పదకొండు రోజుల క్రితం 2025 అక్టోబర్ 4న మాఛాఖోలాలో ట్రెకింగ్ ఆరంభించి, సుమారు 140 కిలోమీటర్లు కాలినడకన సాగి, 5106 మీటర్ల ఎత్తున ఉన్న లార్కే కనుమకు మొత్తం జట్టులోని పదిమందిమీ చేరుకున్నాం కదా!
చేరుకుని విశాల హిమాలయ దృశ్యాన్ని ఊపిరి మరచి, కళ్ళు మూయకుండా చూసాంగదా! హిమల్ ఛూలిలాంటి శిఖరాలతో మనసులోనే కరచాలనం చేసాంగదా! పాత స్నేహితురాలు అన్నపూర్ణ II శిఖరాన్ని పలకరించాంగదా!
ఎన్ని చూసినా, ఎంత చేసినా ఆ గాలి పలచన ప్రాంతంలో మేము ఉండగలిగింది కొద్ది క్షణాలపాటే. శరీరంలోని ఆక్సిజన్ స్థాయి 80 శాతంకన్నా దిగువకు పడిపోయే చోట ఎక్కువసేపు ఉండటమన్నది బాగా ప్రమాదకరం. అంచేత చుట్టూ కనిపించే దృశ్యాలను మనసులో నింపుకుని, ఫొటోల్లో బంధించి, అందరం కలసి గబగబా గ్రూప్ ఫోటో దిగి కనుమ అవతల వేపుకు దిగడానికి సన్నాహాలు మొదలెట్టాం. సరిగ్గా అదే సమయంలో మా ఇజ్రాయెల్ మిత్రులు మేరీ, రాజ్, అయోల అక్కడికి చేరుకున్నారు. ఆరోజు మేరీ 50 వ పుట్టినరోజు.
ఇహ ఆక్సిజన్ సంకోచాలను కొద్దిసేపు పక్కన పెట్టి అందరం మేరీ పుట్టిన రోజు సంబరంలో పాలుపంచుకున్నాం. తరచు కలుసుకోవడంవల్లా, మేరీ వాళ్ళ స్నేహశీలతవల్లా అప్పటికే వారితో మా పరిచయం మైత్రీబంధంగా పరిణమించింది. పుట్టినరోజు అంటే కేక్ ఉండాలి కదా – కానీ ఆ 5000 మీటర్ల ఎత్తున కేక్ కోసి సంబరం చేసుకోవడమన్నది సాధ్యం కాని పని. వాళ్ళ పాప అయోల ఆ సమస్యకు సమాధానంగా స్నికర్స్ కంపెనీ వాళ్ళ చాక్లెట్ బార్ తన బాక్‌పాక్‌లోంచి వెలికి తీసి మేరీకి ఇచ్చి దాన్ని తుంచడం ద్వారా వేడుకను ఆరంభించమంది. ఆమె తుంచింది. అంతా హర్షధ్వానాలు చేసాం. ఏభైయవ పుట్టినరోజు అంటే జీవితంలో ఒక మైలురాయి. దగ్గరివారితో కలసి ఆ వేడుక జరుపుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇజ్రాయెల్‌నుంచి వచ్చి హిమాలయాల కనుమకు చేరిన మేరీ కుటుంబానికి ఇంగ్లాండ్, అమెరికా, ఇండియా, న్యూజిలాండ్‌ల నుంచి వచ్చిన మా బృందం ఆ వేడుక సమయంలో ఆత్మీయభావనను పంచగలిగింది. స్నేహితులూ ఇతర కుటుంబసభ్యులూ లేని లోటును కొంతవరకైనా పూడ్చగలిగింది. దానివల్ల వారికీ మాకూ కూడా సంతోషం కలిగింది. వారితో మరి కాసేపు గడిపి మేము ముందుకు సాగిపోయాం. ఆ ముగ్గురు కుటుంబసభ్యులూ అప్పటి అమూల్యమైన క్షణాలను తమలోనే పంచుకొనేలా చూసాం.మూడు కిలోమీటర్లపాటు మంచుమీద నడవవలసి వచ్చింది– అందుకు మా క్రాంపాన్లు ఎంతగానో సాయపడ్డాయి. ఆ తర్వాత మంచు కరిగి రాళ్ళు బయటపడుతోన్న దారి… ఇంకాస్త నడిచాక దూరాన అన్నపూర్ణ పర్వత శ్రేణి కనిపించింది… మంచు పెళ్ళలు విరిగి జారుతోన్న ధ్వనులు లీలగా వినిపించాయి.
అలా ఓ గంట నడిచాక ఉన్నట్టుండి ఒక మర్మోట్ (Marmot) మా కంట పడింది. స్థూలంగా ఉడత జాతికి చెందిన, అరుదుగా కనిపించే ప్రాణి అది. హిమాలయాల ఉన్నతసీమల్లో దాని నివాసం. అప్పటిదాకా నింపాదిగా తిరుగాడుతూ గడ్డి పరకలు కోరుకుతోన్న ఆ జీవి మా అడుగుల శబ్దం విని నిశ్చేష్టమయింది. కొన్ని సెకన్లపాటు తికమక నిండిన మొహం పెట్టి మాకేసి చూసింది. ఆ సమయం చాలు – చకచకా కెమెరాలు క్లిక్‌మన్నాయి… క్లోజప్ ఫోటోలు లభించాయి.
అంతులేని అవరోహణ అది. క్రమక్రమంగా మారుతోన్న పరిసరదృశ్యాలు మమ్మల్ని యాంత్రికతనుంచి రక్షించాయి. మనసుల్ని తాజాపరుస్తూ వచ్చాయి. కాసేపటికి ఒక కంచరగాడిదల బారు ఎదురొచ్చింది. పక్కకు తప్పుకుని దారి ఇచ్చాం. హిమాలయాల్లో ఈ కంచరగాడిదలే నిత్యావసర వస్తువులు రవాణా చేసే ముఖ్యసాధనాలు. ఇంకా చెప్పాలంటే అవి అక్కడి జీవనాధారాలు. మేమంతా ధర్మశాలనుంచి లార్కే పాస్ మీదుగా భీమ్‌థాంగ్ వేపు వెళుతూ ఉంటే ఆ కంచరగాడిదల బారు దానికి వ్యతిరేక దిశలో భీమ్‌థాంగ్‌నుంచి ధర్మశాల వేపు వెళుతోందన్నమాట. అంత నిడివి ఉన్న కంచరగాడిదల బారును నడిపిస్తున్నది ఇద్దరే ఇద్దరు మనుషులు.కాసేపట్లో మేరీ వాళ్ళు మళ్ళీ వచ్చి మాతో చేరారు. కబుర్లలో పడ్డాం. ఇజ్రాయెలీలతో కబుర్లు అంటే వాటిల్లో మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ కేంద్రబిందువుగా జరుగుతోన్న ఘర్షణలు సహజంగానే చోటు చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేను హిమాలయాల్లో ట్రెకింగ్ చేస్తూ ఇజ్రాయిలీలతో కలసి నడుస్తున్నపుడే రెండు ముఖ్యమైన ఘట్టాలు సంభవించాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు టెల్ అవీవ్ మీద దాడి చేసి వెయ్యికి పైగా ప్రాణాలు తీసినపుడు, మరో 250మందిని నిర్బంధించినపుడు మేము అన్నపూర్ణ ట్రెక్‌లో ఉన్నాం. వెంటనే ఇజ్రాయెల్ స్పందించి గాజా ప్రాంతంలో అపారమైన సైనిక బలాన్ని నియోగించి, టెర్రరిస్టులని హతమార్చి, బందీలను విడిపించే చర్యలు చేపట్టింది. ఆ ప్రక్రియలో ఎంతోమంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది దాన్ని ఊచకోతగా అభివర్ణించారు.
ఈ మనస్లు ట్రెక్ సమయంలో, అమెరికా చొరవతో ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య హింసాకాండ విరమణకు అంగీకారం కుదిరింది. రాజ్, మేరీలు ఆ వార్తను ఎంతో ఆనందంగా మాతో పంచుకున్నారు. మేమూ వాళ్ళ సంబరంలో పాలుపంచుకున్నాం. కానీ నాలుగు నెలలు తిరిగేలోగా, నేను ఇపుడు ఈ యాత్రావివరాలు రాస్తున్నపుడు, ఆనాటి సంబరం క్షణికమేనని తేలుతోంది.
