? ఏమిటి తెలుసు? నేనడిగిందేమిటి, నీ సమాధానం ఏమిటి?”
“పంచాగ్నివిద్య తెలుసా అనే కదా అడిగావు? తెలుసన్నాను. ”
“ఉండు” (be) ధాతురూపం “ఉన్నావు”. ఎలా ఉన్నావు, అంటే ఉండుట (be-ing), ఉనికి (existence) గురించిన ప్రశ్న. ఈ శరీరం ఎలా ఏర్పడుతుందో చెబుతుంది ఛాందోగ్యంలో పంచాగ్నివిద్య. హైడెగర్ యిటువంటి పద్ధతినే అనుసరిస్తాడు:
“Wie befinden Sie sich?” (How do you do?). “sich befinden”, to feel; to be located; to be situated. జర్మన్ భాషలో నిత్యవ్యవహారంలోని యిటువంటి వాక్యాలలో దాగిన తాత్త్వికవాస్తవాలను, బయటికి తెస్తాడు. వాటిని తత్త్వపరిభాషగా మార్చాడు హైడెగర్. అవే, అస్తిత్వవాదంలో ప్రధానమైన seine, seinde, Be-ing, వంటి పదాలు.
హైడెగర్ వ్యాసం “What Is Metaphysics?” నుండి:
- విజ్ఞానశాస్త్రానికి ప్రపంచానికి ఉన్న సంబంధం “ఉన్న” వస్తువులతో — అవి తప్ప మరొకటి లేదు (“nothing else”, జర్మన్ మూలం, sonst nichts)
- విజ్ఞానశాస్త్రకృషిని నడిపించేది “ఉన్న” వస్తువులు — అవి తప్ప మరొకటి లేదు, (“nothing else”, జర్మన్ మూలం, sonst nichts)
- కార్యరంగంలో, విజ్ఞానశాస్త్రం ఎదుర్కొనేది “ఉన్న” వస్తువులు — అవి తప్ప మరొకటి లేదు (only things, and “nothing more” లేక “nothing else”, జర్మన్ మూలం, sonst nichts)
విచిత్రమేమంటే శాస్త్రజ్ఞులు తమ అధ్యయనభూమిని నిర్దేశిస్తూ, అది కాక మరొక దానిని చెబుతున్నారు. వాళ్ళ అధ్యయనవిషయం కేవలం వస్తువులు, “ఉన్న” వస్తువులు, వాటిని మించి మరొకటి లేదు. హైడెగర్ చెప్పదలచుకున్నది ఇంగ్లీషులో మరింత స్పష్టంగా తెలుస్తుంది. “only things, and nothing more” అని పదేపదే నొక్కి చెబుతారు. ఇక్కడ రెండు పదాలున్నాయి, thing, no-thing. శాస్త్రజ్ఞులు వాళ్ళ విషయం thing అని ఊరుకోవడం లేదు, no-thing చేర్చకుండా ఉండడం లేదు. ఇన్నిసార్లు ఉచ్చరిస్తున్న యీ no-thing ను గురించి వారెందుకు ఆలోచించరు? హైడెగర్ కు ఆ no-thing అసలు “thing”. ఇదే కాదు. “What Is Metaphysics?” లో ప్రధానప్రతిపాదన అవస్తువు, (Nothing) దాని ఆవిష్కరణలోకూడా యీ విధానాన్నే ఆశ్రయిస్తాడు హైడెగర్. నిత్యజీవితంలోని అతి సాధారణసంభాషణలో యీ గహనతత్త్వాన్ని పట్టుకుంటాడు. వ్యగ్రత కలిగినపుడు, “ఏమైంది? ఎందుకలా ఉన్నావు?” అంటే, వెంటనే “అదేం లేదు” అన్న సమాధానం అప్రయత్నంగా వస్తుంది. ఈ “ అదేం లేదు” పట్టుకుంటాడు హైడెగర్. ఆ “ అది”, అదే. ఏమిటది? అది “ఏం లేదు” (Nothing).
ఇలా ఉంటుంది జర్మన్ తాత్త్వికుల భాషాచమత్కృతి. శంకరుడు భజగోవిందస్తోత్రంలో యిదే చేస్తాడు. ధాతుపాఠంలో ఎన్ని ధాతువులు లేవు? ఆయన చెవిన “డుకృఞ కరణే” మాత్రమే ఎందుకు పడాలి? ‘ “కృ” ధాత్వర్థమైన “కర్మలు కర్మలు కర్మలు” ఎంతకాలం చేస్తావు? వాటిని దాటి నైష్కర్మ్యం పొందు’, అని ప్రబోధం కొరకు.
