ది వేస్ట్ లాండ్: 7. వాట్ ది థండర్ సెడ్

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


పర్జన్యప్రవచనానికి ఎలియట్ చెప్పిన భాష్యం

దామ్యత దత్త దయధ్వమ్ – ఎలియట్ వీటి వరుస, ‘దత్త దయధ్వమ్ దామ్యత’గా మార్చాడు అని గమనించాం. ఏదో ఒక మార్పు చేయకపోతే, తనదేమీ లేదంటారని చేశాడా? అలా కాక, ఏదైనా ప్రయోజనం సాధించాడా? ‘దత్త’ను ముందుంచడంలో, ఎలియట్ దానం అన్నిటికన్నా మిన్న అని చెప్పడమే కాక, మూటిలోను దానం సామాన్య గుణమంటున్నాడు. దయలో నిన్ను నీవే యిచ్చుకొంటున్నావు. దమంలోనూ, నిన్ను నీవు వదులుకొని, మరొకరి అధీనం చేసుకొంటున్నావు. ఆత్మసంయమనంలో కూడా నిన్ను నీవు కాదనుకోవలె, ‘నీలోని మరొకరికి’ నిన్ను నీవు అధీనం చేస్తున్నావు. కనుక మూటిలోనూ అంతస్సూత్రమొకటే, ‘త్యాగేనైకే’.

ఇక, యీ మూటికి ఎటువంటి కవితాభాష్యం చెప్పాడో చూద్దాం. ప్రవచనాన్ని ప్రవచనంలాగే చెబితే, శాస్త్రమవుతుంది, కావ్యమెలా అవుతుంది?

దత్త

Datta: what have we given?
My friend, blood shaking my heart
The awful daring of a moment’s surrender
Which an age of prudence can never retract
By this, and this only, we have existed
Which is not to be found in our obituaries
Or in memories draped by the beneficent spider
Or under seals broken by the lean solicitor
In our empty rooms

ప్రవచనం నింగిలో. కవి నేల మీదకు దిగి మాట్లాడవలె. అదే చేస్తున్నాడు ఎలియట్.

what have we given?/My friend – ‘ఏమిచ్చాం?’ మనమేమీ యివ్వలేదు అన్న అర్థంలో అడిగిన ప్రశ్నా? ఆత్మపరిశీలనమా? ఇచ్చిన దానిని స్మరించడమా? ఇన్ని అర్థాలు సాధ్యమే, కవి ఉద్దేశించినవే.

ఇందులో ప్రతి పదము జాగ్రత్తగా పరిశీలించవలసినదే. moment’s surrender అంటే, క్షణికోద్రేకానికి లొంగిపోవడం. ఆ లొంగిపోవడంలో పరిణామాలను లెక్కచేయని భయంకరమైన సాహసం ఉంది (awful daring). రక్తప్రసారంలో, మనసును ఆగనివ్వని అలజడి ఉంది (blood shaking my heart). ఆ క్షణికోద్రేకంలో వివేకం నశించి నీవు పోగొట్టుకొన్న క్షణాన్ని, జీవితకాలపు వివేకం తిరిగి తెచ్చి యివ్వలేదు (an age of prudence can never retract). కాని, నిజంగానే ఆ క్షణాన్ని మనం మరచిపోవలెననుకొంటున్నామా? లేదు. జీవితకాలమంతా, అది మనతోనే ఉండిపోతుంది. దాన్ని భద్రంగా రహస్యంగా దాచుకొని మనతోనే తీసుకెళుతున్నాం (By this, and this only, we have existed). మనం పోయిన తరువాత, హిందూ పత్రికలో మన మరణవార్తలో ఆ ‘క్షణం’ ఉండదు. మన సమాధిపై రాసే స్మృతివాక్యాలలో దాని స్మరణ ఉండదు. శ్మశానంలో మనలను స్మరించేది మన శ్రేయోభిలాషి సాలెపురుగు, స్మృతిఫలకంపై అందమైన తెర అల్లుతుంది (memories draped by the beneficent spider). మనం బతికినంత కాలం ఎవరికీ యివ్వక (దత్త!) దాచిన ఆస్తులకు, రాసుకొని సీలువేసిన వీలునామాలో దాని (ఆ surrender) ప్రసక్తి ఉండదు.

