గంధర్వులెవరు?

మన పురాణాల్లో భూతలవాసులు కొందరు దేవతల్తో కలిసిమెలిసి తిరుగుతూంటారు. ఇంద్రుడి దగ్గరికెళ్ళడం, రంభాఊర్వశుల నాట్యాలు చూడ్డం, ఇంద్రుడితో అర్ధసింహాసనాలు పంచుకోవడం జరిగిపోతూంటాయి. ఇదంతా అభూతకల్పన అనుకుంటే సమస్యే లేదు. కల్పన కాకపోతే, ఈ కథల్లో కొంతైనా నిజం ఉండాలి. వెంటనే “అలా ఐతే ఆ రాకపోకలు ఏమయిపోయాయి? ఎందుకు తర్వాత ఆగిపోయాయి? వీటిల్లో నిజం పాలు ఎంత?” అనే ప్రశ్నలు తలెత్తుతాయి.

మనవాళ్ళ కథల్ని బట్టి చూస్తే, స్వర్గం లేదా త్రివిష్టపం (3) అన్నది ఇప్పటి టిబెట్‌, దానికి ప్రక్కన ఉన్న ప్రదేశాలు. ఎ్తౖతెన హిమాలయాల్ని (అప్పట్లో హిమాలయాల్ని హిమాలయాలని అనేవారు కారట. కాళిదాసు కాలానికి అలా పిలవడం మొదలైంది కుమార సంభవమ్‌ 1.1) ఎక్కి, అవతలి ప్రదేశాలకి వెళ్ళడం ఆ కాలం నుంచి ఈకాలం వరకూ కష్టమైన పనే. కాబట్టి, చాలా తక్కువ మంది దేవతల్నీ, దేవతా గణాల్నీ(గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలైన వాళ్ళు (3) ) కలుసుకునేవారు లేదా చూసేవారు. మిగిలిన జనమంతా వాళ్ళ గురించి కర్ణాకర్ణిగా వినేవారు. హిమాలయాలు ఆకాశాన్ని అంటుతూ కనిపిస్తూంటే దేవతలు ఆకాశంలో ఉన్నారని అనుకునేవారు.

రఘువు, దుష్యంతుడు మొదలైన రాజులు దేవతలకు యుద్ధాల్లో సహాయం చేసి స్వర్గం నుంచి (ఆకాశం నుంచి) క్రిందకి దిగినప్పుడు, అంతా హిమాలయాల దగ్గర దిగారే తప్ప (“క్షణాదాయుష్మాన్‌ స్వాధికార భూమౌ వర్తిష్యసే”అభిజ్ఞాన శాకున్తలమ్‌ (2) ), మరే ప్రదేశంలోనూ దిగినట్లు దాఖలాల్లేవు. అందువల్ల స్వర్గం టిబెట్‌ పశ్చిమ చైనాల ప్రాంతం అయే అవకాశం ఉంది. టిబెట్‌సౌందర్యం అందరికీ తెలిసిందే. మానస సరోవరపు అందం వర్ణించనలవి కాదని అనేవాళ్ళు ఈ రోజుల్లోనూ ఉన్నారు. అలాంటి సుందర ప్రకృతిలో బహుముఖంగా వెలిసిన ఒక గొప్ప ధనవంతమైన నాగరికత ఉండి ఉండాలి. అదే మన స్వర్గమై ఉండాలి. ఆ నాగరికతకు చుట్టూ, వాళ్ళని ఆశ్రయిస్తూ, కొన్ని జాతులు హిమాలయాలకు ఉత్తరాన (టిబెట్‌వైపు) పర్వతపుటంచుల్లో తూర్పు వైపుకు వ్యాపించి ఉండాలి. వాళ్ళే గంధర్వులూ, విద్యాధరులూ, యక్షులూ అయి ఉండాలి. యక్షులు మనకు ఆగ్నేయ మూలగా (అస్సాం ప్రాంతాల్లో) కుబేరుడనే రాజు పాలనలో ఉన్నారనీ, ఆ ప్రదేశాన్ని కామరూపమని అంటారనీ కథలు చెపుతున్నాయి. వీటి గురించి కాస్సేపట్లో మాట్లాడుకుందాం.

హిమాలయాలూ, మానస సరోవర ప్రాంతాలూ దేవతా గణాలకి విహార భూములు. దీన్ని బట్టి చూస్తే, వీళ్ళలో కొందరు చైనా వారికి పూర్వీకులు కావాలి. దేవతల కొన్ని లక్షణాల్ని పరిశీలించిన మీదట, పురాతన చైనా చరిత్రను చూసిన మీదట, గంధర్వులు చైనావారి పూర్వీకులై ఉండాలని అనిపిస్తుంది. చైనాకి పశ్చిమాన దేవతలు నివసించి ఉంటారు. ఎలాగూ ఈ రెండు జాతుల మధ్యా సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లు మన కధలు చెబుతున్నాయి గాబట్టి వాళ్ళ నాగరికతలు విపరీతంగా ఇచ్చి పుచ్చుకున్నాయని అనుకోవడంలో తప్పు లేదు. మన ప్రక్క దేశం వారైనందువల్ల మనకీ వాళ్ళకీ ఇలాంటి చారిత్రాత్మక సంబంధాలుండడంలో ఆశ్చర్యమేమీ లేదు.

