సంగ సాహిత్యంలో 78 శాతం కవితలు అగం వర్గానికి చెందినవే. ఐంగుఱునూఱు, నట్రిణై, కుఱుందొగై, అగనానూఱు, కలిత్తొగై అన్నవి అగం సంకలనాలు. పుఱనానూఱు, పదిట్రుప్పత్తు అన్నవి పుఱం సంకలనాలు. పరిప్పాడల్ అన్న ఒక్క సంకలనంలో మాత్రం అగం, పుఱం రెండింటికీ చెందిన కవితలు ఉన్నాయి.
పత్తుప్పాట్టు అనే దీర్ఘకావ్యాలలో కుఱింజిపాట్టు అగం. నెడునల్‌వాడై, పట్టినప్పాలై, ముల్లైప్పాట్టు అన్నవి అగం మరియు పుఱం అంశాలు రెండింటినీ కలిగి ఉన్నాయి. శిరుపాణాట్రుప్పడై, పెరుంబాణాట్రుప్పడై, పొరునరాట్రుప్పడై, మలైపడుగడాం, తిరుమురుగాట్రుప్పడై మార్గదర్శక(ఆట్రుప్పడై) వర్గానికి చెందిన కావ్యాలు. మధురైకాంజి ఒక పుఱం కావ్యం.
మనం ప్రస్తుతం అగం కవితలను మాత్రమే పరిశీలిస్తున్నాము.
అగం కవిత్వం ఎలా ఉంటుంది?
తమిళ లక్షణ గ్రంథమైన తొల్కాప్పియం అగం కవితల యొక్క మూడు భాగాలను ఇలా చెప్పింది:
తెలుగులిపిలో
అగత్తిణై ఇయల్ (3 వ సూత్రం):
“ముదల్ కరు ఉరిప్పొరుళ్ ఎండ్ర మూండ్రే
నువలుం కాలై ముఱై సిఱందనవే
పాడలుళ్ పయిండ్రవై నాడుం కాలై”
తమిళలిపిలో
அகத்திணை இயல்:
முதல், கரு, உரிப்பொருள் என்ற மூன்றே
நுவலும் காலை முறை சிறந்தனவே
பாடலுள் பயின்றவை நாடும் காலை
ముదల్, కరు, ఉరిప్పొరుళ్ అనబడే మూడు వస్తువులే
చక్కని క్రమంలో చెప్పినప్పుడు
కవితకు అస్తిత్వాన్నిచ్చే పునాదిరాళ్ళవుతాయి
ముదల్ పొరుళ్ అంటే ‘మొదటి’ లేక ‘ముఖ్య’ వస్తువు – అంటే పద్యంలో జరిగే సంఘటనా సమయాన్ని(పొళుదు) మఱియు ప్రదేశాన్ని(నిలం) నిర్దేశిస్తుంది. సమయం అంటే నెల, లేదా ఋతువు, అప్పుడు పగలా, రాత్రియా అన్న సూచన. ప్రదేశం అంటే కుఱింజి, ముల్లై, మరుదం, నెయ్దల్, పాలై ప్రాంతపు ప్రకృతి దృశ్యాలను సూచిస్తుంది.
కరుప్పొరుళ్ అంటే ‘కేంద్రక/గర్భ వస్తువు’. ఇది ఆ తిణైకి చెందిన జంతువులు, వృక్షజాలం, దేవత, ప్రజలు, వారి వృత్తులు, ఆహారం, కళలను సూచిస్తుంది.
ఉరిప్పొరుళ్ ఆ తిణై యొక్క దేశకాల పరిస్థితుల్లో నాయికా, నాయకుల మానసికస్థితిని, ప్రవర్తనను సూచిస్తుంది.
ప్రతి అగం కవితలోనూ ఈ మూడు కావ్య వస్తువులు తప్పకుండా ఉండాలి. ఇవి కాక ఉళ్ళురై, ఇరచ్చి –- అంతరార్థం, భావం — అనేవి కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా వ్యాఖ్యాతల ద్వారా వివరించబడ్డాయి.
