నాయకుడు ధనార్జన కొరకు దూర దేశాలకు వెళ్లడం, అతని వియోగం భరించలేక, అతని క్షేమ సమాచారాలు తెలియరాక నాయిక బాధపడడం అగం కవితలలో సాధారణంగా కనిపించే దృశ్యం. తనకే తెలియని దారులలో, భవిష్యత్తును వెదుక్కుంటూ వెళ్లే నాయకుడు, తన ప్రేయసిని వెంట తీసుకువెళ్లే సాహసం చేయలేడు. నచ్చజెప్పో, రహస్యంగానో ఒంటరిగా వెళ్లిపోవడమే ఎక్కువగా జరుగుతుంది. అలా వెళ్లిపోయిన ప్రియుని తలచి వగచే నాయిక మాటలే కుఱుందొగై నాలుగవ కవిత:
తమిళమూలం తెలుగులిపిలో
కుఱుందొగై 4, కామంజేర్ కుళత్తార్, నెయ్దఱ్ తిణై – తలైవి తోఴియిడం సొన్నదు
నోం ఎన్ నెంజే! నోం ఎన్ నెంజే!
ఇమై తీయ్పన్న కణ్ణీర్ తాంగి,
అమైదఱ్కు అమైంద నం కాదలర్,
అమైవు ఇలర్ ఆగుదల్, నోం ఎన్ నెంజే.
తమిళలిపిలో
குறுந்தொகை 4, காமஞ்சேர் குளத்தார், நெய்தற் திணை – தலைவி தோழியிடம் சொன்னது
நோம் என் நெஞ்சே! நோம் என் நெஞ்சே!
இமை தீய்ப்பன்ன கண்ணீர் தாங்கி,
அமைதற்கு அமைந்த நம் காதலர்,
அமைவு இலர் ஆகுதல், நோம் என் நெஞ்சே
కుఱుందొగై 4, కవి: కామంజేర్ కుళత్తార్, నెయ్దల్ తిణై – నాయిక తన స్నేహితురాలితో చెప్పినది:
నొచ్చె నా హృదయమ్ము నొచ్చె నా హృదయమ్ము
అగ్నిధారలై కాల్చు కన్నీరు సహియించి,
ఓదార్పు నొసగంగగలుగు మన ప్రియసఖుడు
నను వీడి పోవంగ నొచ్చె నా హృదయమ్ము
నాయిక బాధపడుతున్నదేమోనని చూడవచ్చిన స్నేహితురాలితో “నిజమే, నా హృదయం నొప్పి పడుతున్నది.” అని దాని కారణాన్ని వివరించడం ఈ పద్యంలోని విషయం. “నోం ఎన్ నెంజే” (నా గుండె నొప్పి పడుతున్నది) అన్న మాట ఈ నాలుగు పాదాల పద్యంలో మూడుసార్లు వచ్చింది. కష్టపడుతున్న ఆమె ఒక ఆత్మీయమైన పలకరింపు వినగానే కన్నీరు పెట్టుకోవడం వలన వచ్చిన ఉద్వేగానికి అది సూచన. ‘నా ప్రియుడు’ అని కాక ‘మన ప్రియుడు’ అంటుంది. తన ప్రేమ కథలో స్నేహితురాలొక విడదీయరాని భాగం. అతడు పరిచయమైన నాటి నుండి వారి ప్రతి సమాగమానికీ ఆమె ఒక సాక్షి. ఆ ఆత్మీయబంధంలో వారి తనువులు వేరైనా హృదయమొక్కటే. ఆ అనుబంధానికి ప్రతీక ఈ ‘మన ప్రియుడు’ అన్న మాట. ఈ ప్రయోగం అగం సాహిత్యంలో విరివిగా వస్తుంది. ఆమె కన్నీరు కళ్ళను నిప్పులా కాల్చేస్తున్నది. ఆ కన్నీటి వేడిని కన్నులు ఎలాగో ఓర్చుకుంటున్నాయి. కానీ హృదయం మాత్రం తాళలేక బాధపడుతున్నది అని నాయిక భావం.
అంత బాధపడుతున్న కళ్ళకు నిద్ర ఎలా వస్తుంది? ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళు మూతపడడం లేదు. ప్రేమరోగం అంటే ఇదేనేమో కదా అని తన స్నేహితురాలితో చెప్పి ఆశ్చర్యపోతున్నది, ఈ కవితలో.