సంస్కృతం కొద్దిగా చదివినా చాలు, మనకు ఇద్దరు గొప్ప గంధర్వు లున్నారని తెలుస్తుంది. వీళ్ళు సంగీతంలో ప్రసిద్ధులు. శబ్దమంజరిలో వీళ్ళపై ప్రత్యేకమైన శబ్దం కూడా ఉంది. విశ్వనాధ సత్యనారాయణ గారు వీరి పేర ఒక నవల కూడా వ్రాసారు. వీళ్ళ పేర్లు “హాహాహూహూ”. ఈ విధమైన ఇంటి పేర్లున్నవాళ్ళని ఈనాటికీ చైనాలో చూస్తాం. చైనా ప్రాచీన చరిత్ర చదివితే, క్రీ. పూ. 10,000 3000 సంవత్సరాల మధ్య “హూ” అనే ఒక చక్రవర్తి అత్యంత వైభవంగా కొంత చైనాను ఏలాడని తెలుస్తుంది (4). ఇతనికి సంగీతం అంటే మహా ఇష్టం. 500 అమ్మాయిలున్న సంగీత బృందాన్ని ఎప్పుడూ తన వెంట తిప్పుకుంటూ సంగీతంలో తేలి యాడేవాడట. తంత్రీ వాద్యాలు కూడా పురాతన చైనాలో ప్రసిద్ధి కెక్కాయి. మన గంధర్వులు కూడా తంత్రీ వాద్యాలు వాడటం మనకి తెలుసు. మన “హాహాహూహూ”ల్లోని “హూ” ఇతనేనేమో !!!

మన దేవతా గణాలకి ఆపాదింపబడ్డ కొన్ని లక్షణాల్ని చైనీయుల్లో చూడవచ్చు. ఉదాహరణకు కొన్ని

చెమట పట్టదు. వాళ్ళు నివసించింది చల్లని దేశం గనుక దీనిపై వేరే చర్చ అక్కర్లేదు.
చాలామంది బంగారపు రంగు వాళ్ళు. ఇదీ చైనీయుల్లో చూస్తాము.
దేవతా గణాల వాళ్ళు “అనిమిష లోచనులు” అంటే, కనురెప్పలు మూయని వాళ్ళు. చైనీయుల కళ్ళు సన్నవి, చిన్నవి. అందువల్ల వాళ్ళు కనురెప్పలు మూసి, తెరిచినట్లు అనిపించదు. పెద్ద కళ్ళున్న జాతుల వాళ్ళకి ఇది వింతగా అనిపించి ఉంటుంది. అందుకే దీని ప్రస్తావన చాలా కథల్లో కనబడుతుంది.
“నిర్జరులు” అంటే ముసలితనం లేనివాళ్ళు. కొండల్లో నివసించే వాళ్ళకు రోజూ చేసుకునే పనుల వల్లే చాలా వ్యాయామం చేసినట్లయి గట్టి దేహాలు ఏర్పడతాయి. శరీరం మీద ముడతలు కూడా త్వరగా రావు. చైనీయుల విషయంలో ఇది నిజమని మనకు తెలుసు.
“గగన యానం” (ఆకాశంలో తిరగడం) చేస్తూంటారు మన కథల్లో. దీని గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచిద్దాం. పురాతన కాలం నుంచీ చైనీయులు ఎన్నో రకాల పనిముట్లూ, పాత్ర సామగ్రీ, యంత్రాలూ చెయ్యడంలో నిపుణులు. ఆ రోజుల్లోనే వాళ్ళు వింతైన రధాలూ, వాహనాలూ వాడే వారు. “చక్రం” అన్నది రవాణాకై వాడింది మొట్టమొదట వీరేనని చరిత్రకారుల అభిప్రాయం. అలాంటి వాహనాల మీద హిమాలయ పర్వతాల పైన గాని, మన వైపుగా దిగుతున్నప్పుడు గాని కొందర్ని మన వాళ్ళు చూసి ఉంటారు. అప్పట్లో (ఇప్పటికి గూడా) హిమాలయాల పైన మేఘాలు ఎక్కువ సంఖ్యలో ఉండి ఉండవచ్చు. (కాళిదాసు హిమాలయాల్లో మేఘాల గురించి, వాటి వల్ల జరిగే వింతల గురించి కుమార సంభవంలో (1.5, 1.14) చక్కని శ్లోకాలు వ్రాసాడు (2)). అందువల్ల, మన వాళ్ళు కొండల మీద సంచరిస్తున్న వాళ్ళని చూసి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా అనుకుని ఉండవచ్చు. నారదుడు మేఘాల్లో నడవడం కూడా ఇలాంటిదేనేమో. భూలోకంలో వింతలు కనబడితే దివి నుండి భువికి దిగుతారు. లేకపోతే అలా వెళ్ళిపోతారు. ఈ అనుభవం కొత్తేమీ కాదు. ఆల్ప్స్‌పర్వతాలపై రైల్లో వెడుతుంటే అందరూ అనుభవించే ఆనందమే ఇది.

