(అ)పరిచితుడు

ఈమధ్య అతడు తరుచుగా కనిపిస్తున్నాడన్న విషయం నేను నా భర్తకి చెప్పలేదు. నా పెళ్ళినాటికే వాళ్ళ రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదని వాళ్ళూ వీళ్ళూ చెప్పుకోగా విన్నాను. ఎప్పుడో దూరంగా వెళ్తూ కనిపించినప్పుడు అదిగో వాడే ఫలానా అని మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన వరుసకి ఆడపడుచు చెప్పడం ద్వారానే నాకు అతను ఎవరో ఏమిటో తెలిసింది. మరోసారి ఏదో పెళ్ళిలో అల్లంత దూరం నుండే చూసి నా భర్త మొహం తిప్పుకుని కుడివైపుకెళ్ళి కూర్చుంటే అతడు అంతకన్నా పెడసరంగా ఎడమవైపుకి తప్పుకోవడం నా కంటపడింది. వారి వారి తండ్రుల విభేదాలకి విలువిచ్చే అలా చేసేవారో లేక వీళ్ళిద్దరి మధ్య కూడా కనిపించని స్పర్థ ఏదైనా వుందో నాకైతే తెలియలేదు.

ఈ ప్రపంచం ఎంత వింతైనదంటే, ఒకే వీధిలో ఏళ్ళ తరుబడి వుంటూ కూడా పలకరించుకోకుండా, ఎదురైతే కనీసం నవ్వకుండా జీవితాలు గడిపేసేవాళ్ళు ఎందరో?! అందులో ఇతడు పరాయివాడికన్నా ఎక్కువే. అందుకే ఎదురైతే ముభావంగా పక్కకి తప్పుకునిపోయే మేమిద్దరం మాట్లాడుకోవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ నిన్నటి రోజున అదే జరిగింది.

కూరల నాణ్యత ఎంచుకునే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వుంటుంది. నిన్ననలాగే అనుకోకుండా మేమిద్దరం ఒకే అంగడిలో కూరలు కొనాల్సివచ్చినప్పుడు నేను దూరంగా నిల్చుని అతడి ఎంపికని చూస్తున్నాను. నేను ముందుగా వచ్చి బేరమాడుతున్నప్పుడు–పక్క పక్కనే నిల్చుని ఏరుకునే అవకాశం వున్నా–అతడు నాలాగే దూరంగా వుండి తన వంతు కోసం ఎదురు చూస్తాడు. దీన్ని బట్టి చూస్తే నేనెవరో అతడికి తెలుసునని నాకనిపించేది.

పచ్చిబఠాణీలు, పాలకూర కొని ముందుకు వెళ్తుండగా వున్నట్లుండి నా ముందు నుండి వస్తున్న జనం చెల్లాచెదురై పరిగెత్తసాగారు. వాళ్ళ తోపుడుకి తూలి నిలబడే లోపున ఎదురుగా కొమ్ములు తిరిగిన ఎద్దొకటి దూసుకురావడం కనిపించింది. కంగారుగా పక్కకి తప్పుకునే లోపల ఎదురుగా వస్తున్న బైక్ ఒకటి నన్ను రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోపల నేలపైన పడిపోయివున్న నన్ను అతడు ‘అరెరే!’ అంటూ లేపి నిలబెట్టాడు. పడడమే ఓ పక్కగా పడ్డానేమో శరీరంలో ఎడమ భాగమంతా నేలని తాకి రాసుకుపోయి నెప్పితో భగ్గుమంది. మోచెయ్యి పూర్తిగా చెక్కుకుపోయి రక్తం చారికలు కట్టింది. భయంతో మెదడు దిమ్మెక్కిపోయింది. నెప్పితో కళ్ళలో నీళ్ళుతిరిగాయి.

నా మొహంలోకి కంగారుగా చూస్తూ “అయ్యయ్యో! దెబ్బలు బాగా తగిలిపోయాయే! మీరు నడవగలరా వదినా? ఈ పక్క వీధిలోనే తెలిసిన డాక్టర్ వున్నాడు. వెళ్దాం అక్కడికి,” అన్నాడతడు. అప్పటికే నిలదొక్కుకున్న నేను మొహమాటంగా “వద్దులే కన్నబాబు! నేనింటి దగ్గర తెలిసిన డాక్టర్ వద్దకి వెళ్తానులే.” అన్నాను. అనుకోకుండా నేనలా పిలవగానే అతడి మొహంలో ఆదుర్దా తగ్గి తేటపడింది. వెంటనే అతడు ఆటోని పిలిచి “పక్క వీధిలోనే అమ్మని జాగ్రత్తగా దింపెయ్యి.” అంటూ “వెంటనే డాక్టరికి చూపించుకోండి వదినా!” అన్నాడు నా బ్యాగు ఆటోలో పెడుతూ.

ఆ సంఘటన జరిగిన వెంటనే నాకేదో తెలియని మంచి జరగబోతోందనిపించింది. కాని అదంతా నా ఊహ మాత్రమే. మా ఇంట్లో కోడళ్ళు ఏ విషయాలు మాట్లాడకూడదో, ఏవి ఎంత మటుకు ఆచి తూచి మాట్లాడాలో నాకు పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే తెలిసివచ్చింది. అది మరోసారి రుజువైంది. మూడు తరాలు దాటితే మరుగునపడిపోయే బాంధవ్యాల కోసం ఇన్ని స్పర్థలు నెత్తినేసుకుని జీవించాలా అని బాధేసింది. ఆ తరువాత కూడా మేము అప్పుడప్పుడూ ఎదురుపడుతూనే వున్నాం. ఇంతకుముందు లాగే ఒకరినుంచొకరం దూరంగా మసులుకునేవాళ్ళం. ఎటొచ్చీ ఎదురుపడినప్పుడు ఒకప్పటిలా నిర్లిప్తంగా కాకుండా మా చూపులు ‘కుశలమా?! బావున్నారుకదా!’ అన్నట్లు పలకరించుకునేవి.