ఇది ఒక దత్తార్థం. ఈ ఎలియట్ వాక్యాలలో మరో అర్థం కూడా సాధ్యమా? చూద్దాం. Surrender దేనికైనా కావచ్చు. క్షణికమైన ఉద్రేకంలో వశం తప్పినట్లే, లిప్తమాత్రమైన అలౌకికానుభవంలో పరవశమూ కావచ్చు. స్నేహంలో ప్రేమలో భక్తిలో సౌందర్యదర్శనంలో ఎప్పుడో ఎక్కడో ఎందుకో తెలియని అలౌకిక ఆనందానుభవం మెరుపులా కలుగుతుంది. ఆ అనుభవం క్షణమే, కాని క్షణికం కాదు. ఆ క్షణం అనంతం. ఆ క్షణం స్మరణలో జీవితకాలమంతా సార్థకమవుతుంది. Surrenderను యీ అర్థంలో చూసినపుడు, యీ వాక్యాలన్నీ అనుగుణంగా అర్థం మారి కనిపిస్తాయి. తక్కిన పదాల అర్థాలు, రెండు విధాల Surrenderకూ, (అవశము, పరవశము,) సామాన్యం కనుక.

ఈ విరుద్ధార్థాలను ఎలియట్ ఎలా సాధించాడు? ఈ వాక్యాలలో కీలకమైన పదం Awful. ఈ పదానికి, దాని సాధారణార్థం (disgusting, terrible, dreadful) కాక, awesome (overwhelming) అనే అర్థం కూడా ఉంది. Awful daring అనే ప్రయోగంలో యీ రెండర్థాలు సాధించగలిగాడు ఎలియట్.

వాస్తవంలో యివి రెండు కావు కూడా. పారలౌకికంలో లౌకికం యిమిడి ఉంటుంది, గుర్తించగలిగినవాడికి. ఈ రెండు ప్రేమలను సూఫీలు ఇష్కే హకీకీ, ఇష్కే మిజాజీ అంటారు. తమిళ వేదాంతులు చిరిన్బమ్ పెరిన్బమ్ అంటారు. వీరందరికీ ముందు ఉపనిషత్తే చెప్పింది, దివ్యానందం స్త్రీపరిష్వంగంలా ఉంటుందని: తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో న బాహ్యం కించన వేద నాంతరం (బృ. ఉ. 4. 3. 21.). ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది, లౌకికానందంలో అలౌకికభ్రాంతి. ఆ వామాచారుల భ్రాంతి సమాజంలో భ్రష్టతకు దారితీస్తుంది. కామం ముక్తిద్వారమంటారు వామాచారులు. అందుకే, ఉపనిషత్తు ముందే ఊహించినట్టు, ‘తద్యథా’ అంటున్నది, స్త్రీపరిష్వంగసుఖం ‘వలె’ అని. ముక్తి కామంలో కాదు, కామం నుండి.)

ఆ అలౌకికానందం మెరుపులా మెరిసి, కన్నుమూసి తెరిచే లోపల, మాయమవుతుందని మరో ఉపనిషత్తు: స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభమానాముమాం… యదేతద్విద్యుతో వ్యద్యుతదా ఇతీన్న్యమీమిషదా… (కేన. 3. 12;4. 4.). (ఆ ఇంద్రుడు) అదే ఆకాశంలో అతిసుందరమైన స్త్రీని, ఉమను, సమీపించెను… (ఆ బ్రహ్మము) మెరుపు మెరవడం వంటిది. కన్ను మూయడం వంటిది. మెరుపు మెరిసినపుడు కళ్ళు మూసుకోడం అసంకల్పితం. మళ్ళీ కన్ను తెరిచేసరికి మెరుపు మాయమవుతుంది. అవశము పరవశము, రెంటినీ కలిపి చెబుతున్నాడు ఎలియట్. రెండూ మనిషిని భయంకరంగా ఊపేసే క్షణాలే.

ఉపనిషత్తు ‘దత్త’లో, ‘నీది’ యివ్వడం చెప్పింది. ఎలియట్ ‘నిన్ను’ యిచ్చుకోడం చెబుతున్నాడు. ఉపనిషదర్థానికి విస్తృతిని, కావ్యత్వాన్ని కల్పించాడు ఎలియట్.