తుఱై – ఇవి అగం కవితలకు వ్యాఖ్యాతలు జోడించిన గమనికలు. అగం కవిత్వానికి తాత్పర్యాలను పండితులు జోడించిన తుఱై(వ్యాఖ్యానం) లేకుండా అర్థం చేసుకోవడం కష్టం. తుఱైలోని అంశాలు కూట్రు(వక్త), కేట్పోర్(వినేవాడు), విరి(ఇతివృత్తం), వక్త శ్రోతకు సందేశాన్ని అందించే విధానం… వీటిని వివరిస్తారు. ఇది ప్రతి కవితకూ ముందుగా శీర్షిక క్రింద ఉంటుంది. పాఠకుడికి పద్యంలోని వక్త ఎవరో, ఆ మాటలు ఎవరు ఎవరితో మాట్లాడారో, ఏ పరిస్థితులలో మాట్లాడారో అన్న సమాచారం తుఱైలో దొరుకుతుంది. వీటిని మూల రచయితలు వ్రాయలేదు. చాలా శతాబ్దాల తరువాత వ్యాఖ్యాతలు జోడించారు. అలా జోడించిన వారు వారివారి జ్ఞానం, అనుభవాల ఆధారంగా రచయిత ఉద్దేశ్యం ఏమిటో ఊహించారు. అందువలన కొన్ని కవితల తుఱైల పై పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కవిత్వంలోని పాత్రలు: అగం కవితలలో ముఖ్య పాత్రలు నాయకుడు(తలైవన్), అతని స్నేహితుడు(తోళన్), నాయకుని రథసారథి(తేర్ పాగన్), నాయిక(తలైవి), నాయిక స్నేహితురాలు(తోళి), నాయిక తల్లి(నట్రాయ్), నాయిక పెంపుడు తల్లి/దాది(శెవిలిత్తాయ్), నాయకుడి ఉంపుడుగత్తె(పరత్తై), పాటగాడు(పాణన్), ఊరివారు. అగం కవితలలో కవి స్వరం వినిపించదు. కవి ఎప్పుడూ పాఠకుడిని ఉద్దేశించి మాట్లాడడు. పాత్రలు మాత్రమే మాట్లాడుతాయి. అలాగే, ఈ కవితలలోని పాత్రలకు ఎప్పుడూ ఊర్లు, పేర్లు ఉండవు. ఇవి వ్యక్తుల ఆంతరంగిక విషయాలు కనుక ఆ నాయికా నాయకులను ఫలానా వారిగా గుర్తించే సంకేతాలు ఉండవు. కవితలు ఎప్పుడూ జనాంతికంగా, సార్వజనికంగా ఉంటాయి. అగం కవిత్వానికి ఇది ఒక ముఖ్యమైన నియమం. రాజులు లేదా రాజ్యాల పేర్లు అరుదుగా కనిపిస్తాయి గాని అవి స్థల, కాల సూచనలుగా మాత్రమే ఉన్నాయి. అలా ఎవరి పేరైనా ఉంటే — ఒక్క పేరున్నా — ఆ కవిత ‘పుఱం’గా వర్గీకరించబడుతుంది.
తిణైల ఆధారంగా అగం కవితల వింగడింపు
సంగ సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి తిణైలు, వాటిని సూచించే వస్తు సామగ్రి, ఆయా తిణైలలో వచ్చే కవితాంశాలు, భూమికలు, సన్నివేశాలను కొంతైనా అవగాహన చేసుకోవడం అవసరం. ముందు వెనుకల కథ ఏదీ చెప్పకుండా, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో సూచించకుండా వ్రాసిన కవితలో అర్థాలు, అంతరార్థాలు తెలుసుకోవడం కష్టమే కదా.
1. కుఱింజి – పర్వత సానువులు
ఇవి పర్వతాలు మరియు వాటికి ఆనుకుని ఉన్న ఏటవాలు భూములు. పర్వత వాలులలో 12 సంవత్సరాలకు ఒకసారి పూచే కుఱింజి పువ్వు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. కుఱింజి మరియు కాందళ్ పువ్వులు పర్వతాలలో పూస్తాయి. సేయోన్(మురుగన్ – కార్తికేయుడు) కుఱింజి భూమికి దేవుడు. అక్కడ ఎలుగుబంట్లు, పులులు, ఏనుగులు, కోతులు, అడవి పందులు, చిలుకలు, నెమళ్ళు నివసిస్తాయి. అడవి బియ్యం, వెదురు బియ్యం, చిరు ధాన్యాలు, ఇంకా దుంపలు పండిస్తారు. తేనెను సేకరిస్తారు. వెదురు, చందన వృక్షాలు సమృద్ధిగా ఉంటాయి. సెలయేళ్ళు, జలపాతాలు పొంగి పొరలుతుంటాయి. కుఱవర్లు అని పిలువబడే పర్వత ప్రజలు చిన్న చిన్న నివాసాలలో గుడిసెలలో తమ కుటుంబాలతో నివసిస్తారు.
