ష్‌! ఆమె పని చేసుకుంటోంది

ఏం పని? ఎవరి కోసం? సమాజం? స్వవ్యక్తీకరణా? కుటుంబశ్రేయస్సా?

ష్‌! ప్రశ్నలు వద్దు. కొలమానాలు వద్దు. ప్రశంసలు? అభిశంసలు? ఆనంద విషాదాలు కలిగించలేవు.

అంతేకాదు. ఎవరు ఏం రాసినా చదివే మనం మన శక్తుల మేరకే చదువుతాం. ఆసక్తుల మేరకే ప్రతిస్పందిస్తాం. రాతని ఎలా ప్రభావితం చేస్తుందో అలాగే చదువునీ ప్రభావితం చేస్తాయి సామాజిక ఉనికి, సామాజిక సందర్భం.

తొంభై ఏళ్ళు పనిచేసింది. చేస్తోంది. అదేంటదీ? స్టిల్‌ గోయింగ్‌ స్ట్రాంగ్‌. అయినా అలసట లేదు. చూడండి ఆమె వేళ్ళు. కలలు చెక్కే అంగుళులు. అవే ఆమె కలాలు.

జీవితం గడిచిపోయినదే. అనుభవం మిగిలిపోయినదే. అది అనంతం. ఎవరిది వారిదే. దాన్ని నెమరు వేసుకోటమే మానవ సామాజిక ప్రస్థానానికి ఇంధనం. ఆ వేళ్ళు చెక్కే శిల్పాలకు ముడిసరుకు.

ష్‌! నంబూరి పరిపూర్ణ పని చేస్తూనే ఉంది. చేసుకుంటూనే ఉంది.

ఏం? ఎవరూ 90ల వరకూ పని చెయ్యలేదా?

నిజమే! బెర్ట్రండ్‌ రసెల్‌ చేశాడు. మామిడిపూడి వెంకట రంగయ్య చేశాడు. మాస్తి, కన్నడిగుల ఆస్తి చేశాడు. విన్నాను. కాళీపట్నం రామారావు? నిజమే. కళ్ళతో కన్నాను.

ఎందుకో, ముసిలివాళ్ళు పనిచేస్తే అబ్బురంగా ఉంటుంది. అపురూపం అనిపిస్తుంది. వణికే చేతులతో అక్షరాలు ఏరి వాక్యాల దండలు కడుతుంటే… అందులో దారం ఆలోచనల ధారని కనబరుస్తుంటే… అహో! అది ఒక ఉత్సవం. ఒక సంభ్రమం. దానికదిగానే ఒక సౌరభం.

నిజమే! గడవక పని చెయ్యటం బాధాకరమే. గడుస్తున్నా పని చేయటం మాత్రం శ్రేయస్కరం. శోభస్కరం.

ఎప్పుడు మొదలయింది ‘ఆ’ పని? అసలు ‘పని’ ఎప్పుడు మొదలవుతుంది ఎవరికైనా? అమ్మ స్తన్యాన్ని అందుకోవటంతోనే గదా? అది ఒక ఆరంభం. దానికి లింగ వివక్ష లేదు.

అది మలుపు ఎప్పుడు తిరుగుతుంది? అమ్మగా స్తన్యాన్ని అందించటంతోనే గదా. అవును. మానవజాతిలో సగానికి మాత్రమే లభించే అనుభవమే అయినా మానవజాతి మొత్తాన్ని ఇప్పటి వరకూ ఉంచిన, పెంచిన దైహిక స్థితి అదేకదా? ఇది మరో ఆరంభం. ఆ ఆరంభంలో కాయం ఉంది. దానికి ఎదిగే అవసరం ఉంది. తిండికోసం తడుముకునే పెదాలు ఉన్నాయి. దాన్ని మాత్రం కోరుకునే పాంచభౌతిక చైతన్యం ఉంది. ఆ తిండికీ ఈ ఎదుగుదలకీ ఉన్న సంబంధం తెలియనితనం ఉంది.

