సైగల్…

ఈ చీకటింట
నీ ఏకాకి పాట

మనసులో ఏముంది?
కనుల నీడలు
కనుగొన్నావు కావు

ఆమె వదనం
నిమేష మాత్రం
ఏమరిచావా?

ఎక్కడ శరీరం
చిక్కబడే సాయంత్రం
దుఃఖం మిగిలి!

ఎండ తాకిన ఏటి ఇసుక
నిండా మునక
బండి వెళ్ళి పోయాక

ఎంత బ్రతిమాలినా
చెంత చేరని చెలి
గొంతులో గద్గదం

లావాటి చినుకులతో వాన
నీవా, నిట్టూరుస్తావు, ఐనా
ఎవరు నీ ప్రియురాలు?

అమావాస్య తారలను
అమాంతం దూరం చేసేదా
అమాయకపు నవ్వులతో?

ఆరి వెలిగే దీపం
దారి కనిపించదు
మరపు రాదు…

సైగల్…
సవ్వడి చేయని
కొవ్వొత్తిలా కరుగుతూ

నీ ఏకాకి పాట
ఈ చీకటింట

(11 ఏప్రిల్, సైగల్ 110 వ జయంతి.)


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...