ఈ కుఱింజి తిణై కవితల ఇతివృత్తం సాధారణంగా ప్రేమికుల రహస్య కలయిక – అది చిరుధాన్యాల పొలంలో కావచ్చు, లేదా కథానాయిక తన తల్లి కళ్ళుగప్పి రాత్రిపూట ఇంటి నుండి బయటకు జారుకున్నప్పుడు కావచ్చు. సమయం పగటిపూట లేదా అర్ధరాత్రి. కుఱింజిలో ప్రేమికుల వివాహానికి ముందు కలయిక ప్రధాన ఇతివృత్తం.
కుఱింజి తిణై దృశ్యాలు – పర్వతాలలో ప్రేమ
నాయిక తమ చిరుధాన్యాల పొలంలో చిలుకలను తోలుతుంటుంది. ఆమె స్నేహితురాలు తరచుగా చిలుకలను వెంబడించడంలో ఆమెతో కలిసి ఉంటుంది. చిలుకలను తరమడానికి యువతులు గిలక్కాయల వంటి శబ్దం చేసే ఉపకరణాలను ఉపయోగిస్తారు. నాయిక చిలుకలను వెంబడిస్తున్నప్పుడు నాయకుడిని కలుస్తుంది, ప్రేమలో పడుతుంది.
ఆ ప్రేమికులు ఒకరినొకరు కలుసుకునేందుకు వారి స్నేహితులు సహాయం చేస్తారు. నాయకుడు రాత్రిపూట తన ప్రేయసిని కలవడానికి అడవి మార్గాల గుండా వస్తాడు. నాయిక అతని భద్రత గురించి ఆందోళన చెందుతుంది. ఆమె స్నేహితురాలు దానిని అతనికి తెలియజేస్తుంది. నాయిక, ఆమె నెచ్చెలి జలపాతాల వద్ద నాయకుడిని కలుస్తారు.
నాయకుడి ప్రేమలో మునిగిపోయి నాయిక సన్నబడుతుంది. ఆమె చేతుల నుండి గాజులు జారిపోతాయి. ఆమె చర్మం పాలిపోతుంది. శరీరంపై పసుపు రంగు మచ్చలు వ్యాపిస్తాయి. గ్రామంలో ఈ వ్యవహారం గురించి తెలుస్తుంది. పుకార్లు ప్రారంభమవుతాయి. అవి ఇంటి దాకా వస్తాయి. తల్లి తన కుమార్తె ఏదో రహస్యంగా చేస్తోందని అనుమానిస్తుంది. విషయం తెలుసుకుని ఆమెను కట్టడి చేస్తుంది. స్నేహితురాలు నాయకుని కలిసి తన స్నేహితురాలిని వచ్చి వివాహం చేసుకోవాలని కోరుతుంది. తన కూతురికి ఏదో గాలి సోకిందని తలచి తల్లి వేలన్(గుడి పూజారి)ను కలిసి పూజలకు ఏర్పాటు చేస్తుంది. తనను బాగుచేయడానికి వేలన్ ‘వెఱియాట్టం’ అనే నృత్యం చేస్తాడు. మురుగన్‌ను శాంతింపజేయడానికి బలులు ఇస్తాడు. నాయిక తల్లిదండ్రులు ఆమెకు వేరొకరితో వివాహం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి అనేకమైన ఒడిదుడుకులే కుఱింజి తిణై కవితల ఇతివృత్తం.
