కేశం

ఆత్తియప్పన్‌కు శరీరంపై చీమలు పాకుతున్న అనుభూతి. ఉదయం నుండి అలానే ఉంది. ఇటువంటి అనుభూతులు కలిగేటప్పుడు ఆయన మనసులో అంతుబట్టని సంతోషం ఉప్పొంగుతుంది. అది మగ ఏనుగు చెవిలో స్రవించే మదజలానికి సమానమైనది. అయితే ఇన్ని రోజులుగా లేకుండా ఈరోజు హఠాత్తుగా ఎందుకిలా అని తెలియలేదు. ఆయనకు యాభైతొమ్మిది ఏళ్ళు. తన పద్నాలుగవ ఏట పేదరికంతో వేంబారి నుండి విరుదునగర్‌కు బ్రతుకుతెరువు కోసం వచ్చినవాడు. ప్రత్తిపేటలో పైపనులు చేసే పిల్లోడిగా పనికి చేరి అక్కడే పత్తి దళారీగా మారి, తక్కువ వెలకి సరుకును కొని చేతులు మార్చి ఎక్కువకు అమ్మేవాడు. ఇప్పుడు పేటలో అతడిదే అతిపెద్ద వ్యాపారం. ఇప్పుడు కొడుకు కదిరేశనే వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. తండ్రి వయసులో సగం అతడిది.

ఆత్తియప్పన్ సరాసరి కంటే కాస్త పొడుగు, వర్షాకాలపు తాటిచెట్టు రంగు మేని ఛాయ. తెల్లని టెర్లిన్ పంచె, మోచేతి వరకు మడిచిన తెల్లని చొక్కా. తలలో దూది పేర్చినట్లు దట్టంగా తెల్ల వెంట్రుకలు. ఆత్తియప్పన్‌కు చిన్న వయసు నుండే చర్మవ్యాధి ఉండేది. అక్కడక్కడా చేప పొలుసుల్లా ఉండే చర్మం ఇప్పుడు శరీరంలో ఎక్కువ మేరకు వ్యాపించింది. సగం సమయం దురద తట్టుకోలేక శరీరాన్ని గోక్కుంటాడు. అలా గోక్కుంటున్నప్పుడు నల్లని అతని భుజాల నుండి తెల్లని పొలుసులు పొట్టుగా రాలుతాయి. గోక్కున్న చోట తెల్లగా చారలు చారలుగా గీతలు కనిపిస్తాయి.

గణపతమ్మ ఇంటి వెనుకభాగంలో మధ్యాహ్నపు భోజనం సిద్ధం చేస్తూ ఉంది. ఉయ్యాల కుర్చీ నుండి లేచి మెల్లగా గణపతమ్మ నడుము వైపుగా రాసుకున్నట్లు నిలబడ్డాడు. “ఒళ్ళు ఇలా పెట్టుకుని వంట చేసే చోటుకి రావొద్దని ఎన్నిసార్లు చెప్పాను. తినే అన్నంలో ఏమైనా, ఏదైనా పడిపోతుంది…” చిరాకుగా ముఖాన్ని పెట్టుకుని పక్కకు తప్పుకోమంది గణపతమ్మ.

కాస్త పక్కకు జరిగి నిలబడి, ‘ఈ ఒక్కరోజైనా’ అన్నట్లు చూశాడు. చిరాకు తగ్గని గణపతమ్మ ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిలబడ్డవాడు ఏమనుకున్నాడో, హఠాత్తుగా పరిగెత్తుకెళ్ళి గణపతమ్మ లావుపాటి శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాడు. వెనక్కి జరిగి బియ్యం నానబెట్టిన గిన్నెని కోపంగా వంటగట్టు మీద పెట్టి, పెంటను తొక్కిన దానిలా ఛీ! అని పక్కకు జరిగి నిలబడింది గణపతమ్మ. మెల్లగా తన దగ్గర నుండి చీమలు కిందకు దిగి గడగడమని పరిగెత్తుకెళ్ళినట్లు అనుభూతి చెందాడు ఆత్తియప్పన్. అంతలో గణపతమ్మ అరవడం మొదలు పెట్టింది. “ఎన్నిసార్లు చెప్పాలి ఇష్టం లేదని? ఈ వయసులో కూడా ఇంకా అనిపిస్తుందా… నాక్కూడా అంటించడానికా?”

ఆత్తియప్పన్ ముఖంలో ఎటువంటి ఉద్వేగం లేకుండా ఆ గది నుండి బయటకొచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఉయ్యాల కుర్చీలో కూర్చున్నాడు. మునుపటిలా సహజంగా సావకాశంగా కూర్చోవడం అతనికి వీలు కాలేదు. లేచి రోడ్డు చివరి వరకు వెళ్ళి నడిచి వస్తే సర్దుకుంటుందేమో అనిపించింది. లేచి వట్టి ఒంటిమీద పైచొక్కా తగిలించుకుని బయటకు నడిచాడు. సగం దూరం వెళ్ళినాక ఆపై వెళ్ళేందుకు మనసొప్పక గిడ్డంగికి వెళ్ళేందుకు తీర్మానించుకున్నాడు. పక్క వీధిలోనే అతని పత్తి గిడ్డంగి ఉంది.

