నేను సైతం

తులసక్క కాలంచేసిందని తెలిసింది. ఏ జబ్బూ లేని, ప్రాణం ఉన్న రాయిలా నిక్షేపంగా ఉండేది. పల్లెటూళ్ళో ఒక్కర్తీ ఉంటుంది. ముఖ్యమైన పనిమీద దూరప్రాంతంలో ఉండిపోవడం వల్ల ఆఖరి చూపు దక్కలేదు. అక్క అంటే దూరపు చుట్టరికమే అయినా, వయసులో అంతరం ఉన్నా మనసుకి దగ్గరే. వాళ్ళ ఊరు కూడా మా ఊరికి గంట ప్రయాణమే. కొడుకులిద్దరూ ఒకడు ఇంగ్లాండ్ నుండి, మరొకడు అమెరికా నుండి వచ్చేశారట. నాలుగు రోజులైంది. ఊరినుండి రాగానే బయలుదేరాను. ఒకేసారి దినం రోజు వెళదాం, నేనూ వస్తాగా అంది మా ఆవిడ. పిచ్చిమొహం, దానికేం తెలుస్తాయి ఆప్యాయతలు! మళ్ళీ దినం రోజు దేనికైనా కుదురుతుందో లేదో. మనసు ఆగక వెంటనే బయలుదేరిపోయాను.


“రా మావయ్యా!” ఆహ్వానించారు.

భార్యలతో కలిసి వచ్చారు. పిల్లలు రాలేదు. మాటామంతీ అవుతోంది.

పిల్లలొస్తే వీలుగా ఉంటుందని డాబాపైన రెండు గదులు వాళ్ళకి అనుకూలంగా కట్టించింది అక్క. పైనుండి భార్య అనుకుంటా పెద్దవాడిని పిలిస్తే వెళ్ళాడు.

“దినం అన్నీ పద్ధతి ప్రకారం జరిపించాలి. నువ్వూ చూసుకోవాలి మావయ్యా,” అన్నాడు చిన్నవాడు. డబ్బుదేముంది ఈరోజు ఉంటే రేపు పోతుంది అనలేదు.

“అమెరికాలో ఎలా ఉందిరా జీవితం?”

“ఫస్ట్ క్లాస్ మావయ్యా. అక్కడ ఒక గుడి ఉంది. నేను కమిటీ మెంబర్‌ని. తెలుగు అసోషియేషన్‌లో నా భార్య చాలా చురుగ్గా ఉంటుంది. మన పండగలు అవీ ఘనంగా జరుపుతాం,” అంటూ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు చూపించాడు. వాడి పిల్లలు కూడా పంచె, పట్టుపరికిణీలు కట్టుకుని ముచ్చటగా ఉన్నారు.

“ఏవండీ ఒకసారి రండి.” పైనుండి ఈసారి చిన్నవాడికి పిలుపు. వాడు వెళ్ళగానే పెద్దవాడు కిందికి దిగాడు.

“సైన్స్ ఇంత అభివృద్ధి చెందింది. దేవుడు, మతం, అస్థికలు కలపడాలూ అంటూ ఇంకా ఏంటో ఈ మూఢనమ్మకాలు!” అన్నాడు ఇంగ్లాండ్‌వాడు. డబ్బు దండగ అని పైకి అనలేదు. అన్నదమ్ములు ఉత్తర దక్షిణ ధ్రువాలన్నమాట.

“ఏ బాధా లేకుండా హాయిగా నిద్రలోనే పోయింది. పక్కనెవరూ లేకపోయాం. అదొక్కటే విచారం…” అన్నాడు.

“అవును. మీరు ఉండి ఉంటే ఏమైనా చెప్పేది.” అన్నాను బాధగా, విచారంగా.

“ఇప్పుడే వస్తా మావయ్యా!” అని పెద్దవాడు మళ్ళీ పైకి వెళ్ళాడు.

నేను వచ్చి చాలాసేపు అయ్యింది. వచ్చిన పని ఇంకా అవ్వలేదు. బయలుదేరాలి. వీళ్ళు కిందకి దిగిరావడంలేదు. మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏదైనా గొడవపడుతున్నారేమో అనిపించింది. పైకి వెళ్ళాను.

‘అమ్మంటే నాకు ప్రాణం అన్నయ్యా. ఆ గొలుసు మాత్రం ఆవిడ గుర్తుగా మాకు ఇవ్వాల్సిందే!’ అంటున్నాడు రెండోవాడు. ‘అబ్బా. నాకు మాత్రం లేదా ప్రేమ? అంత సెంటిమెంటు ఉంటే దాని ఖరీదు కట్టి సగం డబ్బు నాకు ఇచ్చేసి గొలుసు నువ్వు పట్టుకుపో!’ అని అరుస్తున్నాడు పెద్దవాడు.

ఆశ్చర్యమేసింది. ఇందాకే ఒకడేమో అంతా శూన్యంలోనే ఉంది అన్నాడు. ఇంకోడు ఏముంది నా బొంద అంతా శూన్యమే అన్నాడు. రెండు ధ్రువాలూ ఒకటేనన్నమాట.

‘ఛీ, ఇలాంటివాడివి అనుకోలేదు!’ అన్నాడు రెండోవాడు.

‘అప్పటికి నువ్వేదో పెద్ద!’ అన్నాడు పెద్దవాడు.

ఇంత సంపాదించారు. ఒక్క గొలుసు కోసం కొట్టుకోవడం చూసి అసహ్యం వేసింది నాకు. జీవితమ్మీద విరక్తి పుట్టింది.

కొడుకులిద్దరూ కొట్టుకు చస్తారేమోననే ఆస్తి అంతా వీలునామా ద్వారా వాళ్ళ పేరున ముందే రాసేసింది తులసక్క. బంగారం అంతా అప్పుడే కోడళ్ళకి పంచేసింది. మెడలో బాగా దళసరిగా ఉండే ఒక్క రెండుపేటల గొలుసే ఉండేది. దొంగల భయంరా అనేది. ముసల్దాని భయం దొంగల్దోల అనేవాళ్ళు ఊళ్ళోవాళ్ళు.

‘ఈ గొలుసు మాత్రం నీ పెళ్ళానికిస్తాన్రా రావుడూ!’ అనేది తులసక్క నాతో.

నేను వచ్చిందీ అందుకోసమే. మళ్ళీ దినం రోజు అంతమంది జనంలో అడగడం కుదరదేమోనని.