2. ముల్లై – అటవీ ప్రాంతం, పరిసర భూములు
ముల్లై అనే ఒక అడవి మల్లెపూల మీదుగా దీనికి పేరు పెట్టారు. ఈ మొక్క అటవీ ప్రాంతాలలో, ముఖ్యంగా వర్షాకాలంలో విస్తారంగా పెరుగుతుంది. వీరి దేవుడు మాయోన్ (నల్లనివాడు, విష్ణువు). పశువులు, జింకలు, కుందేళ్ళు, అడవి కోళ్ళు అక్కడ నివసిస్తాయి. సజ్జలు, వరిగలు, సామలు పండుతాయి. పువ్వులు మల్లె, తోండ్రి, చెట్లు కొండ్రై, కురుందు, కాయా. వర్షాకాలంలో అడవిలో సెలయేళ్ళ ప్రవాహాలు దూకుడుగా ఉంటాయి.
నాయిక తన భర్త దూరప్రయాణం నుండి తిరిగి వచ్చే వరకు వేచి ఉంటుంది. కొన్ని కవితల్లో ఆ నిరీక్షణ సఫలమౌతుంది. వర్షఋతువు ముల్లై కవితల కాలం. సాధారణంగా సాయంత్రం సమయం. కథానాయిక ఓపికగా వేచి ఉండడం ముల్లై యొక్క ఇతివృత్తం. ఈ నిరీక్షణ వివాహానికి ముందు లేదా వివాహానంతరం కూడ కావచ్చు.
ముల్లై తిణై దృశ్యాలు – సహనంతో వేచి ఉండటం
నాయకుడు వ్యాపారం కోసమో, రాచకార్యం కోసమో దూరదేశం వెళ్ళాడు. వర్ష ఋతువు ప్రారంభానికి ముందే తిరిగి వస్తానని చెప్పి ఉంటాడు. వర్షాకాలం వచ్చినప్పుడు అతని రాక కోసం నాయిక వేచి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమైందని, ఇంకా తన భర్త తిరిగి రాలేదని బాధపడుతుంది. వర్షాకాలం ప్రారంభమైందనే సంకేతాలను నాయిక తిరస్కరిస్తుంది. అలాంటి సంకేతాలను చూపిస్తున్నందుకు చెట్లను నిందిస్తుంది.
ఆమె ఆందోళన చెందుతున్నప్పుడు నాయిక స్నేహితురాలు ఆమెను ఓదార్చుతుంది. నాయకుడు కూడా తన పని ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి రావాలని ఆత్రుతగా ఉంటాడు. తిరిగి వెళ్ళేటప్పుడు తన రథసారథితో ఈ విషయాలు మాట్లాడుతాడు. వర్షాలు ప్రారంభమవుతాయి. అడవి అంతటా కాయా, కొండ్రై, ముల్లై, ఇతర పూలతో నిండి ఉంటుంది.
నాయకుడు చివరికి ఇంటికి చేరుకుని, తాను తిరిగి వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉన్నాడో తన ప్రేయసికి చెబుతాడు.
3. మరుదం – వరి పొలాలు, పంట భూములు, మైదానాలు
వ్యవసాయ ప్రాంతాల్లో పెరిగి పుష్పించే మరుదం(మద్ది) చెట్టు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి వేల్పు వేందన్(ఇంద్రుడు). తెలుపు, ఎరుపు రంగుల వరిని పండిస్తారు. గేదె సాధారణ జంతువు. తామర, కలువలు పువ్వులు. విరివిగా కనిపించే చెట్లు కొండగన్నేరు, ఏరుపొణకు, మద్ది. బావులు, చెరువులు, నదులు, వాగులు ఈ ప్రాంతమంతా ఉంటాయి. కొంగలు, నీటి కాకులు, హంసలు ఇక్కడి పక్షులు. ప్రజల పొలాల్లో నాట్లు వేయడం, కలుపు తీయడం మఱియు వరి కోతలు, నూర్పులు వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు.
పెళ్ళి తర్వాత – సాధారణంగా సంతానం కలిగిన తర్వాత – నాయకుడు తన భార్యను నిర్లక్ష్యం చేస్తూ వేశ్యలతో నివసించడం ప్రారంభిస్తాడు. ప్రేమికుడి అవిశ్వాసం, ప్రియురాలి ఆగ్రహం, ఆవేదన మరుదం వర్గంలోని ఇతివృత్తాలు. ఇవి వివాహానంతర సంఘటనలు.
