అస్తిత్వవాద సాహిత్యం: 3ఇ. నీచ

సముల్లాసశాస్త్రం

(Preludes to The Gay Science or The Joyful Wisdom (La Gaya Scienza)

[అనువాదకుని ముందుమాట: నీచ పద్యాలలో కంటే అతని వచనంలో ఎక్కువ కవిత్వపటుత్వం కనిపిస్తుందనేది సాధారణ భావం. కాని అతడి పద్యాలు ఉపేక్షించదగినవి కావు. ముక్తకాలలో ఉండవలసిన క్లుప్తత, కొద్ది పదాలలో దట్టించిన అర్థం వాటికి కావ్యగౌరవం కలిగిస్తాయి. రెండు అనువాదాలలో (జర్మన్, ఇంగ్లీషు) వడగట్టిన రూపం యీ తెలుగు పద్యానువాదాలు. నా తెలుగు అనువాదానికి నేను అనుసరించిన రెండు ఆంగ్లానువాదాలు, ఒకటి Adrian Del Caro చేసింది: రెండవది Walter Kaufman చేసింది. వారికి నేను ఋణస్థుణ్ణి. నీచ తన The Gay Science కు ఆ పేరు పెట్టడంలో ఏం చెప్పదలచుకున్నాడు? ముందు Gay అన్న పదం. Science అన్న పదం విరుద్ధార్థలను చెప్పేవి కదా అన్న ఆభాస కలుగుతుంది. నీచకు జర్మనుల తాత్త్వికగాంభీర్యం యిష్టం లేదు. అతడికి ప్రొవెన్సల్ (Provençal, ఫ్రాన్స్ లోని దక్షిణభాగం) సంస్కృతి యిష్టం. ఈ సంస్కృతిని కీట్స్ కూడా స్మరించాడు తన ప్రసిద్ధకవితలో.

O. for a draught of vintage! that hath been
Cool’d a long age in the deep-delved earth.
Tasting of Flora and the country green,
Dance, and Provençal song, and sunburnt mirth!
O for a beaker full of the warm South.
Full of the true, the blushful Hippocrene…
(Keats: Ode to a Nightingale)

విజ్ఞానశాస్త్రం (Science) లో జ్ఞానానికి (Apollonian) తప్ప ఆనందానికి (Dionysian) ఆస్కారం లేదన్నది సాధారణభావం. ఆ రెంటినీ కలపడమే నీచ జీవనదర్శనం.

నీచ “Preludes to The Gay Science or The Joyful Wisdom (La Gaya Scienza)” లోని పద్యాలన్నిటినీ అనువదించలేదు. ఎన్నుకున్న వాటి మూలంలో వరుససంఖ్యలు యిచ్చాను.]

7.కరపుస్తకం

(మూలంలో శీర్షిక “vade mecum”, అంటే “నాతో రా” అని అర్ధం. Handbook. guide)

నా దారి, నా మాట నచ్చాయి నీకు. నన్ననుసరిస్తావా?
నీ దారిని నమ్మి నడువు: నా దారికొస్తావు.

(సత్యం ఏకమే అయినా, ఎవడి సాధన శోధన వాడిదే. (“I want to find out the truth that is true only for me.” Kierkegaard) గమ్యం ఒకటే అయినా, దారి వాడు చేసుకోవలసిందే. ఒకడు చేసిన దారి మరొకడికి పనికిరాదు. కాని, ‘ఎవడి దారి వాడిది’, అన్న అనైక్యం కాదు దీని అర్థం. ఇది నీచ విషయంకూడా అతడు చెప్పింది చెప్పినట్టు వేదవాక్యమని స్వీకరించనవసరం లేదు.)

13.నర్తకులకు

జారుడు మంచు
స్వర్గం
నేర్చిననర్తకులకు.
భద్రత అవసరంలేనివాడే నిజంగా భద్రుడు.

ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా తేవాలంటే. “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు (“జారుడు మంచు కైలాసం”) మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది. ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర ఆహార అభద్రతకు ప్రతీక. (Security కాదు, insecurity లో సంతృప్తి ఉంది అంటాడు నీచ.) జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం, జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో ఆనందం ఉంది. రవీంద్రభారతిరంగస్థలంపై దొరకని ఆనందం.

అభద్రతలోని ఆనందాన్ని కోరుకో. ప్రమాదాలను ఎదిరించే సాహసజీవితం కోరుకో.

జీవితంలో భద్రతను కోరకు. అంటాడు నీచ, భద్రత కావాలంటే స్వేచ్ఛను పణంగా పెట్టాలి.

ఈ నాటి రాజకీయంలో జరుగుతున్నది అదే, భద్రతకోసం జనం స్వేచ్ఛను పణంగా పెడుతున్నారు.

“దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు. కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలానికి, మా నావలు బయలుదేరగలుగుతున్నాయి, ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాయి.ఇప్పుడు జ్ఞానాన్వేషణాప్రియులు చేయరాని సాహసం లేదు. సముద్రం, మన సముద్రం, మళ్ళీ పిలుస్తోంది. ఏదీ దాచుకోకుండా. ఇంత స్వచ్ఛ స్వేచ్ఛాసముద్రం బహుశా మునుపెన్నడూ ఉండి ఉండదు. (స.శా.5.343) సముద్రం స్వచ్ఛంగా ఉంది.ప్రయాణానికి స్వేచ్ఛ ఉంది మనిషికి. కాని మునుపటి ప్రమాదాలు అలాగే ఉన్నాయి. లేకపోతే అది సముద్రప్రయాణం ఎట్లా అవుతుంది? అందులో సాహసమేముంది? సముల్లాసమేముంది? జీవితం మంచుకొండ, మహాసముద్రం. ఎదురించి జీవించడమే జీవితం. అదే సముల్లాసం.

21. అహంకారం

అహాన్ని మరీ ఊదకు.
అది సూది మొన తాకుకే శూన్యం.

28. పందులమధ్య పిల్ల

ఆ పిల్లను చూడు, పందులమధ్య, నిస్సహాయంగా,
సుద్దముద్దలా పాలిపోయిన ముఖం.
ఎప్పుడు చూడు ఏడుపు.
ఎప్పటికైనా లేచి నడుస్తుందా?
నిరాశ చెందకు! నిట్టూర్పులు ఆపు!
త్వరలో నృత్యం చేస్తుంది చూడు, పగలూ రాత్రీ.
కాళ్ళు పనిచేస్తాయని తెలిసింది.
యిక తలపై నిలబడి నిన్ను చూసి నవ్వుతుంది.

32.బద్దుడు

ఆగి చెవి ఒగ్గుతాడు:ఏమి వినబడుతోంది వాడికి?
వాడి చెవుల్లో ఏమిటా రొద?
ఎందుకలా పడిపోయాడు? ఏమిటా చచ్చే భయం?
ఒకసారి వాడు సంకెళ్ళు మోస్తే,
వాడి వెనుక ఎప్పుడూ సంకెళ్ళ చప్పుడు

33.ఒంటరి

అనుసరించడం నాయకుడై నడిపించడం
రెండూ నాకు కావు.
సేవించడమా? ఓహ్. కాదు.
శాసించడమా? అసలే కాదు.
భయపడేవాడే భయపెడతాడు.
భయపెట్టేవాడే నడిపించగలడు.
నేనే వడిగా నడవలేను.
కొంత సేపు తప్పిపోవాలని ఉంది.
అడవిలో కడలిలో ప్రాణుల్లా.

43. కీర్తి వెల

నీకు కావలసింది కీర్తి. దాని వెల చెబుతా, విను.
అనుమానం లేదు. మానం వదిలెయ్.

