సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక

Issue Index Image

ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆలూరి బైరాగిది ఒక విశిష్టమైన గొంతుక. తన సమకాలికులు భావ, అభ్యుదయ, విప్లవ కవితోద్యమాలలో పయనిస్తుండగా, బైరాగి ఆ మార్గాలకు భిన్నంగా, మానవ అస్తిత్వానికి సంబంధించిన జటిలమైన ప్రశ్నలను లోతుగా అన్వేషించాడు. ఆయన కవిత్వం సత్యం కోసం చేసే అన్వేషణ; ఆ మార్గంలో ఎదురయ్యే వేదన, ఆశ, నిరాశ, సంశయాల మధ్య జరిగే సంఘర్షణకు అక్షరరూపం. అయితే, బైరాగి కవిత్వం శూన్యవాదంలో ముగిసిపోదు. దానితో ముఖాముఖి తలపడుతుంది. సులభమైన సమాధానాలను తిరస్కరించి, సందేహాన్ని, శోకాన్ని నిర్భయంగా చిత్రించడం ద్వారా, ఆయన ఆ అన్వేషణలోనే ఒక జీవిత ప్రయోజనాన్ని కనుగొన్నాడు. ఆయనకు జీవితంపై అపారమైన ప్రేమ ఉంది, కానీ దానిలోని వ్యర్థత గురించి కూడా ఆయనకు పూర్తి స్పృహ ఉంది. ఆశ-నిరాశల మధ్య, అర్థ-అర్థరాహిత్యాల మధ్య ఉన్న ఈ సంఘర్షణే ఆయన రచనలలోని ఆకర్షణ, శక్తి. బైరాగిని కొంతమంది టి.ఎస్. ఎలియట్ అనుచరుడనో, శ్రీశ్రీని అనుకరించాడనో భావిస్తారు. కానీ నిజానికి, ఐజాక్ న్యూటన్ చెప్పినట్టు, ఆయన ఆ మహామహుల భుజస్కంధాలపై నిలబడటం వల్ల కాబోలు, శ్రీశ్రీ చూసిన మేరకన్నా మరింత దూరం చూడగలిగాడు. ఎలియట్ చూపిన అన్వేషణాపథంలో మరింత ముందుకు వెళ్ళగలిగాడు.

బైరాగి శతజయంతి సందర్భంగా, ఈ ప్రత్యేక సంచికలో శ్రీశ్రీ నుండి సమకాలీన రచయితల వరకు ఎందరో ప్రముఖులు బైరాగి సాహితీమూర్తిత్వాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించిన రచనలను మీకందజేస్తున్నాము. ఆయన కవిత్వాన్ని, జీవన గమనాన్ని, తాత్విక చింతనను లోతుగా విశ్లేషిస్తూ రాసిన 50 వ్యాసాల సమాహారం ఇది. అలాగే, బైరాగి గీతాలకు మొట్టమొదటిసారిగా బాణీలు కూర్చి, ఎంపిక చేసిన పది గీతాలను గానరూపంలో యూట్యూబు వీడియోలుగా మీకు అందిస్తున్నాం. ఈ సంచిక రూపంలో బైరాగి అక్షర, నాద ప్రపంచంలోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చదివి, విని ఈ సంచిక గురించి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి.

[అడిగిన వెంటనే ఎంతో శ్రమపడి ఈమాట ప్రత్యేక సంచికకోసం విపులంగా ప్రత్యేక వ్యాసాలు వ్రాసి పంపిన రచయితలు, రచయిత్రులు, కవిమిత్రులందరికీ అనేక ధన్యవాదాలు. పాత వ్యాసాలను పునర్ముద్రించుకోవడానికి అనుమతి ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. పాత వ్యాసాలను సేకరించడంలో మాకు సహాయపడిన శ్రీనివాస్ పరుచూరిగారికి, బైరాగి గీతాలకు స్వరకల్పన కూర్చి, శ్రావ్యంగా పాడి, ఈమాటకు అందజేసిన ప్రశాంతి చోప్రాగారికి, వీడియోలకు, ప్రత్యేక సంచికకు బొమ్మలు గీసి ఇచ్చిన అన్వర్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు! — సం]