మరుదం తిణై దృశ్యాలు – అవిశ్వాసం, గాయపడిన హృదయాలు
నాయకుడు ఒక ఉంపుడుగత్తెతో గడుపుతుంటాడు. నాయిక చాలా బాధ పడుతుంటుంది. నాయిక స్నేహితురాలు నాయకుడిని నిందిస్తుంది. ఆ ఉంపుడుగత్తె తన భావాల గురించి మాట్లాడుతుంది. నాయిక గురించి మాట్లాడుతుంది.
నాయికకు సందేశం పంపడానికి ఒక దూత(గాయకుడు)ను నియోగిస్తుంది. తన విషాదాన్ని గురించి గాయకునికి చెబుతుంది. తాను ఎంత బాధపడ్డదో నాయకుడికి చెబుతుంది. నాయకుడు ఇంట్లోకి ప్రవేశించడానికి ఆమె స్నేహితురాలు నిరాకరిస్తుంది. ప్రియుని పశ్చాత్తాపాన్ని గుర్తించి నాయిక అతడిని క్షమిస్తుంది.
4. నెయ్దల్ – సముద్ర తీరం, రేవు పట్టణాలు, జాలరుల పల్లెలు
సముద్రతీరం దగ్గర, నదీ ముఖాల వద్ద పెరిగే నీలి కలువ (నెయ్దల్) పేరు పెట్టబడింది. కడలోన్(వరుణుడు) వారి దేవుడు. ఇక్కడ చేపలు పట్టడం, ఉప్పు తయారీ ప్రధాన వృత్తులు. చెరువులలో నీలి కలువలు పెరుగుతాయి. నీటి కాకులు, మొసళ్ళు, సొరచేపలు, ఉప్పు సంచులను మోసే గేదెలు ఇక్కడ నివసిస్తాయి. ఈత చెట్లు, తాటి చెట్లు పెరుగుతాయి, మంచి నీటి బావులు, ఉప్పు నీటి చెరువులు ఉంటాయి. జాలర్లు వారి కుటుంబాలతో తీర సమీపంలోని గూడేలలో నివసిస్తుండేవారు. ఆత్రుతతో వేచి ఉండటం నెయ్దల్ యొక్క ఇతివృత్తం. నాయిక తన ప్రేమికుడు తనను విడిచిపెట్టాడని నమ్ముతుంది. అది వివాహానికి ముందు లేదా వివాహానంతరం కావచ్చు.
నెయ్దల్ తిణై దృశ్యాలు – ఆత్రుతగా ఎదురుచూడటం
సముద్రతీరంలో నాయిక, ఆమె స్నేహితురాలు చేపలు ఎండబెట్టుతుంటారు. వారి తండ్రులు, సోదరులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు. నాయిక సముద్రతీరంలో తన స్నేహితులతో ఆడుకుంటుంది.
నాయిక దూరంగా ఉన్న నాయకుడి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసినప్పుడు వారి పల్లెలో పుకార్లు వ్యాపిస్తాయి. నాయకుడు తన రథంపై తప్పక వస్తాడని నాయిక స్నేహితురాలు ఆమెతో నమ్మబలుకుతుంది. వియోగం వలన నాయిక శరీరం పాలిపోయి బలహీనంగా మారుతుంది. నిద్ర లేని రాత్రులను గడపుతుంటుంది.
5. పాలై – వర్షాలు లేక ఎండి పోయిన మరు భూములు
తడి లేని ప్రాంతాలలో పెరిగే పల్వరేణి(అంకుడు, తెడ్లపాల) చెట్టు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి దేవత కొట్రవై(కాళిక). ఈ పాలై భూమిలో రేచుకుక్కలు, చిక్కిపోయిన ఏనుగులు, పులులు, రాబందులు, డేగలు, పావురాలు, గుడ్లగూభలు, కాకులు, తొండలు నివసిస్తాయి. ఇక్కడ ఇప్ప, రేవడి, తెడ్లపాల వంటి చెట్లు పెరుగుతాయి. ఇక్కడ రేల, కొండ పాపిడి మఱియు పాదిరి పువ్వులు పూస్తాయి. రహదారులపై దోపిడీలు సర్వసాధారణం. ఎండిపోయిన సెలయేళ్ళు మరియు అడుగంటిన బావులు అంతటా కనిపిస్తాయి.