మరో ఆరంభం నాటికి? మరో వ్యక్తితో ముడి అగత్యం. దానికి సామాజిక సమ్మతి, కొండొకచో అసమ్మతీ ఉంటాయి. సందర్భాలు వేరు. సన్నివేశాలు వేరు. ఏ స్థితైనా సమాజ యోచనే.

పరిపూర్ణ సందర్భంలో ముడివడిన వ్యక్తికి ఆశయాలు ఉన్నాయి. అవసరాలూ ఉన్నాయి. ఆశయాలు మస్తిష్కానివి. జ్ఞానానివి. తత్సంబంధిత చైతన్యానివి. అవసరాలు సామాజిక ఉనికికి సంబంధించినవి. సామాజిక స్థితితో పేగుబంధం ఉన్నవి.

ఆ రెంటికీ పొసగదు. ఆ పొసగక పోవటం కొత్తదేం కాదు. ప్రత్యేకమైనదీ కాదు. ఆధునిక మానవ ఆవిర్భావం నుంచీ ఉన్నదే. ఆ ఘర్షణలో విజేతలను గుర్తిస్తుంది సమాజం. ఆ విజేతల మొత్తం జీవితంలో పరాజిత సందర్భాలను, పలాయనాలనూ మరుగుపరచటానికి తదనంతర తరాలు ప్రయత్నించటం కూడా సామాన్యమే.

అనుభవించే నాటి పరిపూర్ణ సంగతి మనకి తెలియదు. మనం ఇచ్చే తీర్పులతో ఆమె అనుభవించినది మారదు. మన దాచివేతలతో ఆమె గత వాస్తవాలు కొత్త అందాలు సంతరించుకోవు. అనుభవాలని చిలికి, చిలికి ఆమె మనకిచ్చిన వెన్నముద్దలు తిన్నాం.

ఆలోచించే ఈ పరిపూర్ణని గమనిస్తే అతని ఆశయాల కోసం, వాటిని తనూ ఆమోదించినా, తన రెక్కల కష్టాన్ని వాడుకున్నది ఆశయాల కోసమే అన్న అవగాహన కనిపిస్తుంది. అంతేకాదు, అవసరాల బలహీనతలో తనకి దూరమయాడని క్షమించే పరిపూర్ణత కూడా ఈ పరిపూర్ణలో కనిపిస్తుంది. క్షమయధరిత్రీ అనే ఆర్యోక్తితో వేసిన శృంఖలాలు ఆమెవి కావని మనకి తెలిసిపోతూనే ఉంటుంది. లింగ వివక్షపై పోరాట దినాలివి. దోషం సమాజానిదనే అవగాహనకి ఇంకా రావలసి ఉంది. ఈ దశలో ఆమె సమవయస్కులు కూడా స్వవివేచనని కాస్త పక్కన పెట్టటం మనం గమనించవచ్చు. అయినా, ఇదంతా చూస్తూ కూడా – ఫిర్యాదీ స్వరం లేకుండా రాయటం పరిపూర్ణలో మనకి కనిపిస్తుంది. నిజమే. ఫిర్యాదీ స్వరానికి ఉన్న ఆకర్షణ పోరాట స్వరానికి లేదు. పోరాటాల తొలిదశలో ఫిర్యాదీ స్వరానికి చెల్లుబడి ఉంటుంది. బలపడే పోరాటాలు ఆ చెల్లుబడిని కలకాలం అంటిపెట్టుకుని ఉండవు. ఫలితాల పట్ల అవగాహన కలుగుతుంది. అది విధాన నిర్ణయం చేస్తుంది. వ్యక్తుల మీద నుంచి వ్యవస్థల మీదకి చూపు విస్తరిస్తుంది. గతపు బురద నుంచి భవిష్యత్తు ఒడ్డుకి అవి చేరగలుగుతాయి. ఇదంతా పరిపూర్ణ ఈనాటి పనిని లోతుగా గమనిస్తే తెలుస్తుంది.

అయితే ఆనాటి పరిపూర్ణది? జీవితపు సామాజిక నిశీధిలో వెలుగుదారులు వెతికే పని.