మా ఎడతెగని అవరోహణకు అంతం లేదా అనిపిస్తున్నపుడు, సాయంత్రం నాలుగు గంటల వేళ అందరం లార్కే ఫేడి అన్న గ్రామం చేరుకున్నాం. ధర్మశాల తర్వాత మాకు తటస్థపడిన మొట్టమొదటి జనావాసమది. ఊళ్ళో ఉన్న టీ హౌస్‌లో అక్కడ దొరికిన మితాహారంతో లంచ్ ముంగించాం. లార్కే కనుమ దాటి వచ్చే ప్రతివారూ తప్పక ఆగే ప్రదేశమది. అందరం మనాంగ్ జిల్లాలోని అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా చేరుకున్నామన్నమాట.లార్కేఫేడీ వదిలి పోఖర్ గ్లేషియర్ మీదుగా భీమ్‌థాంగ్ చేరుకునేసరికి ఏడున్నర అయింది. చీకటి పడిపోయింది. భీమ్‌థాంగ్ చేరామూ అంటే 5160 మీటర్ల లార్కే కనుమనుంచి 1440 మీటర్లు దిగి వచ్చి 3720 మీటర్ల ఎత్తున ఉన్న గ్రామం చేరడమన్నమాట. ఒక్కరోజులో అంత దిగువకు చేరడమన్నది ఎంతో అరుదుగా జరిగే పని.
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజంతా సత్సంఘటనల సమాహారం. వాతావరణం అద్భుతంగా అనుకూలించడం, వానా మంచూ సంగతి అటుంచి రోజంతా ఎండ కాయడం – ఆశించలేనంత అనుకూలత సమకూడిన రోజు అది. ఏ ఒక్క అంశం ఏ కాస్త బెడిసినా మా ఇబ్బందులు ఇబ్బడిముబ్బడి అయేవి. ఒకవేళ వాతావరణం విషమించి కనుమ చేరడానికి అనుమతి లభించని పక్షంలో మేమంతా దేవుడా అంటూ వెనక్కి మళ్ళి మాఛాఖోలా చేరుకోవలసి వచ్చేది. ఏదో అంటారు గదా – సంకల్పబలం ఉంటే విశ్వం యావత్తూ మనకు సహకరించే ‘పన్నాగం’ పన్నుతుంది అని- సరిగ్గా అదే జరిగింది ఆ రోజు!
ఉదయం నాలుగింటికి బయల్దేరిన వాళ్ళం సాయంత్రం ఏడున్నరకు భీమ్‌థాంగ్ చేరాం. అంటే అంతా కలసి పదిహేనున్నర గంటలు కాలిబాట మీద గడిపామన్నమాట! ఒక్క రోజులో అన్ని గంటలు ట్రెకింగ్‌లో గడపటం అన్నది అత్యంత అరుదైన విషయం. మొత్తం బృందమంతా ఏ చిన్న అవరోధమూ లేకుండా విజయవంతంగా లార్కే కనుమను అధిగమించినందుకు బృందపు నాయకునిగా నాకు అపారమైన సంతోషం కలిగింది. కించిత్ గర్వమూ తప్పలేదు.
మా యాత్రలో మరో రెండు రోజులే మిగిలాయి. ఒక రోజు తిలిజె వరకూ 20 కిలోమీటర్ల నడక. ఆఖరి రోజున ఖాట్మండూవరకూ రోజంతా 210 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం. ఈ ఆఖరి ఘట్టంలో ఒక ఊహాతీతమైన ప్రతిపాదన నిగూఢంగా రూపు దిద్దుకుంది. “ప్రయాణం మొదలెట్టి పదమూడు రోజులు. ట్రెక్ ఆరంభించి పన్నెండు. మనం అనుకున్న అన్ని లక్ష్యాలూ ఇప్పటికే విజయవంతంగా సాధించాం. మరో రెండు రోజులపాటు నడక, రోడ్డు ప్రయాణం ఎందుకూ? తిన్నగా హెలికాప్టర్లో ఖాట్మండూ వెళిపోదాం,” అన్నది ఒక సభ్యుని మనసులో మెదిలిన ఆలోచన. మరికొంతమంది సభ్యులకు కూడా అది ఆసక్తి కలిగించింది. అప్పటికే అలసి సొలసి ఉన్నవాళ్ళు అటువేపు మొగ్గడం ఆరంభమయింది. నాకీ విషయం తెలిసేలోగానే వాళ్ళు ఖాట్మండూలోని సూర్యతో మాట్లాడడం, ‘హెలికాప్టర్ ఏర్పాటు చెయ్యడం సాధ్యమే,’ అని సూర్య నిర్ధారించడం జరిగిపోయాయి!
అప్పటికే కొంతమంది హెలికాప్టరు ప్రతిపాదనకు తమతమ అంగీకారాలు తెలిపేసారు. మరికొంతమందిని మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఒకరిద్దరు తటపటాయింపుల్లో ఉన్నారు. ఏది ఏమైనా అంగీకారమే తప్ప ఎలాంటి వ్యతిరేకతా లేని సమయంలో ఆ ప్రతిపాదన నా ముందుకు వచ్చింది.
“మంచిది. కానీ మన రేపటి నడక హిమాలయాల్లోని చిక్కని పచ్చని అడవులగుండా సాగనుందని విన్నాను. బహుశా అది మరో చక్కని అనుభూతికి కారణమవనుంది. మీలో ఎవరైనా ఘట్టిగా హెలికాప్టర్లో వెళ్లదలచుకుంటే నేను ఆపను. అభ్యంతరపెట్టను. నేను మాత్రం మన పూర్వప్రణాళిక ప్రకారం నడచుకొంటాను,” అని స్పష్టీకరించాను. నా మాటల్లోని మృదుదృఢసమంజసత వారిని తాకింది. వెంటనే అందరూ మనసు మార్చుకున్నారు. హెలికాప్టరు ప్రతిపాదన నేలమీదనే నిలచిపోయింది. ఈ సమయంలో బృందాన్ని రెండుగా చీల్చడం సరైన ఆలోచన కాదు అని వారికి కూడా అనిపించింది.
భీమ్‌థాంగ్‌కు చేరువలో ఉన్న పోంకోర్ సరోవరం అక్కడ ఉన్న మరో చక్కని ఆకర్షణ. పోంకోర్ హిమనదిలోంచి పుట్టిన సరోవరమది. వెళ్ళి వద్దామా అనిపించింది. వివరాల్లోకి వెళితే అందుకు ఒక పూటంతా పడుతుందని అర్థమైంది. ముందున్న ఆనాటి 20 కిలోమీటర్ల నడక వద్దని హితవు చెప్పింది.
అక్టోబర్ 15 ఉదయాన అందరం తీరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేసి తొమ్మిదింటికి ట్రెక్ ఆరంభించాం. భీమ్‌థాంగ్ దాటగానే ఎటు చూసినా పచ్చిక నిండిన బయలు ప్రదేశం. అక్కడక్కడ తుప్పలు. ఒక తుప్పలోంచి బాబు కొన్ని ఆకులు కోసి వాటిని చేతుల మధ్య నులిమాడు. చక్కని పరిమళం. దాన్ని సున్పాతి మొక్క అంటారనీ, అది హిమాలయాల్లోనే పెరుగుతుందనీ, దాని ఆకులూ పువ్వులనుంచి బౌద్ధమందిరాలలోనూ ఇళ్లలోనూ వాడే సాంబ్రాణిలాంటి ద్రవ్యం వెలికి తీస్తారనీ బాబు వివరించాడు. ఆ మొక్కకు వైద్యపరంగానూ ప్రాముఖ్యత ఉందట. ముందే చెప్పుకున్నట్టు చైనా, టిబెట్ ప్రాంతాలలోని దేశీవైద్యాలకూ, మన దేశపు ఆయుర్వేద వైద్యానికీ ఉపకరించే ఎన్నో మొక్కలకూ మూలికలకూ హిమాలయాలు పుట్టినిళ్ళు.