దేవతా గణాలు అందమైన వస్త్రాల్ని ధరించే వారు (1). ఋగ్వేదంలో ఎన్నో చోట్ల ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలైన వాళ్ళు బంగారపు రంగు బట్టలు, ద్రాపి (అలంకరింపబడ్డ వస్త్రం ఒక విధంగా, జరీ కాని, ఏవైనా విలువైన పోగుల్తో అలంకరించిన బట్ట) ధరించేవారని చెప్పబడింది (1). చైనాలో పట్టు పుట్టింది. “చీనాంబరం” అన్న మాట తర్వాతే వచ్చినా, “అంబరం” నుండి వచ్చింది గాబట్టి పట్టు వస్త్రాన్ని మన వాళ్ళు అంబరం అని ఉండవచ్చు. కేవలం నార, చర్మాలతో చేసిన బట్టల్ని కట్టిన సప్తసింధులోని మన వాళ్ళకి చైనాలోని పట్టుబట్టలు బాగా నచ్చాయి. పలుచగా అందంగా ఉంటూ చలిని ఆపే శక్తి ఉన్న ఇవి మనవాళ్ళని అమితంగా ఆకర్షించాయేమో!

ఆఖరుగా, దేవతా గణాల వాళ్ళ “కామరూపం” అంటే, కోరిన రూపాన్ని పొందడం గురించి. దీనిలో కూడా ఉన్న చిలవల్నీ పలవల్నీ విరిచి చూద్దాం. కామరూపాల్లో మనం చూసేవి (కథల్లో) చాలావరకు రకరకాల జంతువుల రూపాలు, మానవ రూపాలు. కొందరు భూలోక వాసులు (ముఖ్యం గా మునులు, రాక్షసులు, సిద్ధులు) కూడా దీన్ని కలిగి ఉండేవారు కాబట్టి ఇదేదో అద్భుత మహిమ అనుకోవడానికి లేదు. ఇది కేవలం పరిసరాల్ని బట్టి రూపం మార్చుకోవడమే, ఊసరవిల్లిలా. జంతు చర్మాన్ని కప్పుకుని జంతువులా ప్రవర్తించడం; వేషం, భాష మార్చి మానవ రూపాన్ని పొందడం. కామరూపానికి సంబంధించిన కొన్ని కథల్ని చూస్తే ఇది తెలుస్తుంది. ఉదాహరణకి, ఎవరు కామరూపంలో ఉన్నా, చచ్చే సమయానికి నిజరూపం వచ్చేస్తుంది అంటే, పైన కప్పుకున్న తోలు ఊడిపోతుందన్నమాట. (ఇలా కామరూపాల్లో క్రీడిస్తున్న ముని జంటల మీద బాణాలేసి భంగ పడ్డవాళ్ళున్నారు.) అలా చేయడం వల్ల, మిగిలిన వారికి తమ ఉనికి తెలియకుండా పనులు చేసుకోవచ్చు. పరదేశీయులైన దేవతాగణాలు మన భూముల్లో కామరూపంలో తిరగడంలో గల ఉద్దేశ్యాన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోగలం.

పై మీమాంస అంతా మన దేవతాంశలో చీనాంశ ఉందేమోనన్న అనుమానంతో. “అమెరికా”ను అమరదేశంగా ఊహిస్తూ, ఏదారినైనా సరే వచ్చెయ్యాలని, ఈ అమెరికా (అమర) సుఖాన్ని పొందలేక పోవడం ఒక చేతకాని తనంగా ఊహించుకునే “మన” జనాన్ని చూస్తూంటే, కొంత కాలం తర్వాత అమెరికాని రెండవ స్వర్గంగా గుర్తిస్తామేమో అనిపిస్తోంది. దూరపు కొండలు నునుపు అన్నది ఆర్యోక్తి.

ప్రమాణ గ్రంధాలు

1. “ఋగ్వేద ఆర్యులు” మహా పండిత్‌రాహుల్‌సాంకృత్యాయన్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
2. “కాళిదాస గ్రన్థావళీ” మోతీలాల్‌బనారసీ దాస్‌ప్రెస్‌, వారాణసీ.
3. “అమరకోశం” వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌, చెన్నపురి.
4. “ప్రాచీన నాగరికతలుచైనా” ఇంటర్‌నెట్‌ పబ్లికేషన్‌


రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...