తెలుగు కాల్పనిక సాహిత్యాన్ని పాశ్చాత్య/ఆంగ్ల సాహిత్య సృజనతో పోల్చడం చాలా కాలంగా తెలుగువాళ్ళు జరుపుతున్నా గానీ, ఈమాట డిసెంబర్ 2021 ముందుమాట పుస్తకావిష్కరణల పోలిక అన్న ఒక కొత్త అంశాన్ని లేవనెత్తింది. సభ పెట్టి చేసిన ఆవిష్కరణలనూ, ఆ తరువాత పుస్తకాలని ఉచితంగా పంచే ఆనవాయితీనీ మాని రచయితలని అమెరికాలో లాగా పుస్తక విక్రయశాలల్లోనే ఆవిష్కరణని జరుపుకోండన్న సూచనతో ఈ ముందుమాట ముగుస్తుంది.
ఈనాటి తెలుగు పుస్తకావిష్కరణల పద్ధతి ఒక ప్రహసనమే కావచ్చు. దానికి మార్పు కూడా అవసరమే కావచ్చు. కానీ ‘పాశ్చాత్య పద్ధతి నవలంబించండి’ అన్న సూచన మాత్రం ఈనాటి తెలుగు రచయితల, ప్రచురణకర్తల, పుస్తకశాలల పరిస్థితిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని అనిపించడానికి కారణాలు చాలా వున్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని:
- ఆంగ్ల సాహిత్యానికి పాఠకులు ప్రపంచవ్యాప్తంగా ఉండడంవల్ల పుస్తక ప్రచురణ ఒక గిట్టుబాటయే వ్యాపారం. పేరున్నవే కాక చిన్నచిన్న ప్రచురణ సంస్థలు కూడా కోకొల్లలు. ఒక్కొక్క ప్రింటుకీ వేలకొద్ది, కొన్ని పుస్తకాలకి లక్షలకొద్దీ కాపీలు వేస్తారు. వాళ్ళు తమ ఖర్చుతో రచయితకి బుక్ టూర్ అమరుస్తారు. ఖర్చు పెట్టి పత్రికల్లో ఆ పుస్తకం గూర్చి ప్రకటనలు ఇస్తారు. ముందుమాటలో చెప్పినట్లుగా పుస్తక విక్రయశాలల్లో పుస్తక పఠనానికి, సంతకాలని చెయ్యడానికీ వెసులుబాటు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న పాఠకులు పుస్తకాలని కొంటారు కూడా. ఇవేవీ తెలుగు సాహిత్యానికి వర్తించవు.
తెలుగు ప్రచురణ వర్తక సంస్థల సంఖ్యని ఒక చేతి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. వాళ్ళు లబ్ధప్రతిష్ఠుల, కీర్తిశేషుల పుస్తకాలవైపు తప్పితే – ఎవరో కొద్దిమందిని తప్పించి – వర్తమాన (ఇప్పుడు 50-60 యేళ్ళ వయసువారు కూడా ఆ కోవలోకే వస్తారు) రచయితల గూర్చి అంతగా పట్టించుకోరు. అందువల్ల రచయితలే సొంత ఖర్చుతో ఈనాటి ప్రచురణకర్తలు. మొదటి పుస్తకానికి 500 కాపీలని వేసిన అనుభవంతో నా తరువాతి పుస్తకాలకి 300 కాపీలతోనే సరిపుచ్చాను. (కాపీలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయి!) రచయితలే ప్రకటనలు ఇచ్చుకోవచ్చు గాని, పుస్తకావిష్కరణ సభకి లాగానే దానికీ ఖర్చు వాళ్ళ చేతినించే పడుతుంది.
- బార్న్‌స్ & నోబుల్ వంటి విశాలమైన తెలుగు పుస్తక విక్రయశాలలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏనాడూ లేవు. అటువంటి పుస్తకశాలల వైశాల్యంలో పదవభాగమో పరకభాగమో ఉండి, ఇద్దరు మనుషులు పక్కపక్కన నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్న అల్మైరాల మధ్య ఉన్న సందులో రచయిత కుర్చీలో కూర్చుని ముందు బల్ల మీద పుస్తకాల బొంతని పెట్టి సంతకం చేసివ్వడం అంటే కలలో బావున్నది గానీ ఇలలో సాధ్యమయ్యే పని కాదు.
- ఏడాదికి ఒకమాటు పెట్టే పుస్తక ప్రదర్శనలకి తప్ప తెలుగువాళ్ళు పుస్తకాలు కొనడానికి వెళ్ళడం తక్కువ. పెద్ద నగరాల్లో పనిగట్టుకుని దూరం వెళ్ళవలసిరావడం, చిన్న ఊళ్ళల్లో పుస్తకాలు దొరకవు అన్న అనుభవం కారణాలు కావచ్చు. గత పాతికేళ్ళల్లో హైదారాబాద్ లోని ‘విశాలాంధ్ర’కి ఎప్పుడు వెళ్ళినా కొనేవాళ్ళతో కిటకిట లాడడం అటుంచి, నలుగురికి మించి అక్కడ ఉండడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. వెళ్ళినప్పుడు కూడా, దొరికినవి కొనుక్కోవడమే తప్ప, వాళ్ళ ప్రచురణలు అయితే తప్ప, అక్కడ కొనడానికి వెళ్ళినవి దొరకడం అరుదు.