45.ఎప్పటికీ

“ఈవేళ రావాలనిపించింది. వచ్చాను”. ఇదే అంటాడు ఉండిపోవాలని వచ్చిన ప్రతి ఒక్కడూ.

లోకం ముందొచ్చావననీ, ఆలస్యంచేశావననీ, లక్ష్యం చేయడు.

(అతిమానవుడి అవతరణం చెబుతున్నాడు. అతడు సమాజం ప్రయత్నించి సిద్ధంచేయగల వస్తువు కాదు. అది ప్రాకృతికచర్య. యుగాలుగా పేరుకున్న శక్తి వ్యక్తిరూపంలో విస్ఫోటనమవుతుంది.)

47.పతనం

“వాడు కుంగుతున్నాడు, పడిపోతున్నాడు”, అంటావు అపహసిస్తూ.
జాగ్రత్తగా చూడు. నీవున్న చోటుకే నడుస్తున్నాడు వాడు.
అమితానందభారంతో దిగుతున్నాడు. అతడి అమితప్రకాశంలో నీ చీకటి చెల్లాచెదురు.

(నీచ రచనల్లో తరచు పలకరించే భావం, పతనం అంటే క్షయంకాదు. అంతులేని అవతరణం, దిగడం, లోతులకు వెళ్ళడం. జారతూస్థ మొదటి వచనంలో (Aphorism) ” ” “Thus began Zarathustra’s down-going.”) ໖ ໑ . సూర్యుడు పడమటిసముద్రంలో “పడిపోతాడు”. అదోలోకాలకు ఉదయించినా అస్తమించినా, సముద్రంలో వెలుగునివ్వడానికి. సూర్యుడు పడిపోయినా లేచినా, మనిషికోసమే.)

48. చట్టానికి ఎదురు

ఇది మొదలు, నేను వేలాడుతుంటాను. కాలం నా కంఠాన్ని చుట్టిన కేశం.
ఇది మొదలు. నక్షత్రాలు సూర్యుడు కొక్కొరకోడి నీడలు ముగిసిపోతాయి. కాలాన్ని చెప్పేవన్నీ మూకాంధబధిరాలు.
ఉన్నాయి. నాలో ప్రకృతి నిశ్చలంగా ఎదురునిలిచింది. నడుస్తున్న గడియారపు ముళ్ళకు, నడిచొస్తున్న చట్టాలకు

52. పదరచయితలు

నేను చేత్తో మాత్రమే రాయను.
నేనూ ఓ చేయి వేస్తానంటుంది. నా కాలు.
స్థిరంగా స్వేచ్ఛగా నా పాదాలు ధైర్యంగా పరుగెత్తుతాయి పుటలపై పచ్చికపొలాలపై.

62. చూడండి యీ మనిషిని

అవును! నాకు తెలుసు నేనెక్కడి వాడినో!
ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు. నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు.

(జర్మన్ మూలంలో ఈ పద్యానికి శీర్షిక “Ecce homo” అంటే “behold the man”. Classical Latin: ‘ekke ‘homo. ముళ్ళకిరీటం ఉంచి, జనాలకు ఆయనను చూపిస్తూ, పోంటియస్ పైలెట్ అన్న మాటలు.)

63. తారల నీతి

తారాపథంలో తిరగాలని నీకాదేశం. నీకెందుకు చీకటి చింత?
బ్రహ్మానందంలో సాగనీ నీ భ్రమణం. మా మానవ జీవితాల దుఃఖాలు యిలా సాగనీ.
సుదూరలోకాలకు పంచు నీ ప్రకాశం.
జాలి పనికిరాదు నీకు, పాపాన్ని ఉచ్చాటన చేసినట్టు చెయ్.
కాని, ఒక తప్పరాని నియమం, స్వచ్ఛంగా ఉండు.
స్వచ్ఛత నీచ స్వభావం. “Pure is his eye.” (Zarathustra: Prologue 1)