దారిలో రేలపూల చెట్టు ఒకటి పూలను రాలుస్తుంది. అది అంతగా ఆస్వాదించదగినది కాదన్నట్లు నడిచి గిడ్డంగికి వచ్చాడు. బయట పెద్ద చెక్కదూలం ఒకదాని పైనుండి మోచేతి పరిమాణంలోని తాళంచెవిని వెదకి తీసి గిడ్డంగిని తెరిచాడు. అది బాగా పొడవూ వెడల్పూ ఉన్న పాత నల్లరాతి కట్టడం. పైన జంట ఏనుగుల బొమ్మలు ముద్రించిన పెంకులతో వేయబడ్డ పైకప్పు. అక్కడక్కడా విశాలమైన చెక్క స్తంభాలు అడ్డదూలాన్ని కాస్తున్నాయి. గిడ్డంగి మూడింటిలో రెండున్నర వంతు స్థలంలో పత్తి నింపిన పెద్ద పెద్ద గోధుమరంగు గోనె సంచులు పేర్చబడి ఉన్నాయి. ఆ గిడ్డంగిని చూసినప్పుడల్లా ఈ లోకంలోని అన్ని రకాల మనుష్యులకు బట్టలు నేసేందుకు, రోగులందరి పుళ్ళకు సరిపడా అక్కడ దూది ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే నిజజీవితంలో తన మోకాలి కింద గోకి గోకి నుజ్జు నుజ్జుయిన పుండుకు, దాని నుండి కారే చీముకు చిన్న దూది పింజను జాలి పడి అందించడానికి కూడా మనుషులు ఒక్కరూ లేరు. మళ్ళీ ఆత్తియప్పన్‌ను ఆ తలపు తొలిచేయడం మొదలుపెట్టింది. కామానికి ఎన్ని వేల తలుపులు. ఏ తలుపు ఎప్పుడు తెరుచుకుంటుంది అన్నది ఎవరికీ తెలియడం లేదు. తెలిస్తే కనీసం మూసి ఉంచొచ్చు. వయసు మళ్ళిన దేహంలో కూడా అది తెరుచుకోవడం దారుణం. అణచుకోలేక అవమానపడటం దాని కంటే దారుణంగా వుంటుందని అనుకున్నాడు.

అతడికి మంచి సంభోగసుఖం దక్కి పది ఏళ్ళయినా దాటుంటుంది.

అప్పుడంతా చేతిలోనూ కాళ్ళలోనూ ఇన్ని దురదలు, పుళ్ళు లేవు. ఇప్పుడు గణపతమ్మ కూడా యాభై దాటింది. అందరి స్త్రీలకూ ఉన్నట్లే ఈ వయసుకు తగ్గ బాధలు, చిరాకు సహజమే అయినప్పటికీ ఇలా వెనక్కి తగ్గేందుకు చర్మవ్యాధే ముఖ్యమైన కారణమై ఉండొచ్చు. ఒకప్పుడు ఎక్కువగా గిడ్డంగిలో ఉండేందుకే మక్కువ చూపేవాడు. ఎవరో గిడ్డంగిలోకి వచ్చినట్లు అనిపించి తొంగి చూశాడు. కదిరేశన్. చేతిలో ఇత్తడి క్యారేజి, కూరగిన్నె. ముఖాన్ని ముడుచుకున్నట్టు పెట్టుకున్నాడు. గణపతమ్మ ఏదైనా చెప్పుండవచ్చు. నాలుగొంతులు చూచాయగా చెప్పినప్పటికీ అర్ధం చేసుకునే నేర్పు ఉన్నవాడు. లేదంటే నాన్న దగ్గర నుండి ఇంత వేగంగా వ్యాపారాన్ని నేర్చుకుని ఉండి వుండడు.

కదిరేశన్ మాట్లాడుతూ “గిడ్డంగి లోనే వుండిపో నాన్నా! అన్నం ఇక్కడికే తీసుకువచ్చేస్తాం. ఇంట్లో చిన్న పిల్లలున్నారు. తినే అన్నంలో పడుతుంది. నువ్వు కూడా వదలకుండా పరపరమని గోక్కుంటున్నావు. మధురై పెద్దాసుపత్రిలో చూపిద్దాం అంటే వద్దంటున్నావు. ఇంత ఆస్తి పెట్టుకుని ఏం చెయ్యబోతున్నావో?” అంటూ అన్నాన్ని పక్కన పెట్టి బయలుదేరాడు. సాయంత్రం కాగానే కదిరేశన్ రెండు సంచులలో కొన్ని బట్టలను, రోజువారీ వాడుక సామాన్లను తీసి పట్టుకొచ్చి వొదిలివెళ్ళాడు.

ఆత్తియప్పన్ మొండిగా అక్కడే తినకుండా పడుకోనున్నాడు. రెండు రోజులుగా పత్తిపేటకు వెళ్ళలేదు. మధ్యాహ్నపు వేళల్లో ఎపుడైనా లారీలలో పెద్ద పెద్ద గోనె సంచులలో పత్తి వచ్చి దిగుతుంది, లేదంటే గిడ్డంగిలో నుండి బయటకు వెళుతుంది. రాత్రి భోజనం ఇచ్చేందుకు గణపతమ్మ వచ్చినప్పుడు కదిరేశన్ చిన్న కూతుర్ని కూడా వెంటబెట్టుకు వచ్చింది. చిన్నపిల్ల తన దగ్గరకు వచ్చినప్పటికీ అనాసక్తంగా మాట్లాడాడు. మధ్యాహ్న భోజనం తీసుకు వచ్చిన గిన్నెలను సజ్జలో పెడుతూనే ‘గిడ్డంగిలో పైపనులు చేసేందుకు పక్కనుండే మీసలూరు నుండి ఒకామెను రమ్మని చెప్పాను’ అంది. ఆత్తియప్పన్ నుండి ఊఁ, ఆఁ అని కూడా సమాధానం లేదు.

