తిమిరం

ముక్కంటి నీ వెంట 
తలపు పరుగుల పంట 
అమవాస ముందంట 
మాఘ నిశిలో మింట 
యేడనో నువ్వంట?
తుది మొదలు లేవంట 
తెలిసేది నాకెట్ట?

బూడిదా పూతెనక 
బూచోడివేనంట 
నెత్తురోడే బట్ట
ఏనుగూ తోలంట 
కట్టె కాలీనపుడు 
కాపు నువ్వేనంట
వేదాల రొదలోని 
కిటుకు నీ సృతియంట
గుడి గంట గణగణల 
డమరుకా నాదమెట?

మర్రి చెట్టూ మొదల 
దక్షిణా మూర్తివట 
రాకాసి గణములకు
రాయ జంగమవట 
జనులార్తికా నీ జడలోని గంగ?
నీ గొంతు మంటకా ఓ నీలకంఠా! 
కైలాస కుహరాన కలత చెందేనేమో 
కామాక్షి నణచేవు అర్ధ భాగాన?
దేవదేవుడు నీవు ధ్యానమెందుకు నీకు 
తామసప్రియ జగదంబ నేలు నీవు
ఆక్షేపణలవ్వి స్తుతియంటు మురిసేవు 
ఎపుడు తెలిసేనో నీకు ఓ ఉబ్బులింగా! 

ప్రణవాన ముదమోరి 
జులపాల నెగరేసి 
డమరుకధ్వానాల
తాండవమ్మాడేవు 
కళలన్ని సరి పేర్చి 
విదునికై విసిరేసి 

కాలికిందన నొక్కి 
కనికరించీ నన్ను
కుదురునొక పరియైన 
కూరిమీ నాకిస్తె, 
కూర్చి ఓ పొగడికను 
నే పాడగలనా?