బ్రహ్మాన్ని రమ్మని చెప్పాను. ఇవాళ వస్తాడు. తప్పకుండా వస్తాడు. ఎన్నాళ్ళనుంచో చెబుతోంది ఓసారి రమ్మని చెప్పమని. ఇంట్లో చిన్న చిన్న పనులు, రిపేర్ పనులు బ్రహ్మమే చేస్తాడు. కత్తిపీట ఊగుతూ ఉంటే పీటకి మేకులు కొట్టో, కర్రముక్క పెట్టో దాన్ని సరిచేస్తాడు. అలాగే కొడవలి పిడి కూడా. ఇంకా తలుపు దగ్గర ఏమైనా రంగు పోయినా లేదా వార్నిషు పోయినా, కుర్చీలకి కుసులు ఊడిపోయినా రిపేర్ చేస్తాడు. గుమ్మాలకి గొళ్ళేలు కూడా సరిచేస్తాడు.
వంటింట్లోకి పిల్లులు వచ్చేస్తున్నాయి, ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నాయి, పాల మీద మూత తోసేసి తాగేసి పోతాయి. పెరుగు ఇష్టం లేదనుకుంటా. మూత తప్పించి ఓ సారి మీసాలు తడి చేసుకుని తన్నేసి వెళ్ళిపోతాయి.
కూర్చునే కుర్చీ మీద రాసుకునే బల్ల కదులుతూ రాసుకోవడానికి విసుగ్గా ఉంటోంది. గడ్డం గీసుకోవడానికి అద్దం బల్ల మీద నుంచోవట్లేదు. దాని వెనకాల స్టాండు ఊడిపోయినట్టుంది.
పొద్దున్న నుంచి వస్తాడు వస్తాడు అని చూస్తున్నాను. బయటికి పోవడానికి లేదు. బయటికి వెళ్ళడం చూసి వస్తాడు. లేనని వెళ్ళిపోతాడు.
లైబ్రరీ దగ్గర రావుగారు చూస్తూ ఉంటాడేమో పర్వాలేదు సాయంత్రం కలవచ్చు అర్జంట్ విషయాలు ఏమున్నాయి. రోజూ ఉండే విషయాలే. ఆయన నిన్న వచ్చిన ఫోన్ గురించి చెప్తాడు ‘అబ్బాయి రమ్మంటున్నాడు ఎలా వెళ్ళడం. ఇక్కడ పంటలు వచ్చాక రైతు దగ్గర కౌలు వసూలు చేసుకుని వెళ్ళాలి’ అంటాడు రైతు బ్యాంకులో వేస్తాడు డబ్బులు అంటే వినడు. ఎప్పుడూ ఉండేదే ఆయన చెప్పడం నేను వినడం నేను చెప్పడం ఆయన వినడం. వినడమే, మళ్ళీ మామూలే.
ఇవాళ బ్రహ్మం రాకపోతే రేపు వస్తాడేమో. రేపు పెన్షన్ కోసం బ్యాంకుకి పోవాలి. ఆవిడ అంటూనే ఉంటుంది అంత అర్జంట్ ఏముంది బ్యాంకులో డబ్బులు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా అని. బ్యాంకులో పెన్షన్ టంచన్‌గా పడుతుంది అయినా ఒకసారి అకౌంట్లో చూసుకుంటే అదో ధైర్యం.
మొబైల్‌లో చూసుకోవచ్చు.అయినా ఇప్పుడు ఎసెమెస్ కూడా వస్తుంది. ఇంతకుమునుపు ఊరికెళ్ళి వచ్చేక చూసుకుంటే మూణ్ణెల్లు, ఏం తేడా వచ్చిందో, పెన్షన్ పడలేదు. బ్యాంక్ చుట్టూ పదిసార్లు తిరగవలసి వచ్చింది.
“అలా వీధి గుమ్మంలో తచ్చాడుతున్నారు ఎవరికోసం? ఇంట్లోకి రండి. కాఫీ పెట్టి పిలుస్తున్నా పలకరేం?”
“వస్తున్నా. బ్రహ్మం వస్తానన్నాడని చూస్తున్నాను.”
“బ్రహ్మమా, ఏమిటి పని?”
“ఏవో చిన్న చిన్న పనులున్నాయని రమ్మన్నాను. కత్తిపీట ఊగుతోంది. కొడవలి పిడి ఊడిపోయింది. రాసుకునే బల్ల కదులుతోంది.”
“బాగానే ఉంది సంబడం కత్తిపీట వాడి ఎన్నేళ్ళయింది?”
“కొడవలి ఎక్కడుంది ఇంట్లో?”
“ఎన్నాళ్ళయింది ఏదైనా రాసి?”
“బ్రహ్మంతో కబుర్లాడ్డానికి రిపేరీ మాటలెందుకు. మీ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుని, కాస్త కాఫీ తాగి మీరో వందో, రెండొందలో చదివించుకునేదానికి? అనవసరంగా పాత సామాన్లు బయటకి తీసి ఆ మేకులు అవి కాళ్ళల్లో గుచ్చుకోవడం ఎందుకు? పోయిన పొద్దు మంచిగా పోనివ్వండి.”
“నీకు తెలుసు కదా బ్రహ్మం పనేమీ చెయ్యకుండా డబ్బులిస్తే పుచ్చుకోడు. నాలాగ పెన్షన్ లేదు కదా. పిల్లలు కూడా ఈ మధ్య పనిలేక ఇబ్బంది పడుతున్నారు.”