తమిళమూలం తెలుగులిపిలో
కుఱుందొగై 5, నరివెరూఉత్తలైయార్, నెయ్దఱ్ తిణై – తలైవి తోఴియిడం సొన్నదు
అదు కొల్ తోఴి కామ నోయే,
వది కురుగు ఉఱంగుం ఇన్నిఴల్ పున్నై
ఉడై తిరైత్ తివలై అరుంబుం తీ నీర్
మెల్లంబులంబన్ పిరిందెనప్
పల్లిదఴ్ ఉణ్గణ్ పాడు ఒల్లావే?
తమిళలిపిలో
குறுந்தொகை 5, நரிவெரூஉத் தலையார், நெய்தற் திணை – தலைவி தோழியிடம் சொன்னது
அது கொல் தோழி காம நோயே,
வதி குருகு உறங்கும் இன்னிழல் புன்னை
உடை திரைத் திவலை அரும்பும் தீ நீர்
மெல்லம்புலம்பன் பிரிந்தெனப்
பல்லிதழ் உண்கண் பாடு ஒல்லாவே?
కుఱుందొగై 5, కవి: నరివెరూఉత్తలైయార్, నెయ్దల్ తిణై — నాయిక తన స్నేహితురాలితో చెప్పినది:
ఇదియేనా సఖియ ప్రేమ రోగమ్మన్న,
తీరమును ఢీకొనెడి అలల తుంపరలలో
పూసిన పున్నాగ చెట్ల కొమ్మల నీడ
నిదిరించు కురుగుల దేశమ్ము వాడతడు
నను వీడి పోయిన నాటి నుండియు నాదు
శతపత్రనేత్రములు మూత పడవేలనో?
ప్రతి భావననూ ప్రకృతితో ముడిపెట్టి చెప్పడం సంగ సాహిత్య ప్రధాన లక్షణం. సంగ కాల సాహిత్యంలో 210 వృక్షజాతులను పేర్కొన్నారు. 350 పైగా పశుపక్ష్యాదుల పేర్లను చెప్పారు. వాటిలో అన్నీ ఇప్పుడు మనకు తెలియ రాలేదు. పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ కవితలో నెయ్-దల్ భూమి వర్ణన ఉంది. నాయకునిది నెయ్-దల్ అన్న తీర ప్రాంతం. సముద్రపు అలలు తీరాన్ని తాకి ఎగసిపడుతుంటే వాటి తుంపరలు ఒడ్డున ఉన్న పున్నాగ చెట్లను కమ్మేస్తున్నాయి. ఆ కమ్ముకున్న తుంపర్ల మధ్య పున్నాగ చెట్లు విరివిగా పుష్పించాయి. అలా పూసిన పున్నాగ చెట్ల చల్లని కొమ్మల మీద కురుగు అనే జాతి కొంగలు ప్రశాంతంగా నిద్రిస్తున్నాయి. నాయకుని దేశంలోని కొంగలు కూడా అంత సౌకర్యంగా, చక్కగా నిద్రిస్తుంటే నాకు మాత్రం ఇక్కడ నిద్ర రావడం లేదు. తామరల వంటి నా కనురెప్పలు అసలు మూతపడడం లేదు అనే నాయిక వాపోతున్నది. తామరలు కూడా నెయ్-దల్ ప్రాంతానికి చెందిన పుష్పాలే. నేను కూడా అతనికి చెందిన దానినే అయినా నాకు మాత్రం అలాంటి నిద్రాసుఖం ఎందుకు లేదు? అని నాయిక ప్రశ్న. బహుశా దీనినే ప్రేమ రోగం అంటారేమోనని తన చెలితో చెప్పుకొంటున్నది.
తమిళంలో పున్నై, తెలుగులో పొన్న లేక పున్నాగ అని పిలవబడే ఈ చెట్టు (Calophyllum Inophyllum)
తీర ప్రాంతంలో విస్తారంగా పెరిగేది. వేసవిలో విరివిగా పూలను పూస్తుంది. కురుగు అనే జాతి కొంగ (బహుశః, ఆంగ్లంలో గ్రే హెరాన్), నీటి ఒడ్డున చేపల కోసం, గ్రుడ్లు పొదగడం కోసం వచ్చి చెట్లపై నివసిస్తాయి.
ఎంత ప్రాణస్నేహితురాలైనా నాయికకున్నంత బాధ ఆమె సఖికి ఎందుకుంటుంది? అర్ధరాత్రి దాటింది. కబుర్లు చెబుతూ చెబుతూ అలాగే నిద్రపోయింది. ఊరంతా గాఢనిద్రలో ఉంది. ఈ లోకంలో నిద్ర పట్టక మేలుకొని ఉన్నది తానొకతెయేనేమో అనుకొంటున్నది నాయిక.