హైడెగర్ అస్తిత్వవాదానికి, వాదంగా, ఆదిపురుషుడు అని అందరూ అంగీకరిస్తారు. హసర్ల్ (Husserl) కు యీ ఖ్యాతి చెందవలెనంటారు కొందరు. (హసర్ల్ విశ్వవిద్యాలయ తత్త్వశాస్త్రవిభాగంలో హైడెగర్కు సీనియర్. హైడెగర్ తన ప్రసిద్ధగ్రంథం (“Being and Time”) హసర్ల్కు అంకితమిచ్చాడు. కాని అతడి వాదంతో తీవ్రంగా విభేదించాడు.) హైడెగర్ను సార్త్ర్ (Sartre) వంటివారు అస్తిత్వవాదంలోని నాస్తికవర్గానికి నాయకుణ్ణి చేశారు. ఈ రెండూకూడా నిశితంగా పరిశీలించవలసిన విషయాలే. అలా పరిశీలించాలంటే, తత్త్వశాస్త్రమూలాలలోకి వెళ్ళాలి, కేవలం పాశ్చాత్యతత్త్వశాస్త్రం కాదు. పాశ్చాత్యతత్త్వశాస్త్రమూలాలను కదిలించాడు హైడెగర్. కాని ఆ కదిలించడంలో చాలా కనికట్టువిద్యను ప్రదర్శించాడు. ఆ కనికట్టుకు పనిముట్టు “మాటలాట” (play of words). హైడెగర్ హెచ్చరిస్తూనే ఉంటాడు, “ఇది మాటలాటగా అనిపించవచ్చు” అని. ఆ హెచ్చరికకూడా కనికట్టులో భాగమే. మరో హెచ్చరిక, హైడెగర్ గురించి, అవసరం లేకపోయినా, హైడెగర్ రచన విద్వదౌషధమని ప్రసిద్ధి. ఈ వ్యాసం (“What is metaphysics?) లో వాక్యాలు చదివినపుడు ఎవరూ చెప్పకుండానే తెలుస్తుంది ఆ విషయం.
అనువాదవిషయం
“There is no translation at all in which the words of one language should or could cover the words of another language… Translation is an awakening, clarifying, and unfolding of one’s own language by coming to grips with the foreign language.” Martin Heidegger. అనువాదమంటే, పరభాషతో దాని పరిభాషతో తలపడడంలో, అనువాదభాషను నిద్రలేపడం, పదాలకు కొత్త స్ఫురణ కలిగించడం. అవసరమైతే కొత్త పదాలు సృష్టించడం. ఉదా: “I’ve read Heidegger. I’ve understood nothing.” “నేను హైడెగర్ను చదివాను. ఒక్క ముక్క అర్థం కాలేదు.” ఈ అనువాదం మంచి తెలుగు కాదనలేము. కాని అది సరి అయిన అనువాదమా? “నేను హైడెగర్ చదివాను. నాకు అవస్తువు (no-thing) అర్థమయింది.” ఈ వాక్యం ఎవరికైనా అర్థమవుతుందా? ఇది తెలుగులా లేదు. హైడెగరుకు ఆంగ్లంలో అనువాదాలు “మంచి ఆంగ్లం కాదు” (not good English), అన్నాడు ఒక అనువాదకుడు (Miles) తోడబుట్టిన భాషలోనే అంత “మంచి”గా కనిపించని అనువాదం, తెలుగులో “మంచి తెలుగు” కాదు కదా, తెలుగులానే అనిపించకపోవచ్చు. దీనికి కారణం హైడెగరే కాని అనువాద భాష కాదు. అతడు తన రచన గురించి తరచు “ఇది కేవలం మాటలాటగా (play of words) అనిపించవచ్చు”, అంటూ ఉంటాడు. అతనికే బహుశా మాటలాటలా అనిపించకపోతే, అదే మాట అన్నిసార్లు అనడు. ఈ “మాటలాట”ను గురించి ఒక మాట. హైడెగర్ గ్రంథం (“తత్త్వశాస్త్రమంటే?” “What is Metaphysics?”) లోని ప్రారంభభాగంలోని మూడు వాక్యాలు చూద్దాం.
