పుస్తక పరిచయాలు

తదేక

‘కదిలే దీపస్థంభాలు కదూ పిల్లలు…’ అంటూ ఒక గుర్తుండిపోయే వాక్యం రాసి, వాళ్ళు వదిలిన ఇళ్ళ గురించి ఏం చెప్తాం అని బెంగపడ్డ కవి తిలక్. తనపైని కవి శ్రీకాంత్ ప్రభావాన్ని అట్టే దాచాలనుకోని శైలి ఈ కవిది. పొడవైన వాక్యాలు, చాలా దగ్గరవాళ్ళకి చెబుతున్నట్టుండే సన్నిహితమైన భావాలు ఇతని కవిత్వాన్ని పట్టిచ్చే తొలి లక్షణాలు. ఈ దగ్గరతనమనే మానసికావస్థను ఇతని కవిత్వం పాఠకుల నుండి అధికారంగా అడుగుతుంది. దానికి సుముఖంగా లేని వాళ్ళ నుండి దూరంగా జరుగుతూ పోతుంది. ‘ఒక రాత్రి వెన్నెల్లో తడిసే మట్టీ… కొవ్వొత్తుల కళ్ళేసుకుని నవ్వే సముద్రమూ’ అంటాడో కవితలో. అలలపైన చిందాడే వెన్నెల తళుకును రెపరెపలాడే కొవ్వొత్తి వెలుగుతో పోల్చడంలో కనపడే సౌందర్యస్పృహ ఇతని కవిత్వాన్ని ఆసాంతమూ చదివిస్తుంది. కవితలో వడి ఒకేలా ఉన్నా పోలికల్లో తేలిగ్గా కొరుకుడుపడని సంబంధం, సామ్యం కొన్ని చోట్ల ఇబ్బందిపెడతాయి. వినూత్నమైన, పూర్తిగా తనకు సొంతమైన కల్పనాశక్తితో రాసిన పాదాలు కవితల్లో స్పష్టంగా కనపడుతాయి. ఈ కాలపు మానసికావస్థలకు తగ్గట్టుగా తిప్పుకున్నవా అనిపించే అబ్‌స్ట్రాక్ట్ భావనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అసంబద్ధంగా ఉంటూనే అదే నిజమేమో అనిపించే ధోరణి, తప్పులను అంగీకరిస్తూనే ఇలా తప్ప ఉండలేనని చెప్పే లెక్కలేనితనమూ ఈ కవితలలో ఉన్నాయి.

తడి బట్టలను ఆరేస్తున్న నీ చేతుల వంక నేనలా చూడటం
నువ్వు కళ్ళను ఆకాశంలోకి ఎగరెయ్యడం
నేను నా చూపులను భూమిలోకి పారబొయ్యడం యెన్నిసార్లు జరగలేదూ…

ఈ తడుస్తున్న సముద్రం ముందు కూర్చుని మనం తదవడం ఎంత బాగుంది
లోపల తడిసి ఉన్న చేపలు కొత్తవానలో ఇంకా తడవాలని బయటకొచ్చి మన ఎగరడం…

అయిపోయిన సమయాన్ని కాస్త జేబులో వేసుకుని
అలా ఎంతసేపు నడిచాడో ఇంకా అంతమే లేదు దారికి
దూరం కొలవడానికి తన దగ్గర ఏమీ లేవు, ఒక్క కంటిచూపు తప్ప

…వంటి పాదాల్లోని సౌకుమార్యం, స్వచ్ఛత ఆకర్షిస్తాయి.

పుస్తకం పేరు: తదేక కవితాసంపుటి
కవి: తిలక్ బొమ్మరాజు
ప్రచురణ: ప్రజ్ఞ ప్రచురణలు
ప్రతులకు: కినిగె.కామ్, విశాలాంధ్ర, నవోదయ.