నాయకుడు తన ప్రియురాలితో పారిపోవడానికో, లేక అతను ఒంటరిగా ప్రయాణిస్తుంటే, తిరిగి వచ్చిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవడానికి సరిపడా డబ్బు సంపాదించడానికో భయంకరమైన అరణ్యం గుండా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఒక్కోసారి నాయకుడు వివాహితుడై ఉండి వ్యాపారపు పనుల మీదనో, ధనసంపాదన కోసమో యాత్రకు బయలుదేరతాడు. పాలై యొక్క ఇతివృత్తం ప్రేమికుల విరహం.
పాలై తిణై దృశ్యాలు – వియోగం
నాయకుడు కఱవు కాలంలో ధనం సంపాదించడానికి ఎడారి మార్గంలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతాడు. లేదా, నాయకుడు, నాయికలు పారిపోయి ఎడారి మార్గాల గుండా వెళ్తారు.
పెంపుడు తల్లి నాయికను వెతుక్కుంటూ వెళ్తుంది. దారిలో వెళ్ళేవారు నాయకుడికి, నాయికకు సలహాలు ఇస్తారు. తన కూతురు పారిపోయిందని నాయిక తల్లి చాలా బాధపడుతుంది.
నాయకుడు నాయికను వదిలి సంపద కోసం ఒంటరిగా వెళ్తాడు. దోపిడీ దారులు, క్రూర జంతువులు ఉన్న దారుల గుండా అతను వెళ్ళాల్సి వస్తుందని నాయిక భయపడుతుంది. నాయిక స్నేహితురాలు ఆమెను ఓదారుస్తుంది.
నాయిక దుఃఖంతో కృశించిపోగా, ఆమె చేతి గాజులు జారిపోతాయి. నాయకుడు తనలో తాను తన భావాల గురించి మాట్లాడుకుంటాడు.
ఇప్పుడు ఒక అగం కవితను పరిశీలిద్దామా?
అగం కవితల లక్షణాలను, తిణైల కవన సామగ్రి వివరణలు, కవితలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పారిభాషిక పదాలను తెలుసుకొన్నాము కనుక, ఇప్పుడు వాటిని ఉపయోగించి ఒక పద్యాన్ని పరిశీలించుదాం.
తెలుగులిపిలో
కుఱుందొగై 18, కపిలర్, కుఱింజి తిణై – తోఴి తలైవనిడం సొన్నదు:
వేరల్ వేలి వేర్కోట్ పలవిన్
సారల్ నాడ! సెవ్వియై ఆగుమది!
యార్ అగ్‌దు అఱిందిసినోరే? సారల్
శిఱు కోట్టు పెరుంబఴం తూంగియాంగు, ఇవళ్
ఉయిర్ తవచ్చిఱిదు కామమో పెరిదే.
తమిళలిపిలో
குறுந்தொகை 18, கபிலர், குறிஞ்சித் திணை – தோழி தலைவனிடம் சொன்னது:
வேரல் வேலி வேர்க்கோட் பலவின்
சாரல் நாட! செவ்வியை ஆகுமதி!
யார் அஃது அறிந்திசினோரே? சாரல்
சிறு கோட்டுப் பெரும்பழம் தூங்கியாங்கு, இவள்
உயிர் தவச் சிறிது காமமோ பெரிதே.
పై కవితలో అది కుఱుందొగై సంకలనంలో 18వ కవిత అని, కవి పేరు కపిలుడని చెప్ప బడింది. దానితో బాటు తుఱై ఇవ్వబడింది – ఈ కవిత కుఱింజి తిణైలో ఉన్నదని, ఆ మాటలు, నాయిక స్నేహితురాలు నాయకునితో చెప్పినది అని వివరణ ఉన్నది. అటువంటి తుఱై ప్రతి కవితకూ ఉంటుంది.
పై పద్యానికి యథాతథానువాదం క్రింద-
వెదురుపొదలే కంచెలుగా, ఎక్కడ
పనసచెట్ల వేర్లపై పళ్ళు విరగ కాస్తాయో
ఆ కొండవాలు ప్రాంతపు యువకుడా, నువ్వు సరైన పని చేయి!
ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కొండవాలున
చెట్టు సన్నని కొమ్మకు వేలాడే పెద్ద పనసపండు లాగ,
ఆ పిల్లది చిన్ని ప్రాణం! ఐతే నీపై ఆమెకున్న ప్రేమయో? ఎంతో పెద్దది!