ఉదయం చామనఛాయలో నాజుకైన ఒకామె వచ్చి నిలబడింది. వెంట గణపతమ్మ కూడా వచ్చింది. ఆమె పేరు ఆవుడై తంగం. ఆమె ముఖం కళగా ఉంది. ఆమె విశాలమైన కన్నులు కాంతితో నిండిపోయున్నాయి. ఎందుకో వెనుకకు తిరిగి నడిచింది. నిగనిగలాడే పొడవాటి కురులు ఆమె పిరుదుల వరకు ఉన్నాయి.

ఆమెకు ముప్ఫైమూడు ఏళ్ళు. గణపతమ్మ వెళ్ళిన వెంటనే తంగం గిడ్డంగి విశాలమైన వాకిలి ముందు నిలబడి చూపు ఎక్కడో నిలిపి నిశ్చలంగా చూస్తూ ఉంది. ఆత్తియప్పన్, ఉదయం పత్తిపేట వరకు వెళ్ళి వచ్చి మిట్టమధ్యాహ్నం గిడ్డంగికి వచ్చాడు. అపుడు కూడా ఆమె గిడ్డంగి వాకిలి దగ్గరే నిశ్చలంగా కూర్చొని ఉంది. ఆయన లోపలికి వచ్చిన వెంటనే లేచెళ్ళి మంచినీళ్ళు తీసుకు వచ్చి చెంబును చేతికందించింది. గిడ్డంగిలో ఏదో మార్పు గ్రహించాడు. కొంచెం కూడా దూది నేలరాలి లేదు. చిన్నపాటి చెదిరిన దూదిపింజలు కూడా జాగ్రత్తగా తీసి ఉబ్బెత్తుగానున్న గోనె సంచిలో వాటిని నింపింది ఆవుడై తంగం. ఆహార పాత్రలను తీసుకు వచ్చి ఆత్తియప్పన్ కూర్చునే మంచం ముందు సర్దింది. చిన్నపాటి శబ్దం కూడా లేకుండా ఆ పాత్రలను ఆమె తీసిపెట్టే పద్ధతి అతడికి నచ్చింది. శుభ్రం చేసినప్పటి నుండీ తింటున్న ఆహారం రుచిలో మార్పు రావడాన్ని గ్రహించాడు. తరువాత మంచం మీద పడుకుని కొంచెం సేపు తాటాకు విసనకర్రతో తనకు తానే విసురుకుంటూ నిద్ర కోసం ఎదురుచూశాడు. కొంచెంసేపు తరువాత మిగతా ఆహారపదార్ధాలను తిన్నాక గిన్నెలు కడిగి ఎండ పడే చోటులో బోర్లించి పెట్టింది. ఆపైన ఆవుడై మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి బాసింపట్టు వేసుకుని కూర్చుంది.

మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింటుంది. గుమ్మంలో ఇద్దరు నర్సులు తెల్లరంగు బట్టలతో సైకిల్ మీద వచ్చి దిగారు. ఒక మహిళ కేరియర్లో బూడిదరంగు పెట్టె ఒకటి ఉంది. పెట్టెలో, నల్ల బెల్టుని భుజాల మీద ఆనించుకునే నీలం రంగు పిడి ఉంది. “పెద్దాయనను లేపండి. ఇంటికి వెళ్ళాం. గిడ్డంగిలో ఉన్నారు అని చెప్పారు” అంది. అలికిడి విని ఆత్తియప్పన్ లేచాడు. ఆ ఇద్దరు మహిళలు ఆవుడైతో మాటలు కట్టిపెట్టి లోపలికి వెళ్ళారు. ఆత్తియప్పన్ ఇంతలో ముఖం కడుగుకొని చొక్కాను పైన వేసుకున్నాడు. ఆవుడై కూడా లోపలికి వచ్చింది. ఇద్దరిలో చిన్నదైన నర్సు వేడినీళ్ళు తీసుకురమ్మని చెప్పి దాదాపు ఆజ్ఞ వేసింది. ఆవుడైకి ఏం అర్ధం కాక గిడ్డంగికి బయటకు వెళ్ళి పొయ్యిని వెలిగించింది.

