పుస్తక పరిచయాలు

కులపాలికా ప్రణయసౌందర్యరాగం

దుఃఖే సుఖేష్వ ప్యపరిచ్ఛదత్వా
దసూచ్య మాసీ చ్చిర మాత్మనీవ
తస్యాం స్థితో దోషగుణానపేక్షో
నిర్వ్యాజసిద్ధో మమ భావబంధః

ఈ సంభాషణ కుందమాల లోది. ‘సుఖమునందు దుఃఖమునందు సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై (ఆమె) ఆత్మయందున్నది. దోషమునకు గాని గుణమునకు గాని సంబంధము లేని కారణరహితమైన యొక భావబంధము నాకామె యందున్నది’ అనగల నిండైన ప్రేమని పట్టిచ్చే ఒకానొక విలువైన సంభాషణగా, ఇది నాకు గుర్తుండిపోయింది.

ఇట్లాంటి ప్రేమ ఏ కాలంలోనైనా ఎందరికి సాధ్యమవుతుంది అనుకుంటే ప్రశ్నార్థకమే మిగుల్తుంది. ఇప్పటి సమాజంలో న్యూస్ హెడ్‌లైన్‌లను ఆక్రమిస్తున్న సంఘటనల వల్ల నైతేనేమి, తెలుగు సినిమాల ప్రభావం వల్ల నైతేనేమి, ప్రేమ అన్న పదం లోపల సున్నితమైన అనుకంపనను కలిగించకపోగా భయపెడుతోంది. అకారణమైన ప్రేమను అర్థం చేసుకోగల మనసుకు ఒక జాతిగా దూరమైపోతున్నట్టే ఉన్నాం. ప్రేమ, పెళ్ళి ఇంత బరువైన పదాలుగా, భయపెట్టే పదాలుగా కనపడుతున్న ఈ సంధికాలంలో 1999లో శ్రీవల్లి రాధిక రాసిన ఆమె నడిచే దారిలో అన్న ఈ నవలిక శరత్కాలపు ఉదయపు గాలిలా పల్చగా తేలిగ్గా తాకి గిలిగింతలు పెట్టింది. ఊహల్లో మసకమసకగా మిగిలిన తొలిప్రేమలనో, ఆశల ఆదర్శాల బరువుతో తూచి అందుకోలేకపోయిన విఫల ప్రేమలనో అనాయాసంగా గుర్తుతెచ్చే ఒకానొక సౌకుమార్యమైన అల్లిక ఈ కథనంలో ఉంది.

పెళ్ళాడటానికి ప్రేమ ఒక్కటే అర్హతగా నిలిస్తే బాగుంటుంది కాని, మానవ సహజమైన కుతూహలం అవతలి వ్యక్తిలోని ప్రత్యేకతలు తెలుసుకోనిదే, ఎందెందులో అతడు/ఆమె తనకు సరిజోడో తెలుసుకోనిదే అంత త్వరగా శాంతించదు. తృప్తి చెందదు. ఈ కథానాయకుడు అలాంటి కుతూహలపరుడు. అతని కుతూహలం చిరాకు పెట్టదు, గీతలు చెరుపుకుంటూ చొచ్చుకుపోయే దర్పాన్నో అధికారాన్నో ప్రదర్శించదు. కథానాయిక ముగ్ధ. ఆమెను అర్థం చేసుకోవడానికి ఎన్ని అడుగులేయాలో అన్నే వేస్తాడతడు. దూరాలను గౌరవిస్తూనే.

