ప్రదర్శనశాలలో చిత్రాలు
ఇంకా మనల్ని వదలనట్టు
తీరం తడిలోనైనా
మెరుస్తున్న ఇసుక రేణువులు
ఒత్తుగా మంచుని
కప్పుకున్న చెట్లకు
తెల్లటి కనురెప్పల్లా
వేలాడుతున్నట్టు కొమ్మలు
ఎన్నాళ్ళుగానో తెరవని జ్ఞాపకాల తలుపు
తుప్పుపట్టిపోయిందేమో
నా దగ్గరున్న తాళపు చెవులతో తెరిచే ప్రయత్నం
చేస్తున్నాను
తెరుచుకుంటే, ఏవి భద్రంగా ఉన్నాయో
ఎన్నింటిని పోల్చుకోగలనో
గత జీవితం ఎప్పుడూ
జ్ఞాపకాల సమాహారం కదా
జ్ఞాపకానికీ, మరుపుకీ లోబడి
ఆశ్చర్యంగా ఎన్నాళ్ళో గుప్తంగా ఉన్నవి
అకస్మాత్తుగా బయటకొస్తాయి
ఎవరికైనా అసంపూర్ణ
పునర్నిర్మాణమే కదా గతం
వర్తమానంలో
బంధనాల భ్రమల
సాలెగూడు జీవితం
గతానికి ప్రాతినిధ్యం వహిస్తూ
ముందూ వెనకలని
గుర్తుచేసుకుంటూనే ఉంది
అవును
అలలన్నీ సముద్రానివే
సముద్రమే ఏ అలదీ కాదు
ఏ అలా సముద్రమూ కాదు
జ్ఞాపకాలూ అంతేనేమో!