నా అందం ఏమయింది?

పుట్టినప్పుడు ఉయ్యాలలో నన్ను చూసి
పాలరాతి బొమ్మ నన్నారట
పాలపొంగు తరకనన్నారట
పాలపుంత చుక్కనన్నారట
ఇప్పుడేమో అమ్మ
ఏమిటే నీళ్ళేసిన నిప్పులాగున్నావు అంటుంది
నా అందం ఏమయిందో
ఆ అందం ఎక్కడికి వెళ్ళిందో!

పెరిగేటప్పుడు ఓణీలలో నన్ను చూసి
పూలఋతువు మొలకనన్నారు
పూలతేరు కులుకునన్నారు
పూలముగ్గు మెలికనన్నారు
మరిప్పుడేమో చెల్లెలు
ఏమే ఎండిపోయిన ఆకులాగున్నావు అంటుంది
నా అందం ఏమయిందో
ఆ అందం ఎక్కడికి వెళ్ళిందో!

పెళ్ళయినప్పుడు మొదటి రాత్రి నన్ను చూసి
పోతపోసిన బంగారమన్నాడు
పూతపూసిన సింగారమన్నాడు
గీతగోవింద శృంగారమన్నాడు
ఇక ఇప్పుడేమో ఆయన
అప్పుడు నేను పెళ్ళాడింది నువ్వు కాదు అంటాడు
నా అందం ఏమయిందో
ఆ అందం ఎక్కడికి వెళ్ళిందో!

బాణంలా దూసుకుని వచ్చింది నా పాప
పక్కింటి నేస్తంతో పరుగులెత్తి
అప్పుడే వెలిసిన వాన వాళ్ళపై రాల్చిన
ముత్యాలు నిర్లక్ష్యంగా తుళ్ళుకుంటూ
పాలరాతి శిల్పంపై పూలదండలా
పాలకడలి కెరటంపై పూలరేకులా
పాలవెల్లి మధ్యలో పూలతీగలా
నా పాప

అప్పుడే ఆకాశంలో కనిపించిన
అందాల హరివిల్లును చూపిస్త్తూ
మొఖమంతా ముద్దుల ముత్యాలతో తడిపింది
అంతకన్నా అందమైంది మా అమ్మంటూ

నా అందం ఏమయిందా?
నా అందం నా ఎదుటే నిలబడుంది
ఆ అందం ఎక్కడికి వెళ్ళిందా?
ఆ అందం అందంగా పరకాయప్రవేశం చేసింది.