‘వీని చెంత చేరి వెడలగలను నేను/ అడవికేని కడలి నడిమికేని’ అని అనుకోవడం ఆడవారికేనా అవసరం! ఆ దిశగా ఆలోచన నడిస్తే, సూర్య పాత్రని రచయిత పొరలుపొరలుగా చూపెట్టిన తీరులోని ఆంతర్యమూ అర్థమవుతుంది. మొట్టమొదటి పేజీలోనే, నిశ్చితార్థం అయినప్పటి నుండీ అతనికి ‘ఆమె మీద తనకేదో హక్కుంది’ అనిపిస్తుంది. తన ఆరాటపు ప్రశ్నల ధోరణిని ఆమె అర్థం చేసుకోకపోవడం, నింపాదిగా ముక్తసరిగా బదులివ్వడం చూసి ‘ఎలా ఈ పిల్లతో వేగడం’ అనుకుంటాడు. రచయిత చెప్తారక్కడ: ఇది ఈ కాలపు యువకుల్లో వచ్చిన గొప్ప మార్పు. పెళ్ళి ముందే కాబోయే భార్య మనసు తెలుసుకోవాలన్న విపరీతమైన కోరిక. ఆమె ఇష్టాలేమిటి… కోరికలేమిటి… అభిప్రాయాలేమిటి… ఆలోచనలేమిటి అన్నీ తెలుసుకోవాలన్న ఆకాంక్ష. తెలుసుకుని ఏం చేస్తారు! అంటే ఏం చెయ్యరు. బహుశా పెళ్ళయ్యాక వాటిని గుర్తయినా పెట్టుకోరు. మరెందుకూ తెలుసుకోవడం అంటే, సమాధానం బహుశా వారికీ తెలీదు.

నింపాదిగానే మొదలైనట్టున్న ఈ నవలికలో, ఈ మొదటి రెండు పేజీలు చదివేసరికే, పాఠకుల మనసులో సూర్యశ్రీనివాస్ అల్లరి కళ్ళు, కాబోయే భార్య పట్ల అతనికున్న ఆకర్షణ అర్థమవుతూ అతని మీద ఒక లీలామాత్రపు ఇష్టం ఏర్పరిస్తే, మరోవంక పై వాక్యాలు మనలో రేకెత్తించిన ఆలోచనలు, ఈ శ్రీనివాస్‌దీ ఇదే పోకడా అన్న సందిగ్ధాన్నీ కలిగిస్తాయి. ఈ పాత్ర పట్ల ఇక్కడనగా మొదలైన ఈ కుతూహలం, ఆఖరు అంకం దాకా చెదరకుండా – దాదాపు ప్రతి పేజీలోనూ ‘ఇతనేం చెయ్యదలిచాడు?’ అన్న ప్రశ్నను కలిగిస్తూనే ఉంటుంది. ఎగ్జిబిషన్‌లో మిగతావారిని కలవడమూ, వాళ్ళతో సమయం గడపడమూ కాంచన కోసమేనని పాఠకులకు అర్థం కాదని కాదు. అది తేలిగ్గానే అర్థమవుతుంది. వారి సంభాషణల్లో ఆమె గురించిన ప్రశ్నలు, ప్రస్తావనలు దానికతని స్పందనలూ ఇవి కాదు ముఖ్యం. వాటి వెనుక ఉన్న ఆలోచన, మనసు – ఇవీ రచయిత తన అందమైన శైలి మాటున కప్పిన రహస్యాలు. ఆ ముడిని విప్పిన తీరు, ఇతడు కాంచన మనసెరిగి మసలుకోబోయే తోడయి తీరతాడన్న వాగ్దానమే ఈ పుస్తకానికి గొప్ప ఆకర్షణ.

చాలా నిశితమైన గమనింపులతో, పాఠకులను కథనావరణం లోకి తీసుకెళ్ళడం ఈ పుస్తకంలోని మరో ఆకర్షణీయమైన సంగతి. ‘అప్పుడే గ్రౌండంతా నీళ్ళు చల్లారేమో, సన్నని మట్టి వాసన తేలివస్తోంది’ అన్న వాక్యం చూసినప్పుడు, ఎక్జిబిషన్ గ్రౌండ్స్‌కి సంబంధించిన నాస్టాల్జియా ఏదో చటుక్కున చుట్టుముడుతుంది.

తేలికైన, సహజమైన సంభాషణల్లోనే, ఒక నవలికకు తప్పకుండా కావలసిన క్లుప్తతను ఓ వంక వదలకుండానే, చాలా స్పష్టంగా పాత్ర చిత్రణ కూడా చేయడం ఆశ్చర్యపరిచే విషయం. అది ముగ్గురు స్నేహితులకూ సంబంధించినది కావచ్చు, కాంచనకు, సూర్యకు సంబంధించి కావచ్చు, చాలా పొదుపుగా మాట్లాడిస్తూనే, రచయితగా తానెక్కువ చొరబడకుండానే, ఆ పాత్రలను స్థిరంగా, ఆ పాత్రల స్వభావాన్ని నిలకడగా చూపెట్టిన తీరు గమనించదగినది.