ఆమె వేడినీళ్ళతో లోనికి వచ్చినపుడే గమనించింది. ఆత్తియప్పన్ తన పంచెను మోకాళ్ళ వరకు ఎత్తుకునున్నాడు. రెండు కాళ్ళకు చుట్టబడ్డ గుడ్డ రక్తపు మరకలతో నిండి ఉంది. పెద్దామె ఆ గుడ్డను విప్పింది. లోపలి నుండి ముక్కలు ముక్కలుగా దూది రాలిపోయినట్లుంది. ముఖాన్ని విరుపుగా పెట్టుకున్నట్టు ఆమె అన్ని గుడ్డలని అయిష్టంగానే రెండు వేళ్ళతో దూరంగా విసిరింది. ‘ఇంకా పుండు ఆరనే లేదు’ అన్నది చిన్నామె. ఆవుడై చేతిలో నుంచి వేడినీళ్ళను తీసుకుని ఆయన కాళ్ళ కింద పెట్టి, కొన్ని దూది ముక్కలను వేడినీటిలో ముంచి, పుళ్ళ మీదున్న పసుపు ఆయింటుమెంటు మురికిని, చీమూ నెత్తురూ కారిన మరకలను వాళ్ళు శుభ్రం చేయనారంభించారు. లావుపాటి పెద్ద నర్సు ఆ పుళ్ళను చచ్చిన ఎలుకను చూసినట్లు చూసింది. ఆవుడై ఆ పుళ్ళ మీద నుంచి కళ్ళు తిప్పలేదు. ఆమె కళ్ళలో కాంతి పెరుగుతూ వచ్చింది. కొన్ని నిముషాలలో పుళ్ళు పూర్తిగా శుభ్రం చేయబడి స్నానం చేయించిన పసిపిల్లాడిలా ఉన్నాయి. ఆవుడై కంట్లో కన్నీరు నిండింది. అది ఆ కళ్ళలోని వెలుగును, అలసటను దాచిపెట్టాయి. పెద్దామె ఆయింటుమెంటు డబ్బాను తీసుకొచ్చి రెండు వేళ్ళతో పసుపు ఆయింటుమెంటుని తీసి పుండుపై రాయడం మొదలు పెట్టింది. చిన్నామె ఇప్పుడు గుడ్డను, దూదిని అవసరం మేరకు దగ్గరగా తెచ్చిపెట్టింది. పుండును మళ్ళీ మూయడాన్ని ఆవుడై తట్టుకోలేకపోయింది. మౌనంగా ఏడవసాగింది. ఆమెకు తెలియకుండానే కళ్ళ నుండి కన్నీరు ధారగా కారింది. వ్యాధితో బాధించబడ్డ ఆ రెండు కాళ్ళను తన ఇద్దరు బిడ్డల్లా భావించడం మొదలు పెట్టింది. తన మీద ప్రేమ చూపించేందుకు, తాను ప్రేమ చూపించేందుకు ఎవరు లేని ఈ జీవితంలో ఆ రెండు కాళ్ళ మీద ఆమెకు జాలి, కారుణ్యం పొంగుకొచ్చాయి. ఇపుడు పెద్దామె కాళ్ళకి గుడ్డను చుట్టడం మొదలుపెట్టింది. ‘నా బిడ్డల మీద గుడ్డను చుట్టి మూయొద్దు… మూయొద్దు…’అని నోరు తెరిచి అరుద్దాం అన్నంతగా అనిపించింది ఆవుడైకి. చీర కొంగు నోట్లో కుక్కుకొని చీరను గట్టిగా కరిచిపట్టింది.

ఆ చోటు నుండి తన చూపును మరల్చింది. ఆత్తియప్పన్ తన చొక్కా జేబులో నుండి ఒక ఐదు రూపాయల కాగితం తీసి పెద్ద నర్సు చేతికిచ్చాడు. అది వాళ్ళు ఆశించిన మొత్తంలో లేనట్టుంది, అయిష్టంగానే తీసుకుని బయలుదేరారు. ఆవుడై కంటికి ఇపుడు పుళ్ళు ఉన్న ఆ రెండు కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతావన్నీ ఆమె దృష్టికి కనుమరుగయ్యాయి. మరుగైన ఆ రెండు పుళ్ళ బిడ్డలు మాత్రమే ఆమెకు పదే పదే గుర్తుకొస్తున్నాయి.

గుమ్మంలోకి వెళ్ళి బాసింపట్టు వేసుకుని కూర్చుంది. కూర్చున్న చోట్లోనే కునుకు తీయడం మొదలుపెట్టిన ఆమె అలా రాత్రంతా మేల్కొనే ఉంది. పసుపు బల్బు ఆత్తియప్పన్‌కు ఎదురుగా పైన వెలుగుతుంది. గిడ్డంగి అంతా లేత పసుపు వెలుతురు వ్యాపించి ఉంది. లేచిన వెంటనే గుడ్డను చుట్టిన బిడ్డకు ఊపిరాడదని పిచ్చిదానిలా పంచెను మోకాళ్ళ వరకు లేపడంతో పైకి లేచేందుకు ప్రయత్నించి ఆత్తియప్పన్ మేల్కొన్నాడు. ఏంటని కారణం అడిగితే దీర్ఘంగా చెప్పింది.

“పుళ్ళను చూడాలి.” అత్తియప్పన్ అర్ధం కానివాడిలా నుదురు ముడుచుకు పోయేంతగా మళ్ళీ అడిగాడు. “ఏమిటి?” మళ్ళీ దానినే దీర్ఘంగా చెప్పింది.

“ఆ పుళ్ళను చూడాలి. మా వూరిలో నాటువైద్యుడు ఒకాయన ఉన్నాడు. ‘కాలిలో పుండు వస్తే దానిని గట్టిగా కట్టకూడదు. గాలి తగలాలి.’ అని చెబుతారు.”

“సరే ఈ సమయంలో దానికి ఏం చెయ్యాలి?”

“పుండు మీదున్న కట్టును విప్పాలి.”

‘ఉదయం విప్పుకోవచ్చు.వెళ్ళి పడుకో…’ అని చెప్పేంతలో — మంచం మీద నుంచి కిందకు చాచిన కాళ్ళ దగ్గరకెళ్ళి కూర్చుంది. ఆత్తియప్పన్ గందరగోళంగా చూశాడు. ఆవుడై అతని కాళ్ళను పట్టుకుని కట్లను విప్పడం మొదలు పెట్టింది. గబగబా కట్లను విప్పింది. ఆమెకు మాత్రం పెద్దగా నిట్టూర్చిన పిల్లాడి ఊపిరి చప్పుడు స్పష్టంగా వినిపించింది. ఆయింటుమెంటుని అదే దూదితో తీసి తుడిచి పారేసింది. ఆవుడై ముఖం ప్రకాశవంతమైంది. కళ్ళు మెరిశాయి. శ్రద్దగా పుళ్ళను పరిశీలించింది. ఆత్తియప్పన్ వెళ్ళి పడుకోమని చెప్పాడు. సరే అని చెప్పి పుళ్ళు ఉన్న దిక్కు తిరిగి పడుకుంది. కాస్త పసుపు బల్బు వెలుతురులో పుళ్ళు అస్పష్టంగానూ, స్పష్టంగానూ కనిపించాయి.