మా నడక దారి మెల్లగా దిగువకేసి సాగి దూధ్‌ఖోలా నదీతీరం చేరింది. పాలధారల్లాంటి నీళ్ళు గలగలా సాగిపోతున్న దృశ్యం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. ఈ దూధ్‌ఖోలా అన్నది అక్కడి లోయలకు వెన్నెముక అయిన మర్శియాంగ్దీకి ఉపనది. దారి పొడవునా 7000 మీటర్ల హిమల్ ఛులీ పర్వతం, దాని గొగ్గురు శిఖరాలు మాకు తోడుగా వచ్చాయి. మరో పక్క మనస్లు బృహత్పర్వతం కనిపించి పలకరించింది. శ్యాలా, సోనాగావ్‌లలో ఇంతకు ముందు కనిపించిన దానికి భిన్నమైన కోణంలో కనిపించిన ఆ పర్వత రాజాన్ని చూసి అందరం మహా ముచ్చట పడ్డాం. మనస్లు పర్వతంతోపాటు దాని జంటపర్వతం మనస్లు నార్త్ కూడా మా చూపుకు అందింది.దూధ్‌ఖోలా నది మీది ఒక చెక్క వంతెన దాటి ఉదయపుటెండలో మిలమిలలాడుతున్న దట్టమైన అడవిలోకి అడుగుపెట్టాం. నిడుపాటి పైన్, ఓక్, రోడోడెండ్రాన్, భూర్జవృక్షాలతో నిండిన ఆ అడవిలోని అందమైన కాలిబాటలలో నడవడం మా మనసుల్ని ఆనందంతో నింపింది. పచ్చని ఆకులలోనుంచి చొచ్చుకుని వస్తోన్న ఉదయపుటెండ – ఎమరాల్డ్ గొడుగుల నీడన నడుస్తోన్న అనుభూతి కలిగించింది. మంచు నిండిన శిఖరాలు, నీలిరంగు ఆకాశం, అపుడపుడు ఆకుల నడుమన ఉన్న ఖాళీల్లోంచి తొంగి చూసి పలకరించసాగాయి. ఆ సందర్భానికి సరితూగేలా దూధ్‌ఖోలా మంద్ర ప్రవాహఝరి సున్నితమైన నేపథ్య సంగీతం అందించసాగింది. పదిమందిలో ఉన్నా ఏకాంతభావన కలిగించగల సమయసందర్భాలవి. హిమాలయాలు మాత్రమే అందించగల నిశ్శబ్దధ్యాన సంగీతమది…
సహజంగానే ఆ నడక చిన్నప్పట్నించీ రామాయణం, మహాభారతంలాంటి ఇతిహాసాల్లో చదువుతూ వచ్చిన, మనసులో ముద్రించుకుపోయిన అటవీసౌందర్యాల వివరాలను జ్ఞప్తికి తెచ్చింది. కాళిదాసు రాసిన కుమారసంభవం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలంలాంటి కావ్యాలు కూడా మేమంటే మేమంటూ మనోయవనిక మీద కదలాడసాగాయి… ఆ కాలపు ఋషులూ, యోగులూ నెలకొల్పి నడపిన ఆశ్రమ వాటికల్లో తిరుగాడుతోన్న భావన కలిగింది. వారంతా ఆ పరిసరాల్లో ఇంకా ధ్యానంలో మునిగి ఉన్నారన్న ఆలోచన మనసును ఆవహించింది. మన పురాణాల్లో ఈ పర్వతాలనూ అడవులనూ శాంతికీ, సౌందర్యానికీ, ప్రశాంతతకూ ప్రతీకలుగా ఎందుకు చిత్రించారో ఆ క్షణాన బోధపడింది. దేవతలు నివసించే ప్రదేశం, స్వర్గలోకపు దేవకన్యలు విహరించే సీమ అంటూ హిమాలయాలను ఎందుకు అభివర్ణిస్తారో అర్థమయింది. హిమాలయాలంటే నా మనసులో చిన్నప్పట్నించీ గూడుకట్టుకుని ఉన్న ఊహాచిత్రాలన్నీ ఒక్కసారిగా ప్రాణం పోసుకుని కళ్ళ ముందు నిలచిన భావన కలిగింది. ఎవరెస్ట్ ట్రెక్‌లోనూ, అన్నపూర్ణ ట్రెక్‌లోనూ అచ్చెరువు కలిగించే సుందరమైన అరణ్యాలను చూడకపోలేదు – కానీ ఈ మనస్లు అరణ్యం మాటలకందని మనోజ్ఞసీమ. అసలే అందమైన అడవి – ఉదయపు సమయం, సరితూగే వాతావరణం, కనుమను సంతృప్తికరంగా దాటి వచ్చిన సంబరం, ఇవన్నీ కలసి మనసును శృతి చేసి, ఆ అందాలను ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆవాహన చేసుకొనే అవకాశం నాకు కలిగించాయనుకొంటాను.దారిలో సబీనా అన్న నేపాలీ యువతి కనిపించింది. ఏదో వలంటరీ సంస్థలో ఉపాధ్యాయినిగా పని చేస్తోందట. మరో ముగ్గురు స్నేహితులతో కలసి వచ్చిందట – ఈమె వేగాన్ని అందుకోలేక వాళ్ళు వెనకబడ్డారట. మా గైడ్లూ, పోర్టర్లూ, స్థానికులూ కాకుండా మా ట్రెక్‌లో నేను పలకరించి మాట్లాడుతోన్న మొట్టమొదటి నేపాలీ యాత్రికురాలు ఈ సబీనా అని స్ఫురించింది. తమ జెన్-జి తరంలో ఇపుడు ట్రెకింగ్ బాగా ప్రాచుర్యం పొందుతోందని చెప్పిందామె. కానీ విదేశీయులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించిన ట్రెకింగ్ ఫీజులూ, పర్వతారోహణ రుసుములూ సాధారణ నేపాలీలకు అందుబాటులో ఉండటం లేదని వాపోయింది. మంచినీళ్ళూ, ఇతర ప్రాధమిక నిత్యావసర వస్తువులు కూడా ఎంతో ఖరీదుగా ఉండటం తమను ఈ ట్రిప్‌లో బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పింది. ఆమె మాటలూ వ్యథా విన్నపుడు భారతదేశంలో ఈ విషయాన్ని అతి సులువుగా పరిష్కరించడం గుర్తుకు వచ్చింది. విదేశీయులకు 500 రూపాయల ప్రవేశ రుసుము ఉన్నచోట భారతీయులకు 50 మాత్రమే వసూలు చేసే ఆ పద్ధతి అప్పట్లో అన్యాయమనిపించినా, ఇపుడు ఈ సబీనా చెప్పింది విన్నాక సహేతుకమే అనిపించింది.
కాసేపట్లో మా మాటలు నేపాల్లో ఆ మధ్యే సంభవించిన జెన్-జీ విప్లవం, ప్రభుత్వపతనం వేపు మళ్ళాయి. నవయుగాల బాటలో నేపాల్ దేశాన్ని నడిపించడానికి నవతరం నాయకుల అవసరం ఎంతైనా ఉందని సబీనా అభిప్రాయపడింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, నిరుద్యోగంలాంటి సమస్యలు దేశాన్ని విప్లవమార్గం పట్టించాయంది. వ్యవస్థమీద సామాన్యప్రజానీకంలో ఎన్నాళ్ళుగానో గూడు కట్టుకుని ఉన్న నిరసన ఒక్కసారిగా పెల్లుబికి విప్లవమార్గం పట్టి విజయం సాధించినా పాత తరం నాయకులు తిరిగి అధికారం చేజిక్కించుకొనే ప్రమాదం ఇంకా పొంచి ఉందని అభిప్రాయపడింది. ‘అలా ఎందుకు అనుకుంటున్నావూ,’ అని అడిగితే ‘జెన్-జీ నిరసనలూ, ఉద్యమాలూ పట్నాలూ నగరాల్లోనే జరిగాయి. అవి గ్రామాలూ మారుమూల ప్రదేశాలదాకా వ్యాపించలేదు. ఆ ప్రాంతాల్లో ఇంకా విప్లవంమీద అపనమ్మకం మిగిలి ఉంది. అదీ అసలు సమస్య,’ అని వివరించింది.
సాగిన మా నడక మమ్మల్ని సుర్కే గ్రామం చేర్చింది. ఆ ఊళ్ళోని సెవన్ సిస్టర్స్ రెస్టారెంట్లో దాల్‌భాత్‌తోపాటు దోరగా వేయించిన పాలకూర కూడా వడ్డించారు. అక్కడి తోటలో పెంచినదట – ఎరువుల జాడ ఎరుగనిది. ఆ పాలకూరను ఇండియానుంచి తెచ్చిన కరివేపాకు పొడితోబాటు అన్నంలో కలుపుకుని తింటే రుచి అమోఘం. ‘ఈ పాలకూరే నా ఆరోగ్య రహస్యం,’ అని వెల్లడించాడు బాబు. “ఆరోగ్యమే కాదు, అది ఆయన నిత్యయవ్వనరహస్యం కూడా,” అని చమత్కరించాడు రేషమ్.