ఉదాహరణకు, మాధవి పాత్ర పరిచయం ఇలా ఉంటుంది: మాధవి చాలా చురుకైనది. మిగతా ఇద్దరికన్నా తెలివైనది. విపరీతంగా పుస్తకాలు చదువుతుందేమో, ఆ తేజస్సు ఆమె కళ్ళలో సదా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఏ విషయం గురించైనా కనీసం పది నిమిషాలు అనర్గళంగా మాట్లాడగలదు. సన్నగా నాజూగ్గా చురుకైన కళ్ళతో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆరాటంతో ఉండే ఆ అమ్మాయిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

ఇవి ఎంచి ఎంచి ఇచ్చిన విశేషణాలని, ఏ ఆలోచనా లేకుండా జారవిడిచిన పొగడ్తలు కావని, తరువాత వచ్చే సన్నివేశాలు చెబుతాయి.

సూర్యశ్రీనివాస్ ఏదో కొనడంలో సాయం కావాలని ముగ్గురు స్నేహితురాళ్ళనీ పిలిపించి, మాధవి ‘ఏం కొందాం?’ అని రెట్టించినా ‘కొందాం లెండి, ఇవాళ కాకపోతే రేపు’ అని తాపీగా జవాబిచ్చినప్పుడు, అతనికసలు కొనడమేమీ అవసరం కాదని మొదటగా గుర్తించేది ఈ మాధవి పాత్రే. ఆమె చురుకైన కళ్ళూ ఆలోచనా ఆమెను సూర్య ప్రవర్తనలోని అసంబద్ధతను గమనించేలా చేశాయి. అంతే కాదు, సూర్య సారీ చెప్పినా పశ్చాత్తాపం ధ్వనించని గొంతుతో ‘పర్లేదు లెండి, మేం వెళ్తాం ఇక’ అంటుందామె. ఆ పశ్చాత్తాపం ధ్వనించని గొంతుతో అన్న పదబంధం ఆమె వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే మాట. ఇక్కడే కాదు, ఆఖర్లో సూర్యా, శ్రీనివాస్ ఒక్కరే అని తెలిసినప్పుడు కూడా, ముగ్గురిలోకీ ముందుగా తేరుకునేది, చేతిలోని పనిని, చెయ్యాల్సిన పనిని పూర్తి చేసేదీ మాధవే. పాత్రలను ఏ స్వభావాలతో పరిచయం చేశారో, నడిపించారో ఆ ధోరణిని చివరికంటా తీసుకురావడమంటే ఇదే. ఇది మాధవి పాత్ర చిత్రణలోనే కాదు, మిగతా పాత్రలకు సంబంధించీ గమనించవచ్చు. కాంచన సంగతే తీసుకుంటే, స్నేహితురాళ్ళు అలా ఒక్కో వాక్యంలో ఏదో సందర్భానుసారమే ఆమె గురించి చెప్పినట్టున్నా, ఆమె ధైర్యాన్ని, పట్టుదలనూ, సమయస్పూర్తినీ, ఆమె అభిరుచులనూ వివరంగానే చెప్పారు. అట్లాంటి అమ్మాయి, పెళ్ళికి ముందు బయట ఎక్కడైనా కలుద్దామన్న కాబోయే భర్త మాటలకు అంత ముక్తసరిగా జవాబివ్వడం నప్పదు. అతని ఆరాటాన్ని చిన్నబుచ్చినట్టు ప్రవర్తించడం కొరుకుడు పడదు–అందుకు కారణాలేమిటో, ఎక్జిబిషన్ దగ్గరకు రాగలరా అని సూర్యను అడిగిన సాయంత్రం తానే స్వయంగా విప్పేవరకూ. ఆ సన్నివేశం ఆ పాత్ర చిత్రణ పట్ల పాఠకుల్లో ఉన్న సందేహాలను తొలగించడంతో పాటు, వాళ్ళ స్నేహితురాళ్ళు ఎందుకంత అపురూపంగా ఆమెను తల్చుకుంటారో కూడా చెప్పినట్లయింది. పాత్రలను ఎలివేట్ చెయ్యడంలో ఇదొక ప్రత్యేకమైన పద్ధతి.