- విజ్ఞానశాస్త్రానికి ప్రపంచానికి ఉన్న సంబంధం వస్తువులతో — అవి తప్ప మరొకటి లేదు (“nothing else”, జర్మన్ మూలం, sonst nichts).
- విజ్ఞానశాస్త్రకృషిని నడిపించేది పదార్థాలు — అవి తప్ప మరొకటి లేదు (“nothing else”, sonst nichts).
- కార్యరంగంలో, విజ్ఞానశాస్త్రం ఎదుర్కొనేది పదార్థాలను — అవి తప్ప మరొకటి లేదు (“nothing else”, sonst nichts).
హైడెగర్ తత్త్వదర్శనంలో ప్రధానవస్తువు Nothing. జర్మన్ లో nichts. (no “కాదు”, thing “వస్తువు”; “న, వస్తువు”, అవస్తువు) కనుక ఆ మాటతో ఆడుకొంటున్నాడు. ఈ వాక్యాలలో “అవి తప్ప మరొకటి లేదు” అన్న అర్థాన్నిస్తూ, హైడెగర్కు అవసరమైన ప్రధానార్థాన్నిచ్చే తెలుగు పదమేదైనా (అచ్చతెలుగో తత్సమమో తద్భవమో) ఉందా? నిజానికి గ్రంథంలోని ప్రారంభభాగంలోని యీ వాక్యాలలో nothing అన్న పదాన్ని చెప్పడానికి “అవి తప్ప మరొకటి లేదు” చాలు. అవసరం కూడా. అది “మంచి” తెలుగు కూడా. కాని యీ ప్రారంభభాగంలోని nothing కు, గ్రంథంలో మరి రెండు వాక్యాల తరువాత, యీ అర్థం చాలదు. గ్రంథం సాగేకొద్దీ యింతింతై అన్నట్టు యీ nothing, everything గా సృష్టిసమస్తాన్ని ఆవరిస్తుంది. ఆ దశలో “అవి తప్ప మరొకటి లేదు” సరి అయిన అనువాదం అవదు. ఈ రెండు ప్రయోజనాలను సాధించే Nothing కు సరి అయిన తెలుగు పదం లేదు. కనుక, వేరు సందర్భాలలో వేరు పదాలు వాడక తప్పదు. “మంచి” తెలుగు కాకపోయినా వాడుకోక తప్పదు. “విజ్ఞానశాస్త్రానికి ప్రపంచానికి ఉన్న సంబంధం వస్తువులతో-అది తప్ప అవస్తువు”, అనవచ్చు. (అవిద్య, అభావం, శూన్యం, అసత్తు, మాయ, మహామాయ. ఇలా అనువాదం చేసే అవకాశం లేకపోలేదు అని హైడెగర్కు తెలియకపోలేదు కూడా. అలాంటి అనువాదాలనుండి తన తత్త్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చాలానే చేశాడు కూడా.) అది తెలుగులా ఉండదు. కాని, హైడెగర్ ఉద్దేశించిన ప్రధానార్థంలో “అవస్తువు” వాడబడింది ప్రస్తుతపు నా అనువాదంలో.
హైడెగర్ జర్మన్ పదాలను వాటి సాధారణ అర్థంలో దాగిన అసాధారణార్థాన్ని బయటకు తీస్తాడు. ఉదాహరణకు, అస్తిత్వం అనే అర్థంలో అతడు సృష్టించిన Dasein. ఇది రెండు పదాల కలయిక. Da అంటే “అక్కడ”, sein అంటే భూతము. (సంస్కృతధాతువు “భూ సత్తాయామ్” నుండి “భూతము”. భవము, భావము కూడా “భూ” ధాతువునుండి సాధించినవే. “ఉన్నది”.) భూతము అంటే సృష్టి అయిన వస్తువు. జగత్తులో “ఉన్న” సమస్తజడచేతనపదార్థాలు భూతములే, అంటే వస్తువులు. కనుక sein అంటే “ఉన్నది”. (“ఉన్నది” క్రియాపదము (ఉదా. “అది అక్కడ ఉన్నది”). నామవాచకము (ఉదా. “ఉన్నది లేనిది చెప్పకు”) కూడా. మరి Dasein, (da, sein) అంటే? “అక్కడ ఉన్నది”, (నామవాచకము). ఈ కొత్త పదాన్ని సృష్టించడంలో ఏమి ప్రయోజనం? అసలు ఆ పదానికి అర్థమేమిటి? మరింత స్పష్టతకొరకు, జర్మన్ sein కు ఆంగ్లంలో సమానార్థకం being (to be, “ఉండు”నుండి) Being కు Concise Oxford English (COD) యిచ్చిన అర్థాలు:
- existence
- the nature or essence (of a person etc. )
- a human being
- anything that exists or imagined.
