గుల్మొహర్

నిన్నటి దాకా ఇక్కడ
చెట్టు ఉన్నట్లే గమనించలేదు.
నిన్న ఈ చెట్టు ఆకుల్ని రాల్చేసి
నిరలంకారంగా నిర్లిప్తంగా
నిలబడి ఉండేది.
ఏవో రహస్యాలని నిగూఢంగా దాచుకుని
పెదవి విప్పకుండా ఒదిగి కూర్చున్న
చిన్ని చిన్ని మొగ్గల్ని రెమ్మల చివర్ల మోస్తూ,
ఈ చెట్టు మౌనం గా నిలబడి ఉండేది.

ఈ రోజు ఉదయానికల్లా
ఏదో ఎర్రని రాగం బద్దలైనట్లు,
ఎవరో రాత్రంతా కూర్చుని మొగ్గలలోకి
ఎర్ర రంగు దట్టించినట్లు,
ఈ చెట్టు రెమ్మల చివర్లలో పేలిన రంగుతూటాల్లా మొగ్గలు!

ఏ ఎక్సెంట్రిక్ చిత్రకారుడో హడావుడిగా
దారంట వెడుతూ ఓ క్షణం ఆగి,
తన కనురెప్పలక్రింద దాచుకున్న స్వప్నాల్ని,
కను చివర్లలో దాగిన ఎర్ర జీరల్ని,
తన బ్రష్ కొనలతో చెట్టు మీద చిత్రించి వెళ్ళిపోయాడేమో !

ఎవరో రాజనర్తకి తన చేలాంచలాన్ని సుతారంగా సవరించినట్లు,
చిరుగాలికి రెమ్మల్ని అలవోకగా కదల్చుతూ,
మన శుష్క హృదయాలలోని స్తబ్ద శిశిరాల్ని,కఠిన గ్రీష్మాల్ని,
విరబూసిన వసంతాలుగా మార్చుతూ
అందానికీ,ఆనందానికీ నిర్వచనంలా
ఎర్రెర్రని పుష్పాల్ని గర్వంగా
తన కిరీటంలో అలంకరించుకుంది గుల్మొహర్!


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...