తమిళమూలం తెలుగులిపిలో
కుఱుందొగై 6, పదుమనార్, నెయ్దఱ్ తిణై – తలైవి తోఴియిడం సొన్నదు
నళ్ళెండ్రండ్రే, సొల్ అవిందు
ఇనిదు అడంగినరే మాక్కళ్ మునివిండ్రు,
ననందలై ఉలగముం తుంజుం,
ఓర్ యాన్ మండ్ర తుంజాదేనే.
తమిళలిపిలో
குறுந்தொகை 6, பதுமனார், நெய்தற் திணை – தலைவி தோழியிடம் சொன்னது
நள்ளென்றன்றே, சொல் அவிந்து
இனிது அடங்கினரே மாக்கள் முனிவின்று,
நனந்தலை உலகமும் துஞ்சும்,
ஓர் யான் மன்ற துஞ்சாதேனே.
కుఱుందొగై 6, కవి: పదుమనార్, నెయ్దల్ తిణై – నాయిక తన స్నేహితురాలితో చెప్పినది:
నడి రేయి జామున మాటలు చాలించి
నిదురించ దొడగిరే ఇంటివారెల్లరును
కలఁగక నిదురించె నీ యఖిల లోకమ్ము
ఒక్కతినె కాదె కోల్పోయినాను నిదుర!
ఈ క్రింది కవితలో నాయిక తన హృదయాన్ని సంబోధిస్తూ తానే మాట్లాడుతుంది. ఇలా తన హృదయంతో తాను మాట్లాడడం అన్న ప్రక్రియ సంగ సాహిత్యంలో విరివిగా కనిపిస్తుంది. ఇదే ఒరవడి తర్వాత వచ్చిన అనేక తమిళ కావ్యాల్లో కూడా కనిపిస్తుంది.
నాయకుని వియోగంతో చిక్కి శల్యమైన నాయిక తానిక ఎంత మాత్రం ఈ ఎడబాటును తాళ లేనని తన హృదయంతో చెప్పుకుంటుంది. అందమైన మెరిసే శంఖాన్ని చెక్కి చేసిన గాజులు తన చిక్కిపోయిన ముంజేతుల నుండి జారిపోతున్నవి. కన్నీరు కార్చి కార్చి ఉబ్బిన కనులు మూతపడక నిద్ర పోలేకున్నది. ఈ కష్టాన్ని ఇక సహించలేనని నాయిక తన మనసుతో చెబుతోంది. వియోగ దుఃఖాన్నిసహించడం కన్న నాయకుడు ఏ దేశానికి ధనార్జన కోసం వెళ్ళాడో వెదుక్కొంటూ వెళ్లి అతనితో బాటే బ్రతకడం సుఖమనే నిశ్చయానికి వచ్చింది. అదే దేశమో, ఏ భాషయో, అక్కడి వారెవరో, అక్కడికి వెళ్లి బ్రతకగలనా అని ఒక వైపు మనసు శంకిస్తున్నది. అందుకే తన మనసుకు నచ్చ చెబుతోంది. “నీకు శుభమగు గాక మేలుకో హృదయమా ఇక ఎంత మాత్రం మనం ఈ కష్టాల్ని భరించవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మన అందమైన దేశాన్ని దాటి ఉత్తరాన మన ప్రియుడు ధనార్జన కోసం వెళ్లి ఏ దేశంలో ఉంటున్నాడో ఆ తెలుగు ప్రజల దేశానికే మనం వెళ్ళిపోదాం. అక్కడి వారి భాష నాకు రాదు. అయినా నా ప్రియుని కోసం ఆ దేశాన్ని నా దేశంగా చేసుకోవడానికి నేను సిద్ధమే.” అని తనను తాను సమాధానపరచుకుంటుంది. ఈ మాటలు తన స్నేహితురాలికి వినిపించేలా పైకే అంటున్నది.