దయధ్వమ్

DA
Dayadhvam: I have heard the key
Turn in the door once and turn once only
We think of the key, each in his prison
Thinking of the key, each confirms a prison
Only at nightfall, aethereal rumours
Revive for a moment a broken Coriolanus

ఉపనిషత్తు యీ ఉపదేశం ఎవరికి చేసింది? అసురులకు, అంటే యితరుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను రాక్షసంగా హరించి నిర్బంధించే స్వభావం ఉన్నవారికి. ఇతరులను కారాగారంలో బంధించినవాడు, తన అహంకారమనే కారాగారంలో, తనకు తాను నిర్మించుకొన్న కారాగారంలో బందీ. తాళపుచెవి ఒక్కసారే తిరుగుతుంది, తలుపు వేసి మూసేటప్పుడు. మనమందరం, అహంకారకారాగారంలో బందీలమే. ఆ తాళపుచెవి రెండవ చప్పుడు కోసం (తలుపు తెరిచే చప్పుడు) ఎదురుచూస్తూనే మన జీవితం గడిచిపోతుంది (I have heard the key/ Turn in the door once and turn once only). తలుపు వేసుకొనేది నేను. కాని, తీయడం నా చేతిలో లేదు. మరెవరైనా అనుగ్రహించవలె. అనుగ్రహించేవాడున్నాడంటారు. అసలున్నాడా? కలడో లేడో (aethereal rumours) వట్టి పుకారులేనేమో?

షేక్‌స్పియరు నాటకంలో కొరియోలేనస్‌ను ప్రస్తావిస్తున్నాడు. తన నగరంపై శత్రువులు దాడి చేస్తే, యుద్ధం చేసి వారిని తరిమివేశాడు. కాని, అతని అహంకారకారణంగా ప్రజలు అతనికి తగిన ఉన్నతపదవి యివ్వరు. అతడు కోపంతో, తాను ఓడించిన శత్రురాజుతో సంధి చేసుకొని, తన ప్రజలపైనే దండెత్తి వస్తాడు. తన తల్లి మాటను మన్నించి తిరిగి వెళ్ళిపోతాడు. కాని అక్కడి వారు, అతడు యుద్ధం చేయకుండా తిరిగిరావడాన్ని హర్షించరు. అతనిని వారు చంపుతారు.

ఈ కథను ఎలియట్ ఎందుకు ప్రస్తావించినట్టు? కొరియోలేనస్ స్వభావం రాక్షసమా? అతడు వీరుడు. కాని అతడు యుద్ధం చేసింది, తన నగరప్రజలను శత్రువులనుండి కాపాడడానికి కాదు. ప్రజలపై ప్రేమతో కాదు. తాను గొప్ప వీరుడని లోకానికి చాటడానికి. ఈ అహంకారంలో అతడు బందీ. అందులోనే అతడి జీవితం ముగుస్తుంది (each in his prison/Thinking of the key). ఎప్పుడో, మెరుపులా ఒక్కసారి బందిఖానా తాళం తీస్తున్న చప్పుడవుతుంది, కొరియోలేనస్‌‌కు తల్లి రూపంలో లాగా. కాని, వచ్చినా, అది జీవితం ముగిసే ముందు (Only at nightfall). ఆ అవకాశం అందుకోలేనంత ఆలస్యంగా వస్తుంది. దయధ్వమ్ సందర్భంలో యీ కథ ఏమిటి? అహంకారం తనను తోటివారినుండి దూరం చేస్తుంది. సాటివారితో మెలగలేని వాడు, అహంకారంతో తన గేటు తలుపులు వేసుకొని, తనను తాను బందీ చేసుకొంటున్నాడు. అంటే, ఎలియట్ ఏం చెబుతున్నాడు? దయచూపు అనడం లేదు. అహంకారం దయనీయము అని చూపుతున్నాడు. ‘ముందు నిన్ను నీవు కాపాడుకో’ అంటున్నాడు.

ఉపనిషత్తు చెప్పిన ‘దయధ్వమ్’కు ఎలియట్ చెప్పిన స్వీయభాష్యం యిది. కొరియొలేనస్‌కు తోటివారిని సాటివారుగా చూడలేని అహంకారం. అహంకారం లేని ప్రాభవం ఎట్లా ఉంటుంది? ఈ పద్యం చూద్దాం:

పసగన్ వే చని దోర్బలంబున రణప్రావీణ్యముంజూపి నీ
వసురానీకము ద్రుంచి భూప్రజలకున్ హర్షంబు గావించి రా
క సుమీ రాక జయంబు లేక ప్రజ దుఃఖంబొందగా రాక నీ
యసువర్గంబుల పోకగా నెరుగు పెక్కాడంగ నింకేటికిన్.