ఆ కొండవాలు ప్రాంతం అన్నది ఇందులో ముదల్ పొరుళ్ (ముఖ్యవస్తువు). వెదురుపొదలు, పనసచెట్లు, వాటి పళ్ళు కవితలోని కరు పొరుళ్ (గర్బవస్తువులు). నాయిక ప్రేమ, ఆమె పరిస్థితిపై స్నేహితురాలికున్న ఆందోళన, నాయకునిపై మందలింపు కవితలోని ఉరి పొరుళ్.
ఇప్పుడు దీని ఉళ్ పొరుళ్ (భావార్థం) ఏమిటో చూద్దాం.
నాయికా నాయకులు తరచుగా రహస్యంగా కలుసుకుంటున్నారు. అయితే నాయకుడు పెళ్ళి విషయం ఎత్తడం లేదు. వీరి విషయం ఊరిలో జనాలకు చూచాయగా తెలిసి పోయింది. గుసగుసలు ప్రారంభమయ్యాయి. అవి ఇంటి దాకా వస్తే తల్లి ఏం చేస్తుందో అని నాయిక మనసులో ఆందోళన. నాయకునితో ప్రేమ పెళ్ళి దాకా రాదేమోనన్న భయం. నాయకుడేమో రహస్యంగా కలవడం తప్ప పెళ్ళి ప్రసక్తి తేవడం లేదు. ప్రస్తావించడానికి నాయికకేమో సంకోచం. నాయిక మనసులోని భయాందోళనలను నెచ్చెలి పసి గట్టింది. తన స్నేహితురాలి స్థితికి చలించిపోయింది. ఏదో ఒకటి చేయాలని ఒకనాడు నేరుగా నాయకునితో కలిసి మాట్లాడుతోంది. వెదురు పొదలు కంచెగా ఉన్న పనసచెట్ల వేర్లపై విరగ కాచిన పళ్ళున్న కొండ ప్రాంతపు వాడా అన్న సంబోధనలో ఎలాగైతే నాయకుడి దేశంలో పనసపళ్ళు వేర్లకి కాస్తున్నాయి కాబట్టి, వాటికి వెదురు పొదలు కంచెలా రక్షగా ఉంటున్నాయి కనుక ఆ చెట్లు సురక్షితంగా ఉన్నాయో, అలా నాయకుడు కూడా తన దేశంలో తాను క్షేమంగా ఉన్నాడు కానీ నాయిక మాత్రం తమ ప్రాంతంలో కొండవాలున పెరిగే పనస చెట్టు లాగా ప్రమాదకరపరిస్థితిలో ఉంది అని సూచిస్తున్నది.
నా స్నేహితురాలు బేల. తనది చిన్ని ప్రాణం. కానీ తనకు నీపై ఉన్న ప్రేమ ఎంతో పెద్దది. కొండవాలులో చిటారుకొమ్మన కాసిన పనస కాయ ఎలా చెట్టుని పడేస్తుందో అలా నీపై ప్రేమ ఆమె ప్రాణానికి ప్రమాదకరంగా పరిణమించకూడదు. అలా కాకుండా ఉండాలంటే నువ్వు ఆమెను పెళ్ళి చేసుకోవడం ఒకటే మార్గం. ఆమె మనసులో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికి తెలుసు (నీకు తెలియాలి). ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకో అంటున్నది. వెంటనే పెళ్ళి చేసుకో అని భావం.
రహస్యప్రేమ మగవాడివైపు నుండి బాగానే ఉంటుంది గానీ, ప్రేమించిన అమ్మాయికి ప్రాణ సంకటంగా ఉంటుంది. ఇలాంటి ప్రేమ వీలైనంత తొందరలో పెళ్ళి వైపు దారి తీయాలని కవిత అంతరార్థం.
కవితలో ఈ సమాచారమంతా లేదు. ఈ అదనపు పొరలు (Layers) వ్యాఖ్యాతలు సమకూర్చినవి. హాలుని గాథాసప్తశతికి లేని ఒక సౌకర్యాన్ని తరతరాల వ్యాఖ్యానకర్తలు అలా సంగ సాహిత్యానికి సమకూర్చి పెట్టారు.
