జలదృశ్యం

చూపుడు వేలుకు గోరునామ
తడ తడ పెట్టినట్టు బాధ పడడం ఎందుకు
ఇంతకీ ఏమైంది అనడిగాను.

మా చిన్నన్న చేయించి
తీసుకొచ్చి ఇచ్చిన వస్తువు
విరిగిపోయిందంది.

ఆ ఉదయం వంటింట్లోని పనులను
ఓ గంట వాయిదా వేసింది.
సకలాన్ని అకాలం చేసి
మౌన నిరసనను తెలిపింది.

ఆమెకూ దానికీ వున్న
నాలుగు దశాబ్దాల అనుబంధం
మా ఆవిడ రక్తాన్ని
అది ఎన్నిసార్లు కండ్ల చూసిందో…

చేయించి తెచ్చిన ఈలపీటతో
కూరగాయలు కోస్తూ
ఏమి జ్ఞాపకం వచ్చిందో ఏమో
కళ్ళ నిండా జలదృశ్యం

ఏమైనా బంగారు తునకనా అన్నాను
బంగారు తునకో వెండి తునకో
ఆ మాత్రం ఇనుప ముక్క కూడా లేదంటూ
మా పేదరికాన్ని ఎత్తి చూపింది.

అందరూ అమాయకురాలు అంటారు కానీ
ఆమె గడసరితనం నాకు మాత్రమే తెలుసు.