కిటికీ వెనుక నీలంరంగు అద్దం బిగించినట్టున్న ఆకాశం
చావిట్లో గూడు కట్టుకుని కిచకిచమంటూ గృహప్రవేశానికి నన్ను ఆహ్వానిస్తున్న పిచ్చుకల జంట
నేను పలకరించలేదని అలిగి ముఖం తిప్పుకున్న పెరట్లో నిన్న పూచిన పువ్వు
తలుపు చప్పుడు చేసి ఎప్పట్లా నేను తెరిచేలోపే మాయమయ్యే వీధిలో పిల్లలు
నాకు చిరునవ్వుల్ని మాత్రమే బట్వాడా చేసే పోస్ట్‌మన్‌గారు
రెండ్రోజులుగా మబ్బుల్ని తోడుగా పెట్టి ఏ ఊరో వెళ్ళిన ఎండ
కురుస్తానని మురిపించి జాడ కానరావడం లేని వాన
పాడైపోయిన టెలివిజను, మూగబోయిన ఫోను
ఆగిపోయిన గోడగడియారం, ఆరిపోయిన దీపం
కాగితాలు, కలము, ఉబికే ఆలోచనల ధార, మీరూ
రాత్రి నిద్రాదేవి జోలపాడే ముందు నేను సంభాషించే కాసిన్ని నక్షత్రాలు
నావద్ద సెలవు తీసుకున్న ఈరోజు.