- ఒకవేళ అలాంటి చోట్లే రచయిత తన పుస్తకాన్ని ఆవిష్కరిద్దామనుకున్నా సాధారణ పాఠకులకి ఆ వార్త ఎలా తెలుస్తుంది? ఇవి అభిమాన హీరో సినిమాలు కావయ్యే! ఎన్ని చోట్ల ప్రకటిస్తే ఉన్న కొద్ది మంది పాఠకులకీ ఆ వార్త చేరేను?
- పుస్తక పరిచయం కోసం అచ్చు వార, మాస పత్రికలు రెండు కాపీలు పంపమంటాయి గానీ, ఆ పుస్తక పరిచయం ఆ పత్రికలలో చోటు చేసుకోవడమనేది, లేదా దానికి ఎంత చోటుని కేటాయించారన్నది అస్మదీయులా, లేక తస్మదీయులా అన్న అంశం మీద ఆధారపడి వుంటుంది. ఉన్న అచ్చు పత్రికల సంఖ్య తక్కువ, అచ్చులోకి వస్తున్న పుస్తకాలు ఎక్కువ. పాపం, ఆ పత్రికలు మాత్రం ఏం చేస్తాయి? అందుకని ఈనాడు రచయితలు ఎక్కువగా ఆశ్రయించేది ముఖపుస్తకాన్ని, సోషల్ నెట్‌వర్క్‌నీ. అలాగని అక్కడ వున్న వందల మందిలో అందరూ కొంటారని కాదు; పదిమందికయినా తెలుస్తుందన్న ఆశతో మాత్రమే.
రచనే కనీసం కొంతమందికయినా పూర్తిగా జీవనోపాధి కల్పించడమనేది తెలుగులో శ్రీపాదవారి కాలం నాటితో మొదలుపెట్టి ఈనాటికీ లేదు – కొందరు ‘కమర్షియల్’ రచయితలకి మినహా. అమెరికాలో కూడా హెమింగ్‌వే, ఫాక్‌నర్ల కాలం నాటి పరిస్థితి ఈనాడు లేదు. జార్జ్ సాండర్స్ పేరున్న రచయితే అయినా, ఎన్నో పుస్తకాలు ప్రచురించినా, ఆయనకి ఆదాయాన్ని ఒనగూర్చడానికి యూనివర్సిటీ ఉద్యోగం ముఖ్యం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 2021లో పులిట్జర్ బహుమతి విలువ పదిహేనువేల డాలర్లు. అది ఒక మనిషి సంవత్సరంపాటు జీవించడానికి కూడా ఏమాత్రం సరిపోదు. అందుకని ఈనాడు చాలామంది అమెరికన్ రచయితలు కూడా వేరే జీవనోపాధి వెదుక్కుని రచనని తీరుబాటు సమయంలో చేస్తున్నారు. ఈమధ్య ‘క్రౌడ్ సోర్సింగ్’ పద్ధతిని గూడా వాళ్ళు అవలంబిస్తున్నారు. తెలుగు రచయితలకి అలాంటి వెసులుబాటు లేదు.
అందరు రచయితలకీ కావలసింది పాఠకులే. కొని చదివేవాళ్ళుంటే అంతకంటే కావలసింది లేదు. పుస్తకాన్ని ఉబ్బరంగానే చేతికిచ్చినా, కనీసం వారు చదివి దాని గూర్చి రెండు మాటలు చెప్పితే దానితోనే తృప్తిపడచ్చు. పాఠకులే తక్కువవుతున్న ఈ కాలంలో రచయిత పుస్తకాలని పోస్టల్ ఖర్చులని భరించల్లా పంపడమనేది కొంతమందయినా చదివేవాళ్ళకి చేరుతుందన్న ఆశతో తప్పితే తన రచన మీద గౌరవం లేక కాదు. వీధి భాగవత ప్రదర్శనలు వాళ్ళ వృత్తిమీద గౌరవం లేకుండా చేశారా? అలాగే, రచన కూడా ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్! నటులకి ప్రేక్షకుల లాగే, రచయితలకి పాఠకులు అవసరం. ‘రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు’ అన్న అభిప్రాయానికి తోడుగా అసలు ఆ విలువ కట్టేవాళ్ళకి గానీ, ఆ విలువని తెలిపేవాళ్ళకి గానీ ఒక పుస్తకం చేరేదెట్లా, వందల పుస్తకాలు ఎదురుగా ఉన్నప్పుడు ఒక పాఠకుడిచేత ఆ పుస్తకమే కొనిపించేదెట్లా? అన్న విషయాలని కూడా విశదీకరిస్తే బావుండేది.
ఖర్చు పెట్టి సభలని నిర్వహించడమంటారా, సత్తువ ఉన్నవాళ్ళు పార్టీ ఇస్తున్నారనుకోరాదూ?!