రామచంద్ర పుత్ర! రామభద్ర!

శ్రీలఁ జెలఁగు తెలుఁగు నేలలోఁ బుట్టితిఁ;
దల్లి లక్ష్మినరుసు తండ్రి పేరు
తాత పేరు కలిపి చేతును శతకమ్ము
రామచంద్ర పుత్ర! రామభద్ర!

బాలమురళి గానవాహిని మాధురుల్
విశ్వనాథ కావ్యభాస్వరములు
రేల్బవళ్ళుగ నమరినవి బాల్యమునుండి
రామచంద్ర పుత్ర! రామభద్ర!

ఆఱుఁ గాలములను అరకతో మెరక తా
దున్నుకొనుచు నాకు జున్నుఁ గుడుపు
రైతు దలవకేను కైతసేయగ లేను
రామచంద్ర పుత్ర! రామభద్ర!

కరులు గిరులు తరులు తరణులున్ రుద్రులు
ఇంద్రచంద్రులు పరమేష్ఠి హరియు
సుకవితా సరస్వతి కనుకొసల బంట్లు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

కోటి పూలతేనెఁ గ్రోలినన్ దేఁటికిఁ
దేటగీతి తీపి తెలియఁబోదు;
ఆటవెలఁది కంటె నందమైనది లేదు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

మావిచిగురుఁ దిన్న మత్తకోకిల పాట
మబ్బుఁ గన్న నెమలి యుబ్బులాట
మాట మాట నుండు తేటతెలుఁగు నందు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

వాగ్వధూటి కెన్ని భాష లున్నను నామె
పలుకు సంస్కృతమ్ము, కులుకు తెలుఁగు
సొగసు లూరు వాక్కు సొంతమైనది నాకు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

“కోడి స్టవ్వు మీద కుక్కయి పోయింది
టేస్టు చేయ” మండ్రు టెలివిజనుల
నవ్వు, ఏడ్పు వచ్చు నాకొక్కసారిగా
రామచంద్ర పుత్ర! రామభద్ర!

తెలుఁగు పాదుచేసి తెలుఁగు నీళ్ళను బోసి
పెంచి తెలుఁగు తోఁట, పంచి పూలు
తెలివిగలుగు వఱకుఁ దెలుఁగు లెంక నగుదు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

చదివి పుస్తకాల్ రసజ్ఞుఁడు కాలేడు
గణము లేర్చికూర్చి కవియుఁ గాఁడు
ధనము గలిగినంత దాత కాలేఁడురా
రామచంద్ర పుత్ర! రామభద్ర!

రాజుగారి నాల్క రాజనాల్దిను తరి
తల్లిపాల తీపి తలచుకొనునె
ప్రజలు గుర్తురారు పదవికెక్కిన వెన్క
రామచంద్ర పుత్ర రామభద్ర!

పులిని జంపగ పగ సలపగా నొక మేక
పోయె వృకము కడకు సాయమడగ
విదులు కథ ముగిసిన విధమడుగరు నన్ను
రామచంద్రపుత్ర ! రామభద్ర!

విష్ణుమూర్తి చంపె విడివిడిగా నుండ
మధునిఁ గైటభుఁ దన మాయచేతఁ
గలిని గలిసి వారు కంప్యూట రయినారు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

చింత చితల రెంటఁ జింత యే దొడ్డది
కన్నుమూయు వెనుకఁ గాల్చును చిత;
చింత కాల్చు మనిషి జీవించియుండఁగా
రామచంద్ర పుత్ర! రామభద్ర!

మెతుకు మెతుకు కొఱకు వెతుకుట యొకచోట
పొట్ట బగల మెక్కి పొర్లు టొకట
అర్థశాస్త్రరీతు లగును కౌటిల్యముల్
రామచంద్ర పుత్ర! రామభద్ర!

అమెరికాల హింస, అచటి చిత్ర రిరంస
తెచ్చి తెరకు నెత్తె తెలుగు సినిమ
ఘాతుకాల హోరు బూతుమాటల జోరు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

తిరుమలాధిపునకు తిరునివేదన జేసె
తెలుగు పలుకు చిలికి తీసి వెన్న
గుండె లోతు దాక దండమన్నమయకు
రామచంద్ర పుత్ర! రామభద్ర!

పదులు నూర్లు వేలు పద్యాలె గాదయా
వరలు కావ్య మొక్క వాక్యమైన
చెప్పగలుగ రసము చిప్పిలునట్లుగా
రామచంద్ర పుత్ర! రామభద్ర!


(రామభద్ర శతకం మొదటి ప్రతిని ఐదు ఆరు సంవత్సరాల క్రితం -అప్పటికి వారితో పరిచయం ఏమాత్రమూ లేక పోయినా- దయతో అక్షరం అక్షరమూ పరిశీలించి, దోషాలకు పరిష్కారాలు చెప్పి ప్రచురణకు ప్రోత్సహించిన కవి, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారికి మాటలలో కృతజ్ఞతలు చెప్పటం నాకు సాధ్యం కాని పని. మీ సౌజన్యానికి ధన్య వాదాలు మురళీధర రావు గారూ!

ఎలుక పిల్లను దయతో ముని ఆడపిల్లగా తయారు చేసినా సహజ స్వభావం బలీయమై ఆ ఆడపిల్ల మళ్ళీ ఎలుక పిల్లగా మారిపోయిన కథలో లాగా మురళీధర రావుగారి సూచనలను చూసుకుని పద్యాలను సరిచేసుకున్న ప్రతి కనపడక – ఆ ప్రతికై వెతుకుతూ కాలం గడిచిపోతూ – కనపడిన ఒక ప్రతినుంచి కొన్నిటిని ఏరుకుని ప్రచురణకు పరిశీలించవలసినదని కోరుతూ పంపిన పద్యాలను చిత్రిక పట్టిన ఈమాట సంపాదక – పరిశీలకులకు ఇబ్బడి ముబ్బడిగా కృతజ్ఞతలు!

పద్యాలలో కొన్నిటికి సంస్కృత చాటువులూ విదేశ భాషల సామెతలూ ఆధారాలు. అటువంటి ప్రతి పద్యానికి నోట్స్ రాసుకున్నాను. ఆ ఆధారాల వివరాలు తెలియబరచటం కనీస ధర్మమని తెలుసు గాని అవి అన్నీ మేలుప్రతిలో ఉండటంతో – ఎప్పటికైనా చెప్పగలుగుతాననే ఆశ.)