అలారం మ్రోగింది. అలసటగా ఉన్నా, లేవాలనిపించకపోయినా… చాలా సేపటినుంచి, అలారం ఎప్పుడు చప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్న లత కళ్ళు తెరిచింది.
నది రెండు తీరాల్లా మంచంపై ఇటు లత, అటు భర్త రాఘవ. ఇద్దరి మధ్య వంతెనలా మూడేళ్ళ కొడుకు అరుణ్. తల్లి మీద కాళ్ళు, తండ్రి మీద చేతులు వేసి నిద్ర పోతున్నాడు. కొడుకు కాళ్ళను నెమ్మదిగా పక్కకు జరిపి, దుప్పటి సరిగ్గా సరిగ్గా కప్పి, మెల్లగా మంచం దిగి, చప్పుడు కాకుండా పడగ్గది తలుపు వేసింది లత.
బయట ఇంకా చీకటిగానే ఉంది. వంటింట్లో, టీకి స్టౌ మీద నీళ్ళు పెట్టి బాత్ రూం కి వెళ్ళింది.
లత జీవితం ఉదయం రొటీన్‌లో పడింది. నీళ్ళు మరిగే సమయానికి కిచెన్లోకి రావడం, టీ త్రాగుతూ రాత్రి తరిగి పెట్టుకున్న కూరగాయల్ని బయటకు తీసి వంట పని మొదలెట్టడం… కూరలు తాలింపు వేసేముందు బియ్యాన్ని కడిగి ప్రెషర్ కుక్కర్లో పెట్టి, స్నానం చేసి వచ్చే సరికి… కుక్కర్ కూతలు వేస్తుంది. అప్పటికి అరుణ్, రాఘవ నిద్ర లేస్తారు. లత బాబును స్కూలుకు రెడీ చేస్తుంటే, రాఘవ ఆఫీసుకు రెడీ అవుతాడు. అతన్ని పంపి, బాబును డే కేర్ ప్రీస్కూల్లో దింపి తను ఆఫీసుకు చేరడం… ఇదంతా ఒక పద్దతి ప్రకారం, ఎలాంటి తేడాలు లేకుండా చాలా మామూలుగా జరిగి పోయే తతంగం!
రాఘవకు ఏ పూట వంట ఆ పూట ఫ్రెష్ గా వండాలి. అన్నం కూరలు ఫ్రిజ్లో దాచుకుని వేడి చేసుకుని తినడమంటే ఇష్టముండదు. మైక్రోవేవ్లో వేడి చేసుకుతినడం వల్ల లేని పోని జబ్బులొస్తాయని అతనికో నమ్మకం. రోజూ ఉదయాన్నే లేచి వంటా వార్పులు చేయడం కష్టమనిపించినా చివరికి మొగుడి కోసం ఆ మాత్రం కష్టపడ్డంలో తప్పులేదని లత మనసుకు నచ్చచెప్పుకుంది. క్రమేణా మనసు కూడా రాజీ పడిపోయింది.
లత గోడకు వ్రేళ్ళాడుతున్న గడియారంలోకి చూసింది. ఏడూ నలభై అయింది.
రోజూ తను చేసే పనుల్ని గోడ మీదనుంచి గమనించడం, పనులు ఆలస్యమవుతూంటే మౌనంగా హెచ్చరించడం, తొందరగా పనులు తెమిలితే నవ్వుతూ పలకరించడం – ఆ గడియారం లతకు నేస్తంలా కనిపిస్తుంది.
స్నానానికి వెడుతూ, అరుణ్‌కి దుప్పటి సరిగ్గా కప్పింది.
పిల్లవాడు ఏడుస్తూ నిద్రలేస్తే, రాఘవకు అస్సలు నచ్చదు. ప్రొద్దున్నే వాడి ఏడుపు వింటే, రోజంతా ఏడుస్తూ గడుస్తుందని చిరాకు పడతాడు. బంగారంలాంటి తన నిద్ర పాడయిందని కోప్పడతాడు. సరిపోయినంత నిద్ర పోక పోతే, రోజంతా అలసటగా ఉంటుందట!