ఇందులో వడుగర్ (ఔత్తరాహులు) అన్న శబ్దం తెలుగు వారినే సూచిస్తుందని పండితుల అభిప్రాయం. తమిళ వ్యాకరణం తొల్కాప్పియం ప్రకారం కన్యాకుమారి నుండి తిరువేంగడం (తిరుమల కొండ) వరకు ఉన్న ప్రాంతం తమిళ దేశం. కొండలకు ఉత్తరంగా ఉన్నది వారికి ఉత్తర దేశం కనుక ఇక్కడ వడుగర్ అన్నది తిరుపతిని దాటి ఉన్న ఆంధ్ర దేశమే అని పండితుల అభిప్రాయం. దీనిని బట్టి సంగ కాలానికే తెలుగు నాట కూడా రాజ్యాలు ఉండేవని, అక్కడి భాష తమిళానికి భిన్నమైనదనీ (తెలుగే అయివుండాలి అని నా అనుకోలు. స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు), అక్కడి జనపదాలు తమిళదేశం కంటే ఎక్కువ సుభిక్షంగా ఉండేవని, తమిళ ప్రజలు బ్రతుకు తెరువు కోసం, ఆ ప్రాంతాలకు వెళ్లేవారని ఈ కవిత ద్వారా మనకు తెలియ వస్తున్నది. నా అభిప్రాయంలో తెలుగు భాష ప్రాచీనతకు ఇది ఒక ముఖ్య ప్రాసంగిక సాక్ష్యం.
కురుందొగైలోని ఆ కవిత ఇదే…
తమిళమూలం తెలుగులిపిలో
కుఱుందొగై 11, మామూలనార్, పాలై తిణై – తలైవి తన్ నెంజిడం సొన్నదు, తోఴి కేట్కుంబడియాగ
కోడు ఈర్ ఇలంగు వళై ఞెగిఴ నాడొఱుం
పాడిల కలిఴుం కణ్ణొడు పులంబి
ఈంగు ఇవణ్ ఉఱైదలుం ఉయ్గువం ఆంగే,
ఎఴు ఇని వాఴి ఎన్ నెంజే, మునాదు
కుల్లైక్కణ్ణి వడుగర్ మునైయదు
పల్వేల్ కట్టి నన్నాట్టు ఉంబర్
మొఴిబెయర్ తేఎత్తర్ ఆయినుం,
వఴిబడల్ సూఴ్న్దిసిన్ అవరుడై నాట్టే.
తమిళలిపిలో
குறுந்தொகை 11, மாமூலனார், பாலைத் திணை – தலைவி தன் நெஞ்சிடம் சொன்னது, தோழி கேட்கும்படியாக
கோடு ஈர் இலங்கு வளை ஞெகிழ நாடொறும்
பாடில கலிழும் கண்ணொடு புலம்பி
ஈங்கு இவண் உறைதலும் உய்குவம் ஆங்கே,
எழு இனி வாழி என் நெஞ்சே, முனாது
குல்லைக் கண்ணி வடுகர் முனையது
பல்வேல் கட்டி நன்னாட்டு உம்பர்
மொழிபெயர் தேஎத்தர் ஆயினும்,
வழிபடல் சூழ்ந்திசின் அவருடை நாட்டே.
కుఱుందొగై 11, కవి: మామూలనార్, పాలై తిణై – నాయిక – తన చెలికి వినిపించేలా – తన మనసుతో మాట్లాడినది:
చిక్కిపోయిన నాదు ముంజేతి నుండి
మెఱుగు శంఖపు గాజులు జారిపోవ
కన్నీరు కార్చుచు నొంటరిగ చింతించి
యుబ్బిన కనులకు నిదుర రాక
బ్రతుకలేనిక పైన, పోవుదమచటికే
పారిపోదమీ యొంటరితనము నుండి
లెమ్ము నా హృదయమా నీకు శుభమగు గాక
పలు బల్లెముల వాడు, కట్టి ప్రభువు
పాలించు చక్కని దేశమును దాటి
తులసి మాలలు దాల్చు తెలుగువారున్నట్టి
నా ప్రియుడు నివసించు నాడు చేరుదము
అచట పలికెడి భాష వేరైన గాని
పోవనెంచితి నేను నిశ్చయముగ
అతడు నివసించు దేశమ్మె నాది కూడ!
యువతీ యువకులు ప్రేమించుకోవడం, వారి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, గత్యంతరం లేక వారిరువురూ ఇల్లు విడిచి మరో చోటికి పారిపోవడం, కొంతకాలానికి తల్లిదండ్రులు వారిని వెతుక్కుంటూ వచ్చి వారికి వివాహం జరిపించడం ఇవన్నీ సంగ కాలంలో తరచుగా జరుగుతుండేవి. ఈ ఇతివృత్తంతో సంగ సాహిత్యమంతటా అనేక పద్యాలు కనిపిస్తాయి.
