“అతనొస్తాడని అందరూ అన్నారు
నేను మాత్రం వస్తాడా, చూద్దాం అనుకున్నాను”
లోపలికి, బయటకి చేసే ప్రయాణంలో
త్రోవ గుర్తించిన ప్రతిసారీ
పక్కనే ఉన్నట్టు ఉంటాడు
లేడని నమ్ముతూనే ఉంటాను
ఉన్నాడని ఒప్పుకోకుండా ఉంటాను
అందరూ మంచివాడంటే
భయమేస్తుంది
కాడని ఖచ్చితంగా చెప్పాలనిపిస్తుంది
నిరాధారమైన ఆధారాలతో
ముడి వెయ్యాలనిపిస్తుంది
రహస్యాలన్నీ తెలిసినట్టు
కొండలన్నీ ఎక్కినట్టు
త్రోవంతా నడిచినట్టు
వాక్యాలు చదువుతుంటే
అసూయగా ఉంటుంది
ఏ ప్రయాణమూ లేని
అసంతుష్ట జీవితం అడ్డొస్తుంది
అతనేమైనా వసంతమా?
అతనేమైనా కలకూజితమా?
అతనేమైనా ఆషాఢ మేఘమా?
అతనేమైనా కాళిదాసా, పండితరాయలా,
ఆజ్ఞేయా, శేషేంద్రా, ఇస్మాయిల్?
అంతెందుకు బషో?
అతనొచ్చాడని అందరూ అన్నారు
ఎప్పుడో వచ్చాడని అనుకుంటున్నారు
నేను మాత్రం ఇల్లు సర్దుకుంటున్నాను