సుర్కే గ్రామంలో మాతోపాటు కొద్ది రోజులుగా కలసి వస్తోన్న ఇజ్రాయెల్ కుటుంబం వాళ్ళు మరోసారి తటస్థపడ్డారు. వాళ్ళు ఆ రాత్రి సుర్కేలో ఉండిపోతున్నారట. అంటే వాళ్ళను కలవడం అదే ఆఖరుసారి అన్నమాట. జాతులూ, భాషలూ, దేశాలూ, నేపథ్యాలూ వేరయినా గత కొద్ది రోజులుగా వాళ్ళు మాతో బాగా కలసిపోయారు. వారివీ మావీ ఉమ్మడి సంవేదనలన్న ఎరుక కలిగాక మానసికంగా చేరువ అవడం క్షణాల్లో జరిగిపోయింది. ఆత్మీయత ఇరుపక్షాలలో పండింది. ఎక్కడి ఏ ప్రాంతపు మనుషులయినా బయటి పొరలు తొలగించి మనసుల్లోకి తొంగి చూస్తే అందరి స్పందనలూ, సంవేదనలూ ఒకే రకంగా ఉంటాయి అన్న నా ఆలోచనకు సజీవసాక్ష్యంగా నిలచిందా కుటుంబం. భారమైన మనసులతో మా అడ్రసులూ ఫోన్ నెంబర్లూ ఇచ్చి పుచ్చుకున్నాం. ఇళ్ళకు చేరేక ఫోటోలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాం. ఏ ఆశలూ, ఏ ముసుగులూ లేని ఇలాంటి పరిచయాలకు చిరకాలం నిలబడే శక్తి ఉంటుంది.
లంచ్ ముగిసాక తిరిగి నడక మొదలెట్టేసరికి సాయంకాలపు జాడలు అలుముకోసాగాయి. అంటే ఆనాటి మా ట్రెక్ ముగించడానికి మరికాస్త సమయమే మిగిలి ఉందన్నమాట. కాసేపు బాబుతో కలసి అడుగులు వేసాను. అతనంటే నాకు గొప్ప గౌరవం ఉంది. అభిమానం ఉంది. మేము చేసిన మూడు హిమాలయాల ట్రెక్కుల్లోనూ అతను నిర్వహించిన పాత్ర అద్వితీయం. వృత్తిని మించిన నిబద్ధతకల మనిషి. అతని పూనికే లేనట్టయితే మా ట్రెక్‌లు ఇంత విజయవంతంగా సాగి ఉండేవి కాదు. అతని ఉనికే మా అందరిలోనూ నమ్మకాన్నీ విశ్వాసాన్నీ నింపి వదలడం నేను చూసాను. అతని సహచరులూ, పోర్టర్లూ ఎంతో సహజంగా అతణ్ణి గౌరవించడం, అతని మాట వినడం గమనించాం. చక్కని నాయకత్వ లక్షణాలున్న మనిషి అతను. స్వతహాగా అతనిలో ఉన్న నమ్రత ఎవరినైనా ఆకట్టుకుని సహకరించేలా చేస్తుంది.
ఇన్ని మంచి లక్షణాలున్న బాబు గురుంగ్ ఎంతో మితభాషి. ఇంకా చెప్పాలంటే కాస్తంత సిగ్గరి. మూడుసార్లు అతనితో కలసి వారాల తరబడి ట్రెక్‌లు చేసినా మా సంపర్కం వృత్తిబాధ్యతల పరిధిలోనే ఉండిపోయింది. మనసులు విప్పి మాట్లాడుకోవడం జరగలేదు. ఈ మనస్లు ట్రెక్‌లో చివరి రోజున ఇద్దరం మనసులు విప్పాం. మాటలు పంచుకున్నాం. ఐదుగురు తోబుట్టువులున్న కుటుంబంలో ఇతను రెండవవాడు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు – ఒక తమ్ముడు. అక్క భర్త, రిటైరైన నేపాల్ ఆర్మీ ఆఫీసర్. వాళ్ళు ఖాట్మండూలో వుంటారట. చెల్లెళ్ళిద్దరూ స్వంత ఊళ్లోనే ఉంటున్నారట. ఒక బావమరది దుబాయ్‌లో పని చేస్తున్నాడు. రెండో అతను ఖాట్మండూలో… తమ్ముడు ఖతార్ నివాసి.గ్రామంలో తన స్కూలు విద్య ముగిశాక పై చదువులకోసం ఖాట్మండూ వెళ్లానని చెప్పాడు బాబు. వెళ్ళాడేగానీ ఆర్థిక కారణాలవల్ల ఆ పై చదువు ముగించలేకపోయాడు. హిమాలయాల ట్రెకింగ్ బృందాలకు పోర్టర్‌గా కుదురుకున్నాడు. అలా రెండేళ్ళు గడిచాక ఖాట్మండూలో 45 రోజుల శిక్షణ పొంది సర్టిఫైడ్ గైడ్‌గా రూపొందాడు. ఆ పని చేపట్టి పదిహేనేళ్ళయిందట.
ఈ ట్రెకింగ్ గైడ్‌గా వ్యవహరించదమన్నది ఋతువుల మీద ఆధారపడిన వ్యవహారమని చెప్పుకొచ్చాడు బాబు గురుంగ్. వసంతకాలం, ఆకురాలు కాలాల్లోనే చేతినిండా పని ఉంటుందట. కొంతమంది సాహసికులు నడి శీతాకాలంలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన ట్రెకింగ్‌ల కోసం వస్తూ ఉంటారట కానీ వారి సంఖ్య బాగా తక్కువ. మొత్తం మీద సగటున ఏడాదికి పది ట్రెక్‌లకు గైడ్‌గా వెళుతూ ఉంటాడట. అందులో ఈబీసీ, ఏసీటీ ముఖ్యమైనవి.
సగటున అతనికి ఏడాదిలో నాలుగయిదు నెలలు ఏ పనీ ఉండదట. అలా అని ఆ సమయమంతా రికామీగా గడిపే మనిషి కాదు గురుంగ్; ఖాట్మండూలో కొత్త కొత్త భాషలు నేర్చుకుంటూ ఉంటాడట. నేపాలీ, హిందీ, ఇంగ్లీషులతోపాటు మాండ్రెన్, ఫ్రెంచ్ కూడా ధారాళంగా మాట్లాడగలడు. అలాగే కొత్త కొత్త ట్రెక్ మార్గాల రూపకల్పనలోనూ సమయం గడుపుతాడట – కాంచన జుంగా మార్గం అలా అతని ట్రెక్‌ల పొదిలో వచ్చి చేరినదేనట. తనకు చరిత్ర, భూగోళశాస్త్రాలంటే చాలా ఆసక్తి అని చెప్పాడు బాబు. పర్వతాల విషయంలోనూ, స్థానిక చరిత్ర, పురాణాలు, ఐతిహ్యాల విషయంలోనూ గట్టి పట్టు ఉన్న మనిషి అతను.
వీటన్నిటితోపాటు తనకున్న విరామసమయంలో స్వగ్రామానికి వెళ్ళి తలిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడళ్లకు పనీపాటలలో చేయూతనందిస్తూ ఉంటాడట. తన తోబుట్టువులందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లాపాపలతో వర్ధిల్లుతుంటే ఇతను మాత్రం పెళ్లి చేసుకోలేదు. బంధువులు స్నేహితులే తన కుటుంబం అంటాడు. స్వంత ఊళ్ళో కూరగాయలు పెంచడం తనకు ఇష్టమైన పని అంటాడు.
ఈ పనులతోబాటు ఊళ్ళోని కుర్రకారును చేరదీసి, శిక్షణ ఇచ్చి, ట్రెకింగ్ కార్యక్రమాల్లో పోర్టర్లుగా చేర్చడం బాబుకు ఇష్టమైన పని. ఎవరెస్ట్ బేస్ కాంప్‌లాంటి దూరప్రదేశాలలోని ట్రెక్‌లకు కూడా సోలు ఖుంబు జిల్లానుంచి షెర్పా పోర్టర్లను తీసుకు వెళుతూ ఉంటాడు.
