కథ: ఉరి
రచన: విశ్వనాథ సత్యనారాయణ
కాలం: 1950.
కొంతమంది రచయితలని ఎంత విస్తృతంగా చదివినా, వారి రచనా శైలిని, సిగ్నేచర్ స్టైల్ని పట్టుకున్నామనుకునే లోపు ఏదో ఒక వినూత్న కోణంతో మనలను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. విశ్వనాధ అటువంటి రచయితలలో ఒకరు. వేయిపడగలు, పురాణవైరిగ్రంధమాల, హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు వంటి రచనలు చదివిన తర్వాత సహజంగా విశ్వనాధ రచనా సరళి/ శైలి తాలూకు రూపు గురించి ఒక అంచనా ఏర్పడుతుంది. అయితే 1950వ సంవత్సరంలో ఆనందవాణి పత్రికలో మొదటిసారిగా ప్రచురితమైన ఉరి అనే వారి చిన్నకధను చదివినపుడు, ఆయనమీద పకడ్బందీగా ఏర్పరుచుకున్న అభిప్రాయాలన్నీ అసంపూర్ణమైన అంచనాలుగా అనిపిస్తాయి. రచయితలలో ఈ రకమైన వస్తువైవిధ్యత, అంతకన్నా కూడా శైలీరూప వైవిధ్యతతో ఒక రచనకు మరొక రచనకు మధ్య ఇంతటి వినూత్నతతో పాఠకులని అబ్బురపరచే లక్షణం అరుదు అనే చెప్పాలి.
ఉరి చాలా చిన్నకధ. ఎంత చిన్నదో అంత బలీయమైన కధ. చదువుతుంటే కళ్ళు చెమర్చి, గొంతు పెగలని అనుభవం కలిగించే ఇటువంటి కధలు అంత తరచుగా చూడం. ఈ కధంతా కధకుడు, ప్రధానపాత్ర అయిన ఒక ముద్దాయి స్వరంలో సాగుతుంది. ప్రధానపాత్ర స్వగతంగా కధ నడుపుతున్నప్పుడు, చాలాసార్లు రచయిత గొంతు, పాత్ర గొంతును డామినేట్ చేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ కధలో మనకు కేవలం ప్రొటాగనిస్ట్ మాత్రమే కనబడతాడు కానీ విశ్వనాధ ఎక్కడా కనబడరు. ఈ ప్రొటాగనిస్ట్ భయంకరమైన దారిద్ర్య పీడితుడు. దుర్భర దారిద్ర్యం నుంచి తన తల్లినీ, భార్యాబిడ్డల్నీ కాపాడుకోలేని నిస్సహాయుడు. ఒక గుంపుకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో తన ప్రమేయం లేకుండానే చిక్కుకుని అన్యాయంగా హత్యానేరం మోపబడి, ఉరిశిక్ష వేయబడినవాడు. ఉరిశిక్ష అమలుకు ముందు అతనిని మాట్లాడమని అనుమతి ఇచ్చినపుడు అతని స్వరంలో నిర్లిప్తంగా చెప్పిన కధ, ఈ కధ. కధకుడు నిర్లిప్తంగా చెప్పినా పాఠకుడు చదివిన ప్రతిసారీ చలించకుండా ఉండటం సాధ్యం కాదు. ముఖ్యంగా –
“నేను ఉద్యోగం చేయలేదు. కూలీనాలీ కుదరలేదు. మోసం చేయలేను. ఎక్కడో నాల్గు రాళ్ళు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు. అదివరకు నాల్గురోజులు ఇంటిల్లిపాదీ పస్తున్నాం. నేను, నా భార్య ఎలాగో అల్లాగ తమాయించుకున్నాం. పిల్లలు బక్కనరాలై కూర్చున్న చోటునుంచి లేవలేక, యేడ్చే శక్తి కూడా లేక బ్రతికి ఉన్న శవాలల్లే పడి ఉంటే చూడటం యెలాగా?”
అన్న లైన్ల దగ్గరికి వచ్చేసరికి ప్రతిసారీ కళ్ళు నీళ్ళతో నిండి, కంఠం దుఃఖంతో పూడుకు పోతుంది. గొప్పసాహిత్యం జీవితాన్ని, సమాజాన్ని ప్రతిబింబించాలని అందరూ అంటారు. ఇంత నిజాయితీగా, ఎటువంటి ఆరోపిత/ ఆపాదిత భావాలు లేకుండా జీవితాన్ని ప్రతిబింబించిన కధలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.
ఈ కధ నాకు నచ్చటానికి ప్రధాన కారణం, ఈ కధ కేవలం ఒక సహజమైన, ఆర్ద్రమైన మానవీయ స్పందన లోంచి మాత్రమే రావటం. ఎక్కడా సందేశాలను ఇవ్వటం కానీ, ఇవ్వాలన్న తపన కానీ లేదు. సాహిత్యవస్తువుతో తాదాత్మ్యత, సానుభూతి లేకుండా ఇటువంటి కధలు రావు. నిజానికి సమాజంలో ఉన్న దుర్భరదారిద్ర్యాన్ని చూసి ఎంతగానో విశ్వనాధ చలించకపోతే ఇటువంటి కధ రాయలేరు.