కురుందొగై లోని ఏడవ పద్యం కూడా ఇటువంటిదే. ఒక యువకుడు తాను ప్రేమించిన యువతితో కలిసి వారి ఊరి నుండి దూరంగా వెళ్లిపోతున్నాడు. మధ్యలో అడవి దారుల్లో నడిచిపోతున్నప్పుడు అక్కడ నివసించే జనులు వీళ్ళని చూసి “ఎవరీ క్రొత్తవారు? పాపం అమ్మాయి ఇంకా పెళ్ళికాని పిల్లలా ఉంది. అతనేమో విల్లంబులు ధరించి వీర కింకిణులతో తిరుగుతున్నాడు. ఇంత భయంకరమైన అడవి దారిలో వీరు ఎక్కడికి వెళ్తున్నారో కదా!” అని వారిలో వారు మాట్లాడుకోవడం ఈ పద్యం ఇతివృత్తం. ఆ రోజుల్లో పెళ్లి కాని అమ్మాయిలు కాలికి ఒక ప్రత్యేకమైన అందెలను ధరించేవారు. ఆ అందెలను బట్టి అమ్మాయి కన్య అని గుర్తించేవారు. పెళ్లి సమయంలో వధువు అందెలను తీసివేయడం ఒక వేడుకగా జరిగేది. ఈ అందెలు తీసివేస్తున్నప్పుడు తల్లి మనసు కష్టపడడం మీద సంగ సాహిత్యంలో కవితలు ఉన్నాయి. అలాగే వీరులైన వారు వారి కాలికి వీర సిలంబు అనే ప్రత్యేకమైన పెండేరాలను ధరించేవారు. అది వారి వీరత్వానికి చిహ్నంగా ఉండేది. ఈ రెండు సాంప్రదాయాలనూ కవితలో ప్రస్తావించారు.
ఈ కవితలో వాగై చెట్టు ప్రసక్తి వస్తుంది. దీనిని తెలుగులో దిరిసెన చెట్టు అంటారు (శాస్త్రీయ నామం Albezia Lebbeck). దీని కాయలు చెట్టుపైనే ఎండినప్పుడు లేత గోధుమ రంగులోకి మారి అందులోని గింజలు విడిగా గల గల మంటూ ఉంటాయి. గట్టిగా గాలి వీచినప్పుడు ఈ కాయలు కదిలి ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తుంటాయి. ఆ శబ్దాన్ని ఈ కవితలో వర్ణించారు.
అలాగే ఈ కవితలో ఆర్యుల ప్రసక్తి ఉంది ఆ రోజుల్లో ఆర్యులని చెప్పుకునేవారు తమిళ జనపదాలకు వచ్చి గడ కట్టి, దానిమీద తాడు కట్టి, వాటిపై విన్యాసాలు చేసేవారట. అడవిలో వీచే హోరుగాలికి కదిలి శబ్దం చేసే దిరిసెన చెట్ల కాయల ధ్వని ఆర్యుల పిల్ల నాట్యం చేస్తున్నప్పుడు క్రింద ఉన్నవాడు వాయించే డమరు నాదంలా ఉందని ఒక పోలిక చెప్పారు.
కుఱుందొగైలోని ఆ పద్యం క్రింద:
తమిళమూలం తెలుగులిపిలో
కుఱుందొగై 7, పెరుంబదుమనార్, పాలై తిణై – తలైవియైయుం తలైవనైయుం సురత్తిల్ కండవర్గళ్ సొన్నదు
విల్లోన్ కాలన కఴలే, తొడియోళ్
మెల్లడి మేలవుం సిలంబే, నల్లోర్
యార్ కొల్ అళియర్ తామే, ఆరియర్
కయిఱాడు పఱైయిన్ కాల్ పొరక్ కలంగి
వాగై వెణ్ నెట్రు ఒలిక్కుం
వేయ్ పయిల్ అఴువం మున్నియోరే?
తమిళలిపిలో
குறுந்தொகை 7, பெரும்பதுமனார், பாலைத் திணை – தலைவியையும் தலைவனையும் சுரத்தில் கண்டவர்கள் சொன்னது
வில்லோன் காலன கழலே, தொடியோள்
மெல்லடி மேலவும் சிலம்பே, நல்லோர்
யார் கொல் அளியர் தாமே, ஆரியர்
கயிறாடு பறையின் கால் பொரக் கலங்கி
வாகை வெண் நெற்று ஒலிக்கும்
வேய் பயில் அழுவம் முன்னியோரே?