ఉదయాన ఆత్తియప్పన్ లేచి పత్తిపేట వరకు వెళ్ళి వచ్చాడు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి వాకిట్లో పైచొక్కా వేసుకొని గ్రామపు పెద్దాయన ఒకతను కూర్చోనున్నాడు. ఆత్తియప్పన్‌ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేశాడు. మీసలూరు నుండి వచ్చినట్టు చెప్పగానే కారణం అర్ధమయ్యింది. లారీ ఒకటి గిడ్డంగిలో పత్తి బస్తాలను ఎక్కించుకుంటూ ఉంది. కదిరేశన్ లోపల ఉంటాడేమో అనుకున్నాడు. అయితే కదిరేశన్ తన మోటార్ సైకిల్‌పై ఎదురుగా వస్తూ కనిపించేసరికి గబగబా లోపలికి వెళ్ళి చూశాడు. పత్తి బరువు తూచి అడ్రసు గోనె సంచులపై వేస్తుంది ఆవుడై. ఎపుడు బరువు తూచే చోట ఎవరైనా నిలబడాలి. కదిరేశన్ ఆవుడైకి ఏమీ చెప్పలేదు.

లారీ బయలుదేరి వెళ్ళిన వెంటనే మీసలూరు పెద్దాయన ఆత్తియప్పన్ పంచెను మోకాలి పైకి లాగి పుండు ఉన్న కాళ్ళకి చికిత్స చేయనారంభించాడు. కాళ్ళకి ఆముదం నూనె లాంటి పలుచని ఒక ద్రవాన్ని, తను తీసుకు వచ్చిన కోడి ఈకతో రాశాడు. దాంట్లోంచి దట్టమైన చేదు వాసన వచ్చింది. శరీరంలో వేరే ఎక్కడెక్కడ దురద తీవ్రత ఉంది అని అడిగాడు. రోజుకి అదే ద్రవాన్ని రెండు వేళలా రాసుకొమ్మని త్వరలో పుళ్ళు ఆరిపోతాయి, పదిరోజులు అయ్యాక వచ్చి మళ్ళీ చూస్తానని చెప్పి బయలుదేరాడు. ఆత్తియప్పన్ తన పంచెను మోకాలి పైవరకు మడిచి పెట్టుకుని ఊళ్ళోకి బయలుదేరాడు. ప్రతిరోజు ఉదయం, రాత్రి వేళల్లో ఆవుడైనే ఆ పుండ్ల మీద కోడి ఈకతో మందు రాస్తూ ఉండేది. పుళ్ళు ఆరిపోయి, ఇప్పుడు దురదలు చాలా వరకు తగ్గాయని ఆమెతో చెప్పాడు.

వేసవి తాకిడి ఎక్కువగా ఉంది. ఒక రోజు రాత్రి వేసవి వర్షం ముసాబులా పట్టుకుంది. వర్షం వస్తున్నట్లు అనిపించగానే అవసరవసరంగా బయట పడున్న ఏనుగు పరిమాణంలో ఉండే ఒకటి రెండు పత్తి గోతాలను లోనికి నెట్టి, ఖాళీ గోనె సంచులను, చిన్న దూది పింజలను ఒకర్తే ఒంటరిగా గిడ్డంగిలోకి తీసుకొచ్చి పెట్టింది. వర్షం గట్టిగా కురవడం ఆరంభించింది. వర్షంతో పాటు ఆత్తియప్పన్ ఆమె పెట్టిన పుల్లని వెల్లుల్లి కూరను వేసుకు తినడం పూర్తయ్యాక శరీరాన్ని మంచంపైకి ఎక్కించాడు. ఆవుడై నూనె బుడ్డితో అతడి దగ్గరకు వచ్చి నిలబడింది. పుళ్ళు అనే తన ఇద్దరు బిడ్డలను ఆ లేత పసుపు వెలుతురులో చూస్తూ నిలబడింది. బయట కురిసే వర్షం మట్టి వాసనను మాత్రమే కాకుండా, ఆమె శరీరంలో మాతృత్వాన్ని కూడా రేకెత్తించింది.

