ఎండ నీరెండగా మారుతున్న సాయంత్రపు వేళ రైలందుకోవడానికి బయలుదేరావు. దారికి ఇరువైపులా పసుపు పచ్చని పూలదుప్పటి పరచినట్లు ఆవపూల పంట. ఈ ఊరిని, పరిసరాలని, ఈ జీవితాన్ని ఇలా వదిలి వెళ్ళడం నీకు మొదటిసారి కాదు. అలా అని అంత సులువేమీ కాదు. విడిచి వెళ్తున్న నీకే ఇంత కష్టంగా వుంటే ఇక వీడుకోలు ఇవ్వడానికి అంటిపెట్టుకొని వస్తున్న ఆమెకి మరెన్నో రెట్లు కష్టంగా వుంటుందని తెలుసు నీకు. అందుకే ఉదయం నుండి సహజంగా కనిపించే ప్రయత్నాలే చేశావు.
వీడుకోలు సమయంలో నవ్వుతూ నవ్విస్తూ బాగానే నటించావు. బండి కదిలాకే ఇక నటించాల్సిన అవసరం లేకపోయింది. గుండెల్లో తడి కాస్త ముఖంలోంచి ఆవిరవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఓ రెండుసార్లు లేచి మొహం కడుక్కొని వచ్చావు. ఇదంతా చూసీ చూడనట్లు చూస్తూనే వున్నాడు నీ ఎదుటి సీట్లో కుర్రాడు. ఆ అంటకత్తెర క్రాఫ్వాడు. నీలాంటి దుస్తులే వేసుకున్నవాడు. చెలిమి చేసే ప్రయత్నంలో ఊర్లు, పేర్లు కలబోసి భయ్యా అంటూ వరస కూడా కలిపాడు.
మరో చోటో, మరో పరిస్థితిలోనో వీడు ఎదురైతే తనపట్ల నీ ప్రవర్తన వేరుగా వుండేదేమో! ఇప్పుడు నువ్వేమో ఏకాంతం కోరుకుంటున్నావు. ఈ కంపార్ట్మెంట్ అంతా ఓ ఆల్చిప్పగా మారి నువ్వందులో ముడుచుకుని – నీ వాళ్ళతో గడిపిన రోజులు తలుచుకుంటూ – గుండెల్లో పేరుకున్న వ్యధని కరిగించాలని నీ కోరిక. వాడి హావభావాలు చూస్తే ఏ చిన్న అవకాశం ఇచ్చినా నీ పరిధిలోకి వచ్చి నీ ఊహలన్నీ ఛిన్నాభిన్నం చేసేలా వున్నాడు.
వాడిని పట్టించుకోకుండా కిటికీలోనుండి బయటకి చూస్తుండిపోయావు. గోధుమ చేలు దాటుకుని – వాగులు, వంతెనల పైనుండి సాగి – వేగంగా వెళ్ళి వెళ్ళి రైలు నెమ్మదించింది. దూరంగా మరో ఊరు నీ కంటపడింది.
తడిసి బరువెక్కిన కనురెప్పలని, చొక్కా చేతి మడతలలో ఇంకిపోయిన తడిని గాలికి ఆరేసుకున్నట్లు ఉంటుందని తలుపు దగ్గరకొచ్చి నిల్చున్నావు. స్టేషన్లో బండి ఆగి చూస్తే – దూరంగా ఓ చిన్న ఊరు. అచ్చు నీ ఊరు లాంటి ఊరు. ఆ చల్లగాలికి మండుతున్న కళ్ళు మూసుకుంటే నీ వాళ్ళంతా అక్కడే వున్నట్లుంది. బెంచి పైన కూర్చున్న పెద్దమనిషి ఎవరో కానీ అచ్చు నీ తండ్రిలానే వున్నాడనిపించింది.
కర్చీఫ్ కోసం జేబులో చేయిపెడితే తగిలింది. వెళ్ళాక చూడు అంటూ ఇంట్లోంచి వచ్చేముందు జేబులో ఆమె వుంచిన కవరు. తీసి చూస్తే ఓ ఫోటో మరింక ఓ మడత పెట్టిన కాగితం. ఫోటోలో నీ పాత యూనిఫామ్ వేసుకుని, కాటుకతో మీసాలు దిద్దుకుని ఆమె. పక్కనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్న పిల్లలు. కాగితం విప్పి చూశావు. చదువుతుంటే వెనుకగా వచ్చి చెయ్యి భుజంపైన వేసి నీతో చెపుతున్నట్లేవుంది. ‘చూశావుగా! నువ్వులేని లోటు పిల్లలకి తెలియకూడదని ఆ వేషం వేస్తే ఎలా నవ్వుతున్నారో. అప్పుడప్పుడూ అడుగుతుంటారు నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావని. అసలెప్పుడు తిరిగి వస్తావో ఖచ్చితంగా తెలియకపోతేనే వాళ్ళకీ నాకూ కూడా హాయిలే. ఎదురుచూసే పనిలేదు…’ అప్పటికే చెమ్మగిల్లిన కళ్ళకి అక్షరాలు కదలిపోయి ఆపైన చదవడం కష్టం అయింది నీకు.