తన తోబుట్టువులంతా తమతమ పిల్లలతోనూ కుటుంబాలతోనూ సతమతమవుతూ ఉంటారుగాబట్టి తమ తల్లిదండ్రుల బాగోగులు తానే చూసుకుంటూ ఉంటానని బాబు చెప్పాడు. తనకు అంతా కలసి ఎనిమిదిమంది అక్కాచెల్లెళ్ల పిల్లలూ, అన్నదమ్ముల పిల్లలూ ఉన్నారనీ, వాళ్ళందరితో గడపటం తనకు ఇష్టమైన పని అనీ చెప్పుకొచ్చాడు. వాళ్ళ చదువుసంధ్యల్లో కూడా చేయూత ఇస్తూ ఉంటాడట. ఇహ రేషమ్ విషయానికి వస్తే, అతను బాబుకు కజిన్. అన్ని ట్రెకింగ్ కార్యక్రమాల్లోనూ బాబుతోపాటు ఉండే మనిషి.
సూర్యతో తనకు పదిహేనేళ్ళ వృత్తిపరమైన అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు బాబు. పేరుకు ఫ్రీలాన్సర్నే అయినా సూర్య వాళ్ళ హిమాలయన్ ఎడ్వెంచర్స్ సంస్థ నిర్వహించే అన్ని పెద్ద ట్రెకింగ్ కార్యక్రమాల్లోనూ తాను పాలుపంచుకుంటానని చెప్పాడు.సుర్కే-తిలిజె గ్రామాల నడుమన ఉన్న కాస్తంత దూరమూ అక్కడక్కడ ఎత్తులు ఎక్కవలసి వచ్చినా, స్థూలంగా దిగుడుదారి. సరళమైన నడక. మరో గంట గడిచాక దారిలోని గొవాగావ్ అన్న గ్రామం చేరాం. ఎన్నుకున్న మార్గాన్ని దాదాపు అధిగమించేసామన్న భావన మాలో కొత్త ఉత్సాహం నింపింది. అడుగులు వేగవంతం అయ్యాయి. గంట గడిచేలోగా తిలిజె గ్రామం చేరిపోయాం. మా అంతిమగమ్యం చేరుకున్నామన్నమాట. అక్కడ దూధ్‌ఖోలా నది మీద ఉన్న వంతెన దాటడంతో మా ట్రెక్ లాంఛనప్రాయంగా ముగిసింది. మాఛా ఖోలా – తిలిజె అన్నది ఒక సంపూర్ణమైన ట్రెక్ మార్గం. మినహాయింపు అన్నది లేకుండా ఆ మార్గం మొత్తాన్ని మేము మా కాళ్లతో కొలిచాం. మనసుతో నడిచాం. అడ్డదారులు తొక్కలేదు. షార్ట్‌కట్‌లకు పాల్పడలేదు. గొప్ప సంతోషం. అందరమూ అక్కడ ఉన్న ఓ చిన్న టీ దుకాణంలో చేరి సంబరం చేసుకున్నాం.
ముందే అనుకున్నట్టు ఆ రోజంతా హాయిగా గడిచింది. 20 కిలోమీటర్లు నడిచినా ఎక్కడా శ్రమ అనిపించలేదు. పైగా ఎంతో అరుదైన, అందమైన పచ్చల రాశిలాంటి అరణ్యమార్గంలో విహరించాం. ఆనాటి నడక ముగిసాక అందరూ ‘అవునవును, హెలికాప్టర్లో వెళ్ళకపోవడం మంచిదయింది. వెళ్ళి ఉంటే ఎంతో కోల్పోయేవాళ్ళం,‘ అన్నారు. ‘హెలికాప్టర్ విషయంలో మరీ భీష్మించానా,’ అంటూ అప్పటిదాకా మనసులో లీలగా మెదులుతోన్న అనుమానం వారి మాటలవల్ల పూర్తిగా తీరిపోయింది. “మనం హెలికాప్టర్ మార్గం ఎన్నుకొని ఉంటే అది నిజానికి ఆ తర్వాత మన మనసుల్ని కాస్తంత మెలి పెడుతూనే ఉండేది. ‘ట్రెక్ మార్గాన్ని సంపూర్ణంగా అధిగమించలేదు. తోడు వచ్చిన పర్వతాలకు సరైన వీడ్కోలు పలకలేదు,’ అన్న భావన మనసులో వెలితికి కారణమయ్యేది. ఇవాళ ఇలా నడచి ఎంతో మంచి పని చేసాం,” అని ముక్తాయించాడు సురేష్.చీకటి ముసిరే వేళ అందరం జీపుల్లో ఆనాటి మా నివాసస్థలం ధారాపానీకేసి సాగిపోయాం. ఎంతో సన్నటి మార్గం. ఎత్తైన కొండల చరియల్ని తొలిచి నిర్మించిన మార్గం. ఆ రోడ్డు మీద ఒక్క జీపు పట్టడమే కనాకష్టం. అదృష్టవశాత్తూ అప్పటికే చీకటి పడిపోయింది. ఆ రోడ్డు, రోడ్డు పక్క ఉన్న లోతైన లోయలు – వాటిల్ని పగటిపూట చూసి ఉంటే మేమంతా జీపులు ఎక్కడానికి ఎంతో కొంత సంకోచించి ఉండేవాళ్ళం. రెండేళ్ల క్రితం అన్నపూర్ణ ట్రెక్‌లో ఇలాగే ఒక చోట బిక్కుబిక్కుమంటూ చేతివేళ్ళ గోళ్లను ఫలహారంగా చేస్తూ జీపులో వెళ్ళడం గుర్తొచ్చింది. మొత్తానికి అందరం క్షేమంగా ధారాపానీ చేరుకున్నాం. టైము చూస్తే రాత్రి తొమ్మిది! గబగబా భోజనాలు చేసి పడకల మీద పడిపోయాం – అలసట, ఆనందం, సంతృప్తి, నిద్రా…
మర్నాటి ఉదయం ఓ కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేసాం.
గైడ్లనూ పోర్టర్లనూ పేరుపేరునా పిలచి మా సంతోషంకొద్దీ పారితోషికాలు అందించాం. వారందరి సహాయసహకారాలు లేని పక్షంలో ఇలాంటి ట్రెక్‌లు మాకు సాధ్యమయేవి కాదన్న విషయం నొక్కి చెప్పాం. మా బృందం తరఫున నేను బాబు, రేషమ్, సామిలకు వాళ్ళు అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు చెప్పాను. అలాగే మా బరువులన్నీ మోసిన బుధి, రాజన్, చంద్ర, సుదీప్, ప్రతీక్, గోకుల్, ఉత్సవ్, క్రిష్ణలకు పేరుపేరునా ధన్యవాదాలు పలికాను. కార్యక్రమమంతటికీ కీలక సూత్రధారి ఏజెంట్ సూర్యశ్రేష్ఠను తలచుకోవడం మరచిపోలేదు. ఈ పన్నెండు పదమూడు రోజులూ మీరంతా మా కుటుంబంలోని సభ్యులైపోయారన్న విషయం నొక్కి వక్కాణించాను.అన్నట్టు, మేము చేరుకుని రాత్రి గడిపిన ధారాపానీ గ్రామం 2023 నాటి మా అన్నపూర్ణ ట్రెక్‌కు ఆరంభబిందువు. ఉదయాన్నే అందరం ఖాట్మండూకేసి రోడ్డు ప్రయాణం ఆరంభించాం. ప్రయాణంలోని మొదటి చరణం మర్శియాంగ్దీ నదీతీరాన సాగింది. అన్నపూర్ణ ట్రెక్ రోజుల్లోకూడా ఇదే నది రోజుల తరబడి మాతోపాటు నడిచింది. సాహచర్యం అందించింది.
ఆ కొండదారి ఏమంత సౌకర్యవంతమైనది కాదు. అయినా అనుభవజ్ఞులైన మా డ్రైవర్ల చేతిలో మేమెక్కిన మూడు లాండ్ క్రూజర్లూ చులాగ్గా సాగిపోయాయి. వాళ్ళకా దారులు కొట్టిన పిండి. ప్రతి మలుపూ వారికి కరతలామలకం. మాబోటి వాళ్ళకు అది నిజానికి వత్తిడి నింపే ప్రయాణమవ్వాలిగానీ అప్పటికే అలాంటి దారుల్లో ప్రయాణం చేసిన అనుభవం మా అందరికీ ఉండటం వల్ల ఏ ఆందోళనా లేకుండా, ప్రశాంతంగా రహదారి సౌందర్యాలను ఆస్వాదించాం.
