నిశ్శబ్దం

ఇప్పుడు ఈ క్షణాన, ఇన్ని సంవత్సరాలుగా
కలలు కలలుగా గడిచిన కోరికల్లో
కోరికలై పురివిప్పిన కలల్లొ
అక్షరాలుగా, మాటలుగా, చూపులుగా
అనంతవై విస్తరించిన మన ప్రేమ
ఇప్పుడు, ఈ క్షణాణ మనిద్దరి మధ్య
అత్యంత సహజంగా, నగ్నంగా నర్తిస్తున్నట్టు లేదు?
కనిపించీ, కనిపించని నీ పెదవులు
తడి, తడిగా మెత్తగా వెచ్చగా
నా మనసులో సుడిగుండాల్ని
నా గుండెల్లో సునామీల్ని సృష్టించే నీ నాలుక
మూసుకున్న కనురెప్పల క్రింద
వెలుగుతున్న నీ కళ్ళు నాకు
కనిపించకపోయినా తెలుస్తున్నాయి కావా.
ఎగిసిపడే మెత్త మెత్తని నీ గుండెల
బిగిసిన మొనలు నాలో రగిలించే జ్వాల
పెనవేసుకు పోతున్న, మన కాళ్ళు, చేతులు
నలిగిన మల్లెల వాసనకి మెరుగులు దిద్దే
నీ చిరుచమటల వెచ్చని వాసనలు
స్పర్శకి మాత్రవే తెలుస్తున్న నీ వీపు
తాకితే వంట్లో అగ్నినిరేపే నీ పిరుదులు
మనసుని, గుండెని
రక్తాన్ని, నరాల్ని
కలపి నలిపేస్తున్న వెచ్చని నిట్టూర్పులు
వొక క్రొత్త భాషని సృజిస్తున్న శరీర స్పర్శలు
మాటల్లో, చూపుల్లో, రాతల్లో
పెరిగి, పెరిగి అనంతవైపోయిన మన ప్రేమ
ఈ రోజు, ఈ క్షణాన మన మధ్య
నిజవై మనల్ని తరింపచేస్తున్న మన ప్రేమ.


నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం
కంటికి కనిపించకుండా
స్పర్శకు తెలీకుండా
మనసును తాకకుండా
మనసంతా పరచుకున్న నిశ్శబ్దం
కనిపించని కోరలతో నా మెడ
నరాన్ని కొరికి నా రక్తం త్రాగుతున్న నిశ్శబ్దం
శబ్దాన్ని, శరీరాన్ని, రంగులని, కలల్ని
నవ్వుని, ఏడుపుని ఆక్రమించి
బతుకంతా వ్యాపిస్తున్న నిశ్శబ్దం
పాతిక వసంతాల అబలను నేను
పక్కలో కదులుతున్న నా చిన్ని తల్లి
గుండెల్లొ నన్ను నేను పొదువుకుంటూ
నన్ను నేను బతికించుకుంటూ…
నిన్న ఎందుకు కలలా మారిపోయిందో
రేపెందుకు అలలా కూలిపోయిందో
ఆలోచించుకుంటూ…
మెరిసె ఆ చిన్ని కళ్ళలో
రేపటి ఆనందాన్ని చూస్తూ నేను


ఇంత నవ్వుని, ఇంత మందుని
ఇంత స్వర్గాన్ని ఇంత మంది హితుల్ని
వదిలి పోవాలా ఇప్పుడు
అర్థ రాత్రి అసలు రాకుంటే!
గెలుకుతూ తిన్న నాలుగు మెతుకులు
ఎక్కడ దాక్కుందో ఈ నిద్ర ఇప్పటి దాకా
పక్కలో ఏడుపు మొకం, దీనికి
దానికి ఎక్కడ పోలిక, నక్కకి నాక లోకానికి…


ఛీ.. ఇంత కష్టంలో కూడా పడగ విప్పే కోరికలు
వొళ్ళంతా పరచుకుంటున్న వెచ్చదనంతో
నేనంటే నాకే అసహ్యవేసే కోరికలు
చెవిలో వెచ్చ వెచ్చగా పలికె పెదవుల మధ్యలో
పొలికేక పెడుతున్న రయిలింజను లాంటి గురక
నన్ను హత్తుకుని నాలో లయించిపోయిన తపనలు
నన్ను అలుముకుని స్వర్గానికెగిరిపోయిన కోరికలు
ఇప్పుడు ఈ క్షణాన నా పక్కలో
ఎలుగుబంటై నిద్రపోతున్నయ్


కొండ దిగటం ఇంత కష్టవా?
ఎంత సునాయాసంగా ఎక్కేనీ కొండ
ఎవర్నైతే పట్టుకుని ఎక్కించానో
వాళ్ళింకా ఎక్కుతూనే వున్నారు
కానీ నేనేవిటి దిగుతున్నాను
అబ్బ అలుపుగుంది, ఎక్కడ వుందిది
ఏ మనవడి ముడ్డి కడుగుతుంది
ఎంత గొప్పగా, ఎంత దర్పంగా
నేనెక్కిన కొండేనా ఇది


ఎక్కేప్పుడు కన్నా దిగేప్పుడు
నా కొంగు పట్టుకున్న చేతులెక్కువేవిటి
ఈ కష్టం ఎప్పటికి తీరుతుందో
ఈ ప్రయాణం ఎప్పటికి ఆగుతుందో
పొద్దటనించి పనితో నలిగిన ఈ వళ్ళు
వయసుతో నలిగిన ఈ వళ్ళు
అబ్బ వుండండి నాకోపికలేదు..
నా మాటలకి శబ్దం లేదా
కరిగి పోయిన నా కోరికలకి
నేనే అమృతం పోయగలను
చెదిరిపోయిన నా మమకారానికి
జాలితో గాలి కొట్టగలనా?
అబ్బ అలసిపోయిన ఈ ఒంట్లో
నలిగిపోయిన ఈ మనసులో
మీపై నేనే ప్రేమ చితుకులని
రాజెయ్యగలను?