రైలు కదిలి వేగం అందుకుంది. ఊరు కనుమరుగైంది. కొండ వాలులో వంపులు తిరుగుతూ వెళ్తున్న రైలు తిరిగి ఎక్కిన చోటికే తీసుకువెళ్తోందేమో అనిపించటం కేవలం నీ భ్రమ.
తెచ్చుకున్నవి తిని నీళ్ళు తాగే సమయానికి బండి పొలిమేరలు దాటి మరో రాష్ట్రంలో మరో ఊరుని చేరింది. ఆ ప్లాట్ఫామ్ పైన బన్ను రొట్టెలు అమ్ముతున్న కుర్రవాడు – చేతిలో బిడ్డతో రైలెక్కుతున్న ఆడపడుచు – ఎంతో ఆత్మీయంగా అనిపించారు నీకు. దాటి వెళ్తుంటే ఛాయామాత్రంగా కనిపిస్తున్న ఆ ఊరి వీధులు, అరుగులు, ఇళ్ళ పైకప్పులు సమస్తం నీకు పరిచితంగానే తోచాయి.
సరుగుడు చెట్ల మధ్య నుండి సాగి సాగి – మరికొంత సమయం అడవి మార్గంలో ప్రయాణించి, రైలు సరిహద్దుకేసి దూసుకుపోసాగింది. చిక్కటి చీకటి అడవిపైనుండి కమ్ముకురాసాగింది.
కదిలిపోతున్న చెట్ల నీలినీడలు తిరిగి ఏవేవో గుర్తు చేస్తున్నాయి. నా అన్న జీవితం నుండి కొనసాగి – ఊరు, రాష్ట్రం, దేశం అంటూ సరిహద్దులు గీసుకున్నాక – ఆ హద్దుకి ఆవల – అది నీ దేశం కాదనుకున్నప్పుడు విచిత్రంగా ఇంతకు ముందు అక్కడి వారెవరూ నీవాళ్ళుగా తోచలేదు. గాలికి, నీటికి, వలస వెళ్ళే పక్షికి లేనీ సరిహద్దులు కేవలం ఈ మనిషికే ఎందుకూ అన్న ఆలోచన నిన్ను కొత్తగా వెంటాడుతోంది.
మొన్న జరిగిన యుద్ధంలో మొదటిసారి పాల్గొని అటుపక్క వాళ్ళని నీ మారణాయుధాలకి బలి చేసినప్పుడు – చిన్నారుల ఆసుపత్రులని, సామాన్య జనాన్ని తోటివారితో కలిసి నేలకూల్చినప్పుడు – దేశానికి నీ వంతు న్యాయం చేశాననుకున్నావు. యుద్ధవిరామంలో ఇంటికి వెళ్ళి నీవాళ్ళని చూశాకే కదా – ఆ చిన్నారులు, ఆ వ్యక్తులు పదేపదే గుర్తుకొచ్చారు!
ఊరిలో బంధువులు, స్నేహితుల మధ్య – మోసుకొచ్చిన బరువేదో దించుకునే సావకాశం కాని – ఆ వ్యధ తాలూకు భారం తగ్గించుకునే అవకాశం కాని ఇంతవరకూ నీకు చిక్కలేదు. అందుకే, మనసారా ఏడ్చే ఆ అవకాశం కోసమే గుండె చిక్కబట్టుకుని ఇంతసేపు ఎదురుచూశావు!
క్రింద బెర్తులో చిన్నోడు గుండెల పైన చెయ్యేసుకుని నిద్రపోతున్నాడు. బోర్లా తిరిగి దిండులో మొహం దాచుకున్నావు. రైలు కుదుపుల ధ్వనిలో నీ రోదన కలిసిపోయిందిలే! మరతుపాకి పట్టుకున్నంత మాత్రాన మరమనిషివి కాదుగా!