కాసేపట్లో బేసిషహర్ పట్టణం చేరాం. కొండదారులు ముగిసి తారు బాటలు మొదలయ్యే కూడలి ప్రదేశమది. మరో రెండున్నర గంటల్లో పొఖారా-ఖాట్మండు హైవే పైకి ఎక్కాం. ఎక్కడ కొండ నడక, ఎక్కడ రాజమార్గం – నడుమ ఉన్నది కేవలం నాలుగయిదు గంటలు… మరో ఆరు గంటలు గడవగానే ఖాట్మండూ చేరుకున్నాం. అక్టోబర్ 3న ఖాట్మండు వదిలిన వాళ్ళం బాటలు దాటి, కొండలు ఎక్కి, కనుమలు చేరి, అడవులు నడిచి, పద్నాలుగు రోజుల తర్వాత, అక్టోబర్ 16 న ఏ రకమైన ఆరోగ్యసమస్యలూ ఎదుర్కోకుండా, ఎలాంటి ప్రమాదాలకూ గురి కాకుండా క్షేమంగా సంతోషంగా తిరిగి ఖాట్మండు చేరుకున్నామన్నమాట.
ధారాపానీ – ఖాట్మండు ప్రయాణంలో నా మనసంతా గత రెండు వారాల హిమాలయ స్మృతులతో నిండిపోయింది. మాఛాఖోలాలో భారీ లాండ్‌స్లైడ్ ప్రదేశాన్ని బాబు గురుంగ్ చొరవతో ఏ ప్రమాదమూ లేకుండా దాటడం, ఆ వెంటనే రోజంతా నిండు వానలో ఏ వెరపూ లేకుండా నడవడం, దారంతా పలకరిస్తూ వచ్చిన జలపాతాలు, కష్టపెట్టిన అధిరోహణలు, ఎదురొచ్చిన మరిన్ని భూపాతాలు, దాటిన ఉయ్యాల వంతెనలు, చేరుకున్న సెరాంగ్ బౌద్ధమఠం, అన్నీ కళ్ళముందు గిర్రున తిరిగాయి. ఆ మఠంలో ఒకరోజు గడడం, భిక్షువులతో సంపర్కాలు, ప్రార్థనాకార్యక్రమాల్లో పాల్గొనడం, హిమాలయాల అడవుల్లో తిరుగాడడం, పచ్చిక బయళ్ళు దాటుకుని వెళ్ళడం, జడల బర్రెలను వాటి వాటి విహార స్థలాల్లో చూడటం, అరుదుగా కనిపించే హిమాలయన్ ధార్, నీలిగొర్రెలు, మర్మోట్లు, కంచరగాడిదల బారులకు దారులివ్వడం, బుధిగండకి, దూధ్‌ఖోలా నదీతీరాలలో ఎడతెగని నడకలు – ఎన్నెన్ని జ్ఞాపకాలు… ఎన్నెన్ని జీవితంలో ఒక్కసారే సంభవించగల అనుభవాలు… అలాగే దారినిండా గ్రామాలే గ్రామాలు, టిబెటన్ గ్రామాలు – ఫిలిమ్, బిహి, ఘాప్, నమ్రుంగ్, శ్యాలా, ల్హో, సమాగావ్, సమ్ రో, భీమ్ థాంగ్, వాటితోపాటు అనేకానేక చిన్నాపెద్దా మఠాలు, మణికుడ్యాలు, కణిలు, స్వాగతద్వారాలు, ఫుంగ్యెన్, సమాగావ్ గొంపాలు… బీరేంద్ర తాల్‌కు ఉపయాత్రలు, హిమానీనదాలను దగ్గరనుంచి చూడటం, కొండొకచో వాటి మీద నడవడం, మనస్లు శిఖరంతో రోజుల తరబడి మైత్రి, శ్రింగి హిమల్, గణేశ్ హిమల్, లార్కే పీక్, హిమ్లంగ్ హిమల్, హిమల్ ఛులి, సమ్ దో పీక్‌లాంటి గగనకుసుమాల బాణీ హిమశిఖరాలతో కరచాలన దూరంలో నిలవడం… విభ్రమగొలిపే సూర్యోదయాలు, మనసును రాగరంజితం చేసే అరుణ సువర్ణ కిరణాలు… లార్కే పాస్ దాటడం, గుర్తుండిపోయే మనుషుల్ని కలవడం – లామ, పేమ, ఫుర్బు, ఇజ్రాయెల్ కుటుంబం, మా బృందం సభ్యులు, ఇతర బృందాల సహ-ట్రెకర్లు, గైడ్లు, పోర్టర్లు – రెండు వారాలే కావచ్చు: ఏమి జీవితం!!
ఎవరెస్ట్, అన్నపూర్ణ ట్రెక్‌లలో వారాల తరబడి గడిపాక కూడా మరో రెండు వారాలు మనస్లు ఒడిలో గడపాలన్న నిర్ణయానికి ఇదిగో – ఈ కొండలు, నదులు, అడవులు, గ్రామాలు, మఠాలు, మనుషులు… వాటి పిలుపులే, వారి తలపులే కారణమై ఉండాలి. ట్రెక్‌ల పరంగా ఇంతకు మించి ఆశించదగిన అనుభవాలు, అనుభూతులు లేవనే అనిపిస్తోంది. మనస్లు నా మనసును పూర్తిగా సంతృప్తిపరిచింది అనే అనిపిస్తోంది. అయినా ఏం చెప్పగలం? విపులాచ పృధ్వీ – తీరని దాహం… మళ్ళా ఎక్కడెక్కడి పర్వతాలనో వెతుక్కుంటూ వెళతానేమో!
హిమాలయాల్లో ఔత్సాహికులకు అందుబాటులో ఉండే ముఖ్యమైన మూడు ట్రెక్‌లూ చేసాక వాటిని పోల్చి చూడకుండా ఉండటం చాలా కష్టం. మూడు ట్రెక్‌లూ తమకే స్వంతమైన విలక్షణతలు కలిగినవే. వేటి ఆకర్షణ వాటిది. వీటికి రాంకులు ఇవ్వడమన్నది పూర్తిగా అసమంజసం. అయినా వీటిల్లోని పోలికలూ తేడాలూ చర్చించడం అవసరం.
శోభాపరంగా అన్నపూర్ణ, మనస్లు ఒకే కోవకు చెందినవి. భౌగోళిక వైవిధ్యత, సంస్కృతిపరమైన సాపత్యం, నదుల సాహచర్యం, అడవుల అనుభవాలు రెండింటిలోనూ సమానంగా ఉన్నాయి. కానీ అన్నపూర్ణ ట్రెక్‌లో హిమశిఖరాలు దూరాన నిలబడి పలకరిస్తాయి. మనస్లు యాత్రలో అవి మన దగ్గరకు వచ్చి మనలో భాగమవుతాయి. జంట శిఖరాల మనస్లు పర్వతమయితే వేరువేరు సమయాల్లో వేరు వేరు కోణాల్లో మనకు దగ్గరగా నిలబడి తన సంపూర్ణ స్వరూపాన్ని మనకు ప్రదర్శిస్తుంది.
ఎవరెస్ట్ యాత్రామార్గం సరళరేఖను అనుసరిస్తుంది. ఒక ఋజుమార్గంలో ముందుకు వెళ్ళి మళ్ళీ అదే మార్గంలో తిరిగి వస్తాం. అన్నపూర్ణ మనస్లుల విషయంలో అలా కాదు – అవి స్థూలంగా తిరగవేసిన గొడుగు ఆకృతిలో ఉండే మార్గాలు. ఆరంభబిందువు వేరు – ముగింపు బిందువు వేరు. మళ్ళా అన్నపూర్ణ మార్గానికీ, మనస్లు మార్గానికీ ధారాపానీ, బేసిషహార్ ఉమ్మడి బిందువులు. మా అన్నపూర్ణ ట్రెక్ ధారాపానీ దగ్గర మొదలయితే, మనస్లు అదే ధారాపానీ దగ్గర ముగిసింది.
