కీడెంచు

“మిమ్మల్ని ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు. మీరు ఎవరు?” ఆమె చెవి దగ్గరికి ఒంగి అడిగాడు. మసక వెలుతురు, పెద్దగా సంగీతం, చుట్టూ మనుషుల రణగొణధ్వనుల మధ్య ఒక్కతే ఆమె.

కొన్ని ప్రశ్నలూ జవాబులూ అవుతూండగానే ఆకర్షణ వల్ల ఒంట్లో విద్యుత్తు, దాన్నుంచి చెంపల్లో వేడి, కళ్ళలో మెరుపులు, పెదాల మీద నవ్వులు. కొన్ని మాటల్లో తెలిసీ, కొన్ని మాటల్లేకుండానూ. చేతులు పట్టుకుని నడకలు, అర్థాలతో బరువెక్కిన మాటలు, ఊహలతో మత్తెక్కిన కళ్ళు, కొన్ని ‘మిస్ యూ’లు- చేతికి అందేంత దూరంలో ఆశగా. మరికొంత దూరంలో ఒళ్ళు విరిచే ఉద్రేకాలూ బిగి కౌగిలింతలూ తడి ముద్దులూ. ఆ తర్వాత ఇంకొంత దూరంలో రెండు ‘నా ఉద్దేశం అది కాదు’లూ, నాలుగు ‘పొరపాటు నాదే!’లూ, కొన్ని ‘సారీ’లూ, ఒక ‘నీ మొహం నాకు చూపించకు’.

“మనం విడిపోతాం. అప్పుడేమిటి? ‘ఆ తర్వాత వీళ్ళెప్పుడూ కలుసుకోలేదు’ కంటే గుబులు పుట్టించే వాక్యం నాకు తెలియదు. ఏదేమయినా మనం జీవితాంతం స్నేహితుల్లా మిగిలిపోతామా?” అడిగాడు.

“సంబంధం తెగిపోతే కత్తితో కోసినట్టు క్లీన్‌గా నీట్‌గా ఒకేసారి తెగిపోవాలి. ఇంకా మధ్యలో పీలికలూ పీచులూ వేడికోళ్ళూ వేలాడ్డాలూ వెంటాడడాలూ నాకు పడవు. స్టాప్ అంటే స్టాప్, అంతే. పీరియడ్.”

“చాలా ఉంటాయి కదా, పంచుకున్నవీ పెంచుకున్నవీ దాచుకున్నవీ.” మాటలతో పాటలతో నింపుకున్న ఉదయాలూ మధ్యాహ్నాలూ సాయంత్రాలూ రాత్రులూ. పూల వాసన కమ్ముకున్న వేసంగులూ, వెచ్చబర్చుకున్న శీతాకాలాలూ, మోసపుచ్చని వానాకాలాలూ. ఊపిరి ఆవిరీ, పెదవి తడీ, ఒంటి వేడీ.

“డిలీట్. ఎంప్టీ ట్రాష్. బ్లాక్. బ్లాక్. బ్లాక్. బ్లాక్. చూసినా చూసుకోం. మాట్లాడినా మాట్లాడుకోం. నా ప్రపంచంలో మీరుండరు, మీ ప్రపంచంలో నేనుండను.”

ఇంకోసారి తట్టుకోగలడా తను? తల అడ్డంగా ఊపాడు. “ఉహూ! కష్టం!”

‘వాళ్ళసలెప్పుడూ కలుసుకోలేదు’ కూడా గుబులు పుట్టిస్తుందా?

నిట్టూర్చి అంది “పర్లేదు. మనం అపరిచితులుగా మిగలడమే మంచిది.”

తలూపాడు. “మిమ్మల్ని ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు. మీరు ఎవరు?”


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...