ఈ కధ ఎత్తుగడే విశ్వనాధ సొత్తయిన సునిశిత తర్కంతో మొదలవుతుంది. “ఉరిశిక్ష వేసేముందు మాట్లాడమంటే అర్ధం ఉంది, శిక్ష వేశాక చెప్పుకోకపోయినా ఒకటే” అంటూనే, “మనుష్యుడై జన్మ ఎత్తిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది. అది మాయాపిహితులైన మానవులకు సహజ లక్షణం.” అంటారు. ఈ వాక్యం చాలా చక్కటి అబ్జర్వేషన్. మన అందరి అనుభవమే. అయినా ఇలా సిద్ధాంతీకరించకపోతే ప్రత్యక్షంగా మన దృష్టిలోకి రాని విషయం కూడా.
అలాగే మరో చోట ఆయన తర్కం చూడండి, “చంపడంలో ఇన్ని భేదాలేమిటి? రాయి తగిలితే చచ్చి తుపాకి గుండు తగిలితే బ్రతుకుతాడా? తుపాకి గుండు తగిలిచస్తే శిక్ష లేదూ! రాయి తగిలి చస్తే శిక్షా?”
ఈ కధలోని భాషలో కానీ, భావంలో కానీ విశ్వనాధ చూపిన సరళత మనల్ని ఆశ్చర్య పరస్తుంది. నిజానికి ఈ పాత్ర స్వభావానికి ఇటువంటి సరళమైన భాష ఔచిత్యాన్నిస్తుంది. రచయిత ఎంత పండితుడైనా భాషని పాత్రోచితంగా వాడుకోటంలోనే అతని ప్రతిభ తెలుస్తుంది.
ఎవరికీ పనికి రాకుండా విరిగి పడున్న కర్ర పుల్లల్ని వంట చెరకు కోసం ఏరుకుంటున్న ప్రొటాగనిస్ట్‌ని ఒకాయన కర్రతో కొట్టే సంఘటనలో భయంకరమైన దారిద్ర్యంతో పాటు, ప్రపంచంలో నిష్కారణంగా కరడు కట్టిన నిర్దయను చూస్తాం. ఈ కధలో ప్రతివాక్యమూ మనల్ని కదిలించి వెంటాడుతుందంటే అతిశయోక్తి లేదు.
అన్నిటికన్నా ఈ కధ ముగింపు వాక్యాలు మనల్ని నిర్ఘాంతులని చేస్తాయి. వేదనతో నింపుతాయి. “నాకు ఇంత ఉపకారం చేసిన మీరు వెయ్యేళ్ళు బ్రతకండి. బ్రతుకంతా తిండి లేక చచ్చిన నాకు రెండు నెలలు సుఖంగా తిండి పెట్టారు. మీకడుపులు చల్లగా ఉండాలి. కానీ నా ఇంటిది, పిల్లలు ఏమైనారో తెలియలేదు. నాకు ఒక్కటే చింతగా ఉంది. నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే, ఎల్లాగో అల్లాగ పెద్దవాళ్ళు అయితే చివరి రోజుల్లో వాళ్ళకు కూడా నాకు పట్టిన యోగం పడుతుందా అని. అదంతా మీ దయ. వాళ్ళని వెదికించి ఈ ఉపకారం చేయిస్తే మీ కడుపున పుట్తాను.”
ఇందులో వ్యంగ్యం ఏ మాత్రం లేదు. తనవారిని కూడా వెదికించి ఖైదులో ఉంచమని ప్రాదేయపడటంలో తన భార్యాబిడ్డలకి కనీసావసరమైన పూటభోజనం సమకూర్చాలన్న తపన, ఆరాటం, సమకూర్చలేని తన అశక్తత, ఉరిశిక్ష వేసినా అన్నం పెట్టిన అధికారుల పట్ల అమాయకమైన కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఒక కుటుంబం మొత్తం పస్తులతో గడపకపోతే జైలుజీవితమే మెరుగనిపిస్తుంది? ఆ దుర్భర పరిస్థితిని ఎటువంటి మెలోడ్రామా లేకుండా విశ్వనాధ చిత్రించిన తీరు మనల్ని బలీయంగా వెంటాడుతుంది.
ఈ కధ నిస్సందేహంగా నేను చదివిన గొప్ప కధలలో ఒకటి. ఈ కధ చదివినప్పుడు నాకు నా అభిమాన కవి తిలక్ ‘ఆర్తగీతం’ గుర్తుకు వచ్చింది.
“నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను
సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును
మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను…”
పాఠకులు కూడా ఈ కధ చదివాక అలానే ఆర్ద్రమవుతారనే నా నమ్మకం.
(కొన్ని నెలల క్రితం యధాలాపంగా మా నాన్నగారితో మాట్లాడుతుంటే ఈ కధ ప్రసక్తి రావటం, నేను ఈ కధ చదవలేదనటం, ఆ విషయం తెలిసి మా నాన్నగారికి సన్నిహిత మిత్రులు, స్నేహశీలి, విశ్వనాధ కళాపీఠవ్యవస్థాపకులు, స్వయంగా కవి, రచయిత, అనువాదకులు అయిన శ్రీ వెలిచాల కొండలరావుగారు ఈ కధ పిడిఎఫ్ నాకు పంపడం జరిగాయి. వారికి నా కృతజ్ఞతలు.)