ఆత్తియప్పన్ ఏదో తోచిన వాడిలా లేచి నిలబడ్డాడు. పంచెను మోకాళ్ళపైకి మడిచి పెట్టి మందు రాసుకునేందుకు కాళ్ళను సిద్ధం చేశాడు. చాలా సంతోషమైన పనిని చేయబోతున్న దానిలా ఆవుడై గాబరాగా కోడి ఈకను వెదికింది. అలవాటుగా నాలుగైదుసార్లు వాడిన కోడి ఈకను తీసి విసిరేసింది. ఎప్పుడూ ఈకను ఉంచే పెంకు కింది చెక్క దూలంలో చేతితో వెదికింది. ఒకట్రెండు ఈకలు చిక్కాయి. కాని, వాటన్నింటిలో ఆత్తియప్పన్ చెవులు తిప్పుకున్న గులిమి అంటుకునుంది. తన బిడ్డలపై ఇటువంటి ఈకను ఉంచి రాసేందుకు సుతరామూ ఇష్టంలేక ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళింది. కాళ్ళ దగ్గర కూర్చుని ఎంతో ప్రయాస తోటి, ఆశ తోటి ఆ పుళ్ళను చూసింది. తరువాత తన పిరుదుల వరకుండే పొడుగైన నల్లని కురుల మొనను ముందుకు తెచ్చి మందు నూనె గిన్నెలోకి ముంచి తీసింది. వింతగా చూశాడు ఆత్తియప్పన్. అయినా సరే వారించలేదు. మెల్లగా పుళ్ళ మీద ఎంత సుతారంగా నిమరగలదో అంత సుతారంగా నిమిరింది. అది ఏసు ప్రభువుకు మగ్ధలీన తన పొడుగాటి ఉంగరాల జుట్టుతో నిమురుతూ అతడి పాదాలపై పరిమళ తైలాన్ని అద్దిన ఘటన లాగుంది. ఆ బిడ్డలు మెల్లగా కళ్ళతో తనను చూసి దానిని అంగీకరించినట్లు అనిపించింది.

ఆత్తియప్పన్‌కు ఒంట్లో పులకరింత తగ్గనే లేదు. ఇన్ని రోజులలో శరీరం ఇంతగా పరవశం చెందడాన్ని ఇదివరకెన్నడు అతడు ఎరుగడు. తప్పితే తన వయస్సు మళ్ళిన ముసలి శరీరంపై ఒక స్త్రీ ఇంత ఆదరణ చూపిస్తుంటే అతడికి గుండె పగిలి ఏడ్చేయాలనేంతగా అనిపించింది. పుళ్ళ మీద ఈకతో నిమరగా నిమరగా తన శరీరం నుండి ఒక్కసారిగా వేయి తలుపులు తెరుచుకోవడం గుర్తించాడు. కరిచే నోరు లేని నల్ల చీమలు లక్షల సంఖ్యలో శరీరమంతా ఎక్కి అటుఇటుగా పాకుతున్నట్లు భావించాడు. పులకరింపు తారాస్థాయికి చేరడంతో కాళ్ళ దగ్గర కూర్చోనున్న ఆవుడై భుజాలపై తన చేతులు మోపాడు. తూలి నేలపై కూర్చుని గట్టిగా ఆవుడైను హత్తుకున్నాడు. ఆవుడై వారించలేదు. మంచంపైకి శరీరాన్ని మళ్ళించేందుకు తోసినప్పుడు ఆతియప్పన్ బట్టలను విప్పుకునున్నాడు. ఆవుడై సంకోచపడ్డ దానిలా, తన బిడ్డల ముందు చేయకూడని పనిని చేస్తున్న దానిలా బల్బును ఆపేసింది. కొంత సమయం తరువాత అత్తియప్పన్ మళ్ళీ బల్బును వెలిగించాడు. తేలికైన దూది పింజెలా కూర్చున్నాడు. కళ్ళలో తేమ నిండింది. అతడికి అకస్మాత్తుగా గుక్కపెట్టి ఏడ్వాలన్నట్లు అనిపించింది. నిటారుగా లేకుండా ముందుకు కూలబడి కూర్చున్నాడు. కాస్త జరిగి గోడకు ఆనుకొని ఆవుడై మౌనంగా, నిశ్చలంగా తన బిడ్డలను మళ్ళీ చూడసాగింది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడే ధైర్యం చేయలేదు. అక్కడ చాలాసేపు మౌనం మాత్రమే చోటు చేసుకుంది. ఆత్తియప్పన్‌కు శరీరంలో ఇప్పుడు కరిచే చీమలు లక్షలసంఖ్యలో ఎక్కి కరవడం మొదలెట్టినట్లు అనిపించింది. నొప్పి భరించలేని వాడిలా ఆవుడైతో సంకోచంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

మొదటి మాటగా “నీ బిడ్డ ఎక్కడ?” అన్నాడు. ఆవుడై ఠక్కున పైకి చూసి కిందకు తలొంచింది. సంకోచంగా ఆత్తియప్పనే మళ్ళీ “నీ రొమ్ముల నుండి ఇంకా పాలు కారుతున్నాయి“ అన్నాడు. ఆవుడై కళ్ళ నుండి నీరు కారడం చూసి మాటలను ఆపాడు. వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆమె పాదం మీద చేతిని ఉంచి తనని క్షమించమని అడిగాడు. ఆవుడై దానిని పెద్దగా పట్టించుకోలేదు. తల దించుకుని కన్నీరు కారుస్తూనే ఉంది. ఆత్తియప్పన్ మళ్ళీ సంకోచంతో అడిగాడు, “నీ బిడ్డ ఎక్కడ?”

“చనిపోయింది!” ముడతలు పడ్డ నుదుటితోటి సూటిగా ఆమెని చూశాడు. “అవును చనిపోయింది…” దుఃఖం నిండిన గొంతుతో చెప్పడం మొదలెట్టింది.