నిద్ర సరిపోకపోతే తనకూ అలసటగా ఉంటుందని రాఘవకు చాలా సార్లు చెప్పాలని వుంటుంది. చెబితే రాఘవ ఎలా స్పందిస్తాడో లతకు తెలుసు. పెళ్ళైన కొత్తలో చాలా సార్లు తనకు నచ్చని విషయాలను, నచ్చే సంగతులను భర్తతో చెప్పుకుంది. అతడి స్పందన చూసింది. తనూ ప్రతిస్పందించింది. రాను రాను ప్రతిస్పందన వల్ల ఉపయోగం కనబడక, క్రమంగా మౌనాన్ని ఆశ్రయించడం మొదలెట్టింది. మౌనం అలవాటుగా మారింది.
“భార్య భర్తకు నీడలా ఉన్నంత కాలం, కాపురం సెలయేరులా అలజడులు లేకుండా హాయిగా సాగుతుంది. అస్తిత్వం, సమానత్వం అనుకుంటూ బయల్దేరితే బ్రతుకు సుడిగుండాల్లో చిక్కడి పోతుంది. తొందర పడకుండా కాపురం దిద్దుకో తల్లీ” అని అమ్మ చెప్పిన సూక్తిని అనుసరించడానికి ప్రయత్నించింది. ప్రయత్నం అలవాటుగా మారింది.
బాత్ రూంలోంచి బయటకొచ్చేసరికి బాబు కదులుతున్నాడు. నెమ్మదిగా వాడిని పక్కమీద నుంచి తీసుకుని భుజాన వేసుకుని, బెడ్ రూంలోంచి బయటకొచ్చింది. అంత నెమ్మదిగా వచ్చినా రాఘవకు మెలుకువ వచ్చింది.
“ఓ మైగాడ్! అప్పుడే ఎనిమిదయిందా…” అంటూ, హడావిడిగా బాత్ రూంలోకి వెళ్ళాడు.
పిల్ల వాడిని భుజాన వేసుకునే, ప్రెషర్ కుక్కర్ ఉన్న బర్నర్ ఆన్ చేసింది. తర్వాత, ఫ్రిజ్ లోంచి దోశ పిండి తీసి బయట పెట్టింది. ప్రొద్దున్నే టిఫిన్ చేయకుండా ఇల్లు కదలడు రాఘవ. కార్న్ ఫ్లేక్ సీరియల్, బేగిల్స్ లాంటివి రాఘవకు నచ్చవు. హాయిగా మన ఇడ్లీలు, దోశలు, పూరీలు తినకుండా, మందు వాసన కొట్టే సీరియల్స్ తినే ఖర్మ ఎందుకు అంటాడు.
పిల్లవాడికి బ్రష్ చేసి, పాలిచ్చింది. కిచెన్లో వంట గిన్నెలు సర్దుతుండగా, ఇండియానుంచి అమ్మ ఫోన్ – చాలా రోజులుగా ఫోనెందుకు చేయడం లేదని. అంతా బాగానే ఉంది కదా అని అడిగింది. బాగానే ఉన్నాం… సాయంత్రం తీరిగ్గా మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది లత.
ఎన్నాళ్ళయింది అమ్మతో మాట్లాడి అని ఆలోచించబోయింది, కానీ పప్పు తాలింపు వెయ్యాలని గుర్తొచ్చి కిచెన్ లోకి వెళ్ళింది. ఆలోచనలు అలా మధ్యలో తెగిపోవడం, ఒక నిమిషం క్రితం జరిగింది రెండో నిమిషానికి మరచి పోవడం… ఈ మధ్య తరచు జరుగుతోంది. దీన్నే వర్తమానంలో బ్రతకడమంటారేమో! ఈ ఆలోచనలూ ఇలాగే, ఏ రోజుకారోజు కొత్తగా, మొదటిసారిగా వచ్చినట్లే.
