అతడు చెక్కిన రవివర్మ శిల్పం

నవల పేరు రాజా రవివర్మ. ఆ శిల్పాన్ని చెక్కినవారు పి. మోహన్. నల్లరాతి మీద రక్తమాంసాలున్న ఒక ముఖాన్ని చెక్కడం కళగలిగిన శ్రమ. ‘Chip out what is not horse in it’ వంటి తిప్పలు పడి రవివర్మ జీవితచిత్రణ అనే శిల్పం రాబట్టారు రచయిత. తెలుగులో పరాయివారి జీవితచరిత్ర సమగ్రంగా రావడం అంటే దుర్లభం–next to impossible! జీవితచరిత్ర రాయడం అంటే ఒక ఇన్‌ఫార్మర్‌గారు పోలీసువారికి చేరవేసే నివేదిక వంటిదయితే ఈ నవల రాయడం శుద్ధదండగమారి పని. గూగులమ్మనో, వికిపీడియానో సంప్రదించి రైళ్ళ రాకపోకలవంటి జీవిత వివరాల పట్టీ ఒకటి వామహస్తంతో అదరగొట్టవచ్చు.

రాజా రవివర్మ చదివేకా ఆ చివర్నుంచి ఈ చివరికి మంచి పరిశోధన సాధించిన వివరాల పుట్టలో ప్రతి చిన్న అంశం తైపారు చేసి చూసుకుని, దాన్ని నవలకి సరిపడేట్టు చేసిన ఘనయత్నం కనిపిస్తుంది. రవివర్మ అనే ఆనాటి కళాకారుని జీవితకథలో ఒకటి రెండు మలుపులను వెదికి పెన్సిల్ చెక్కినట్టు రాసిపడెయ్యటం, కిట్టించడం కుదరదు–నాటి ప్రాంతీయ చరిత్ర, వలస కళల వాతావరణం, తైనాతీల వస్తుప్రపంచం, బ్రిటిష్ జమీందారీ అడుగుబొడుగు నీడలు సర్వసమగ్రంగా శోధించి నేతపని చేయడంవల్ల పాఠకుడికి ‘రవి’ కళాప్రపంచపు ‘అదనపు విలువలు’ బహుళ ప్రయోజనం చేకూర్చాయి.

కేరళలో ప్రారంభమయిన రవి కథ కాస్త నడుస్తుండగానే మనకి కొబ్బరిచెట్ల వరుస, కొబ్బరి గానుగ నూనె వాసన వేసే శిఖముడి పదార్థాలు, ఎండాకాలపు జిగురు చెమటల అసౌకర్యం, అవతల వీచే లవంగాల వాసన, కొబ్బరిపూత తాలూకు వంటలు, పోకచెట్లు, పొడవాటి అరటిగెలల బారులు, అరటిపూల ఎరుపు, కలువల రంగులు, వాటి మధ్య పొడవాటి పడవలు, అందమైన చామనచాయల, చనువుగల ఆడపిల్లల కట్టుబొట్టు, వినయ విధేయతల వెనుక ముంచెత్తుతున్న కామపువాసనలు, అణగిపోయే తిరుగుబాట్లు, వంటిల్లు గడప దాటని అపేక్షలు, అలుపెరుగని ప్రేమల హోరు బలేగా ఎదురవుతాయి.

అంతేకాదు, ఆంగ్లపాలన ఛాయల్లో మతఛాందసపు సాలెగూడు అల్లిక, విస్తరణ… సంస్కరణ ఉద్యమించి సాహిత్య పత్రికలు నిలిచి ఎలుగెత్తడం, కొత్త సాంస్కృతిక వేదిక మీద పాత స్వరాల పాటలు… నలుపు తెలుపు ఫోటోలవారు ఆయిల్ కలర్స్‌తో కేన్వాస్‌లపై పోర్‌ట్రైట్‌లకు ఎగబడటం, నగరాల్లో ప్లేగు రోగం, అతిశయించిన పేదరికం, చిరువ్యాపారం… మతమార్పిడుల దొరతనం, విద్యారంగంలో కొత్త మొలకలు, దేశభక్తి నలుదిశలా కమ్ముకోవటం వంటి ఎన్నో దృశ్యాలు రవి కథ చుట్టూ అల్లుకుని కనిపిస్తాయి. గాంధీజీ రాకమునుపు, మొదటిదశ కాంగ్రెస్ తరం చరిత్రతో సహా నాటి నగరాల్లోని మేధో చింతన చక్కగా పరుచుకుంది పేజీల్లో.