ఈ మూడు ట్రెక్‌లలోనూ చివరికి చేరుకొనే ఎత్తులు దాదాపు సమానమే అయినా అక్కడికి చేరే ప్రక్రియలో తటస్థపడే నిమ్నోన్నతాలలో బాగా తేడా ఉంది. ఎవరెస్ట్ ట్రెక్ 3000 మీటర్ల దగ్గర మొదలవుతుంది. అయిదో రోజుకల్లా 4000 మీటర్లు చేరి మరో వారం రోజులపాటు అదే ఎత్తులో కొనసాగుతుంది. అన్నపూర్ణ, మనస్లుల విషయంలో ఆరంభబిందువులు 1000 మీటర్లకు చేరువలో ఉంటాయి. 4000 మీటర్లు చేరడానికి ఏడెనిమిది రోజులు పట్టేస్తుంది. చేరాక కూడా ఆ ఎత్తులో రెండు మూడు రోజులే ఉంటాం. స్థూలంగా చెప్పాలంటే ఎవరెస్ట్ ఉన్నతశ్రేణి పర్వతసీమలో సాగే యాత్ర. జనజీవనవైవిధ్యం తక్కువ. అన్నపూర్ణ మనస్లుల విషయంలో భిన్నమైన శ్రేణుల్లో నడవటంవల్ల రకరకాల ప్రకృతి మనకు స్వాగతం చెపుతుంది. వృక్షాలు నిండిన పచ్చని అడవులు, తర్వాత పచ్చిక బయళ్ళు, ఆ తర్వాత మంచు దారులు – ఇలా వైవిధ్యం ఎక్కువ.
ఈ మూడు ట్రెక్‌లలోనూ మనస్లు విసిరే సవాళ్ళు ఎక్కువ. ఎవరెస్ట్ విషయంలో ట్రెక్ ఆరంభంలోనూ, ట్రెక్ ముగిసాకా లుక్లా దాకా వెళ్ళి రావడానికి విమానసౌకర్యం ఉంది. అన్నపూర్ణ దగ్గరికొస్తే రోడ్లు బాగా లోపలికి చొచ్చుకుపోయి నడవవలసిన దూరాన్ని బాగా తగ్గిస్తున్నాయి. అలాగే అన్నపూర్ణ ట్రెక్ ముగిసాక జోమ్‌సోమ్‌నుంచి ఖాట్మండూ చేరడానికీ విమానసౌకర్యం ఉంది. మనస్లు విషయంలో రోడ్ల మీద వెళ్ళగలిగిన దూరం పరిమితం – నడక మాత్రమే సాధ్యమైన 140 కిలోమీటర్ల దారిలో సాగిపోవలసి ఉంటుంది. ఆ దారి అంతా మానవస్పర్శవల్ల ఇంకా ప్రభావితం కాని సీమ అవడంవల్ల కలుషితం కాని ప్రకృతి, అతి నాగరికం లేని మనుషులు, అరుదుగా కనిపించే జంతువులు – ఈ అంశాలన్నీ మన అనుభవాలకు మెరుగుదిద్దుతాయి, పెంపు చేస్తాయి.
ఈ మూడు యాత్రలలోనూ ఉన్న ఒక సామాన్య అంశం గురించి చెప్పుకోవాలి – అంతిమగమ్యం 5000 మీటర్లు దాటిన ఎత్తులో ఉండటం. ఎవరెస్ట్ బేస్ కాంప్ 5364 మీటర్లయితే అన్నపూర్ణ ట్రెక్‌లో థోరోంగ్ లా పాస్ 5416 మీటర్ల ఎత్తున ఉంది. మనస్లు సర్క్యూట్‌లో మనం చేరుకునే అత్యున్నత బిందువు 5106 మీటర్ల లార్కే పాస్.
ముఖ్యమైన మూడు యాత్రలనూ నాలుగేళ్ల వ్యవధిలో ముగించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. నేపాల్ దేశపు ఉన్నత హిమాలయ శ్రేణుల తూర్పుభాగంలో ఉన్న ఎవరెస్ట్ దగ్గర మొదలెట్టి, పడమర భాగంలోని అన్నపూర్ణ సర్క్యూట్‌లో కొనసాగి చివరికి నడుమన ఉన్న మనస్లు ట్రెక్‌లో మా ప్రయాణాలు ముగించాం. ఈ యాత్రల నేపథ్యంలో హిమాలయాల భౌగోళిక ఆత్మ నేపాల్ దేశంలో ఉన్నదని అర్థమయింది. ప్రపంచంలోని 8000 మీటర్ల ఎత్తును దాటిన 14 పర్వత శిఖరాలలో ఎనిమిది ఈ నేపాల్ భూభాగంలో ఉండటం సామాన్యమైన విషయం కాదు. వాటితోపాటు మరెన్నో ఉన్నత శిఖరాలు కూడా నేపాల్‌లో ఉన్నాయి. ఈబీసీ ఏసీటీ మనస్లులాంటి మూడు అతి ముఖ్యమైన ప్రాంతాలను కాలినడకన చూసి రావడం హిమాలయాలను ప్రేమించి ఆరాధించే ఏ మనిషికైనా ఎంతో సంతృప్తి కలిగించే విషయం.
వాతావరణం మాకు అన్నిసార్లూ ఎంతగానో అనుకూలించింది. వానలు పడినా, కొండచరియలు విరిగిపడి దారిని మూసివేసినా, హిమాలయాలు మామీద చూపిస్తోన్న అనురాగంవల్ల వాటిల్ని అవరోధాలుగా భావించకుండా ముందుకే సాగాం. లక్ష్యాలు చేరుకున్నాం. కొన్నికొన్నిచోట్ల క్లిష్టసమయాల్లో సాహసించి తీసుకున్న నిర్ణయాలు చివరికి పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చడం యాదృచ్ఛికం అనుకోను. పరీక్షలో నెగ్గిన ప్రతిసారీ ప్రకృతి మా మీద చిరునవ్వులు చిందించింది. వెచ్చని సూర్యకిరణాలు, నిర్మలమైన ఆకాశాలు, గలగలల సెలయేళ్లను మాకు తోడుగా పంపింది. సూర్యోదయ సూర్యాస్తమయాలనూ, విశాలమైన లోయల అపురూప దృశ్యాలనూ మాకు కానుకలుగా అందించింది.
మూడు ప్రయాణాలూ కలుపుకుంటే, ఒకటిని మించిన ప్రయాణాలలో పాల్గొన్న గోపి, అనిత, సింహంలాంటి వారిని డబుల్ కౌంటింగ్‌లోంచి తప్పించినా, దాదాపు అరవైమందిమి కలసి ట్రెక్ చేసాం. అందులో ఏ ఒక్కరూ గమ్యం చేరకుండా ఉండిపోలేదు. అనుభవాన్ని వెంటబెట్టుకుని వచ్చి విజయం సాధించిన వాళ్ళు కొందరయితే ఉత్సాహాన్నే మూలధాతువుగా చేసుకుని, భౌతికశక్తిగా మార్చుకుని, ఆత్మబలంతో అన్ని అవరోధాలూ దాటుకుని ట్రెక్‌లు ముగించిన ఫస్ట్ టైమర్స్ కొందరు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
నా జీవితంలో నాలుగేళ్ల సమయం మీద ఈ హిమాలయాల ట్రెక్‌లు ఆధిపత్యం చెలాయించాయి. వివరాల సేకరణ, ప్లానింగ్, రోజువారీ కార్యక్రమాల రూపకల్పన, బృందాలను ఏర్పరచడం, అందరూ శారీరకంగా సిద్ధమయేలా చూడడం, అవసరమైన పరికరాల కొనుగోలు, వాతావరణ సూచనలు సేకరించడం, ట్రెక్ బాటలో బృందమంతటితో కలసి అడుగుపెట్టడం – ఇవన్నీ అపురూపమైన, అమూల్యమైన అనుభవాలు. అప్పటివరకూ నా సాధారణ జీవితం నేర్పని ఎన్నో పాఠాలను ఈ ట్రెక్ నిర్వహణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో నేర్చుకోగలిగాను.