Being కు మనిషి అన్న అర్థంకూడా ఉన్నది. కాని, అదే పదానికి ఉన్న రెండవ అర్థంలో (the nature or essence (of a person etc.) అది రూఢమయింది. ఏమిటా రెండవ అర్థం? స్వభావము, లేక ప్రకృతి. అంటే, కనిపిస్తున్న మనిషి కాక కనిపించని తత్త్వం ముందుకొస్తున్నది. దీని వలన being మూడవ అర్థాన్ని పోగొట్టుకొని, రెండవ అర్థంలోకి అదృశ్యమవడమో, నాలుగవ అర్థంలో పడిపోవడమో జరుగుతోంది. రెండవ అర్థంలో, (the nature or essence (of a person etc.) రెండు అర్థాలు సాధ్యం. ఒకటి, మనిషి ప్రకృతి ముందే నిర్ణయమైపోయింది, (దైవాసురసంపద్విభాగం, గుణత్రయవిభాగము). రెండవ అర్థంలో సాధ్యమైన మరో అర్థం, మనిషికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు కోసేసి, వాణ్ణి తత్త్వంగా, నిష్క్రియాత్మగా మార్చేస్తుంది. (“ఆత్మ నిత్యమ్మ కాలాద్యవచ్ఛిన్నము”: విశ్వనాథ కల్పవృక్షము). Being అన్న పదం పరమాత్మ (Supreme Being) కు కూడా అన్వయిస్తాం.) ఈ Being ను be-ing గా విడగొట్టి వాడుతున్నారు, కొందరు అనువాదకులు. ఎందుకు? be-ing లోని “be” ధాత్వర్థాన్ని గుర్తుచేయడానికి. walk-ing, speak-ing, అన్నపుడు నడవడం, మాట్లాడడం అనే క్రియార్థం నిర్వర్తించబడుచున్నది అని కదా అర్థం? మరి be-ing అన్నపుడు క్రియార్థం నిర్వర్తించబడుతోందా? “ఉండడం” అంటే? బండలా పడి ఉండడమా? బండలా బతకడమా? “అస్తి” లోని “అస్” ధాత్వర్థాన్ని మనిషికి గుర్తుచేసేదే అస్తిత్వవాదం.
ఇప్పుడు తిరిగి da-sein కు వద్దాం. “అక్కడ ఉన్నది” లోని “అక్కడ” ఏ ప్రయోజనం కొరకు? “ఉన్నది” అంటే చాలదా? చాలదు. ఉండడానికి లక్షణం? దేశకాలాదులు. “అక్కడ ఉన్నది, యిక్కడ ఉండింది, నిన్న అక్కడ చూచాను.” “అక్కడ” కాలాన్నికూడా ఉపలక్షిస్తుంది. దేశము కాలము ఒకటి లేక మరొకటి లేవు కదా! దూరాన్ని కాలంలో కూడా చెబుతాం, “పది నిమిషాల నడక, ఫ్లైట్లో గంట”. దేశకాలాలను రెంటినీ కలిపి “నాలుగవ కొలత” (space-time లేక fourth dimension అంటుంది సాపేక్ష సిద్ధాంతం).
హైడెగర్ ప్రధానగ్రంథం పేరు, “Being and Time”. Da-sein దేశాన్ని చెబుతోంది. ఈ కల్పితపదం, మనిషి దేశకాలాలకు అతీతమైన తత్త్వం కాడని, మనిషి సక్రియుడని, తన కర్మలచే తనను తాను నిర్మించుకుంటాడని, “బతకడం” మనిషి “ధర్మ”మని, (తత్త్వం కాదని) చెబుతుంది. ఇది హైడెగర్ పదప్రయోగము, అనువాదభాషావిషయము.
[ “What is Metaphysics?” అన్న పుస్తకానికి నేను నాలుగు అనువాదాలను పరిశీలించాను: Miles Groth, Stephen Hicks, Sheehan, Alexander Moore. వీరందరికి నేను ఋణపడి ఉన్నాను. — రచయిత. ]
(ఇంకావుంది)