నిలిచినచోట నిలవకుండా రవివర్మ రంగులు పుచ్చుకుని దేశమంతా తిరగటంలో ‘భిన్నత్వం’ చూసి నేర్చుకోడం ఒక కీలక దశ. కేరళలో స్వజనం గాక రవి మహారాష్ట్ర, గుజరాత్‌లలో తన ‘మోడల్స్’తో ప్రేమ గాని ప్రేమలో మసలవలసి రావటం, నాటి కళావంతుల ఎడల నిర్దయాపర్వం మిగిల్చిన సానుభూతి పర్యవసానం… ప్రేమనదిలో లౌక్యంగా ఈదుకొచ్చి ఒడ్డుదాటి తప్పుకున్న రవిలో అంతర్మథనం, కరుణారూపం రాయడంలో రచయిత నేర్పు విశాలంగా కనిపిస్తుంది. అలాగే చిత్రకళా సామగ్రి, పెయింటింగ్ చేసే పనిలో క్రాఫ్ట్ మెలకువలు మొదలయినవి (తెలుగు నవలలకు పరిచయం గట్టిగా లేని వాతావరణం) చక్కగా అవసరానికి సరిపెట్టారు. తప్పనిసరిగా నగ్నంగా చూపించదలచిన స్త్రీలకు (చిత్రంలో) అంచక్కటి చీర చుట్టి జరీ అంచు నేతని పెయింట్ చేస్తున్నట్టే రాసి రవి స్టూడియోని వాక్యాల్లో కట్టేరు రచయిత.

రవి కుటుంబం, అన్నదమ్ముల ప్రేమ, హితుల కరవు, ఆశించినంత దక్కినా దక్కకపోయినా ఆర్థిక స్థితిలో నిజాయితీకి ఆయన ఇచ్చిన విలువ నేటికి చిన్న ప్రశ్న ఒకటి పలువురి ముందు పెట్టినట్టనిపించింది. రవి వెనుదిరగటం, వెరవటం, తల ఎగరేసి ఎదురు నిలవటం దేనికదే ఆయన నైజాన్ని మరో కోణంలో చూపెడుతుంది. తన తప్పు, ఒప్పులను సమీక్షించుకోగల వ్యక్తిత్వం భాగం చదువుతుంటే ‘well edited film’ లాగా అనిపించింది ఈ నవల.

వివేకానంద, ఠాకూర్, అరవిందులు స్వదేశీ, విదేశీ చిత్రకళ, శైలికి సంబంధించి రవివర్మతో విభేదించి విశ్లేషించిన అంశాలన్నీ చిన్నపాటి చర్చను అందించాయి. అలాగే రవికి నౌరోజి, తిలక్, రనడే వంటి మొదటితరం రాజకీయ పెద్దలతో పరిచయ స్నేహాలు; బరోడా సంస్థానం, రాణులు, అక్కడి గౌరవ సంప్రదాయాలు–మార్జిన్‌లో నోట్ చేసినట్టుండే చిరువివరాలు ముచ్చటపెట్టేయి. ఐతే అక్కడక్కడ సంవత్సరాలు, వ్యక్తుల వివరాలు సరిగా లేవనిపించింది. ఇదంత ఇబ్బంది పెట్టిందీ లేదనవచ్చు. ముఖచిత్రాలు వదిలేస్తే, పౌరాణిక దృశ్యాలను చూపెట్టే చిత్రరచన వెనుక రవి సాహిత్య కృషి, పఠనాసక్తి, ఆర్టిస్టుకు వుండాల్సిన సద్గుణాలుగా, అత్యవసరాలుగా పేరాల మధ్య గుర్తు చేస్తుంది. సహజ ప్రకృతి చిత్రణ సంగతి రవికి అంత ముఖ్యమనిపించకపోవటం వెనుక ఆయన సంపాదన మార్గంలో పెయింటింగ్ చేయడమే మరీ ముఖ్యం అన్నది స్పష్టంగానే కనిపిస్తుంది.

కళాకారుడి చరిత్ర, నాటి ఆర్థిక సామాజిక దృశ్యం రెండుగా కనబడకుండా మంచి కథగా నవలంతా నడవటం బహుబాగుంది.

అన్నట్టు ఈ నవలలో తెలుగు పాఠకులను ఆకర్షించే మరో ముచ్చట–రవి యాత్రలు, తెలుగువారిని కేన్వాస్‌కు ఎక్కించిన విశేషాలూనూ. హైదరాబాద్ నగరంలో ఆయన కొన్నాళ్ళు వుండటం, దీన్‌దయాళ్, కిషన్ ప్రసాద్‌ల ఆతిథ్యం పొందటం, టాంక్‌బండ్ పరిసరాలను చిత్రించడం, అలాగే విజయవాడ, నూజివీడు, రాజమండ్రి, వైజాగ్ ప్రయాణాలు… గురజాడ అప్పారావు, న్యాపతి సుబ్బారావు వంటి మహనీయులు రవివర్మతో మాట్లాడటం, తెలుగువారికి సంబంధించి ఆయా పెయింటింగులను కాకినాడకు పంపించడం వంటి వివరాలు ముచ్చట పెట్టేయి. ఆపై, అవి ఏవి, ఎక్కడున్నాయో తెలుసుకోవాలనీ పాఠకుడిగా నాకు అనిపించింది. పాఠకుడిగా రాజా రవివర్మ చిత్రకళపై నా అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా చదువుతోంటే రచయితను అభినందించకుండా ఉండటం మహాకష్టం అనిపించింది. కొన్ని మోనోగ్రాఫ్‌లు మినహాయించి ఒక కళాకారుని మీద తెలుగులో చక్కటి నవల ఎప్పుడొచ్చింది?!

పి. మోహన్‌గారూ, గొప్పపని చేసిపెట్టారండీ. థాంక్యూ.

రాజా రవివర్మ (జీవిత నవల)
రచయిత: పి. మోహన్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు, రచయిత వద్ద: 99490 52916

తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...