“మా నాన్న వంటవాళ్ళతో పనికి వెళ్ళేవాడు. పెళ్ళిళ్ళకు, పేరంటాలకు వండి వారుస్తాడు. ఆయన వెంట పనిచేసే పాండికే నన్ను పెళ్ళి చేసిచ్చాడు. అల్లుడు, మామగారు ఒకటిగా కూర్చుని సారాయి తాగేవారు. పెళ్ళైన మూడు నెలలకే నాన్న చనిపోయాడు. ఏడు నెలలకి మొగుడు వొదిలి పారిపోయాడు. వంటవాళ్ళతో కలిసి పనిచేసే షణ్ముఖ అక్కను లేపుకుపోయాడు. అపుడు నా కడుపులో బిడ్డను వదిలి వెళ్ళాడు. ఒక్కదాన్నే మెడలో ఉన్న దానిని పెట్టి ఐదు నెలలు, చెవిలో ఉన్నదానిని పెట్టి రెండు నెలలు అని నెట్టుకొచ్చాను. మా నాన్నగారి స్నేహితుడు ఒకాయన మారియప్పన్ అని… కట్టెల అడితిలో పనిచేసేవాడు. నొప్పులొచ్చిన సమయంలో విరుదునగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చి వదిలేసి వెళ్ళాడు. మూడు రోజులుగా మనిషి ఆచూకీ లేదు. రెండో రోజు బిడ్డను కనేశాను. పరిచేందుకు గుడ్డ కూడా లేకుండా పుష్యమి మాసంలో ఆ చలిలో బయట వరండాలో తీసుకెళ్ళి పడేశారు. బిడ్డ రాత్రంతా ఏడ్చింది. పక్కన పడుకున్నవాళ్ళే పరిచేందుకు తాటాకు చాపను, కప్పేందుకు కాస్త గుడ్డను ఇచ్చారు. తెల్లవారేసరికి బిడ్డ బిగుసుకు పోయింది. ఊరుకు తీసుకు వెళ్ళేందుకు దిక్కులేదు. అక్కడే పాతిపెడదాం అని చెప్పిన కంపౌండర్ వదలకుండా పన్నెండు రూపాయలు అడిగాడు. బిగుసుకుపోయిన శరీరాన్ని రెండు గంటలు చేతిలో పట్టుకుని చివరికి అతనికి ఇచ్చేసి వచ్చేశాను. ఒక రిక్షా బండి ఎక్కాను. బయలుదేరేటప్పుడు కంపౌండర్ ఆసుపత్రికి వెనుకున్న చెత్తకుండీలో పెద్ద ప్లాస్టిక్ కాగితంలో చుట్టిన దేనినో విసరడం చూశాను. రెండు మూడు కుక్కలు వేగంగా పరిగెత్తాయి… నేను రిక్షాలో కూర్చున్న చోటు నుండే బలహీనమైన నా చేతిని మాత్రం విదిల్చి కుక్కలను తరిమే ప్రయత్నం చేశాను. కుదరలేదు. అప్పుడు అదొక్కటే సాధ్యపడింది.” చెబుతుండగానే ఆవుడై గుండె పగిలేలా ఏడుపు మొదలెట్టింది.

“తిండికి గతి లేక ఎక్కడైనా ఇంటి పని చేద్దాం అని మునుపటిలాగే విరుదునగర్ వచ్చి కట్టెల అడితి మారియప్పన్‌ని కలిశాను. ఆయన యాలకుల కొట్టు గుణశీలన్ అన్న కొట్టులో పని చేయమన్నాడు. ఆయన అత్తగారు పండు ముసలిది. నడక లేదు. ఉచ్చకి, దొడ్డికి పోతే ఎత్తేందుకు మనుష్యులు కూడా లేరు. మూడు నెలలు ఉన్నాను. మూడు నెలల్లో ముసలిది చచ్చిపోయింది. కొద్ది రోజుల్లో నన్ను బయటకి పంపేశారు. ముందులాగే మారియప్పనే వచ్చి చూశాడు. ఈసారి మరొక పని చూసి పెడతాను అని చెప్పి ఊరి చివర ఒక ఇంట్లో ఉంచాడు. ఆరోజు రాత్రే తప్పతాగి ఇంటికొచ్చి, ఎన్నో సార్లు…” అని చెప్పి ఏడ్చింది. “ఆయనకి మా నాన్న వయస్సు” అని చెప్పి మళ్ళీ ఏడ్చింది.

ఆత్తియప్పన్ “నన్ను క్షమించు… క్షమించు…” అని ఆమె పాదాలపై పడ్డాడు. ఆమె బిగుసుకుపోయి మౌనంగా ఉండిపోయింది. “ఇక్కడ నుండి కూడా వెళ్ళిపోతావా?” అని అడిగాడు. మౌనంగా, దీర్ఘంగా తన బిడ్డలను చూస్తూనే ఉంది. ఎటువంటి చలనం లేదు.

మరునాడు ఉదయం లేచింది మొదలు ఆవుడై ఎక్కడుందో ఏం చేస్తుందో గమనిస్తూనే ఉన్నాడు. ఆవుడై రోజూ అక్కడే గిడ్డంగికి బయట రేకుల పాకలో వంట చేస్తుంది ఇద్దరికీ. ఆ రాత్రి తరువాత ఆత్తియప్పన్ తేలికైన దూది పింజలా జీవిస్తున్నాడు. కాళ్ళ పుళ్ళు పూర్తిగా మానలేదు. పలుచని ఆ నూనెపూత ఎడతెగక నాలుగేళ్ళుగా ఆవుడై కురుల మొనలతో నిమురుతూ రాస్తూనే ఉంది. ఇద్దరు కూడా దానిని ఇష్టపడ్డారు. పుళ్ళు వెంటనే మానకూడదన్నదే ఇద్దరి ప్రార్థనగా ఉంది. గణపతమ్మ చాలా వరకు అర్థం చేసుకోగలిగింది. ఆవుడైని తన సహోదరిగా భావించడం మొదలుపెట్టింది. ఒక రోజు వేకువజామున చూసేసరికి, ఎంత సేపటినుంచో తెలియదు, గిడ్డంగి పట్టెమంచంలో దూలాన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఆత్తియప్పన్ పడున్నాడు. వెంటనే ఆవుడై మోకాళ్ళ వరకు పంచెను పైకిలేపి తన ఇద్దరి బిడ్డల మీద చేయి పెట్టి చూసింది. ఇద్దరు బిడ్డలు చల్లబడిపోయారు. ఈ ఇద్దరు తప్పితే, తన కరుణ, ప్రేమ చూపేందుకు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అన్నట్లు ముడుచుకుపోయి గిడ్డంగి ఆవరణలోకెళ్ళి కూర్చుంది.

