అమ్ముదామా? అమ్ముడుపోదామా సోదరా?!

ఉరికంబంలాగానో, ధ్వజస్థంభంలాగానో నిటారుగా నిలబడి మనం అన్నిటినీ ప్రశ్నించగలం. సకల విలువలు తేలేది, తెలిసేది ప్రశ్నించడం వలనే. అసలు ప్రశ్నే ఎదురవని సమాజం చివరికి అంతరంగం కూడా సులువుగా పట్టుబడవని రచయిత నందిగం కృష్ణారావు తమ ‘మరణానంతర జీవితం’ అనే నవలతో మనముందుకు వచ్చారు. ఆపై, దేనినయినా ప్రశ్నించే ముందు అద్దానిని తెలుసుకోకుండా ప్రశ్నించి ప్రయోజనం లేదని, ప్రశ్నకు ముందూ వెనుకల, ఇరుపక్కల తోడై నీకో నిజాయితీ, నిన్ను దాటిన ప్రయోజనం, వీటిలో మనిషితనం వుండాలనీ కూడా గుర్తుచేయించే పనిపెట్టారు ఈ నవలతో. చిన్న నవలేగాని కునుకు పట్టనీకుండా పేచీపెట్టక మానదు. అప్పుడెప్పుడో ఓసారి ఈ నవల పత్రికలో ధారావాహికంగా అచ్చయివచ్చినప్పుడు మిత్రులు కె. ఎన్. వై. పతంజలి, అసుర, మరికొందరు నావలె శ్రద్ధగా చదివి కంగారుపడ్డాము… కలసినప్పుడల్లా చర్చించుకునేటంతగా… సకారణంగానే. మనందరి చుట్టూవున్న, చుట్టుముట్టిన సమాజం మనల్ని మినహాయించదు గనుక లౌక్యం, లౌల్యం అంటని నిట్రాతి వంటి నిజాయితీ కరవయిన చోటల్లా దొంగ వేదాంతం, కనురెప్పల చాటున రాజకీయ దృష్టి పేరుకుపోవటం ఖాయమని మనవి. ఈ నవల్లోని దాదాపు అన్ని పాత్రలూ పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే చెంపలు వాయించినట్లు చెబుతాయి. అలాగని ఇదేమీ మనకు తెలీని సంగతని కాదు… మళ్ళీ మళ్ళీ మనల్ని కుదిపినట్లనిపించడం… ఈ పాత్రల వెనుక రచయిత ప్రజ్ఞ.

ముక్తవరం పార్థసారథి, రెవెరా వంటి మంచి రచయితలూ చదువరులూ ఈ నవలని హత్తుకుని, మెచ్చి మనముందు చర్చకి పెట్టారనిపించింది. నిజంగానే ఈ నవల్లోని పాత్రలు, సారాంశం పరిచయంలేనివి కావుగానీ, ఆ పాత్రల మనోకామన మన ఒంటికి పులిమినట్టు రాయడం భలే శైలి, సత్తా కూడానూ. చిత్రమేమంటే మనం చదివిన గొప్ప గొప్ప ఆంధ్ర, ఆంగ్ల నవలల్లోని పాత్రలు మనకి అర్థం గానివి, తెలీనివి గావు. కానీ వాటి ద్వారా రచయిత చెప్పించిన మాటలు, సందర్భాలు మనలో మూసుకున్న మరో కన్నుకు పనిచెబుతాయి. సరిగ్గా ఈ తీరునే నందిగం కృష్ణారావు పాత్రలు మనలో విరుచుకుపడే భావాలు మనల్నీ ప్రశ్నించేట్టు చేయగలవు. ఈ పాత్రలన్నీ లోపలి నుంచి, బయటి పలుగులను, నికార్సయిన దగుల్బాజీతనాన్నీ మన ముందు పరిచిపోతాయి! ఇలా పాత్రల్ని తయారుచేయడంలో, మాటలు పలికించడంలో కొత్తదనం, గమ్మత్తుదనం కంటే రచయిత పడే వేదన ప్రతిబింబం వీటిలో కనిపిస్తుంది. అందుకే రచయితని బోలెడు అభినందించాలి గదా!

సమాజంలో మనకి ఎదురయే సకల పాత్రలూ అవసరవేళల్లో ఎలా విధిగా మోసపోతాయో, ఆ శాల్తీలు ఎందుకని మనకు నిద్రాభంగం చేస్తాయో, ఆ వైనాన్ని నందిగం వాక్యాలు నోరు విప్పి ఉలిక్కిపడేట్టు మాట్టాడతాయి. అమాయకపు వెర్రిమొహాలను చాకచక్యం అవసరం లేకుండా చదివేసే ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు, లాయర్లు, స్వీయ పబ్లిసిటీ సినీజనం, డాక్టర్లు, పోలీసులు, న్యాయమూర్తులు, బ్రోకర్లు – అందరూ వెరసి ఎక్కడా దాపరికంలేని ఎక్స్‌ప్లాయిటేషన్‌ను జీవనావసరంగా మార్చుకొనే శైలి కనిపిస్తుంది. వెర్రిబాగుల మధ్యతరగతి కల్తీలేని మోసానికి రెడీమేడ్‌గా తలవొంచుకుని తిరగడం… సమస్తం దైనందిన విధి-డ్యూటీ వంటి దృశ్యం అవగతం అవుతుంది, ప్రతి పేజీ నిండార. పాత్రలన్నిటిలో మరీ ముఖ్యంగా ‘టక్కర్ చంద్రశేఖర్’ న్యాయోచితమైన దుర్మార్గమార్గం అతి లౌక్యులకే కిర్రెక్కిస్తుంది.

వీరమాచనేని ప్రసాదు, స్వప్న, సురేంద్రరెడ్డి వంటి పాత్రలు, ఆస్కర్ వైల్డ్, దాస్తోవ్‌స్కీ, గొగోల్, చెహోవ్ రాసిన పాత్రలన్నీ తెలిసిన మంచి పాఠకులకి సైతం నందిగం సృష్టించిన పాత్రలు మరొకసారి ఝలక్ ఇస్తాయి. మహారచయితలు ఆవిష్కరించనిది, విశ్లేషించనిది ఏదీ లేదు. ఐనాగాని మళ్ళీ మనల్ని కొత్త దృశ్యం ఉన్నట్టే చూపెట్టే పట్టుగల శైలి నిలువుగా కనిపిస్తుంది ఈ నవల్లో.

జీవన విషాదమో, న్యాయాన్యాయాల పరిహాసమో, అజ్ఞానం, మూర్ఖత్వం రంగరించిన చేతగానితనమో… ఎందరో అమాంతం అమ్ముడు పోవడం, అందుకోసం ఎదురుచూస్తూ నింపాదిగా చచ్చిపోవడం నిర్దాక్షిణ్యంగా చూపెట్టారు రచయిత. నవల ఎత్తుగడ భలే చిత్రంగా ఉంది. ఆద్యంతం రచయిత వాక్యాలు, పదాలు అలుపులేకుండా దొర్లిపోతుంటాయి… అందుకే నవల చదివినంతసేపు చదువుతున్నట్టనిపించదు. చూస్తోన్నట్టనిపిస్తుంది. మరోసారి చదివించేట్టూ చేస్తూందీ నవల.

తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...