దోశ పెనం పొయ్యి మీద పెట్టి, పక్క పొయ్యి మీద పప్పు తాళింపు వేసింది. బాబు బ్రేక్ ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. పిల్లవాడికి దోశలేసి ఇస్తుండగా, రాఘవ కంగారు పడుతూ కిచెన్లోకి వినిపించేలా “ఇవ్వాలొక ఇంపార్టెంట్ మీటింగుంది. త్వరగా వెళ్ళాలి” అని కేకేసి చెప్పాడు.
“దోశ వేస్తున్నా”, లత కూడా రాఘవకు వినిపించేలా చెప్పింది.
గబగబా నాలుగు దోశలేసి, రాఘవకు ప్లేటులో పెట్టాక చట్నీ చేయలేదన్న సంగతి గుర్తొచ్చింది. దోశలు వేరుశనగపప్పు చట్నీతో తినడం రాఘవకు ఇష్టం.
“ఛీ ఇంత సంపాయిస్తున్నాం. కావల్సినట్లు తింటానిక్కూడా లేదు. వూళ్ళలో పాక హోటల్లో కూడా మంచి చట్నీతో దోశ తినొచ్చు. మా అమ్మ ఏనాడైనా చట్నీ చేయకుండా దోశ చేసిందేమో అడుగు” అంటూ, వారం రోజుల పాటు బ్రేక్ ఫాస్ట్ తినకుండా రాఘవ అలగడం లతకు ఇంకా గుర్తుంది.
ఇప్పుడేం చేయాలి అనుకుంటుండగానే, రాఘవ కిచెన్లోకి వచ్చాడు. తనకు వేసిన దోశల ప్లేట్ తీసుకుని, “చట్నీ చెయ్యలేదా?” అనడిగాడు. గుండె గుభిల్లుమంది లతకు.
“పోన్లే…అల్లం చట్నీ వెయ్యి. అసలే ఆఫీసుకు లేటవుతోంది” అన్నాడు.
“సారీ. హడావిడిలో చట్నీ చేయడం మర్చి పోయా” అంటూ అల్లం పచ్చడి అందించింది లత, మనసులో ‘హమ్మయ్య గండం గడిచింది’ అనుకుంటూ.
రాఘవ సెల్ మ్రోగింది. “రాత్రి మనవాళ్ళు భలే ఆడార్రా… డెబ్బై బంతుల్లో సెంచరీ… చితక్కొట్టేసారు. మేచ్ చాలా బాగుంది. పడుకునేప్పటికి లేటయింది… తొందరగా ఆఫీసుకెళ్ళాలి… వెళ్ళి కాల్ చేస్తాలే” అంటూ ఎవరితోనో మాట్లాడుతూనే దోశలు తినేశాడు.
ఫోన్ పెట్టేసాక బాబుతో మాటల్లోకి దిగాడు రాఘవ. రాఘవకు, బాబుకు లంచ్ బాక్సులు పేక్ చేసి, బాగుల్లో పెట్టింది లత. తనకూ ఒక లంచ్ బాక్సు పేక్ చేసుకుంది.
“ఒకే బడ్డీ… సీ యూ టు నైట్”, “బై లతా… అయ్ హావ్ టు రన్…” అంటూ బయల్దేరి వెళ్ళిపోయాడు రాఘవ.
కిచెన్ కాస్త సర్ది, గిన్నెల్ని సింక్‌లో వేసి బాబును స్నానానికి తీసుకెళ్ళింది. బాబును రెడీ చేసి, తనూ డ్రెస్ ఛేంజ్ చేసుకుని, లంచ్ బాగ్ తీసుకుని, పిల్ల వాని స్కూల్ సంచీ, లంచ్ బేగ్ తీసుకుని బయల్దేరింది.
బాబును స్కూల్లో డ్రాప్ చేసి, లత ఓ అరగంట లేటుగా ఆఫీసుకు చేరింది.