అంతర్గతస్థాయిలో ఈ ప్రయాణాలు నా మీద చూపించిన ప్రభావం వెలకట్టలేనిది. నా జీవితగమనాన్ని సరిదిద్దగల శక్తి ఉన్న అనుభవాలివి. ఈ ప్రయాణాలవల్ల ప్రకృతితో నాకున్న అనుబంధం మరింత పటిష్టమయింది. మనిషిగా నా బలాలూ పరిమితులూ మరికాస్త స్పష్టంగా తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకోడాన్ని నాలోకి ఇంకించుకుని మరికాస్త మెరుగైన వ్యక్తిగా పరిణమించగలనన్న ఆశాభావం నాలో ఉంది. కాలిబాటలలో ప్రశాంతంగా ఏకాంతంగా సాగిపోతోన్న సమయాల్లో చాలాసార్లు నాలోకి నేను తొంగిచూసుకునే ప్రయత్నం చేశాను. ఆత్మావలోకనానికీ ఆత్మవిమర్శకూ అవకాశం కలిగించిన సందర్భాలవి. అనేకమార్లు ఆ హిమాలయాలలోని దృశ్యాలనూ, మనుషులనీ, అనుభవాలనీ నా చిన్ననాటి జ్ఞాపకాలతో అప్రయత్నంగా అనుసంధించి మరోసారి మరోసారి బాల్యాన్ని దర్శించుకోగలిగాను… పసివాడిని కాగలిగాను.
నాతోపాటు ట్రెక్ చేసిన వాళ్ళలో చాలామంది పూర్వపరిచయం ఉన్నవాళ్ళు. కొంతమంది నాకు కొత్తవాళ్ళు. అందరూ తెలుగువాళ్లే అయినా అమెరికానుంచీ ఆస్ట్రేలియావరకూ విస్తరించి ఉన్నవాళ్ళు. ప్రతి ఒక్కరూ అపార జీవితానుభవాలు పొందినవాళ్ళు. అందరమూ మా ఉమ్మడి జ్ఞానాన్నీ అనుభవాన్నీ కలబోసి పంచుకున్నాం. తద్వారా లబ్ధి పొందాం. పరిచయాలు స్నేహాలయ్యాయి. పాత స్నేహాలు పునరుద్ధరించబడ్డాయి. హిమాలయాలలో ఏర్పడే మైత్రీబంధం చిరకాలం మన్నే నాణ్యతగలది. ఇతర బృందాల ట్రెకర్లతోనూ, మాతో వచ్చిన గైడ్లూ పోర్టర్లతోనూ, దారిలోని టీ హౌస్‌ల నిర్వాహకులతోనూ, గ్రామాల్లో తటస్థపడ్డ స్థానికులతోనూ గడిపిన క్షణాలకు విలువ కట్టడం సాధ్యమయే పని కాదు. ఎన్ని చిరునదులు సంగమిస్తే ‘మనిషి’ అన్న పెనుప్రవాహం ఏర్పడుతుందీ!!
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అనుభవాలు నన్ను వివశుడిని చేసాయి. పదే పదే మనసులో మెదులుతున్నాయి. వాటన్నిటినీ ఆపోశన పట్టడం, నాలోకి ఇంకించుకోవడం – భౌతికంగా హిమాలయాలను దాటి వచ్చి నెలలూ సంవత్సరాలూ గడచినా మానసికంగా మరింకెన్నాళ్ళో, ఎన్నేళ్ళో పట్టే ప్రక్రియ…
మూలరచయిత మలిపలుకులు
ఇరవై నెలలు ధారావాహికంగా ప్రచురించబడిన నా నేపాల్ యాత్రాత్రయం ముగింపుకు వస్తున్న సందర్భంగా ఈమాట సంపాదకబృందానికి – ముఖ్యంగా మాధవ్ మాచవరంగారికి ధన్యవాదాలు. వారి శ్రద్ధ, చేసిన మార్పులుచేర్పులు రచనకు వన్నె పెంచాయి. చిట్టచివర్లో శ్రీనివాస్ బందా ప్రమేయం రచనకు అదనపు నాణ్యత సమకూర్చింది.
ప్రచురించబడినంత కాలం తమ నిర్మాణాత్మక ప్రోత్సాహం అందించిన పాఠకవర్గానికి ప్రత్యేక అభినందనలు. హై ఆల్టిట్యూడ్ ట్రెక్‌లో ఆక్సిజన్ ఎంత అవసరమో ఒక రచయితకు పాఠకుల ఆమోదం కూడా అంతే అవసరం.
నా మూడు ప్రయాణాలకూ తెలుగురూపం ఇచ్చిన అమరేంద్ర కృషి అపురూపం. నాతో రాయించడంలోనూ, రాసిన దాన్ని మెరుగుపరచడంలోనూ ఆయన పాత్ర అమూల్యం. ఆయన తన అనువాదక్రమంలో నాతో జరిపిన చర్చలు నా ఆంగ్లమూలాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపకరించాయి. ఆయన చేసిన సూచనలు, విమర్శ నా మూలరచనను నెలనెలా మెరుగుపరచుకొనేలా చేసాయి. ఒక దశ దాటిన తర్వాత ఆయా ప్రయాణాలు చేసింది నేనొక్కడినే కాదనీ, అమరేంద్ర అజ్ఞాతంగా నాతోపాటు కలసి నడిచాడనీ అనిపించింది.
ఈ మూడు యాత్రలనూ త్వరలో తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ పుస్తకంగా తీసుకురావాలని నా ఆకాంక్ష. తద్వారా హిమాలయాలు నాకు అందించిన తాత్వికకాంతులనూ, నిశ్శబ్దసంగీతాలనూ మరింతమందికి పంచాలని నా కోరిక.
డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి.
1.7.2026
అనువాదకుని మలిపలుకులు
డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి తమ నేపాల్ హిమాలయాల యాత్రలు మొదలుపెట్టింది అక్టోబర్ 2022 లో. మూడవ యాత్ర ముగించింది అక్టోబర్ 2025 లో.
నవంబర్ 2024 లో నేను నా అనువాద సహయాత్ర మొదలెట్టాను. ఈ జూలై 2026 ఈమాట సంచికలో వస్తున్నది 20 వ ఎపిసోడ్. విడుపు లేకుండా ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అన్నపూర్ణ సర్క్యూట్, మనస్లు సర్క్యూట్‌లకు చెందిన యాత్రాకథానాలు ప్రచురించిన ఈమాటకు ధన్యవాదాలు.
ఈ మూడు ప్రదేశాలలో వేటికీ నేను ప్రత్యక్షంగా వెళ్లకపోయినా భారతదేశపు హిమాలయాలలో తగు మాత్రం ట్రెకింగ్ చేసిన అనుభవం నాకు ఉంది. అంచేత శేషగిరి ట్రెకింగ్ షూస్‌లో అడుగుపెట్టి ఆయనతోపాటు అనువాద సహయాత్ర చెయ్యడం నాకు సులభమయింది. సంతోషం, సంతృప్తి కలిగాయి.
మూడు ప్రయాణాల్లోనూ స్థూలంగా ఒకటే వస్తువు; రోజుల తరబడి కొండలు ఎక్కి దిగటం. ఎక్కిందే ఎక్కి, చెప్పిందే చెప్పి, వర్ణించిందే వర్ణించి పాఠకులను ఇబ్బంది పెడుతున్నామా అని కొన్నిసార్లు అనిపించకపోలేదు. అలాంటి అర్జునవిషాదయోగంలో పడ్డ ప్రతిసారీ దంతుర్తి శర్మలూ, శ్రీనివాస్‌లూ, రమేష్‌లూ ప్రోత్సాహకరమైన అభిప్రాయాలు ప్రకటించి మాలో ఉత్సాహం నింపారు. వారందరికీ ధన్యవాదాలు.
ఈమాట సంపాదకవర్గం గురించి ఎంత చెప్పినా తక్కువే – మాధవ్ మాచవరం, సుధామయి సత్తెనపల్లి, సురేశ్ కొలిచాల, శ్రీనివాస్ బందాల సలహాలూ, సవరణలూ, చేయూతలూ లేని పక్షంలో ఈ ఇరవై అధ్యాయాల ప్రచురణ ఇంత సంతృప్తికరంగా జరిగేది కాదు.
తెలుగువారికి అంతగా పరిచయం లేని ప్రదేశాలనూ, ట్రెకింగ్ ప్రక్రియనూ వివరంగా మానవీయస్పర్శతో దగ్గర చేయగలిగాననే అనుకుంటున్నాను.
అందరికీ మరోసారి ధన్యవాదాలు… నమస్కారాలు.
దాసరి అమరేంద్ర
1.7.2026