కుఱుందొగై 7, కవి: పెరుంబదుమనార్, పాలై తిణై – నాయికా, నాయకులను దారిలో చూసిన వారు చెప్పుకొన్నది:
ఆ విలుకాని పాదమున వీర కింకిణియు, నా యువతి
చేతికి గాజులు, చక్కనౌ అందియలు
ఎవ్వరో పాపమీ మంచి యువక యాత్రికులు?
తీగపై యాడు ఆర్యుల డమరు నాదము వోలె
వడగాడ్పు తాకున కొమ్మలు కదలాడ
దిరిసెన చెట్టు కాయలు ధ్వనియించు ఈ
వెదురు వనములు సొచ్చి పోవుచున్నారే?
సందర్భం వచ్చింది గనుక, కన్యక అందెలను తీసివేసే వేడుక గురించిన ఒక పద్యం, ఐంగుఱునూరు సంకలనం నుండి చూద్దాం. నాయిక తన ఇంటి నుండి పారిపోయి నాయకుని పెళ్లి చేసుకున్నది. వారిని వెతుక్కుంటూ ఆమె తల్లిదండ్రులు నాయకుడి ఇంటికి వచ్చారు. నాయకుని తల్లి నాయిక అందియలను తీసివేసింది. తమ ఇంట గొప్ప వేడుకగా జరగాల్సిన అందెలను తీసివేసే సంప్రదాయం పరాయి ఇంటిలో సాధారణంగా జరుగుతున్నందుకు నాయిక తల్లి నొచ్చుకొన్నది. ఈ వేడుక తమ ఇంట జరిగి ఉంటే తాను ఎంత గొప్పగా చేసి ఉండేదోనని తలచి బాధపడింది. దీనికి కారణమైన అల్లునిపై అక్కసు, అతని తల్లిపై కోపం వ్యక్తమయేలా ఇలా అంటున్నది (బహుశః కూతురితోనే) – “అందెలు తీసివేసే వేడుక మీ ఇంట జరిగినా నేను వాళ్ళని తీసుకుపోయి మా ఇంట ఘనంగా వివాహం జరిపిస్తానని అతని తల్లితో చెప్పవెందుకు?” అని. తన కూతురిని మాయమాటలు చెప్పి తీసుకుపోయిన అల్లునిపై ఆమెకున్న కోపం ఇందులో వ్యక్తం అవుతుంది. అతడు గొప్ప వీరుడు అంటూనే అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని వ్యంగ్యంగా అంటుంది. తన వియ్యపురాలిని అతనిని కన్నట్టి తల్లి అని సంబోధించడం ద్వారా ఆమె పట్ల ఉన్న తృణీకార భావాన్ని కూడా ప్రకటిస్తోంది.
తమిళమూలం తెలుగులిపిలో
ఐంగుఱునూఱు 399, ఓదలాందైయార్, పాలై తిణై – తలైవియిన్ తాయ్ సొన్నదు
నుంమనైచ్చిలంబు కఴీఇ అయరినుం,
ఎంమనై వదువై నన్ మణం కఴిగెన
చొల్లిన్ ఎవనో మట్రే, వెన్ వేల్
మై అఱ విళంగియ కఴల్ అడి
పొయ్ వల్ కాళైయై ఈండ్ర తాయ్కే?
తమిళలిపిలో
ஐங்குறுநூறு 399, ஓதலாந்தையார், பாலைத் திணை – தலைவியின் தாய் சொன்னது
நும் மனைச் சிலம்பு கழீஇ அயரினும்,
எம் மனை வதுவை நன் மணம் கழிகெனச்
சொல்லின் எவனோ மற்றே, வென்வேல்
மை அற விளங்கிய கழல் அடிப்
பொய் வல் காளையை ஈன்ற தாய்க்கே?
ఐంగుఱునూఱు 399, కవి: ఓదలాందైయార్, పాలై తిణై – నాయిక తల్లి చెప్పినది:
అందెలను తీసివేసే వేడుక మీయింట జరిగినా
పెళ్ళిని మాత్రం ఘనంగా మా ఇంటనే చేస్తానని,
గొప్ప ఈటెను గొన్నవాడు, పాదాలకు
మెఱిసే వీర కింకిణులున్న వాడు,
అబద్ధాలాడడంలో దిట్ట ఐనవాడిని కన్నతల్లితో నా మాటగా చెప్పవెందుకు?
(సశేషం)
