నవంబర్ 2022

కలలూ కుతూహలమూ రెండూ పచ్చగా చిగుర్లేసే కాలం ఏ మనిషి జీవితంలోనైనా బాల్యమేనేమో. మనిషిగా శారీరకంగాను, మానసికంగానూ దృఢంగా ఎదగడానికి పౌష్టికాహారం, వ్యాయామం, మంచి సమాజం అవసరమైనట్టే మంచి సాహిత్యమూ అవసరమే. వీటిని కనీస అవసరాలుగా గుర్తుపట్టాలి. ప్రస్తుత తెలుగు సమాజంలో ఎదిగే పిల్లలకు వీటిలో ఏవి ఏరీతిన దక్కుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. మొదటినుండీ మన సమాజంలో పిల్లలకు గౌరవనీయమైన స్థానం లేదు. ఒదిగి ఉండటాన్ని అభినందించినట్టు ప్రశ్నించడాన్ని అభినందించడం; అమాయకత్వాన్ని అక్కున చేర్చుకున్నట్టు, పరిశోధకతనూ కుతూహలాన్నీ చప్పట్లు కొట్టి ఉత్సాహపరచడం ఉండదు. తమను ఇబ్బంది పెట్టే పిల్లల ప్రశ్నలను కొట్టిపారేయకుండా, పక్కకు నెట్టేయకుండా సమాధానం ఇవ్వడం కనపడదు. ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతున్నట్టు కనపడుతోన్నా, మారాల్సిన దానితో పోలిస్తే ఆ శాతం ఏమంత చెప్పుకోదగ్గది కాదు. కుతూహలం జ్ఞానాన్ని పెంచుకోవడానికి మొదటి మెట్టు. ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, ప్రశ్నించడం, జవాబులు వెదుక్కోవడం, సమాధానాలు సృష్టించుకోవడం, ఇవన్నీ పుస్తకాలు నేర్పిస్తాయి. అలాంటి పుస్తకాలు చదవడం ఎంత చిన్నవయసులో అలవడితే, అంత త్వరగా వాళ్ళు స్వతంత్రులవుతారు. ఈ చిన్నపిల్లలకు ఏ పుస్తకాలు కావాలి? ఆహ్లాదకరమో, ఆలోచనాసహితమో – అసలు బాలసాహిత్యం అంటే ఎలా ఉండాలో ఈ విభాగంలో కృషి చేస్తున్న ఎందరికి అవగాహన ఉంది? బాలసాహిత్యం అన్న చీటీ అయితే తగిలిస్తారు కానీ ఇప్పటికీ పిల్లలకు తగిన పుస్తకాలంటే ఠకామని చెప్పుకునేందుకు గట్టిగా పది పుస్తకాలైనా కనపడవు. తానా, మంచి పుస్తకం వంటి ప్రచురణలు ఈ ఖాళీలను గుర్తుపట్టి, పోటీలను పెట్టి తమ ప్రోత్సాహం ఉంటుందన్న హామీ ఇస్తున్నా, నిజానికి ఈ పోటీల్లో గెలుపొందిన పుస్తకాల స్థాయి, ఆ పుస్తకాల్లోని బొమ్మల స్థాయి చెప్పుకోదగినవిగా లేవు. పసి హృదయాలకు ఆసక్తి, ఇష్టం కలిగించడం సామాన్యమైన విషయం కాదు. కథకుడు ఎక్కడో ఆకాశంలో నిలబడి చెప్పే నీతి బోధలతోనో, బాలసాహిత్యం అనగానే లేనిపోని పెద్దరికాన్ని తలకెత్తుకుని ‘పిల్లలూ…’ అంటూ మొదలెడితేనో సాధ్యమయ్యే పని కాదు. నిజానికి అలా మొదలెట్టే రచయితలను కొరతవేసే చట్టం ఒకటి రావాలి. సమాజంలోనే పిల్లలను చూసే పద్ధతి, వాళ్ళతో సంభాషించే పద్ధతి, వాళ్ళను గౌరవించే పద్ధతి మారితే తప్ప; పిల్లలకు ఏం కావాలన్న దాని మీద కొందరికైనా కనీస అవగాహన, స్పష్టమైన అభిప్రాయం, దృక్పథం ఏర్పడితే తప్ప; బహుశా ఈ బాలసాహిత్య విభాగంలో లోటు పూడ్చలేనిదిగా ఉంటూనే ఉంటుంది. ఊహ తెలిసిన నాటి నుండి పిల్లలను చదువు అన్న చట్రంలోకి నెట్టి, వాళ్ళ ఊహలని, భవిష్యత్తుని ఉద్యోగం, హోదా, డబ్బు అన్న మాటల చుట్టూ అల్లి విప్పుకోలేని పీటముళ్ళతో వారిని బందీలను చేసే సమాజం సజీవంగా ఉన్నంతకాలం, పిల్లల సృజనాత్మకత గురించి, సంతోషం గురించి బెంగపడక తప్పదు. ఆ సమాజానికి బాలసాహిత్యం అతిశయోక్తి. అనవసరపు ప్రయాస. పిల్లలు చాలా తెలివైనవారని, ఎదిగే క్రమంలో ఎన్నో అనుభవిస్తారని, పరిశీలిస్తారని, మార్పులకు లోనవుతారని గ్రహించడం ముఖ్యం. వారి లోకాన్ని అంతే లోతుగా వారికి పరిచయం చేయడం అవసరం. పెద్దల ప్రపంచం లానే పిల్లల ప్రపంచమూ సంక్లిష్టమైనదని గ్రహించి ఆ గౌరవంతో రచనలు చేస్తే తప్ప మంచి బాలసాహిత్యాన్ని ఆశించలేం. ‘పిల్లలకేమండీ చీకూ చింతా లేని ప్రపంచం’ అనే వారెవరికీ బాల్యం గుర్తు లేదనో, అర్థం కాలేదనో, అసలు లేదనో అనుకోవాలి. ఇతరదేశాల్లో వస్తున్న బాలసాహిత్యపు మేలి రచనలను, మన పిల్లలతో పాటు ఇలాంటి పెద్దవాళ్ళకీ పాఠాలుగా చెప్పాలి.