స్తన్యాన్ని వదిలి ఆహారాన్ని కోరే మూడు నోళ్ళు. సమాజం పట్ల ప్రతిస్పందనలతో మార్గదర్శకత్వం కోసం ఆరాటపడే మూడు జతల కళ్ళు. జంటగా మోయవలసిన భారం ఒంటరి భుజాలపై పడింది. అప్పుడు ఆమెది జీవితంతో పోరాటం. వాస్తవమైన పని ఆరంభమయింది. ఆహారం ఇచ్చింది. ఆలోచనలు ఇచ్చింది. ఉన్నంతలో ఆనందించటం, ఆనందాన్ని పంచటం మప్పింది. ఏ మనిషైనా తల్లి గర్భపు చీకటిలోంచే వస్తాడు. సమాజపు చీకటిలోనే వెలుతురు కోసం తడిమిట్లాడుతాడు. లభించిన వెలుతురుతో చీకటితో పోరాటానికి దిగుతాడు. అందుకు వ్యక్తులతో చేతులు కలుపుతాడు. ఇదంతా పరిపూర్ణ తనకి చేతనైన పద్ధతిలో తెలియజెప్పింది. జీవించటం నేర్పింది. దొరికిన పిడికెడు వెలుతురునీ పదిమందితో పంచుకోవటమే వెలుగుదారి అంది. సమాజపు నిశీధిలో వెలుతురు చూసే చూపు, పంచే నేర్పు ఆ పసి మనసులలో నింపింది.

అలా ఆలంబనలకు, యాత్రానుభూతులకీ విత్తులు నాటింది.

అప్పుడామె ‘ఆ’ పని ఆరంభించింది. ‘ఆ’ పనికి రాత సాధనమని ఆమె గ్రహించింది. అందుకు బిడ్డని చూసి రాతని ఆరంభించాననటానికి ఆమె అహం అడ్డుపడలేదు. ఆ సాధనంతో- ఎర్ర లచ్చుప్పకి ప్రాణప్రతిష్ఠ చేసింది. మాకూ ఉషస్సులు ఉన్నాయంది. తాను కనుగొన్న వెలుగుదారులను నలుగురికీ చూపించింది.

ఆమె పరిపూర్ణా?

కాదు. అయే అవకాశం లేదు.

ఎందుకు? పరిపూర్ణత మానవ స్వప్నం. చైతన్య సాధన. అది స్థలకాలబద్ధం. అంతే.

మరెందుకు పాదాభివందనం చేశావు ఆరోజు?

అహాన్ని జయించటానికి, జయించానని నమ్మించుకోటానికి చేశానేమో? ఆచారం సంస్కృతుల కోసం తలిదండ్రులకి చేశాను. ఒక దేహం లోనే ఉత్తమాంగం, అధమాంగం అనే గణన సమాజ కల్పన. దానిపట్ల నాకు గౌరవం సరే కించిత్తు కూడా నమ్మకం లేదు.

మధ్యలో నీ సోది ఎందుకు?

పాదాభివందనాలు గౌరవానికి ప్రతీకలు మాత్రమే అని చెప్పటానికి.

ఆమె పరిపూర్ణ కాకపోయినానా?

అవును. పరిపూర్ణులను మాత్రమే గౌరవిస్తామంటే మనం పాదాభివందనం చేయదగిన వారు కంటబడరు. పరిపూర్ణులు, ముక్తి ప్రదాతలు, జ్ఞానసంపన్నుల కోసం మనిషి వెతుకుతాడు. ఆ డిమాండ్‌ వల్ల సప్లై చేయటానికి ఈనాడు అనేకానేక దుకాణాలు కూడా వెలిశాయి.

అయితే?

మనకి తారసపడిన నంబూరి పరిపూర్ణలకి ఏనాడైనా పాదాభివందనం చేయవలసిందే. పరిపూర్ణత్వం కోసం వెతుకులాట విడవవలసిందే.

నేనా పని చేశాను. చేస్తాను.

[నంబూరి పరిపూర్ణకు 91వ ఏడు నిండిన సందర్భంగా ఆగస్ట్ 27న విడుదల అయిన అభినందన సంచిక నుంచి.]