కేవలం కథానాయిక, నాయకుల పాత్రలు, స్వభావాల్లోని బలాలు, వాటి చిత్రణా మాత్రమే కాదు, రచయిత ఇంత చిన్న నవలికలో ఎంతో చాకచక్యంగా ఇమిడ్చిన కాలానుగుణమైన సంగతులు గమనింపులోకి వచ్చే కొద్దీ మనని చకితుల్ని చేస్తాయి. ఉదాహరణకి, పెళ్ళిచూపులకీ పెళ్ళికీ మధ్య అబ్బాయిని బయట కలవడానికి అమ్మాయిని అనుమతించే వాతావరణం. అందులో అమ్మాయి తనకు తానుగా పెట్టుకున్న హద్దులు, దానికి ఆమె ఇచ్చే ఆలోచనాత్మకమైన వివరణ, ఇవన్నీ ఆ కాలపు సామాజికస్థితిని కళ్ళ ముందుకు తెస్తాయి. క్లాస్‍మేట్స్‌నీ, కొలీగ్స్‌నీ, లేదా పెళ్ళికి ముందు ఒకటికి పదిసార్లు పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండానే కలిసి మాట్లాడుకుని కానీ పెళ్ళికి సంబంధించిన ఏ నిర్ణయమూ తీసుకోని ఇప్పటి తరానికి, ఇది వింత పోకడే కావచ్చు. ఫేస్‌బుక్‌లూ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మూడొంతులో ఆ పైబడో జీవితం బహిరంగ రహస్యమైపోయాక, కేవలం ఆ అమ్మాయికి సంబంధించిన ఏ వివరమూ తెలీక ఆమె స్నేహితులతో నేస్తం కట్టడానికి సిద్ధమైన అబ్బాయిని అమాయకుడిగా ముద్ర వేస్తారు కూడా కావచ్చు. కాని, ఇక్కడ కూడా రచయిత నాయికకు సంబంధించి చెప్పిన వివరాల్లో, ఆప్తమిత్రులు తప్ప చెప్పలేని ఆంతరంగికమైన విషయాలున్నాయి. ఆ రకంగా, ఇప్పటికీ ప్రాణమిత్రులే మనదైన నైజాన్ని విప్పేందుకు దగ్గరి దారని నేను నమ్ముతాను. ఆ మేరకు, ఈ కథానాయకుడు ఈ కాలానికీ తగిన సమయస్పూర్తిని చూపించాడనే చెప్పక తప్పదు.

ప్రేమ బాగుంటుంది. మాయలా కమ్మేసే ప్రేమ మాత్రమే కాదు, ఒక మెలకువతో దగ్గరయ్యే ప్రేమ కూడా. ఆహ్లాదకరమైన నవలిక అని పేర్కొనదగిన ఈ పుస్తకంలో, అడుగడుగునా అనుభవంలోకి వచ్చే తేలికదనం, హాయిదనం వస్తువు వల్లా, రచయిత శైలి వల్లా. మిగతా ముగ్గురు స్నేహితురాళ్ళతో సూర్య నడవడిక, దానిని ఆయా పాత్రలు అన్వయించుకునే తీరు, తమతమ ఊహలను పొడిగించుకున్న తీరు, ఈ చిన్ని నవలికకు అవసరమైనంత నాటకీయతను అద్దాయి. కళ్యాణమండపంలో నాటకం ముగిసే వేళకి, వాళ్ళంతా సిగ్గుపడి తమను తాము నిభాయించుకున్న తీరు – కాంచనకూ వాళ్ళకూ మధ్యనున్న స్నేహాన్నే కాదు, సూర్య వ్యక్తిత్వాన్ని కూడా తేటతెల్లం చేస్తుంది. అతని నడవడికలోని హుందాతనాన్ని మళ్ళీ వెనక్కు వెళ్ళి గమనించేలా చేస్తుంది. పెళ్ళి మండపంలో స్నేహితురాళ్ళను చూడగానే, ‘హలో! వచ్చేశారా’ అంటాడతను ఆప్యాయంగా. ఆ ఆప్యాయంగా అన్న ఒక్క పదంతో అతని మనసేమిటో, మర్యాదేమిటో చెప్పారు రచయిత్రి. నిజానికి అక్కడి వాళ్ళందరి హృదయసంస్కారాలను పరిచిన అపురూపమైన సన్నివేశమది. అందుకే, ఇది హాయిగొలిపే నవలిక అన్న మాట నిజమే కాని, రచనా శైలికీ శిల్పానికీ చెందిన నైపుణ్యానికి నిరూపణగా, మళ్ళీ మళ్ళీ చదువుకునేలా చేసే పుస్తకం కూడా.

