స్వేచ్ఛ?

అలముకొన్న భయం
అంధకారమయం
కృశింపజేయు భయం
నశింపజేయు భయం
దించబడిన శిరం
వంచబడిన శిరం
ఎలా ఎత్తగలం
ఎలా నిలువగలం
Where the mind is without fear and the head is held high

బోధపడని పుస్తకాలు
బోధించని గురువరులు
వసతి లేని కళాశాల
పను లీయని పట్టములు
పదును లేని మతుల పోక
చదువుండదు డబ్బు లేక
Where knowledge is free

ఇంటివాడా? బయటివాడా?
నల్లవాడా? తెల్లవాడా?
కులీనుడా? కులహీనుడా?
ఉన్నవాడా? లేనివాడా?
ఏకతలో భిన్నత్వం
ఏమిటో ఈ మనస్తత్వం
Where the world has not been broken up into fragments by narrow domestic walls

సత్య మెపుడు జయిస్తుం ద-
సత్యము కాదన్నారు అవి
శిలలపైన అక్షరాలు
జలము పైన అక్షరాలు
విన్నవన్ని అబద్ధాలు
కన్నవన్ని కల్ల కలలు
Where words come out from the depth of truth

కష్టిస్తే ఫలితాలా
తుష్టి నిచ్చు జీతాలా
కష్టాలే ఫలితాలు
నష్టాలే జీవితాలు
ఎన్నాళ్ళో ఎన్నాళ్ళో
కన్నీళ్ళిక ఎన్నాళ్ళో
Where tireless striving stretches its arms towards perfection

అద్భుతాల దీపాలు
అంతులేని శాపాలు
జాతకాలు పాతకాలు
దేవుడికే లంచాలు
ఇంకిపోని సంకుచితత్వం
ఇదియే మా మానవత్వం
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit

దారుణాల మారణాల
కారణాల విధి నీవా
భావహీను లయ్యాము
క్రియాహీను లయ్యాము
భక్తిహీను లయ్యాము
శక్తిహీను లయ్యాము
Where the mind is led forward by thee into ever-widening thought and action

ఇదియేనా మా స్వేచ్ఛ
ఇదియేనా నీ యిచ్ఛ
ఈ నరకం వద్దు ప్రభూ
ఇక నరకం వద్దు ప్రభూ
పాతకులను దండించు
ఘాతకులను ఖండించు
నూతన స్వర్గం మాకు
చేతలలో చూపించు
చేతులతో చూపించు
భూతల స్వర్గం మాకు
Into that heaven of freedom, my Father, let my country awake.