కదిరేశన్ గిడ్డంగికి అప్పుడు వచ్చాడు. గణపతమ్మ కూడా పరిగెత్తుకొచ్చింది. తంతులన్నీ ఇక్కడే గిడ్డంగిలోనే జరగాలని చెప్పింది. ఆవుడై మాత్రమే ఆత్తియప్పన్‌కి చివరి స్నానం చేయించాలని అడిగింది. కదిరేశన్ ఎదురు చెప్పలేదు. నీటి సదుపాయం ఉన్న చోటులో ఒక పెద్ద కుర్చీలో తీసుకువెళ్ళి ఆత్తియప్పన్‌ని కూర్చోబెట్టాడు కదిరేశన్. గణపతమ్మ ఆవుడైని ఆ చోటుకి తీసుకువచ్చింది. పెద్ద ఇత్తడి అండాలో నీళ్ళు నింపున్నాయి. కొంత సమయం గడిచాక కదిరేశన్ తిరిగి వచ్చాడు. ఆత్తియప్పన్ పంచెను మోకాలి వరకు పైకెత్తి రెండు కాళ్ళకు మాత్రం నీటిని ముంచి ముంచి పోస్తూనే ఉంది ఆవుడై తంగం. కదిరేశన్ అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ మళ్ళీ అండాని నీటితో నింపాడు. ఐదోసారి నీళ్ళు పోసేందుకు వచ్చినపుడు ఆవుడై తన పొడుగాటి కురులతో తన ఇద్దరి బిడ్డలను నిమిరి నిమిరి తడిని అద్దుతూ తుడవడం చూశాడు. గణపతమ్మ ఆవుడైని ఎక్కడికీ వెళ్ళొద్దని తనతో పాటే ఉండిపోవాలని కోరింది. ఆవుడై అందుకు నిరాకరించింది. కావాలంటే, గిడ్డంగిలో ఉండేందుకు అనుమతించమని కోరింది.

మూడు నెలలు గడిచాయి. ఈ మూడు నెలల్లో తన కురులకి నీళ్ళు తగలకుండా పెట్టుకుంది. చనిపోయిన బిడ్డల పరిమళం అందులో వీస్తుందేమో అన్నట్టు తన కురులను ముందుకు లాగి వాసన చూస్తూనే ఉంది. కొద్ది రోజులలో ఆవుడై తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో అవస్థపడింది. జ్వరం చివరి దశలో ఆమె కురులన్నీ దాదాపుగా రాలిపోయాయి. పిరుదుల వరకు వున్న నల్లని కేశాలు ఇపుడు మెడ వరకు కూడా లేకుండా, అవి కూడా దాదాపు వ్యాధి సోకి నల్లబడ్డ ఇత్తడి రంగులోకి మారిపోయాయి.

(మూలం: కేశం, వికటన్ వారి తడం సంచిక, ఫిబ్రవరి 2017.)


రచయిత గురించి: నరన్ అనే కలం పేరుతో రాసే ఆరోగ్య సెల్వరాజ్ ఒక ప్రముఖ టీవీ చానల్‌లో పని చేస్తున్నారు. నరన్ నూతన తమిళ సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి. తమిళ సాహిత్యంలో కథలు, కవిత్వం, నవలలు విరివిగా రాస్తున్న అతికొద్దిమంది వర్ధమాన రచయితలలో అతను కూడా ఒకరు. సర్రియలిజం, మాజికల్ రియలిజం, ఫాంటసీ, జెన్ తత్వం వంటి అంశాలతో నిండిన కవిత్వం అతనిది. ఇక కథల విషయానికి వస్తే సన్నివేశాలలో గాఢత, కవితాత్మకత రెండూ సమపాళ్ళలో మేళవించి ముందుకు సాగుతాయి. కేశం, వారణాసి అతడికి గుర్తింపు తెచ్చిన కథలు. వీటితో పాటు 360 డిగ్రీ అనే ఒక పత్రికకు సంపాదకుడిగాను, సాల్ట్ అనే పబ్లికేషన్ వ్యవస్థాపకుడిగాను ఉన్నారు. కేవలం సాహిత్యాన్ని చదవడంతో మాత్రమే సరిపెట్టుకోకుండా, వేర్వేరు కాలాల్లోని కళాకారులతో ప్రయాణం కొనసాగించడం ఇష్టం. ఇంతవరకు సాహిత్య రంగంలో తన రచనలకై 11 అవార్డులు అందుకున్నారు. కేశం అనే ఈ కథా సంకలనానికి 4 అవార్డులు లభించాయి. అందులో సుజాత స్మారక అవార్డు, వికటన్ అవార్డు, బాల కుమరన్ స్మారక అవార్డు, 2 వాసగ శాలై అవార్డులు ముఖ్యమైనవి.