నాయికా నాయికల మధ్య నడిచిన సన్నివేశాల్లో లీలగా తొణికిసలాడిన మోహానుభవం పల్చటి నవ్వును పెదాల మీదకు తెస్తుంది. అది మనుషుల్ని ఎటో విసిరేసే ప్రణయోధృతి కాదు. గుండెల్లో సన్నని అలజడి కలిగించి సంతోషపు పొంగును నరనరాల్లో నింపే స్పర్శానుభవం. అంతే. అప్పటికే స్థిరపరిచిన ఎక్జిబిషన్ లాంటి బహిరంగ ప్రదేశంలో (కథనానికి సంబంధించిన సెట్టింగ్‌లో), వీళ్ళిద్దరికీ మధ్య కుదిర్చిన సన్నివేశాలు, ఏకాంతాలు, కథలో ఏమి ఉండాలి, దేనిని ఎలా వాడాలి అన్న వివరానికి సంబంధించి పాఠాల్లా ఉంటాయి.

ఇది ప్రేమలాగే, నిత్యనూతనంగా అనిపించే కథ. ఎందుకూ అంటే, ఇందులో మనసుపడ్డ అమ్మాయి మౌనానికి అర్థాలు వెదుక్కోవాలని ఆశపడ్డ అబ్బాయి ఉన్నాడు కనుక. చుట్టూ జనం ఉన్నా, ప్రేమించిన మనిషి పక్కన నడుస్తోంటే అనంత జలరాశి మధ్యలో వెన్నెట్లో ఏకాంతంగా విహరిస్తున్నట్టుంది – అనుకోగల తొలిప్రేమల పులకలను పట్టిచ్చిన కథ కనుక. అరచేతిలో చేయి గట్టిగా బిగియగానే, ఆ మాత్రపు స్పర్శానుభావానికే చుట్టూ నిశ్శబ్దాన్ని పరుచుకున్న జంట యే ఇష్టాలతో ఒకరినొకరు పెనవేసుకోనున్నారో మనకి అన్యాపదేశంగా చెప్పిన కథ కనుక. రేగిన ఆమె సెలవినవ్వుతో అతనిలో పరవశోదయం. ఆతని మృదుకౌగిలే ఆమెకు చలిరాతిరి వెచ్చందనం. సందేహాల నుండి నులిసిగ్గుల్లోకి నడిపించే సంభాషణ బలం. ఇదీ అని చెప్పలేని భయాల నుండి పంచుకోనున్న జీవితమంతా వలపు సౌరభం నిండే తీరనుందన్న తీర్మానం దాకా ప్రయాణం. ఒక పుస్తకం బాగుందని చెప్పడానికి ఇంకేం కావాలి! చేయందుకున్న తోడంటే ఓ నమ్మకం, వేయబోయే అడుగు పట్ల ఆశ, ఊహలు నిజమవనున్నాయన్న ఆలోచన అందించే తృప్తీ – వీటికి కాలదోషం పట్టేదాకా, ఈ పుస్తకం పాఠక హృదయాల్లో పదిలం.

పుస్తకం పేరు: ఆమె నడిచే దారిలో
రచన: టి. శ్రీవల్లీ రాధిక
ప్రతుల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9441644644