ఒక రాజ్యంపై శత్రువులు దండెత్తి వచ్చారు. ఆ దేశపురాజు, తన సేనాధిపతికి యిస్తున్న ఆదేశం యీ పద్యం, మంతనం కాదు, స్వపరబలాబలాల విచారణ లేదు. ‘నీవు యింద్రుడివి మహేంద్రుడివి’ అని ఉబకేయడం లేదు. (త్వమస్త్రవిత్ శస్త్రవిదాం వరిష్ఠ /సురాసురాణామపి శోకదాతా/ ఇంద్రేషు సేంద్రేషు చ దృష్టకర్మా… సుందరకాండలో రావణుడు, ఇంద్రజిత్తును, తన కొడుకే అయినా, పొగిడినట్టు.) ఈ పద్యంలో ప్రతి పదంలో ప్రాభవం తెలుస్తోంది. ఒక్క మాట అదనంగా లేదు. మాటాడిన మాట ఎట్లా ఉంది? సర్వసైన్యాధ్యక్షుడైన ప్రభువు, సేనాధిపతితో ఎట్లా మాట్లాడాలో అట్లా ఉంది: భూప్రజలకున్ హర్షంబు గావించి రాక సుమీ రాక, జయంబు లేక ప్రజ దుఃఖంబొందగా రాక, నీ యసువర్గంబుల పోక. కదనభూమిలో కత్తి మాటాడినట్టున్నది. (రాక, రాక, లేక, రాక, పోక.)

పెక్కాడంగనింకేటికిన్ – అంటే ‘యింతకంటే నేను చెప్పవలసినది లేదు’ అని కాదు అర్థం. ‘నీవు మాట్లాడవలసిన పని లేదు. పని చూడు, మాటలు వద్దు’ అని అర్థం. (I don’t want to hear explanations. I want result. Job done, or your head gone అంటున్నాడు.) సేనాధిపతి అతని ‘భృత్యుడు’. కాని, యీ పద్యంలో తెలుస్తున్నది అహంభావం కాదు, ప్రాభవం. రఘువంశపు రాజుల గురించి, కాళిదాసు ‘సత్యాయ మితభాషిణామ్’ అన్నాడు. దీనికి, మితభాష్యకారుడు మల్లినాథుని వ్యాఖ్య: ‘న తు ప్రాభవాయ’ మితభాషణం అసత్యదోషభయం చేత. అంతేకాని, ప్రభువును అన్న పొగరు వల్ల కాదు – అని వ్యాఖ్య. కాని, కొన్ని సందర్భాలలో ప్రభువు ప్రభుస్వరంతోనే మాట్లాడవలె. ఇది అటువంటి సందర్భమే. ఇటువంటి సన్నివేశము, యిటువంటి పద్యరచనాపటుత్వము (కాకువు), బహుశా ప్రపంచసాహిత్యంలోనే అరుదు. కాని, యిందులో ప్రస్తుతం మనం గమనించ వలసింది, ప్రభువు స్వరంలో ప్రాభవం ఉంది కాని, అహంకారం లేదు. ‘యుద్ధంలో పరాజయం నాకు పరాభవం’ అనడం లేదు రాజు. ఒకే ఒక విషయం చెబుతున్నాడు. ‘భూప్రజలకున్ హర్షంబు… ప్రజ దుఃఖంబొందగా రాక…” తన గురించి ఒక్క మాట లేదు. జయం తనకు కాదు, తన కొరకు కాదు, తన రాజవైభవం కొరకు కాదు. ప్రజల కొరకు. కొరియోలేనస్‌కు లేనిది, అంబరీషునికి ఉన్నది ప్రజలపట్ల ప్రేమ. (అవును, యీ పద్యంలో ప్రభువు అంబరీషుడు. ఆం. మ. భా. శాంతి. 4. 433.) ఇదీ ఉపనిషత్తు చెప్పిన ‘దయధ్వమ్’కు ఎలియట్ చెబుతున్న భాష్యం.

దామ్యత

DA
Damyata: The boat responded
Gaily, to the hand expert with sail and oar
The sea was calm, your heart would have responded
Gaily, when invited, beating obedient
To controlling hands

ఉపనిషత్తులో, ప్రజాపతి ఉపదేశంలో మొదటిది ‘దామ్యత’. ఇది దేవతలకు ఉపదేశం. దేవతలు యింద్రియనిగ్రహం లేనివారు, కనుక వారిని యింద్రియనిగ్రహం అలవరచుకొమ్మని ఉపదేశం. (అదాంతా యూయం స్వభావతః, అతో దాంతో భవ. శం. భా.) అంటే, దేవతలలోని సుఖప్రియత్వాన్ని, ముఖ్యంగా కామప్రవృత్తిని, నియమించుకోమని ఉపదేశం. దేవతలలో చేర్చదగినంతగా ఎదిగిన మానవులలో కూడా, యీ కామప్రవృత్తి ఎంత బలంగా ఉంటుందో చెబుతున్నది యీ ఉపదేశం. కాని, ఎలియట్ యిక్కడకూడా తన స్వంత భాష్యం చెబుతున్నాడు. దమం కామవిషయంగా గ్రహించలేదు. అసలు మూడు ‘ద’లను విడివిడిగా కాక, మూటిలోను ఉన్న సామాన్యాన్ని పట్టుకోవలెనని ప్రయత్నిస్తున్నాడు. మూడు ‘ద’లు, సత్త్వరజస్తమస్సులు. అంటే, త్రిగుణాత్మికయైన ప్రకృతి.

ఆ ప్రకృతి గుండె చప్పుడు వినడమే దమమని అంటున్నాడు ఎలియట్. ప్రకృతి గుండెపై చెవి ఒగ్గి వినగలిగితే, నీ గుండె వేరుగా కొట్టుకోదు, ప్రకృతితో కలిసి కొట్టుకొంటుంది. పడవ నడపడంలో అనుభవం ఉన్నవాడు, సముద్రపు గుండె చప్పుడు వినగలడు. శాంతసముద్రంలో పడవ సంతోషంతో స్పందిస్తుంది. సమర్థుడైన కైవటుని చేతులలో (beating obedient/To controlling hands) ప్రయాణం సుఖంగా సంతోషంగా క్షేమంగా సాగుతుంది. నీ గుండె ప్రకృతితో ప్రతిస్పందించి ఉండేది, కాని నీవు మాట వినలేదు (your heart would have responded). సముద్రాన్ని శాసిస్తానంటావు. పడవ నేనే నడపగలను అంటావు. ఫ్లీబస్ ఏమైనాడో తెలుసుకదా? (O you who turn the wheel: Death by Water.)

దమమంటే, ప్రకృతితో లయ కలిపి, ప్రకృతిలో లయమై, ప్రకృతిగా మారి ప్రవర్తించడం అని భాష్యం చెప్పాడు ఎలియట్. శాస్త్రానికి కావ్యరూపమిచ్చాడు.

‘ఏరుకున్న ముక్కలు కాక, ఎలియట్ కవితలో అతనిదంటూ ఏముంది’, అని కొందరంటారు. ‘ఉపనిషత్తులు ఎలియట్ దగ్గర నేర్చుకోవాలా? తాతకు దగ్గులు నేర్పుతాడా? మేం పుట్టి పెరిగింది ఉపనిషత్తులలో’ అంటారు మనవాళ్ళు కొందరు. ఎలియట్ ఏ మూలంనుండి ఏది గ్రహించినా, దానిని స్వంతం చేసుకొంటాడు. తీసుకున్నంత తిరిగి యిస్తాడు కూడా.

ఒక కవి తన రచనలో పూర్వసాహిత్యపు నీడలు పడకుండా, దానిని ఎంతగా తిరస్కరిస్తూ, దానికి ఎంత భిన్నంగా రాయగలిగితే అతడు అంత స్వయంప్రతిభ కల రచయిత అంటుంటాం. ఈ సాధారణ అభిప్రాయానికి విరుద్ధంగా ఎలియట్, ఎవని రచనలో పూర్వకవులు తాము అమరులమని బలంగా ప్రకటించుకొంటారో, అతడు నిజంగా స్వయంప్రతిభ కలవాడు, అంటాడు. అతడు నిజమైన నవ్యకవి.

‘… we shall often find that not only the best, but the most individual parts of his work may be those in which the dead poets, his ancestors, assert their immortality most vigorously.’ (Tradition and the Individual Talent.)

‘కవిప్రతిభలోననుండు కావ్యగతశతాంశములయందు తొంబదియైన పాళ్ళు.’ విశ్వనాథ, సంప్రదాయానికి పది మార్కులు వేస్తాడు. ఎలియట్ తొంబది వేస్తాడు, సంప్రదాయాన్ని సొంతం చేసుకోడమే స్వయంప్రతిభ కనుక.

(సమాప్తం)